Previous Page Next Page 
సుహాసిని పేజి 15


    కాసేపటికి అతడి తటతటాయింపైపోయింది. అతడు నెమ్మదిగా వారిని సమీపించి దగ్గర్లో ఆగాడు.

    "ఊరు మనకి కొత్త....సుబ్రహ్మణ్యం వచ్చేదాకా ఆగడం మంచిది" అంటున్నాడు ప్రకాశరావు తండ్రి.

    గౌతమ్ చప్పున ఆయన్ను సమీపించి_ "మీ పేరు భాస్కర్రావా?" అనడిగాడు.

    "కాదు నాయనా! నా పేరు సుందర్రావ్" అన్నాడాయన.

    "ఈ ట్రయిన్లోనే మా భాస్కర్రావుగారు రావాలే...." అని గట్టిగానే పైకి అనుకుని- "మీ పేరు సుందర్రావన్నారు కదూ! మీరు కానీ కోదండపాణి గారింటిక్కాదు కదా!" అన్నాడతప్పుడే స్పురించినట్లు.

    "అరే! మీకెలా తెలుసు?" అన్నాడు ప్రకాశరావు ఆశ్చర్యంగా.

    అప్పుడే గౌతమ్ ప్రకాశరావుని చూశాడు.

    ఆరడుగుల ఎత్తు, పచ్చటి ఛాయ, మగతనం ఉట్టిపడే వ్యక్తిత్వానికి అలాంటివే మీసాలు!

    "చాలా బాగున్నాడు" అప్రయత్నంగా అనుకున్నాడు గౌతమ్ అప్రయత్నంగానే అతడప్పుడు రెండు జంటల్ని ఊహించుకున్నాడు. ప్రకాశరావుతో పోలిస్తే హాస పక్కన తను పేలవంగా వున్నాడని వెంటనే తోచిందతనికి.

    "అరే! మీకెలా తెలుసు?" మళ్ళీ అన్నాడు ప్రకాశరావు.
   
    అతడి స్వరం కూడా మగతనానికి ఉదాహరణలా వుంది.

    "కోదండపాణిగారు నాకు బాగా తెలుసు. ఈ రోజు వాళ్ళమ్మాయి పెళ్ళి చూపులు. వరుడు, చెల్లెలు, తల్లిదండ్రులు వస్తారని ఆయన చెప్పారు. మిమ్మల్ని చూడగానే ఆ మాటలు గుర్తుకొచ్చాయి" అన్నాడు గౌతమ్.

    ఆ అవకాశాన్ని సుందర్రావు వినియోగించుకోవాలనుకున్నాడు. ఆయన తెలివిగా గౌతమ్ ని కబుర్లలో పెట్టి కోదండపాణి కుటుంబం గురించి వాకబు చేశాడు.

    ఇలాంటవకాసం కోసమే ఎదురు చూస్తున్నాడు గౌతమ్. హాస గురించి చెడుగా చెప్పకుండా ఎలాగో అలా ఈ సంబంధం చెడగొట్టాలని అతడి ఉద్దేశ్యం. కానీ సుందర్రావు వివరాలడిగేసరికి అలా చెయ్యలేకపోయాడు.

    కోదండపాణి కుటుంబం గురించి అతడు చెప్పిన వివరాలు సుందర్రావుకి కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి.

    "అమ్మాయి పేరు హాస. చాలా అందంగా వుంటుంది. కట్నం లేకుండా చేసుకునేందుకు ఎందరో ముందుకు వచ్చారు. కానీ వాళ్ళకు సంప్రదాయం ముఖ్యం. ఆ అమ్మాయి బియ్యే ఫైనలియర్ చదువుతోంది. కానీ పెద్దవాళ్ళెంతంటే అంతే!" అంటూ హాస గురించి అతడు చెబుతూంటే వరుడు కూడా ఉత్సాహపడ్డాడు. ఆ ఉత్సాహాన్ని తల్లికీ, చెల్లెలికీ కనపడకుండా దాచాలని అతడు పడే తాపత్రయాన్ని కూడా గౌతమ్ గమనించాడు.

