Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 12

       
                         వీటిని కనిపెట్టిన వారు
                           తూర్పు ఖండంవారే!

   పోచెంజర్ కచ్చడం గురించి చరిత్ర మనవిచేశాను. అది వారికి దొరికినది ఒక 50 సంవత్సరాల కిందనే. కాని, అసలు ఆ కచ్చడం కట్టుకొన్న స్త్రీ చనిపోయినది ఒక నూరు సంవత్సరాలకు ముందయినా అయివుండాలి.
    అప్పటికే ఈ ఆచారం యూరపు దేశాలలో చాలా వ్యాప్తిలో వుంది. నిస్సందేహం. ఈమాట రుజువు చెయ్యటానికి ఆయా మ్యూజియాలలో ఇప్పటికీ వున్న అనేక కచ్చడాలే చాలు. (వీటి బొమ్మలనే ఈ వ్యాసావళిలో ప్రకటిస్తున్నాను.)
    యూరపులో తూర్పు పడమరా అనకుండా, వుత్తరం దక్షిణం అనకుండా సర్వత్రా ఈ ఆచారం వుండేదని కూడా నిర్ధారణ చెయ్యవచ్చును. ఆయా కచ్చడాలు దొరికిన స్థలాలను పట్టీ దొరికిన సన్నివేశాలనుపట్టీ ఈ మాటను ఎవరయినా అంగీకరించక తప్పదు.
    ఇందులో ఒక్క విశేషం వుంది. ఇప్పుడు కనిపిస్తూన్న ఈ కచ్చడాలు చాలావరకు పశ్చిమదేశాలలోనివే. తూర్పు దేశాలలో దొరికిన కచ్చడాల నమూనాలు లేవు. దీనిని పట్టి, ఈ ఆచారం అంతా పాశ్చాత్యులదే అనికొందరు నిర్ధారణచేస్తే చెయ్యవచ్చును. కాని, అది పొరపాటవుతుంది.
    ఎందుచేతనంటే తూర్పు సామాన్యమైన ఖండం కాదు. అందులోనూ సంభోగ విషయంలో తూర్పుది అందెవేసిన చేయి. స్త్రీ పురుష సంబంధాన్ని శోధించి, నిర్వచించి, శాస్త్రాలు వ్రాసిన దేశం తూర్పు. కఠిన పరీక్షలు చేసి కళాస్థానాలను ఏర్పాటు చేసిన దేశం తూర్పు. ఇప్పుడిప్పుడు పాశ్చాత్యులు ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్టుంది.
    వయస్సులో మిన్ను మన్ను తెలియకుండా కిందా మీదా పడుతూ వుండే స్త్రీ పురుషుల చర్యలను పరిశీలించి, ఒక దారికి తీసుకొనివచ్చి ఎనభయి నాలుగు రకాలు అవి పేర్లు పెట్టి చెప్పగలిగిన దేశం: స్త్రీ పురుషుల అవయవ పరిమాణాలలో వ్యత్యాసాలవల్ల కలిగిన నష్టకష్టాలను పరిశోధించి, ఆ చింత ఏమీ లేకుండా చేయడానికి సూక్ష్మమార్గాలు చూపించిన దేశం తూర్పు.
    పెదవి ముద్దునూ పంటినొక్కునూ ఒక పెద్ద శాస్త్రభాగంగా చేసి దేశదేశాలకు వాటి రుచిని చాటించినది తూర్పుదేశం. ఈ విషయంలో తూర్పుదేశం వెనక పడ్డదంటే నమ్మకూడని మాట. నమ్మలేము.
    అటువంటి తూర్పుదేశంలో, ఇనపకచ్చడాలు లేకుండానా? సాక్షాత్తు ఇనుపకచ్చడాలతో ఇప్పుడుగూడా వ్యక్తులు కన్పిస్తున్న ఈ తూర్పులో, మరుగుబిళ్ళలు లేకపోతే మానభంగం అన్నట్టు భావించే ఈ దేశంలో, అవి లేకుండానా?
    ఆ కచ్చడాలమీది చిత్రరచనా, ఆ కళా కౌశలమూ, ఆ ఉపాయ ప్రాశస్త్యమూ అన్నీ తూర్పు వాసనే కొడుతున్నాయి. కాని, మరొకటికాదే. కాబట్టి తూర్పులో ఇవి లేకపోవడం ఏమిటి?
    మూడునాలుగువందల సంవత్సరాల క్రింద వ్రాసిన వ్రాతలను పట్టి చూస్తే, నిజానికి, ఈ ఇనపకచ్చడాల ఆచారం తూర్పు దేశాలనుంచే పడమటికి పాకిందని తేటపడుతుంది. ఆ వ్రాతలే నమ్మాలి. ప్రాచ్యదేశాల విజ్ఞానం ఎలాగ ప్రసరించిందో, ఆ సంగతి తెలిసిన వారికి, ఈమాటే విశ్వాసపాత్రం అని తేటపడుతుంది.
    అప్పుడేకాదు. ఇప్పుడు గూడా ఈ విషయాలను పాశ్చాత్యులు ప్రాచ్యుల దగ్గరనుంచి నేర్చుకుంటూ ఉన్నారు. ఇలా నేర్చుకుంటూనే వుంటారు. ఇంకా, ఇంకాను. ఈ రోజులలో తూర్పువాడు అంటే కొంత నాగరికత తక్కువ కలవాడు అన్న అర్ధం అక్కడక్కడ వుంది. అలాగనే ఆ రోజులలో "అప్రాచ్యుడు" అంటే, తూర్పువాడు కానివాడు, అన్న మాటకు వట్టి అనాగరికుడు అని అర్ధం వుండేది. ఇప్పటికీ ఈ అర్ధంలో వాడుక వుంది.
    కాబట్టి ఈ కచ్చడాలు మనతూర్పే పడమరకిచ్చింది. సాంప్రదాయాన్ని పట్టి చూచినా, తెలివితేటలను పట్టి చూచినా, వ్రాతకోతలను పట్టిచూచినా, కచ్చడాల తయారీని పట్టిచూచినా, వీటిని మొదట కనిపెట్టినవారు తూర్పువారే. పాశ్చాత్యులు-ఇప్పటిలాగానే, అప్పుడుకూడా-అనుకరించినవారే.
    దీనికి ఇంకా బలమయిన కారణం: బహుభార్యత్వం, అంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం అన్న ఆచారం తూర్పులోనే విశేషం కదా ఇలాంటి నిరోధక సాధనాలు అవసరం.

 Previous Page Next Page