Previous Page Next Page 
సుహాసిని పేజి 13


    "అయితే నాకేం రాసిపెట్టి వుంది!"

    "ఓ అద్భుత వనిత....ఆమెను నీవు పెళ్ళాడగలిగితే మీ యిద్దరి సంతానమూ భారతదేశపు భవిష్యత్తునే మార్చగలదు."

    "ఆమెను నేను పెళ్ళాడుతానా?"

    "అది కాలానికి మాత్రమే తెలిసిన పరమ రహస్యం."

    "ఆమెను నేను పెళ్ళాడకపోతే?"

    "ఏ క్షణంలో ఆమె నీ కళ్ళబడుతుందో ఆ క్షణం నుంచీ నీవామెకోసమే జీవించు. ఆమె సంతోషమే నీ జీవితాశయం చేసుకో."

    "అందువల్ల నాకుగానీ, దేశానికిగానీ, ప్రపంచానికి గానీ యేం ప్రయోజనం."

    "వెర్రివాడా! నిస్వార్ధమైన ప్రేమ భూప్రపంచానికి సూర్యకాంతి వంటిది. నీలాంటి ప్రేమికులు కొందరుంటే చాలు.... భూతలంపై సృష్టి మరెంతకాలమో వర్ధిల్లుతుంది."

    "స్వామీ! చిన్న సందేహం....నేను చనిపోకపోతే స్వర్గానికెలా వచ్చాను?" అన్నాడు గౌతమ్.

    "అది నీ ఆత్మ కల్పించుకున్న భ్రమ. చనిపోయాననుకుంటే స్వర్గం కనపడింది చనిపోలేదనుకుంటే...."


                                                       *    *    *    *


    తలుపులు దబదబ బాదుతున్న చప్పుడు విని ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుముకున్న గౌతమ్ కి చుట్టూ చూస్తే రోజూ చూసే తన గదిలోని వస్తువులే కనిపించాయి.

    వెళ్ళి తలుపు తీసి చూస్తే రంగమ్మ కనిపించింది.

    "ఏం జరిగింది బాబూ? ఎప్పటికీ లేవలేదు? తలుపు గడియ తోస్తే పడేలా తీసి వుంచలేదు" అంది రంగమ్మ.

    "ఏమో! ఈరోజెంతో తృప్తిగా, సంతోషంగా వుంది" అన్నాడు గౌతమ్.

    రంగమ్మ తన పనులు చేసుకుని పోతూంటే త్వరగా తెమిలాడలేడు. ఆ రోజునుండి ప్రతి కదలికలోనూ కొత్త వుత్సాహముంది.


                               14


    దేవేంద్ర ప్రతిభను తనింటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాజేంద్ర నడివయస్కుడిలా అతడికి తండ్రి అయ్యాడు. రవీంద్ర వృద్ధుడిలా అతడికి తాత అయ్యాడు. సుమారు పదిమంది యువకులతో స్నేహితులూ, సంస్థ సభ్యులూ అయ్యారు.

    అంతమంది పురుషుల మధ్య ప్రతిభ ఒక్కతే ఆడది.

    "అక్కడ అందరూ ఆమెను మర్యాదనిచ్చారు. దేవేంద్రను పొగిడారు. అతడి అడుగుజాడల్లోనే నడుస్తూ తామూ ప్రతిభవంటి అమ్మాయిని వివాహమాడాలని కుతూహలపడుతున్నట్లు చెప్పారు.

    ప్రతిభ వారికి సాయపడగల పద్ధతి ఒక్కటే!

    వరకట్న సమస్య చేత పీడించబడుతున్న మధ్యతరగతి ఆడపిల్లల జాబితా అడ్రసుతో సహా కావాలి వారికి.

