"ఇదెక్కడి తద్దినం! ఆ అమ్మాయి నాకు కూతురుతో సమానం అంటే పెళ్ళి చేసుకోమంటారేం?" పృధ్వీ చిరాకుపడిపోయాడు.
"నా కడుపులో బిడ్డకు తండ్రి అయినవాడు నాకు తండ్రినని చెప్పుకుంటున్నాడు. వావివరసలు లేనివాడు ఇతడు మనిషా? మృగమా? నాకు తండ్రిలాంటివాడితో నేనుమాత్రం వివాహానికి ఎలా అంగీకరిస్తాను? నేనింకా మానవత్వం నుండి మృగస్థాయికి దిగజారలేదు. అతడితో నా వివాహం జరిపించాలని మీరేమీ శ్రమతీసుకోకండి." కరుణ ఖచ్చితంగా చెప్పింది.
సుబ్బరాయశర్మ అన్న తెలుగు రీడర్ విస్తుపోతూ అన్నాడు "అదేమిటి కరుణా! ప్రస్తుతం నీ జీవితానికున్న పరిష్కారం అదొక్కటే కదా? నయాన్నో, భయాన్నో అతడు నిన్ను వివాహం చేసుకొంటే నీ జీవితం ఒడ్డునపడుతుంది కదా!"
"ఆత్మాభిమానం గల ఆడపిల్లకు అదొక్కటే పరిష్కారం ఎలా అవుతుంది? తెలిసీ తెలియని తనంతో వయసు వరదలోపడి నేను మోసపోతే మోసపోయానేమోగాని ఇలాంటి నీచ - నికృష్టుడితో జీవితాన్ని పంచుకోవడానికి మాత్రం నేను యిష్టపడను పెళ్ళికాకుండానే చెడిపోయానన్న ముద్ర నాకు శాశ్వతంగా మిగిలితే మిగలనీ........."
"అతడు ప్రవర్తించిన తీరుకు నువ్విలా ఆవేశపడటం సహజమే కరుణా! కాని కొంచెం నిదానంగా ఆలోచించి చూడు. నీ ఆవేశం ఎంత అర్ధరహితమైందో నీకే తెలుస్తుంది. నీ జీవితం నీ ఒక్కదానిదే కాదు. నీకొక కుటుంబం వుంది.
అమ్మా, నాన్నా, చెల్లెళ్ళు వున్నారు. పెళ్ళి కాకుండానే కూతురు చెడిపోయిందంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంత అవమానం? ఆ కళంకం ఎంతగా క్రుంగదీస్తుంది వాళ్ళను? పెళ్ళి కావలసిన నీ చెల్లెళ్ళు........ ఎంతో భవిష్యత్తున్న నీ తమ్ముడు....."
"అందుకే....... నావల్ల ఎవరూ అవమానంతో క్రుంగిపోకూడదనే నేనొక నిర్ణయానికి వచ్చాను" అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి చిన్న క్యానొకటి తీసింది. తీస్తూతీస్తూనే క్యాన్ మూతతీసి ఒంటిమీద ఒంపేసుకొని, బ్యాగ్ లోంచి అగ్గిపెట్టె కూడా తీసి గీయడానికి రెడీగా పుల్ల కూడా చేతిలోకి తీసుకుంది.
ఇదంతా కనుమూసి తెరిచేలోగా జరిగిపోయింది.
"ఏయ్ కరుణా! ఏమిటా పిచ్చిపని........?" విశిష్ట గాబరాగా దగ్గరికి రాబోయింది.
"ఎవరూ నా దగ్గరికి రావద్దు, నన్ను ఒంటరిగా కాలిపోనివ్వండి"
"ఆత్మహత్య చేసుకోవడం వట్టి పిరికితనం. వద్దు - నువ్వాపనికి ఒడిగట్టొద్దు......" విశిష్ట దగ్గరగా రెండడుగులు వేసింది.
"చెప్పానా నా దగ్గరికి రావద్దని. నువ్వూ నాతోపాటు కాలిపోవడానికయితే రా....." అగ్గిపెట్టె మీదున్న గంధకం మీద పుల్లుంచి అంది కరుణ.
విశిష్టకు ఆగిపోక తప్పలేదు.
"దయచేసి నా దగ్గరికి రావాలని ఎవరూ ప్రయత్నించవద్దు. వస్తే నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు చెప్పకుండానే పోతాను"
ఎక్కడి వాళ్ళక్కడ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు.
