గంగాధరానికి నవ్వాగడంలేదు. అలా నవ్వి నవ్వి చివరికి సర్దుకుని "మునెయ్య భలే ఐడియా వేసి తప్పించుకున్నాడే" అంటూ కితాబు యిచ్చేశాడు.
తనకు తెలిసిన విషయమంతా అతనికి చెప్పేయడంతో అప్పటికి కడుపునొప్పి తగ్గింది ఆకాశవాణి సుబ్బారావుకి.
ఇద్దరూ బయల్దేరబోతుంటే భూపతిరెడ్డి కూతురు శశి వచ్చింది. ఎప్పుడూ ఇల్లు వదిలి బయటికి రాని శశి అంతరాత్రి వీధుల్లో తిరుగుతుండడం ఆశ్చర్యంగా అనిపించి బొమ్మల్లా చూస్తున్నారు.
ఆమె కొత్తగా కనిపిస్తోంది.
అతిగా అలంకరించుకోవడంవల్లే ఆమె అలా కనిపిస్తోందని వాళ్ళిద్దరూ గ్రహించారు.
కళ్ళకి కాటుక, నుదుటున పెద్ద బొట్టు, తలలో మల్లెపూలదండలు ముఖానికి దట్టంగా పౌడరు - అవయవాలను దాచలేని బట్టలు - ఈ వేషధారణలో మరొక్కరయితే ఎబ్బెట్టుగా కనిపించేవాళ్ళేగానీ ఆమె అసాధారణ అందగత్తెకాబట్టి అలా అనిపించడంలేదు. పైపెచ్చు ఆమె రాత్రికి వేలాడుతున్న ఎర్రరాళ్ళ జుమికీలా అద్బుతంగా వుంది.
"మా ఆయన కనిపించాడా?" అని అడిగింది ఆమె.
వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తన భర్త గురించి అడిగితే తమకేం తెలుస్తుంది? మరొకరయితే ఆ జవాబే చెప్పే వాళ్ళేగానీ ఆమె భూపతిరెడ్డి కూతురు ఏ తేడా వచ్చినా తోలు వలిచేస్తాడు.
"తెలియదక్కా" అన్నారు ఇద్దరూ ఒకేసారి భయంగా.
ఆమె ముందుకు అడుగులు వేసింది.
ఊరంతా తిరిగింది గానీ ఎక్కడా కనపడలేదు.
చివరికి చంద్రరేఖ ఇంటి దగ్గరకి వచ్చింది.
ఆమెను చూస్తూనే చంద్రరేఖ సాదరంగా ఆహ్వానించింది. శశి అంటే ఆమెకి ప్రత్యేకమైన అభిమానం. అంత పెద్ద ఇంట్లో పుట్టినా, ఆగర్భ శ్రీమంతులయిన గర్వం అనేది ఎక్కడా కనపడదు. పైపెచ్చు అందర్నీ అభిమానంతో చూస్తుంది.
"రా శశీ! ఇలా కూర్చో!" మంచం వాల్చింది.
శశి కూర్చుంది.
ఆమె అలంకరణ కొత్తగా అనిపించింది చంద్రరేఖకి కూడా. ఇలా అతి అలంకరణ అనేది తనని తాను ఎక్కువగా ప్రేమించుకున్నప్పుడు జరుగుతుంది. స్త్రీ యవ్వనంలోకి వచ్చేటప్పటికి చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పొందినంత గాఢమైన ప్రేమ పురుషుడి దగ్గర్నుంచి పొందాలనీ కోరుకుంటుంది. కానీ ఈ ప్రపంచం పురుషుడిది.
పురుషుడు ఆధిక్యతలో వుంటాడు. తను స్త్రీకంటే అధికుడ్ని అని అనుకుంటాడు. తనతో సమానం కావడాన్ని మనస్పూర్తిగా ప్రేమించలేడు అందుకే పురుషుడు ఎప్పుడూ స్త్రీని చులకనగా చూస్తుంటాడు తప్ప సాటి మనిషిగా, సహచరిణిగా గుర్తించలేడు. బానిసలాగా చూడడం ప్రారంభిస్తాడు.
ఈ బేదాన్ని స్త్రీ గ్రహిస్తుంది. పురుషుడినుంచి ప్రేమ దొరకదని తేలిపోవడంతో తనే రెండుగా విడిపోతుంది. అంటే డ్యుయల్ రోల్ అన్న మాట. ఇలా తనను తాను ప్రేమించుకుంటుంది.
దీన్నే ఏమంటారు? డాక్టర్ ఏదో పేరు చెప్పాడు. కానీ గుర్తు రాలేదు చంద్రరేఖకి. అలా ఆలోచిస్తుంటే చివరికి పేరు తట్టింది -నార్సిసిజం తనని తాను ప్రేమించుకోవడాన్ని అలా పిలుస్తారు.
శశికూడా స్వప్రేమికురాలు అయిపోయిందా?
పెళ్ళి జరిగి పట్టుమని మూడు నెలలుకూడా కాలేదు. ఈ మూడు నెలల్లో ఏం జరిగింది? చాలా అనుమానాలు కలిగాయి చంద్రరేఖకి.
"మామూలుగా బయటికి రాని పిల్లవు. ఎనిమిది గంటల రాత్రి ఊర్లో తిరుగుతున్నావు ప్రత్యేకమైన కారణం ఏమైనా వుందా?"
"ఏమీ లేదక్కా - మా ఆయన కనపడడం లేదు-" అంది దిగులుగా.
"వాసూనా?"
"ఆఁ"
"ఎక్కడికి వెళ్ళాడేమిటి?"
"అదే అర్ధం కావడంలేదు. రాత్రియితే చాలు కనపడడు. ఎవరి ఇంటి పంచనో, లేక శివాలయంలోనో పడుకుని ఉదయం లేచి వస్తున్నాడు. ఈ రోజు ఎలాగయినా ఇంటికి పట్టుకుపోదామని వచ్చాను."
"రాత్రయితే ఇంటిపట్టున వుండడంలేదా? తనలో తానే అనుకుంటూ చంద్రరేఖ ఆలోచనలో పడింది.