Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 13

    తన ఫ్రెండ్స్  వెళ్లిపోతుంటే- "ఏయ్ఁ! ఆగండే...నేనూ వస్తున్నా!" అంటున్న స్ఫూర్తిని ఈష్ చిటికెన వేలు బలంగా ఆపింది.
    "నేనున్నానుగా!" అన్నాడు కళ్ళతోనే నవ్వుతూ. జేబులో ఉన్న హొటల్ రూమ్ కీ చూపించి, "మనం ఇక్కడికెళ్తున్నాం !" అన్నాడు.
    "నాకేవీ అర్థంకావట్లా! అందరూ కలిసే చేస్తున్నారీ పని! ఎందుకు?"
    "నేను చెప్తాను పద!"  రూమ్ కు తీసుకెళ్లాడు.
    "ఇది మన ఫస్ట్ నైట్! కానీ, మన మనసులు కలిసే నైట్ మాత్రమే! శరీరాలు కాదు! శరీరాలు మీ అమ్మనాన్న సమక్షంలో, మా అమ్మానాన్నల ఆశీర్వాదంతో జరిగిన పెళ్ళితరువాత కలుస్తాయి....ఓ.కే.!" అన్నాడు.
    రిలాక్సయింది. సైన్ చేసినప్పటినుండీ ఎందుకో తెలీదు... ఈష్ తనవాడిలా అనిపించసాగాడు. ఉదయం, నిన్న చూసిన ఈష్ లాగా లేడు. కొత్త ఈష్! తన ఈష్! తన  కలల్లోకి వచ్చే ఈష్! తనంటే శ్రద్ద, ప్రత్యేకత చూపించే ఈష్! మెల్లగా అతని భుజంమ్మీద వాలింది మమత్వంతో, మమేకంతో.
    'తన'.., 'తనది'.... అనే భావన ఎంత లోత్తెందీ అంటే- ఆ 'తన'లో తనదంటూ ఏవీ మిగల్చకుండా తన సొంతం అయిపోయిందన్నంత లోతైందీ! ఇది ఒకరిలో ఒకరికి ఏవీ  మిగల్చనీయదు. అర్పణ! శరీరం, మనసు, ఆలోచన, భవిష్యత్తు, భావన, భద్రత.... అంతా  అర్పణ చేసేసి  నిబ్బరంగా నిట్టూర్చేంత లోతైంది! ఇక తన గురించి తనకే బాధ్యత  లేదు. ఈష్! ఈష్ దే బాధ్యత. సమస్యలూ ఈష్ వి. ఈష్ నష్టాలూ, ఆనందాలూ తనవి. ఓఫ్ఁ! ఎంత రిలీఫ్..!' అనుకుంది స్ఫూర్తి. తనవి తనకెప్పుడూ భారమే! ఇతరులవి పరమతేలిక. ఆ తేలికతనంలో ఎంతో ఎత్తుకు- భారం లేకుండా మనసు రెక్కలు విచ్చుకుని ఎగిరింది! దిశదిశలూ దర్శించింది..., పరవశించింది.
    'ఎందుకు పెళ్ళికి పెద్ద హంగామా! అవతలి పెద్దవాళ్ళు, ఇవతలి పెద్దవాళ్ళు తమ హొదాలూ, దర్జాలూ చూపించుకోవడానికి కాకపోతే! రెండు హృదయాలు ఏక మవడానికి బాజా భజంత్రీలవసరమా? గాఢమైన మౌనంలో, కనులు నిండిన తపనలో, మూగపోయిన గుండెతో నిశ్శబ్దంగా మనసులు కలిపేసుకుంటే.... అది పెళ్ళవదా?
    జీవితానికి, మనసులు కలిపేసుకుంటే.... అది పెళ్ళవదా?