    అది గమనించనట్లే నటిస్తూ-

    "ఆ అమ్మాయి హాసను ఇంట్లోనూ, కాలేజీలోనూ కూడా నవ్వులరాణి పిలుస్తూంటారు. ఎలాంటి కష్టంలోనూ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వదు. నవ్వు ఆమెకందాన్నిచ్చిందో, ఆమె నవ్వుకందాన్నిచ్చిందో చెప్పడం కష్టం. ఆమె ఏ ఇంట్లో అడుగుపెడుతుందో అక్కడ నవ్వులు విరుస్తాయని జ్యోతిష్కుడు చెప్పాడు...."

    అని ఇంకా ఏదో అనబోతుండగా__

    "నీ మాటలు వింటూంటే ఆ కోదండపాణిగారు నిన్నిక్కడకు ముందుగా పంపినట్లుంది" అన్నాడు ప్రకాశరావు చటుక్కున.

    గౌతమ్ తడబడి_ఆయన నన్నెందుకు పంపుతారూ? నేనీ సంబంధం చెడగొడతానని భయం...." అన్నాడు.

    ప్రకాశరావు తల్లి కుతూహలంగా- "నువ్వీ సంబంధాన్నెందుకు చెడగొడతావు? పైగా తెలిసినవాడినన్నావు....?" అంది.

    "నిజం చెబుతున్నాను. నాకా అమ్మాయంటే యిష్టం. కానీ నా ఉద్యోగం చిన్నది. కోదండపాణిగారు చూసే సంబంధాలన్నీ మీ ఎత్తులో వున్నాయి. నేను పరోక్షంగా నా గురించి సూచిస్తే ఆయన సూటిగానే అలాంటాశలు పెట్టుకోవద్దని నాకు చెప్పేశాడు...." 

    ప్రకాశరావు కలగజేసుకుని_ "పోనీ ఆ అమ్మాయికి మీరంటే యిష్టమేమో కనుక్కోలేకపోయారా?" అనడిగాడు.

    "అంత చనువు మాకెక్కడిదీ? వాళ్ళింట్లో నేను మాట్లాడేది ఒక కోదండపాణి గారితోటీ. ఎప్పుడయినా వాళ్ళ నాన్నగారు దక్షిణామూర్తిగారి తోటీనూ! అయినా ఆ అమ్మాయి కాలేజీలోనే మగపిల్లల్తో మాట్లాడదు.... ఇంట్లో మాట్లాడుతుందా" అన్నాడు గౌతమ్.

    ప్రకాశరావు తేలిగ్గా నిట్టూర్చాడు.

    "అన్నీ పెద్ద సంబంధాలే చూస్తున్నారంటున్నావు....కట్నం బాగా యివ్వగలరా?" అడిగాడు సుందర్రావు.

    "ఆ అమ్మాయిని చూసిన వాళ్ళెవరూ కట్నం అడగలేరని నా నమ్మకం. నేనయితే పైసా కట్నం లేకుండా ఆ అమ్మాయిని చేసుకునేవాణ్ణి" అన్నాడు గౌతమ్.

    ప్రకాశరావు తల్లి కళ్ళు మెరిశాయ్.

    "ఇదిగో అబ్బాయ్! కాస్త నీ వివరాలూ, అడ్రసు చెప్పు. వూరెళ్ళాక ఉత్తరం రాయిస్తాను....మా వాళ్ళలో నాలుగు సంబంధాలు వున్నాయ్...." అంది.

    గౌతమ్ కంగారుగా- "నా సంబంధాలు మా నాన్నగారు చూస్తున్నారండి...." అన్నాడు.

    సుందర్రావేదో అనబోయి, ఎదురుగా చూసి- "అదిగో సుబ్రహ్మణ్యం వచ్చేస్తున్నాడు" అన్నాడు.

    గౌతమ్ అక్కడినుంచి తప్పుకుంటూ సుబ్రహ్మణ్యం చిరునామా అడిగి తెలుసుకున్నాడు.


                      *    *    *    *


    "హాసా!"

    ఉలిక్కిపడిందామె

    అదే పిలుపు....ఎంతో మధురంగా, ప్రేమాభిమానాలుట్టిపడుతూ....

    "హాసా!"
   
    "ఊఁ"

    "ప్రకాశరావు నీకు నచ్చేడా?"

    హాస బదులు చెప్పడానికి తటపటాయించింది.

