Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 12

    ఆమె చేతిలోని సూట్ కేస్ ను తీసుకున్నాడతను.
   
    ఇద్దరి బట్టలూ అందులోనే వున్నాయి. రెండు సూట్ కేసులు మోతబరువు ఎందుకని ముందుచూపుతో తన బట్టలు ఇంట్లోనే వుంచి వచ్చేటప్పుడు ఆమె సూట్ కేసులో వాటిని కూడా సర్దుకుని రమ్మని చెప్పాడు రాంగో.
   
    "ఇంతకూ మనం ఎక్కడకు వెళుతున్నాం..."
   
    "పెళ్ళిచేసుకోబోతున్నాం..." అన్నాడతను క్లుప్తంగా.
   
    ఎక్కడకు...ఏమిటి...ఎందుకు? అనే ప్రశ్నలు ఇకవేయలేదు జాజిబాల.
   
    రాంగోపై ఆమెకు అంత నమ్మకం!
   
    ఇద్దరూ బస్ వైపు నడిచారు.
   
    చల్లని రాత్రివేళ సన్నజాజుల పరిమళం చుట్టుకున్నట్టు కొబ్బరి ఆకుల చివర్ల నుంచి వెన్నెల జారినట్టు, నీలిపూల మైదానం ప్రేమగా పిల్చినట్టు....ఆ బస్ వాళ్ళను ఆహ్వానించింది.
   
    ఇద్దరూ బస్ లో ఎక్కి కూర్చున్నారు.
   
    రాంగో తను ఏం చేయబోతున్నదీ జాజిబాలకు చెప్పాడు.
   
    పూర్తిగా విని ఆమె స్థాణువైంది.
   
    తప్పు చేస్తున్నామేమో అని బాధ పడింది.
   
    తరువాత భయపడింది.
   
    కానీ రాంగో ధైర్యం చెప్పడంతో చివరకు ఎలాగోలా మామూలు మనిషి కాగలిగింది.
   
    "అడిగీ అడగకుండానే ఆలోచించకుండా నాతో బయలుదేరావు. నీకెలా థాంక్స్ చెప్పాలో తెలీడం లేదు..."
   
    మునివ్రేళ్ళతో ఆమె గడ్డాన్ని పట్టుకుని, ముఖాన్ని ఆమె ముఖం దగ్గరకు చేరుస్తూ సిన్సియర్ గా అన్నాడు రాంగో.
   
    "అంతంత మాటలెందుకు.....నువ్వంటే నాకిష్టం_నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నదానిని. నువ్వు పిలవగానే రాకుండా ఎలా ఉండగలను?" కళ్ళు వెడల్పుచేసి అమాయకంగా చూస్తూ చెప్పింది.
   
    ఇప్పుడు అతని మొఖంలో ఎలాంటి బాధ లేదు.
   
    ఆమెక్కూడా అలాగే వుంది.
   
    సహజంగానే ప్రేమికులు తమ జీవితంలో ....దుఃఖానికి, కన్నీళ్ళకి, విచారపడడానికీ తక్కువ సమయం కేటాయించి....సరదాకి, సంతోషానికి, సుఖానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు.
   
    తమ ప్రేమ వ్యవహారాల్లో ఒక్క క్షణాన్నికూడా వదులుకోలేరు!
   
    ప్రస్తుతం రాంగో, జాజిబాలల మానసిక స్థితికూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు.
   
    బస్ కదిలింది.
   
    దానితోపాటే వాళ్ళిద్దరి హృదయాలలో వున్న భారం కాస్తా దిగి పోయినట్టయింది.
   
    కానీ...
   
    వాళ్ళు ఊహించలేని విషయం ఒకటుంది!
   
    తాము తీసుకున్న నిర్ణయం వలన మున్ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొనబోతున్న విషయం వాళ్ళ ఊహకు అందని నగ్నసత్యం.
   
    హైదరాబాద్ చేరేసరికి ఉదయం ఏడుగంటలైంది.
   
    ఇద్దరూ బస్ దిగారు.
   
    ప్లాట్ ఫారమ్ అంతా ప్యాసింజర్లతో కిటకిట లాడుతున్నది. వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వారి వారి బంధువులు వచ్చారు. వాళ్ళు హాయిగా...ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
   
    "ఎక్కడకు వెళదాం?" అడిగింది జాజిబాల.
   
    అలా అడిగినప్పుడు ఆమె లేత పెదవులు వణకడం గమనించాడు రాంగో.
   
    జాజిబాల ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆమె నిండైన వక్షోజాలు లేచి పడుతున్నాయి. ఆమె అవయవాల పొంకం, ఇతరుల మీద కలిగించే ప్రభావం గురించి అతను పట్టించుకోవడంలేదు.
   
    "ఇవాళ ఇక్కడే వుందాం....పది గంటల సమయంలో వెళ్ళి మా బాస్ కు రావలసిన శ్యాష్ కలెక్షన్ చేసుకురావాలి. ఆ యాభైవేలు చేతిలో పడిన తరువాత మనం ఏం చేద్దామో అప్పుడు నిర్ణయించుకుందాం" చెప్పాడు రాంగో.
   
    "ఇక్కడా?"
   
    "అవును...."
   
    "ఇక్కడ ఎక్కడ వుంటామని?"
   
    "ఏదయినా హోటల్ లో రూం తీసుకుని వుందాం."
   
    ఇద్దరూ మాట్లాడుకుంటూనే మెయిన్ రోడ్మీదకు వచ్చారు.
   
    రాంగో ఆటోని పిలిచాడు.
   
    "ఏదయిన మంచి హోటల్ కు తీసుకువెళ్ళు" చెప్పాడు రాంగో.
   
    "ఎక్కండి సార్...." ఆటో రివర్స్ చేస్తూ అన్నాడు ఆటో డ్రైవర్.
   
    ఇద్దరూ ఎక్కగానే ఆటో కదిలింది.
   
    అరగంట తరువాత ఆగింది ఆటో.
   
    హోటల్ కల్యాణి.....!
   
    మెయిన్ రోడ్ కు ఎడంగావున్న ఒక విశాలమైన వీధిలో వున్నది ఆ రెండతస్తుల హోటల్.
   
    ఆటో డ్రైవర్ కు డబ్బులిచ్చి జాజిబాలతో కలిసి లోపలకు వెళ్ళాడు రాంగో.
   
    "ఒక డబుల్ రూమ్ కావాలి" వాళ్ళిద్దరివైపు అనుమానంగా చూశాడు రిసెప్షనిష్టు.
   
    రిజిష్టర్ లో సంతకం చేయించుకుని అడ్వాన్స్ తీసుకుని బోయ్ ని పిలిచాడు కౌంటర్ లో వున్న రిసెప్షనిష్టు.
   
    సూట్ కేసు తీసుకుని లిఫ్ట్వైపు నడిచాడు రూం బోయ్.
   
    అతన్ని అనుసరించారు రాంగో....జాజిబాల.
   
    పై అంతస్థులో వున్నది ఆ రూమ్.
       
    రూమ్ తాళం తీసి వాటర్ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు రూమ్ బోయ్.
   
    "ఎలా వుంది గది?...." బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు రాంగో.

 Previous Page Next Page