    జీవితానికి, పెళ్ళికి పునాది- ఆత్మసాక్షిగానీ అక్షింతలు, మంగళసూత్రం సాక్ష్యాలా? విందుభోజనాలు సాక్ష్యాలా? ఆర్భాటాలు, అనవసరపు అహంభావాలూ అవసరమా? ప్రకృతిలో ప్రతి స్త్రీత్వం, పురుషత్వం మౌనంలోనే ఏకమౌతాయే! మరి, మనుషులెందుకు గోలగోలలో, గడబిడలో, హడావిడిలో  ఏకమవ్వాలని పెద్దలంటారు! దాన్నే 'పెళ్ళి' అంటారు. అనవసరపు ప్రశ్న.., అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్న! కాకపోతే - ఎవరి సమాధానం వారికి సంతృప్తినిస్తుంది.... అది నెగటివ్ అయినా, పాజిటివ్ అయినా!' అనిపించింది స్ఫూర్తి, ఈష్ లకు,
    "స్ఫూర్తీ! ఇలాంటి ఫస్ట్ నైట్ ఎవరికీ జరిగుండదు. ఫస్ట్ నైట్ రోజు ఒకరిగురించి ఒకరు తెలుసుకుంటారు. కానీ, ఈరోజు నేను నీకు తెలియని నీ గురించి కొన్ని విషయాలు చెప్తా! నా భార్యగా విను! స్ఫూర్తిగా కాదు!" ఈష్.
    స్ఫూర్తికి మెల్లగా, పసిపిల్లలా, నిమ్మళంగా, ఓదార్పుగా, ఓపికగా చెప్పాడు- తనకు జరిగిన అన్యాయం!
    'అందులో నీ తప్పు లేద'న్నాడు. 'నీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేద'న్నాడు. 'కొన్నాళ్లు నీ భర్తగా నీ నిర్ణయాలు నన్ను తీసుకోనిమ్మ'న్నాడు. రాత్రంతా తనను కూతురిలా, తను తండ్రిలా లాలించాడు. రెండు మనసులూ ఏకమై ఒక నిర్ణయం తీసుకున్నాయి.
    ఉదయాన లేడీడాక్టరును కలిశారు. తనకు కొత్తగా పెళ్ళయిందనీ, అప్పుడే పిల్లలొద్దనీ...భర్తగా తాను సంతకం చేసి అబార్షన్ చేయించాడు.
    మరుసటిరోజు సాయంత్రం టాక్సీలో స్ఫూర్తిని హాస్టల్ కి తీసుకొచ్చాడు.
    గబగబ దిగబోతున్న స్ఫూర్తిని- "మెల్లగా...." అని పట్టుకున్నాడు.
    జ్ఞాపిక, కామినీ, రేవతీ ఎదురొచ్చారు. తనను రెండుచేతుల్లో పసిపిల్లలా లేపి పట్టుకుని వాళ్ళముందు దించి, "జాగ్రత్త! నాలుగయిదు రోజులు రెస్ట్ అవసరం!" అని వాళ్ళకు అప్పజెప్పాడు.
    తన స్నేహితురాళ్ళు వైపు దేవతలను చూసినట్టు చూసింది స్ఫూర్తి. స్నేహంలొ దైవత్వం కనిపించింది ఆమెకు. నలుగురి కళ్ళల్లోనూ నీళ్లు! అని ఆనందం, ఉద్వేగం కలగలిపిన నీళ్లు! స్ఫూర్తిని మెల్లగా నడిపించుకెళ్లారు హాస్టల్ రూమ్ లోకి!
    తెల్లవార్లూ మూలుగుతూనే ఉంది! ముగ్గురూ కనిపెట్టుకునే ఉన్నారు. రెండురోజుల్లో మామూలు మనిషయింది.... మిసెస్ ఈష్ కుమార్!
    "బాధల కన్నీరు తుడవ
    రుధిర హృదయమున్నది!
    రమ్యంగా ఓదార్చగల రంగుల
    ఉదయస్తమయాలున్నవి!"
    "గాలిబ్ ఎప్పుడో చెప్పాడు- బాధ ఉన్నప్పుడు రుధిర హృదయాలు ఉన్నాయి ఓదార్చడానికని! ఎంత నిజమో- రేవంత్ కు తెలిసింది స్ఫూర్తిని చూశాక, స్నేహితుల మనస్ఫూర్తిని చూశాక!
    అది పిల్లలకంటే ఎక్కువ జ్ఞానంతో సాధించిన విజయం! మామూలుగానే కాలేజ్ కెళ్లసాగారు. ఏది ఏం జరిగినా చదువు డిస్టర్బ్ కాకూడదనే పట్టుదల వాళ్ళ పెద్దపెద్ద సమస్యలను సైతం చిన్నబరిచేసింది. ఇప్పుడు జ్ఞాపిక, కామిని కూడా అల్లరి చేయగలిగే మనఃస్తిమితం పొందారు.