    సంస్థ గురించి ఇంకా ఎవరికీ బహిర్గతం చేయకూడదు. ఎందుకంటే అక్కడ సంస్థ సభ్యులుగా చేరిన యువకులందరూ తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా యిందుకు పూనుకున్నారు. తలిదండ్రులకు తెలియకుండా ఈ సంస్థను ప్రారంభించారు. మూక ఉమ్మడిగా వివాహాలు జరిగి ఒక్కసారిగా సంస్థ ఆశయాలను బయటపెట్టి సమాజంలో సంచలనం కలిగిస్తే అప్పుడు వారిని నిరసించిన ఆ తలిదండ్రులే సంస్థను అభినందించక తప్పదు. ముందుగానే యీ విషయం తెలిస్తే సంస్థను మొగ్గదశలోనే త్రుంచి నలిపి వేయగల సమర్ధులా తలిదండ్రులు.

    ప్రతిభకు వారి మాటలు నచ్చాయి. వారి ఆశయాలు నచ్చాయి. వారు నచ్చారు.

    దేవేంద్ర తన నెటువంటి మాయాజాలంలో యిరికిస్తున్నాడో ఆమెకు తెలియదు.

    ఆమె చాలా సిన్సియర్ గా తన డ్యూటీ ప్రారంభించింది.


                               15


    గౌతమ్ వెనక్కు తిరిగాడు.

    ఆ కుర్రాడికి పదేళ్లుంటాయేమో! నిక్కరు జారిపోతూంటే ఓ చేత్తో పట్టుకున్నాడు. రెండో చేతిలో ఓ కవరుంది.

    "ఆ అమ్మాయి మీకిమ్మంది సార్!" అంటూ రెండో చేత్తో ఓ వేపు చూపించి నిక్కరు జారిపోతూంటే చటుక్కున పట్టుకున్నాడు మళ్ళీ.

    గౌతమ్ అటువేపు చూశాడు. అక్కడ చాలామంది యువతులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. వారిలో ఎవ్వరూ అతడిని చూడ్డం లేదు...... అతడు చటుక్కున ఆ కుర్రాడి చేతిలోని వుత్తరం తీసుకున్నాడు.

    అంతే! ఆ కుర్రాడక్కణ్నించి పరుగు లంకించుకున్నాడు.

    గౌతమ్ పక్కనే చెట్టు నీడకు వెళ్ళాడు.

    అతడి దృష్టి చేతిలోని ఉత్తరం మీంచి దూరాన ఉన్న ఆ ఆడపిల్లల మీదనే ప్రసరిస్తోంది. వాళ్ళలో ఎవరు తనకీ వుత్తరాన్నిచ్చారు?

    ఎందుకు?

    అతడింకా ఆలోచిస్తూండగానే అక్కడున్న కాలేజి గేటు తెరుచుకుంది. గేటు బయట వున్న ఆడ, మగ అందరూ ఒక్కసారి కాలేజీ ఆవరణలోకి ప్రవేశించారు.

    అప్పుడు గౌతమ్ కవరు చించి లోపలి ఉత్తరాన్ని తీశాడు.

    గ్లేజ్డ్ పేపరు మీంచి ఏదో పరిమళం గుప్పుమంది. ఆ పరిమళాన్ని మించి ఆకర్షిస్తున్న ముత్యాల కోవల్లాంటి అక్షరాలు.

    "డియర్!

    నువ్వెవరో నాకు తెలియదు. నీ పేరూ నాకు తెలియదు.... కానీ రోజూ నిన్ను చూస్తున్నాను. నీలో నాకు ఏదో తెలియని ఆకర్షణ. నువ్వు నా వేపు చూస్తావేమోనని ఎన్నో సార్లు ఆశపడ్డాను. కానీ ఏ ఊహా లోకంలో వుంటావో నీ చూపులయినా నన్నెప్పుడూ తాకలేదు.

