"అంతకంటే చేయగలిగినదేముంది?"
అతను వెళ్ళిపోబోతుంటే-"మీకంపార్టుమెంటునంబరూ, బెర్తు నంబరూ ఇవ్వండి. ఏమైనా వీలుంటే తర్వాత నేనువచ్చి చెబుతాను..." అన్నాడా ముసలాయన. అతను నిరుత్సాహంగానే ఆ వివరాలిచ్చి వెళ్ళిపోయాడు.
రాజమండ్రిలో వెయిటింగులిస్టు నంబరువన్- "బాబూ ఎలాగో అలా మా సంగతి చూడాలి. బోగీలో ఎక్కికూర్చోనివ్వండి. చాలా అర్జంటు ప్రయాణం. ఎంత కావాలనా ఇస్తాను... అన్నాడు.
ముసలాయన రాజారావు బృందాన్ని చూపించి "వీళ్ళంతా అలా కూర్చున్నవాళ్ళే. కొన్ని సీట్లు కాళీవున్నాయి కాబట్టి వీళ్ళని ఎక్కనిచహను. వీళ్ళందరూ బెజవాడలో దిగిపోబోతున్నారు. ఇది ఈ రోజు పరిస్థితి. ప్రస్తుతానికి సీట్లుకూడా కాళీలేవు కాబట్టి మిమ్మల్నిందులో ఎక్కనివ్వను..." అన్నాడు.
అతను స్వరం తగ్గించి- "మీరేటు చెప్పేయండి...ఎంతైనా సరే..." అన్నాడు.
"నా ఎత్తు ధనం పోసినా ఇందులో ఎక్కనివ్వను..." అన్నాడు ముసలాయన తీవ్రంగా- "అంతగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలనునుంటే, ప్రయాణంవారీ అంత అర్జంటనుకుంటే ఇది డే టైము జర్నీకదా- ఫస్టుక్లాసులో నిరభ్యంతరంగా ఎక్కవచ్చు. త్వరపదండి..."
ముసలాయన చిరాగ్గా- "వెధవ్వుద్యోగం చస్తున్నాను. ఇంకా రెండేళ్ళ సర్వీసు-" అని తనలోతను గొనుక్కున్నాడు కూడా.
ట్రయిన్ రాజమండ్రి వదిలిపెట్టింది. ఆ క్షణంలోనే ఈశ్వరరావుకూడా బొంబాయి బోగీమీద అన్ని ఆశలూ వదులుకున్నాడు. "జీవితంలో ఇలాంటివాణ్ని చూడలేదు-" అని అతను నెమ్మదిగా రాజారావు చెవిలో గొణిగాడు కూడా.
ముసలాయన చార్టుని పరిశీలించి ఏవో లెక్కలు వేస్తూన్నాడు. మిత్రబృందంగా మారిన అక్కడి అసహాయులు తమ కబుర్లలో పడ్డారు. ఒకళ్ళగురించి ఒకరు మరికొన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.
చౌదరికి బొంబాయి కొట్టినపిండి అని విన్న బాలకృష్ణ "అక్కడసూట్ కేసులు చాలాచౌక అని విన్నాను. మోసం లేకుండా ఎక్కడ కొనుక్కోవచ్చో చెప్పగలరా?" అన్నాడు.
"బొంబాయిలో మోసం లేనిదెక్కడండీ- అయిదొందలు చెప్పిన సరుకు యాభైరూపాల్నుంచి బేరం చెయ్యొచ్చు అయితే మనకూ అనుభవం అవసరం, ఒకడు అయిదొందలు చెప్పి అరవై రూపాయకివ్వవచ్చు. బేరం చెప్పేవాడెవ్వడో, చెప్పనివాడెవడో- సరుకునాణ్యత ఎలాంటిదో అన్నీ తెలియాలి__" అంటూ చౌదరి బొంబాయి గురించి తనకు తెలిసిన వివరాలు మొదలుపెట్టాడు.
ఒక మార్కెటులో ఒకడు హెచ్చుధర చెప్పి అన్నదానికి ఒక పైసాకూడా తగ్గలేదట. వాడిసరుకు తప్పక నాణ్యమైనదై వుండాలని అందరూ వాదిదగ్గరే అన్నీ కొనేశారట. అయితే అదంతా చచ్చు క్వాలిటీ సరుకట.
ఇలాంటి వుదాహరణలు వినేసరికి బాలకృష్ణ భయపడి పోయి- "బొంబాయిలో ఏమీకొనన్లేండి" అనేశాడు. చౌదరి అతని భుజం తట్టి ఓదార్చి- "కంగారుపడకండి. మీవాళ్ళున్నారంటున్నారుకదా" కూడా తీసుకువెళ్ళండి__" అన్నాడు.
బాలకృష్ణ టోకున చాలా సరుకుకొని బొంబాయినుంచి తేవాలని చాలా వుబలాటంగా వుంది. అతను చౌదరినడిగి కొన్ని స్థలాల పేర్లు నోట్ చేసుకున్నాడు.
ట్రయిన్ నిడదవోలు స్టేషన్ లో ఆగింది. రాజారావు ప్లాట్ ఫారంకేసే చూస్తున్నాడు. అక్కడ చక్కని అరిటాకులో కట్టిన దోసెలు దొరుకుతాయి. వేడిగా వుండకపోయినా ప్లాటు ఫారం మీద అటువంటి టిఫిన్ దొరకడమే అబ్బురం కదా!
ఈశ్వరరావు కంపార్టుమెంటు దిగుతూ- నేను బండి ఎక్కకపోతే కంగారు పడకండి. సికింద్రాబాదుబోగీలో ప్రయత్నాలు చేస్తున్నాననుకోండి_" అని రాజారావుకి చెప్పాడు. అతన్ని అనుసరిస్తూ చౌదరి, బాలకృష్ణకూడా దిగారు. వీళ్ళిద్దర్నీ అనుసరిస్తూ ముసలాయనకూడా దిగాడు. అప్పుడే రాజారావుకి దోసె దొరికింది.
రాజారావు దోసె తినడం అయ్యేసరికి ముసలాయన ఓ మనిషిని వెంటబెట్టుకుని వచ్చాడు. మరి నిడదవోలు కోటా లోదో ఏమో తెలియదుకానీ- ఓ బెర్తు కాళీ వుందట. వాల్తేరులో ఎక్కవలసిన పెద్దమనిషి కోసం ముసలాయన ఇప్పుడు దాన్ని కేటాయించాడు. ఇక్కడ ఎంతోమంది ఎక్స్ ట్రా డబ్బులిచ్చి బెర్తు కొనుక్కోవాలనుకుంటుంటే- ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఓ మనిషిని తీసుకొచ్చాడు. ఈ విధమైన అదృష్టానికి ఆ మనిషి చలించిపోయి ఇరవైరూపాయలనోటు చేతిలో పెట్టగా ముసలాయన ప్రాంఫ్టుగా పద్నాలుగు రూపాయల యాభైపైసలూ, రసీదూ అతనికి తిరిగి ఇచ్చేసి- "ఆ కంపార్టుమెంటులో మీరు ఇచ్చిన బెర్తు డబ్బులు మీకింకా తిరిగిరావు. ఆ రసీదు ఇక్కడ పనికిరాదు. అనవసరంగా మీకు అయిదున్నర నష్టమైంది. ఈ విషయంలో నేను మీకేమీ సాయం చేయలేను__" అన్నాడు.