                                            9
    చాలారోజుల తరువాత ఫ్రెండ్సందరూ యూనివర్సిటీ లాన్ లో కూర్చున్నారు.
    ఎంతో ఉల్లాసంగా ఉన్నారందరూ. అందరి గుండెల్లోనూ రిలీఫ్! ఒక భారమైన సమస్య తొలగిపోయిన రిలీఫ్! ఒక ఫ్రెండ్ జీవనసమస్యను తీర్చేసిన రీలీఫ్..! ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసిన రిలాక్స్ నెస్..!
    "త్రీమంత్స్ లో మీరీ యూనివర్సిటీ ఎక్స్ స్టూడెంట్సయిపోతారు!" జ్ఞాపిక గుర్తుచేసింది రేవంత్ కు, క్రాంత్, ఈష్ కు!
    "యూనివర్సీటీకా.., యూనివర్స్ కా?" రేవతి కంగారుపడింది.
    "అపశకున పక్షీ! యూనివర్సిటీకే!" అంది 'టీ'ని వత్తిపలుకుతూ కామిని.
    "అయితే ఫర్వాలా! నేను హడలిచచ్చిపోయాను యూనివర్స్ కేమో, గ్రూప్ సూయి సైడ్ ప్రోగ్రామ్ ఉందేమో, లేదా ఏదైనా బాంబ్ బ్లాస్టింగ్ ఉందేమోనని! థాంక్ గాడ్!" అంది జీసస్ ను ప్రే చేసినట్టు చేసి, 'ఆమెన్...!'అని.
    "అసలు నీ నెత్తిన ఓ బంబేస్తే మమ్మల్ని చావకుండా, బ్రతక్కుండా కళ్ళు ప్రశ్నలూ జోకులూ వేసే పీడా పోతుంది!" స్ఫూర్తి తీర్పు చెప్పేసింది.
    "ఎందుకే నన్ను తిడతావ్! నేనెంతో ముందుజాగ్రత్తగా మాట్లాడితే!" ఇద్దరూ  మళ్లీ యుద్ధం మొదలు.
    జ్ఞాపిక- రేవతి నోరూ, కామిని- స్ఫూర్తి నోరూ మూసిపట్టుకుని-  "వీళ్ళిద్దరూ అబ్సెంట్ అనుకుని మనం  మాట్లాడుకుందాం. వీళ్ళిద్దర్నీ వదిలేస్తే మనకు 'ఊ' కొట్టడానికి కూడా చాన్సు లేకుండా వాగుతుంటారు!" అంది కామిని.
    బాయ్స్ నవ్వారు.
    రేవతి- స్ఫూర్తి గింజుకున్నా వదల్లా! "ఒట్టు! మేం మాట్లాడం!" అని తలమీద చేతులేసుకున్నాక వదిలేశారిద్దర్నీ.
    "సంతోషం, బాధ కలగులుపుగా ఉంది!" క్రాంత్ అన్నాడు.
    "బయట ప్రపంచంలోకెళ్లక మన దారులు మనల్ని ఎటువైపు తీస్కెళ్తాయో! జీవితంలో మళ్లీ ఏ విధంగా కలుసుకుంటామో!"
    రేవతి డెఫ్ అండ్ డెమ్ లాంగ్వేజ్ లో జ్ఞాపికకు ఏదో సైగ చేసింది.
    జ్ఞాపికను అర్థంకాలా! కామినికి సైగ చేసింది.
    కామినికీ అర్థంకాలా! స్ఫూర్తికి సైగ చేసింది.
    స్ఫూర్తికీ అర్థంకాలా! రేవంత్ కు, క్రాంత్ కు, ఈష్ కు సైగ చేసింది.
    వాళ్ళకీ అర్థంకాలా!
    "చెప్పేదేదో చెప్పేడవ్వే.... ఆ సైగలేంటి?" విసుక్కుంది జ్ఞాపిక.
    "మీరే కదా... మాట్లాడోద్దని ఒట్టు వెయించుకున్నారు!" అంది రేవతి.
    "నువ్వు మాట్లాడకుండా కూడా మమ్మల్ని చంపగలవని తెలీక అలా అన్నాం. ఆ చంపేదేదో మాట్లాడే చంపు!" అంది కామిని.
