"నువ్వు క్షమార్పణ చెబితే హాస్యం రసాభాస అవుతుంది" అంది సుగుణ.
"ఇది హాస్యం కాదు....హింస! అసలతడెవరే?" అంది హాస.
"ఏమో! మాకేం తెలుసు? ఉత్తరం రాశాం ఫోటో జతచేశాం.... కవర్ లో పెట్టాం. ఓ చిన్న కుర్రాడికిచ్చాం. కంటికి నదురుగా ఆనిన ఏ యువకుడికయినా యిమ్మన్నాం. ఆ తర్వాతేం జరిగిందో...."
హాస నిట్టూర్చి, "ఆ చిన్న కుర్రాడే ఆ ఉత్తరం చదువుకుని ఇక్కడికొస్తే ఎంతో బాగుంటుంది" అని నవ్వేసింది.
"అరే! అప్పుడే నవ్వా?" అంది ప్రతిభ.
"ఎలాంటి టైములో మీరు నన్నిరికించి ఈ నాటక మాడుతున్నారో తెలియదు మీకు. రేపే నాకు పెళ్ళిచూపులు....." అంది హాస.
"నిజమా? హాస్యమా?" అంది ప్రతిభ.
"రేపు పన్నెండు గంటల ట్రయన్ లో వరుడు, అతని చెల్లెలు, తలిదండ్రులు నన్ను చూసుకుందుకు వస్తున్నారు" అంది హాస.
"అయాం సారీ హాసా?" అంది లలిత.
"ఇట్సాల్ రైట్.... మీరు చేసిన పనికి ఈరోజు నేనో వ్యక్తికి సారీ చెప్పుకుంటాను. మా వాళ్ళిచ్చే కట్నం చాలక రేపు నాకో వ్యక్తి సారీ చెబుతాడు...." అంది హాస.
"టైము ఏడయినట్లుందే, ఆ వ్యక్తింకా వచ్చినట్లు లేడు" అంది మాలతి చుట్టూ చూస్తూ.
మొత్తం అందరూ ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు కానీ ఆ వ్యక్తి గంట క్రితంనుంచి అక్కడే వుండి రహస్యంగా వారి సంభాషణంతా వింటున్నాడని వారికి తెలియదు. వారు అరగంటసేపు అతడికోసం చూసి వాళ్ళు వెళ్ళిపోయారు.
* * * *
వాళ్ళు వెళ్ళిన కాసేపటికి గౌతమ్ తనూ లేచాడు.
ఫోటో చూడగానే ఆమెపట్ల అతడి కాకర్షణ పుట్టింది. అయితే అంత సులభంగా అతడామె కళ్ళబడదల్చుకోలేదు.
పార్కుకి ముందుగానే వచ్చి ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె పార్కులో అడుగుపెట్టగానే ఆమెను గుర్తుపట్టాడు. చెలికత్తెల మధ్య రాకుమారిలా ధగద్దగాయమానంగా వెలిగిపోతోందామె.
గౌతమ్ మరోలోచన లేకుండా చొక్కా జేబులోంచి విశ్వామిత్రుడిచ్చిన గుళికను తీసి నోట్లో వేసుకుని గుటుక్కున మ్రింగాడు.
ఆమె అతణ్ణి దాటుకుంటూనే మల్లె పందిరి వద్దకు వెళ్ళింది. అది గుళిక మహత్యమో, అతడి వినికిడి ప్రభావమో, లేక అతడి కోరిక బలమో చెప్పడం కష్టం.
అతడికి ఆమె మాటలు చెవుల్లో వినబడుతున్నాయి. ఆ మాటలను బట్టి అక్కడ జరుగుతున్న సంభాషణ నూహించ గలిగాడతడు.
* * * *
రాత్రి పదకొండు గంటల సమయం.
నిద్ర పట్టక మంచం మీద అటూ యిటూ పొర్లుతున్న హాసకు మరునాడు తనకు జరుగబోయే పెళ్ళిచూపులు గుర్తొస్తున్నాయి.
అతడెవరో, ఎలాగుంటాడో?