    "చెప్పు హాసా! నా దగ్గర సిగ్గుపడకు....ప్రకాశరావు నీకు నచ్చేడా?"

    "ఊఁ"

    "అతడు నీతో మాట్లాడేడా?"

    "ఊఁ"

    "ఏమన్నాడు?"

    "పేరడిగాడు, చదువడిగాడు. అంతే!"

    "పెళ్ళివారేమన్నారు?"

    "వెళ్ళాక ఉత్తరం రాస్తామన్నారు"

    "మీ యింట్లో ఏమనుకుంటున్నారు?"

    "తెలియదు. నా ఆలోచనలలో నేనున్నాను"

    "అవతల కాసేపు నిశ్శబ్దం....."

    "ఏయ్" అంది హాస.

    "ఊఁ" అంది చెవుల్లో ఆ గొంతు.

    "ఎవరు నువ్వు?"

    "నేనెవరినైనా నీ శ్రేయోభిలాషిని...."

    "నువ్వెక్కడుంటావు? ఎలా ఉంటావు" కుతూహలంగా అడిగింది హాస.

    "ఎక్కడున్నా, ఎలాగున్నా నీ గురించే ఆలోచిస్తుంటాను...."

    "అలా దాటేయకు. నీ గురించి చెప్పాల్సిందే...."

    "ప్రస్తుతానికి సెలవు...."

    "హలో....హలో...." అంది హాస. ఇక మాటలు వినబడలేదు.

    "హలో....హలో....ప్లీజ్...."

    గదిలో లైటు వెలిగింది. హాస ఉలిక్కిపడి తలెత్తితే ఎదురుగా గుమ్మం దగ్గర నాయనమ్మ, గిరిధర్.

    పార్వతమ్మ హాసను సమీంచి తల నిమిరి, "ఈ వయసులో పెళ్ళి గురించి ఆలోచించడం తప్పుకాదు. కానీ అదే పిచ్చిగా మారిపోకూడదు" అంది.

    "చే౧ ఏమిటి బామ్మా నువ్వనేది?" అందామె.

    "వూహల్లో నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈవేళ చూసిన కుర్రాడు నీకు నచ్చితే కనుక.... వాణ్ని మర్చిపోవటానికి ప్రయత్నించు. వాళ్ళు అందుబాటులో లేరు మనకి__" అంది పార్వతమ్మ.

    ఆమె మాట్లాడలేదు.

    "వాళ్ళకి పదితులాల బంగారం, యాభయ్ వేలు కట్నం కావాలట"

    హాస తలెత్తి తమాషాగా నవ్వింది.

    "ఎందుకే నవ్వుతావు?"

    "నాకే గనుక డబ్బుంటే వాళ్ళకి పదితులాల బంగారం, యాభయ్ వేల రూపాయలూ ఇచ్చి వుండేదాన్ని__" అంది హాస.

    "అబ్బాయి నీకు బాగా నచ్చినట్లున్నాడు...." అంది పార్వతమ్మ నిట్టూర్చి.

    "అందుకే మరి- అడిగింది లేదనకుండా యివ్వాలనుంది. అయినా ఈ చందాల కోసం వచ్చేవాళ్ళు వున్న వాళ్ళిళ్ళకి పోక లేని వాళ్ళింటికొస్తారేమిటి?" అని నిట్టూర్చింది హాస.

    "చందా ఏమిటి? వాళ్ళు పెళ్ళిచూపులకొచ్చారు?"

    "అరే ఆ విషయం మర్చిపోయాను. వాళ్ళు నా గురించి అడిగేరా?" అందామె.

    పార్వత మనుమరాలి తల నిమురుతూ "వాళ్ళకు నువ్వూ కావాలి, నీ డబ్బూ కావాలి...." అంది.

    "అది ఎలా కుదురుతుంది? నాకే గనుక డబ్బుంటే వాళ్ళకు కోరిన బంగారం, డబ్బు ఇస్తాను. కానీ అతన్ని పెళ్ళి చేసుకోనుగా...." అని నవ్వింది హాస.

    "బామ్మా! నాకు నిద్రొస్తోంది__నువ్వు యిక్కడే పడుకో" అన్నాడు గిరిధర్.

 Previous Page Next Page