    "మనమందరం ఎక్కడున్నా ప్రతి సంవత్సరం యూనివర్సిటీ పక్కనున్న శ్మశానంలో  ఉన్న మర్రిచెట్టు కింద అమావాస్యరోజు కలుసుకుందాం! ఐడియా బావుంది కదా...!" అంది స్పూర్తి వైపు తిరిగి.
    స్పూర్తి టీషర్టు చేతులు పైకి మడిచి-
    "శ్మశానంలో..?!"
    "ఆఁ...అవును."
    "మర్రిచెట్టు క్రింద..?!"
    "యస్స్..!"
    "అదీ... అమావాస్య రోజు?!"
    "ఎగ్జాటీ...!"
    "నిన్నూ..." లేచింది పైకి.
    "హెల్ప్... హెల్ప్!" అని అరుస్తూ రేవతి గ్రూప్ చుట్టూ పరిగెత్తింది.
    ఎవరూ హెల్ప్ చెయ్యలా !
    "ఆగవే నువ్వు! పిశాచీ ఆగు!" అని స్పూర్తి పరుగెట్టింది వెంట.
    "అరె కోయీ హై ఇదర్.... బచావ్! బచావోనా!" అని రేవతి, "స్టాప్.... ఈడియట్! స్టాప్....ఐ సెడ్!" అని స్పూర్తీ పరిగెట్టారు.
    మిగిలినవాళ్ళూ పడీపడీ నవ్వుకున్నారు వాళ్ళను చూసి!
    "ఇక వెళ్దామా..?" లేచింది కామిని.
    "రేవంత్... నాక్కొంచెం రిఫెరెన్స్ కావాలి!" జ్ఞాపిక.
    "య్యా! ఐయాం ఆల్సో గోయింగ్ టు లైబ్రరీ! ఇఫ్ యు డోంట్ మైండ్...నేనక్కడ ఇస్తాను."
    "ఓ.కే.!" అని, "బై కామీ...!" అనేసి వెళ్లిపోయారిద్దరూ.
    కామినీ, క్రాంత్ నడుస్తూ సాగిపోయారో వైపు!
    ఈష్ బయల్దేరాడు.... స్ఫూర్తీ, రేవతీ ఎక్కడ ఫైటింగ్ చేస్తున్నారో చూడ్డానికి!
    రెఫెరెన్స్ అయ్యాక రేవంత్ అడిగాడు జ్ఞాపికను-
    "జ్ఞాపీ! అందరం హ్యాపీగా ఉన్నాంకదూ!"
    "అవును."
    "ఈ హ్యాపీ మూడ్ లో నిన్నో చోటికి తీస్కెళ్లనా!"
    "హ్యాపీ మూడ్  వెళ్లాలా  ఆ చోటుకు?"
    "అవును. అప్పుడే నువ్వు స్పందించగలవు!"
    "అయితే... అది తప్పకుండా పూజాస్థలమయి ఉంటుంది! లేదా  పూలతోటయి ఉంటుంది. లేదా సాగరతీరం అయిఉంటుంది. లేదా పచ్చిక బయళ్లయి ఉంటుంది. లేదా వర్షపు జల్లయి ఉంటుంది!" ఊహించేసింది... ఇద్దరికీ నచ్చే  కామన్ ఇష్టాలు అవే కనుక!
    "ఇవన్నీ కలిసిన చోటు- లాస్యపు నాట్యపు వేదిక అధరం.... అని నిజం చేస్తూ!"
    "వ్వాట్.... అన్నీ ఒక్కచోటా?" కళ్ళు విప్పార్చి సంభ్రమంగా నమ్మనట్టు చూసింది.
    "హాఁ... ఒక్కచోటే!" ఊరిస్తూ.
    "ఎక్కడా... ఎక్కడా?" తొందర తొందరపడిపోయింది.
    "పద! చూపిస్తా..."బైక్ స్టార్టయింది.
    వెనకే జ్ఞాపిక కూర్చుని, జస్ట్- రేవంత్ ను ఆనుకుంది.
    ఇష్టమైన స్పర్శ! తనను భద్రంగా ఆనందం చూపిస్తానని తీసుకెళ్లే స్పర్శ! ఎన్ని వింతలో, ప్రేమలో ఎన్ని విడ్డూరాలో! ఎప్పటికప్పుడు కొత్తదనం! ఎప్పటికప్పుడు అనుభవైకవేద్యం! నుదురు వీపుకానించి కళ్ళు మూసుకుంది. తన ఇష్టాన్ని అలవోకగా మోస్తూ ఆనందతీరాలకు విహారయాత్రకు బయల్దేరాడు రేవంత్... రేచుక్కలా!