"ప్రియమైన నా సహ విద్యార్ధినీ, విద్యార్ధులూ! ప్రియమైన ఆచార్యులూ........ అందరికీ నా తుది వందనాలు! ఒకటి రెండు నిముషాల్లో నన్ను నేను మంటలకు ఆహుతి చేసుకోబోతూ ఇస్తున్న మరణ వాంగ్మూలమిది. రైటింగ్ లోనూ ఇచ్చాను. ఆ కవరు పోస్టులో వేశాను. అది రేపు అందవలసిన వాళ్ళకు అందుతుంది. నేనిప్పుడు మూడునెలల గర్భవతిని అందుకు ఈ పృధ్వీ కుమారే కారకుడు! చస్తూ అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తన ఓరచూపులతో నన్ను రెచ్చగొట్టి, లైన్ లోకి లాగి, పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నన్ను గర్బవతిని చేశాడు. ఇప్పుడు తనకేమీ తెలియదంటున్నాడు. తెలుసు కదా, పెళ్ళి కాకుండా గర్భవతి అయిన ఆడపిల్లకు ఈ సమాజంలో ఎన్ని అవమానాలో! అన్ని అవమానాలూ భరిస్తూ నాకీ మొండి బ్రతుకు బతకాలనిలేదు. అందుకే ఈ పలాయనం.
కాలేజీకి వచ్చింది చదువుకోసమని మరిచి ఎవరూ ప్రేమలోపడి సమస్యలు తెచ్చుకోకండి. మన మీద ఎంతో నమ్మకముంచి, మనం చదువుకొని ప్రయోజకులం అవుతామని కాలేజీలకి పంపే అమ్మా నాన్నల్ని చాటుమాటు వ్యవహారాలతో మోసగించకండి! ఏ ఆడపిల్లయినా, ఏ మగపిల్లాడైనా చదువు పూర్తిచేసి ఆర్ధికంగా నిలబడే దాకా ప్రేమలూ, దోమలూ దగ్గరికి రానివ్వకండి., నాలా తప్పటడుగు వేసే ఆడపిల్లలకు నా జీవితం కనువిప్పు కలిగించాలనే మీ అందరి ఎదురుగా నన్ను నేను కాల్చుకొంటున్నాను."
ఆమె ఆవేశంతో , దుఃఖంతో మాట్లాడుతుంటగానే విశిష్ట పిల్లిలా నెమ్మదిగా ఆమె వైపు కదలసాగింది.
సింధు పృధ్వీ దగ్గరికి పరిగెత్తింది. "జరిగిన తప్పుకు మీది బాధ్యత వుందని ఒప్పుకోండి సార్! దాన్ని వివాహం చేసుకొంటానని చెప్పండి సార్! మీరా మాట చెబితే అది ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుంటుంది!" ప్రాధేయపడింది.
"ఇదెక్కడి తద్దినం! ఎవడి పాపమో నా మెడకు కట్టుకోమంటావేం? నాకీ వ్యవహారంతో సంబంధమేమీ లేదు" ముఖం చిరాకుగా పెట్టి అన్నాడు పృధ్వీ.
కరుణ చేతిలోని అగ్గిపుల్ల చుర్రుమని వెలిగింది.
మరుక్షణం.
ఏదో ఉత్సవ సందర్భంలో ఏర్పాటు చేసిన దిష్టి బొమ్మలా మండిపోయింది కరుణ.
విశిష్ట ఒక్క అంగలో వెనక్కి జరక్కపోతే ఆమెనీ చుట్టివేసేవి మంటలు.
ఎవరూ ఏమీ చెయ్యలేని నిస్సహాయత!
కొందరు నీళ్ళ కోసం పరిగెత్తారు.
కొందరు అంబులెన్స్ కు ఫోన్ చెయ్యడానికి పరిగెత్తారు.
వాళ్ళు తిరిగివచ్చే సరికి కాలిన ఒక మాంసం ముద్దగా పడింది కరుణ!
"అన్నెం పున్నెం ఎరుగని ఒక అమాయకురాలి చావుకు కారణమయిన వాడిని వదలకండి! తన్నండి!చంపండి!" విశిష్ట ఉగ్రమూర్తిగా అరిచింది.
ప్రమాదం పసికట్టిన పృధ్వీ ఎప్పుడో జారుకున్నాడు. పార్కింగ్ ప్లేస్ లో వున్న తన కారులో పడి కారుని స్టార్ట్ చేసి మెరుపు వేగంతో పోనిచ్చాడు.