ఆ సమయంలో ఎవరో ఆమెను, "హాసా!" అని పిలిచారు.
వులిక్కిపడి లేచి కూర్చుని చుట్టూ చూసిందామె.
ఎక్కడా ఎవరూ లేరు.... కానీ మళ్ళీ అదే పిలుపు.... "హాసా!" అని....
"ఎవరూ?" అందామె.
"నేను నీకు కనిపించను. వినిపిస్తాను...."
హాసకు భయం వేసింది. చెవిలో మాట్లాడుతున్నంత స్పష్టంగా వినబడుతున్నాయా మాటలు.
"భయపడకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకే అపకారమూ చేయను"
"నాకేం భయం? నాకు కనిపించాలంటే నీకీ భయంలాగుంది!" అంది హాస నవ్వుతూ.
"నీకు భయం లేకపోతే ఉత్తరం స్వయంగా ఎందుకివ్వలేదు?"
హాస ఆశ్చర్యంగా, "ఉత్తరం నీకందిందా? అది నా ఫ్రెండ్సు చేసిన చెడ్డపని. నన్ను క్షమించు" అంది.
"నన్ను క్షమించే ప్రసక్తిలేదు. నువ్వు తప్పుచేసినా అది నాకొప్పులాగే కనబడుతుంది. ఇక నీ ఫ్రెండ్సంటావా? నిన్ను పరిచయం చేసినందుకు వాళ్ళకు కొన్ని జన్మలపాటు రుణపడి వుంటాను."
"ఎవరు నువ్వు? నాతో ఎలా మాట్లాడుతున్నావు?"
"నాగురించి ఇప్పుడేమీ చెప్పను. నువ్వు నా ప్రేమనంగీకరించగానే నేను నీ కళ్ళముందు ప్రత్యక్షమవుతాను."
"ప్రత్యక్షం కావడమేమిటి? నువ్వు మనిషివి కావా?"
"అన్నీ చెబుతాను. నేనంటే నీకిష్టమేనా?"
హాస క్షణం తటపటాయించి, "ఇప్పుడెలా చెప్పగలను? రేపే నాకు పెళ్ళిచూపులు" అంది.
"అయితే...."
"నాపెళ్ళి నా యిష్టం కాదు. పెద్దల యిష్టం. రేపు వచ్చినవాడు అందరికీ యిష్టమయితే నాకూ ఇష్టమే మరి...."
"ఓహో-సరే....అయితే రేపటిదాకా ఆగుతాను."
"హలో.... ఎవరు నువ్వు...."
"మనం మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం....ఓకే...."
హాసకు మాటలు వినిపించలేదు. ఆమె అదేపనిగా "హలో, హలో" అనసాగింది.
బదులుగా గదిలో దీపం వెలిగింది.
హాస కళ్ళు నులుముకుని అటుచూస్తే గుమ్మం దగ్గర నాయనమ్మ, గిరిధర్ ఉన్నారు.
జరిగిందేమిటో హాసకర్ధంమైంది. ఆమె తనలో తను మాట్లాడుకుంటుంటే పక్కమంచం మీద పడుకున్న గిరిధర్ కు భయం వేసి నెమ్మదిగా మంచం మీంచి లేచి వెళ్ళి నాయనమ్మను నిద్రలేపుకుని వచ్చాడు.
నాయనమ్మ వచ్చి, "ఇప్పుడెలా చెప్పగలను? రేపే నాకు పెళ్ళిచూపులు" అని హాస అనడం దగ్గర్నుంచీ మిగతా సంభాషణంతా విని హాస హలో హలో అని గొడవ చేస్తూంటే తను లైటు వేసింది.
"ఏమిటీ....? పెళ్ళి గురించి కలలు కంటున్నావా?" అంది నాయనమ్మ....
"లేదు, ఫోన్లో మాట్లాడుతున్నాను" అంది హాస.
"ఎవరితో?"
"ఎవరో రామభద్రంట. స్వర్గం నుంచి ఫోన్ చేశాడు. పార్వతమ్మ కావాలన్నాడు. నా పేరు హాస అని తెలియగానే రాంగ్ నంబర్ అని పెట్టేశాడు...." అంది హాస.