    బైక్ ఆగితే కళ్ళు తెరిచింది జ్ఞాపిక.
    అది కాలేజ్ క్యాంపస్!
    ఏ కాలేజో తెలీదు.... డిగ్రీ పిల్లలు బుక్స్ పట్టుకుని గుంపులు గుంపులుగా!
    "ఇదేంటీ నీళ్ళూ, వర్షం , పూలు- అనీ, ఇక్కడి...."
    "ఉష్ష్...." అన్నాడు పెదవులపై చూపుడువేలు ఆనించి, "కమాన్!" అని కళ్ళతో సైగ చేసి ఓ క్లాస్ రూమ్ లోకి - అందులోనూ... ఆఖరి సీట్స్ లోకి తీస్కెళ్లి కూర్చోబెట్టాడు.
    "అదికాదూ! ఇదేంటీ..."
    మళ్లీ "ఉష్ష్..!" అన్నాడు.
    "పిన్ డ్రాప్ సైలెన్స్! స్టూడెంట్స్ కామ్ గా ఉన్నారు. నెక్ స్ట్ క్లాస్ కు మెంటల్లీ ప్రి పేరవుతున్నాట్టున్నారు.
    'అసలు వీళ్ళు స్టూడెంట్సేనా .... ఇంత కామ్ గా ఉన్నారు!' అనుకుంది. 'ఓహొఁ.... నెక్స్ స్ట్ క్లాస్ గురించిన యాంగ్జయిటీ వాళ్ళను కామ్ గా చేసేసిందేమో!' అనుకుంది మళ్లీ.
    అందరూ కూర్చున్నాక కనిపించింది క్లాస్ రూమ్ డయాస్ పైన ....ఆమె!
    నీలిరంగు చీర స్టెప్స్ తో పిన్ చేసుకుని, లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్, తెల్లని కోలమొహం, పెద్దపెద్ద కళ్ళు, గీసినట్లున్న పెదాలు, చిన్ని గడ్డం మీద సొట్టపడి, నవ్వకపోయినా నవ్వినట్లుండే పెదాలు, ఆ అందానికి దిష్టిచుక్కలా విల్లంటి కనుబొమ్మల మధ్య  చిన్న నల్లనిచుక్కలాంటి బొట్టు.
    'ఎంత బావుందీ...' అనుకుంది. చిన్నగా జెలస్!
    రేవంత్ తనవైపు చూసి నవ్వి, మళ్లీ  అటువైపు తిరిగి రెండుచేతులూ గడ్డానికి ఆనించుకుని రెడీ అయిపోయాడు క్లాస్ కు.
    కోపం వచ్చింది జ్ఞాపికకు.
    'అక్కడికి తీస్కెళ్తాను, ఇక్కడికి తీస్కెళ్తాను.... అని క్లాస్ రూమ్ కు పట్టుకొచ్చాడెంటీ?!' అని ! ఏవయినా అంటే ఉష్ష్....' అంటాడని ఊరుకుంది.
    "హలో....డియర్స్!" అంది తను! జ్ఞాపిక తల తిప్పింది.
    "హాయ్ఁ....మేమ్!" అన్నారందరూ మెత్తగా.
    "టుడే వుయ్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎబౌట్ కీట్స్ పోయట్రీ! హావ్ యు ఇంట్రస్ట్?" అడిగింది మెత్తగా, ప్రేమగా....కళ్ళతో నవ్వుతూ.
    "య్యా...మేమ్!" అన్నారందరూ మెత్తగా.
    "షల్ వుయ్ బిగిన్...?!" మళ్లీ అడిగింది.
    "య్యా... మేమ్!" అన్నారు మళ్లీ అందరూ.
    "డు యు నో ఎనిథింగ్ ఎబౌట్ కీట్స్...?!" అడిగింది మళ్లీ మెత్తగా.
    "నో... మేమ్!" మళ్లీ చెప్పారందరూ.
    "నో ప్రాబ్లమ్! బయాం గోయింగ్ టు ఇన్ టర్ డ్యూస్ హిమ్!"
    "థాంక్యూ... మేమ్!" అన్నారు మళ్లీ.  

 Previous Page Next Page