    నా మనసు నీకు చెప్పాలనీ నీతో మనసు విప్పి మాట్లాడాలనీ నిన్నడిగి నీవు దొంగిలించిన నా హృదయాన్ని వెనక్కు తీసుకోవాలనీ వుంది. కానీ ఆడపిల్లని కదా! వెంటనే ధైర్యం చేయలేకపోయాను. సంప్రదాయానికి భయపడితే ఆ సంప్రదాయంలోనివారే అయిన రుక్మిణి, దమయంతి నాకా ధైర్యం యిచ్చారు. వెంటనే యీ లేఖ వ్రాశాను.

    రాత్రి ఏడింటికి సరోవరా పార్కులో మల్లెపందిరి కింద మనం కలుసుకుందాం. తప్పకుండా వస్తావు కదూ!

    అన్నట్లు నేనెలాగుంటానో నీకు తెలియదుగా....

    ఈ కవర్లోనే నా ఫోటో వుంచుతున్నాను.

                                                                                                       నీ
                                                                                                      హాస"

    పి యస్; నా ముఖానికి నా పేరు నప్పదనిపిస్తే నీకు తోచిన పేరు చెప్పు. ఆ క్షణం నుంచీ అదే నా పేరు...."

    గౌతమ్ ఉత్తరం చదవడం పూర్తిచేసి కవరు తడిమాడు. అందులోంచి ఫోటో బయటపడింది.

    ఫోటో చూసి గౌతమ్ కి కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.

    ఆమె దివి నుంచి భువికీ దిగిన అప్సరస కాంతలా వుంది.

    ఆమె కన్నుల్లో మెరుపు....ఆమె పెదవుల్లో విరుపే....ఆమె ముఖంలో దివ్య తేజస్సు....

    "బాప్ రే! ఈమె నిజంగా నన్ను ప్రేమించిందా....?" అనుకున్నాడతడు.


                                                            *    *    *    *


    సాయంత్రం ఆరుం పావయింది.

    సరోవరా పార్కులో మల్లెపందిరి కింద మొత్తం ఏడుగురమ్మాయిలూ వున్నారు.

    హాస ముఖం గంభీరంగా ఉంది, "మీరు చేసిన పని నాకేం నచ్చలేదు" అందామె.

    "అరే! నవ్వుల రాణి సీరియస్ గా అయిపోయిందే" అంది ప్రతిభ.

    "లైఫీజ్ జస్ట్ ఫన్.... టేకిటీజీ...." అంది సుగుణ.

    "ఫన్ అంటే ముక్కూ మొహం తెలియని మనిషి నాటపట్టించటం కాదు...." అంది హాస యింకా సీరియస్ గానే.

    "ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఫన్ వుంటుంది" అంది కోమలి.

    "కావచ్చు. మీ ఫన్ లో నన్నెందు కిరికించాలి?"

    "మా సంతోషం కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు?" అంది మాలతి.

    "దిసీజ్ శాడిస్టిక్ ప్లెజర్...." అంది హాస. "మనం మన సంతోషం కోసం నవ్వాలి. ఒకడిని ఏడిపించి నవ్వకూడదు"

    "ఏమో కాకతాళీయంగా ఆ ఉత్తర మందుకున్నవాడే నీ జీవితంలో నవ్వుల పువ్వులు కురిపిస్తాడేమో. ఎవరు చూడొచ్చారు?" అంది ప్రతిభ.

    "డియర్ ప్రతిభా! నేను నవ్వుల రాణినే కాని- విప్లవరాణిని కాదు. నా పెళ్ళి నా యిష్టప్రకారం కాక మా అమ్మా నాన్నల యిష్టప్రకారం జరుగుతుంది."

    "అవన్నీ వట్టి కబుర్లే....ఏడింటికి అతనొస్తాడన్నామా? ఇది ఆరుంపావుకే యిక్కడికొచ్చి చేరిందా లేదా?" అంది ప్రతిభ.

    "అందుక్కారణముంది. అతడు అన్న టైమ్ కి ముందుగా వస్తాడని నా అనుమానం. జరిగిందానికి క్షమార్పణ చెప్పుకోవాలని వచ్చాను."

 Previous Page Next Page