"భడవకానా!" అంటూ మీదకొచ్చింది నాయనమ్మ.
వయసులో ఉన్నప్పుడు పార్వతమ్మని ప్రేమించాడు రామభద్రం. ఆమెకు వివాహమైనా విడిచిపెట్టక వెంటపడి దేహశుద్ధి చేయించుకున్నాడు రామభద్రం.
తల్లిదండ్రులు వాడికెలా బుద్ధి చెప్పాలో తెలియక పెళ్ళి చేయాలనుకుంటే ఇంట్లోంచి పారిపోయి పెద్ద వ్యాపారస్థుడై పదేళ్ళ తర్వాత తిరిగొచ్చాడు. చెడు తిరుగుళ్ళున్నాయి కానీపెళ్ళి మాత్రం చేసుకోలేడు. ఆ వయసులో చిరాగ్గా ఉన్నా ఇప్పుడు నాయనమ్మ ఆ కథను గర్వంగా చెప్పుకుంటూంటుంది. అప్పుడు రామభద్రం పేరు వింటే మండిపడే తాతగారు ముసిముసిగా నవ్వుతూంటారిప్పుడు.
"బామ్మా౧ నువ్వు కూడా నాకు సాయంగా పడుకోవే!" అన్నాడు గిరిధర్.
"కాలం మారుతోంది. ఈ రోజుల్లో మగపిల్లలకి ఆడపిల్లలకీ, ముసలమ్మలలూ సాయం కావాలి...." అంది హాస.
"పెళ్ళికలలు కంటున్న పిల్ల నిన్నొకత్తినీ వదిలేయడమే మంచిది. ఇంకా ఏయేం ఫోన్లు చేసుకుంటుందో....పద, మనం వేరేచోట పడుకుందాం" అంది నాయనమ్మ.
ఆ రాత్రికి గదిలో హాస మాత్రమే పడుకుంది.
* * * *
"విశ్వామిత్రా! ధన్యోస్మి" అనుకున్నాడు గౌతమ్.
ఎంత అదృష్టం తనది! తనకు నచ్చిన అమ్మాయితో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. యిలాంటి అదృష్టం ఎవరికో గానీ రాదు.
గౌతమ్ కి మళ్ళీ మళ్ళీ హాసతో మాట్లాడాలని వుంది కానీ తొలిపరిచయంలోనే ఆమెకు విసుగు పుట్టించడం ఇష్టం లేక కనులు మూసుకున్నాడు.
అతడి కళ్ళముందు హాస కనబడింది. ఆమె నవ్వుతోంది.
ఈమె నాకు దక్కితే చాలు. అంతకు మించిన అదృష్టం ఈ జన్మకు అవసరం లేదు" అనుకున్నాడు గౌతమ్.
16
భారతదేశంలోనూ అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిలో ట్రయిన్స్ టైముకి రావడం ఒకటి!
ఆ రోజలాంటి అద్భుతమే జరిగింది.
ట్రయిన్లోంచి దిగిన వారిలో ప్రకాశరావు కుటుంబం ఈ అద్భుతం వల్ల యిబ్బంది పడ్డారు. వాళ్ళను స్టేషన్లో రిసీవ్ చేసుకుందుకు రావాల్సిన సుబ్రహ్మణ్యం ట్రయిన్ టైముకి గంట కలుపుకుని కానీ రాడు.
ప్రకాశరావు, తండ్రి, తల్లి చెల్లెలు, వారి మొత్తం సామాను ఓ సూట్ కేసు, మరో బ్రీఫ్ కేసు.
గౌతమ్ దూరాన్నుంచి వారిని గమనిస్తున్నాడు. హాస కోసం వచ్చిన సంబంధం వాళ్ళేనని అతడు త్వరగానే ఊహించగలిగాడు. వాళ్ళను త్వరగా పలకరించి తను వచ్చిన పని పూర్తి చేసుకోవాలని అతడికుంది. అయితే ఇలాంటి అలవాటు లేక తటపటాయిస్తున్నాడు.