కోడలిమాటే నిజమైంది!
పిల్లలకోసం చేయని యాత్రలేదు, మొక్కని రాయిలేదన్నట్టుగా అయింది రాజ్యం జీవితం! పిల్లలకోసం కట్టించుకొన్న తాయెత్తులు ఒంటినిండా ఉన్నాయి! పిల్లలకోసం ఏ పరీక్ష అంటే ఆ పరీక్ష చేయించుకొంది డాక్టర్ల దగ్గర!నలభయ్యేళ్ళకి దగ్గరగా వచ్చేస్తూంది వయసు! ఆశ నిరాశగా మారిపోతున్న సమయంలో ఎక్కడిదో ఈ బిడ్డవచ్చి తన ఒడి చేరుకొంది.
ఈ బిడ్డ తనకేనా? పూర్తిగా తనకేనా? మళ్ళీ ఎవరూ వచ్చి లాక్కుపోరుకదా?
"నిజంగా ఈ బిడ్డ మనకేనా?" నమ్మలేనట్టుగా మళ్ళీ అడిగింది రాజ్యం.
"ఎందుకంత అపనమ్మకం? ఎవరూ ఈ బిడ్డను నీ నుండి లాక్కుపోరు, ఒక్క దేవుడుతప్ప! మన అమ్మగారు ఇప్పించారు ఈ బిడ్డను! ఇదిగో, పాపకి పాలడబ్బాలు, పాలపీక, పౌడరు...ఇవన్నీ మనమ్మగారు ఇప్పించారు!" బాస్కెట్ నుండి పాపవస్తువులు తీసి బయటపెడుతూ చెప్పాడు సుందరయ్య, ఉత్సాహంతో.
మరునాడు ప్రొద్దుటే వెళ్ళి పాపకోసం వెదురుతొట్టె, తాడు కొని రిక్షాలో వేసుకువచ్చాడు సుందరయ్య. రాజ్యం పాపకి స్నానంచేసి ఒళ్ళంతా పౌడరు చల్లి నుదుట, బుగ్గనా, అరికాళ్ళలో మసిబొట్టు పెట్టి గరిటలో నిప్పు మీద సాంబ్రాణి వేసి పాపకి పొగపడుతూంది!
"చిదిమి దీపం పెట్టుకొనేలా ఉందని మురుస్తున్నావుగాని, రాజ్యం ఈ పిల్ల పెరిగి నీ గుండెలమీద కుంపటి కాకపోతే చూడు! పెంచుకోక పెంచుకోక ఇలాంటి పిల్లనే పెంచుకోవాలీ? పెళ్ళికాకుండా పుట్టిన పిల్లని తెలిస్తే దీన్ని ఎవడైనా పెళ్ళాడుతాదా?" ఆ వీధిలోనే కాపురముంటున్న సుబ్బమ్మ అంటూంది.
"పెళ్ళికాకపోతే పీడాపోయింది! మా కళ్ళముందుంటుంది లెండి! సుబ్బమ్మగారూ!" వచ్చిన కోపం నిగ్రహించుకొని శాంతంగా అన్నాడు సుందరయ్య. "మా పిల్లను పెళ్ళిచేసుకొమ్మని నీ కొడుకుల దగ్గరికీ, మనుషుల దగ్గరికీ రాను. అసలు ఆ పిల్లకు పెళ్ళేచేయను తెలుసా? చక్కగా చదివిస్తాను. ఇండియాకి ఇప్పుడున్న మినిష్టరంత చేస్తాను!"
"దీన్నే గొంతెమ్మ కోరిక లంటారు నాయనా!"
"పసిపాప! దైవస్వరూపం! అంత పిల్లని పట్టుకొని దీనికి పెళ్ళేకాదని, చెప్పడమేమిటి మీ చుప్పనాతితనం కాకపోతే, సుబ్బమ్మగారూ!" సాగదీసి మరీ అడిగాడు సుందరయ్య.
"నిన్న ఈ వేళప్పుడు ముళ్ళ చెట్లలో పడిఉందా? దీని వైభవం చూడిప్పుడు!" ఆశ్చర్యం వెళ్ళబోసుకొంది ఎదురింటి ఆండాళమ్మ.
"ఇవాళ ఇంట్లో, రేపు మంట్లో అన్న వేదాంతం చెప్పిపోయారు పెద్దలు! ఆ వేదాంతం మా పాప విషయంలో తిరగబడిందనుకో, ఆండాళమ్మత్తా!"
"అందరికీ చక్కని సమాధానాలు చెబుతావురా, సుందరయ్యా!" ఆండాళమ్మా గలగలా నవ్వింది "ఆడపిల్లను పెంచుకొంటే ఏం లాభం? ఒకింటికిస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ఒంటరివాళ్ళు అయిపోవడమేకదా! మగపిల్లాన్ని పెంచుకోవాల్సింది సుందరయ్యా!"
"మగవెధవలకి ప్రేమ తక్కువండీ! పెళ్ళాలొస్తే ఉన్నది కాస్తా పోతుంది. ఆడపిల్లలు అలాకాదు! ఒకింటికి వెళ్ళినాసరే 'నాన్న ఎలా ఉన్నాడో? అమ్మ ఏం చేస్తూందో' అన్న ఆలోచనే ఉంటుంది. ఆడపిల్లకి ఉండే ప్రేమ మగాడికి చస్తే ఉండదు! పుట్టారుగా నాకూ నలుగురు కొడుకులు! పెళ్ళాలొచ్చాక పగవాళ్ళయ్యారు!" తన అనుభవసారాన్ని చెప్పింది మరొకామె!
* * *
పాపకి ఏం పేరు పెట్టాలి?
ఎంత ఆలోచించినా రాజ్యం దంపతులకి మంచి పేరు స్పురించలేదు! వనజ, గిరిజ లాంటి పేర్లు అసలు నచ్చలేదు. ఏదైనా వినూత్నమైన పేరుపెట్టాలని సుందరయ్య ప్రతిపాదన! ఎవరికీ లేని పేరు ఎక్కడినుండి తెస్తారంటుంది రాజ్యం. రాజ్యం ఏ పేరు సూచించినా సుందరయ్యకి నచ్చడం లేదు. చివరికి "అమ్మగారి నడిగిరా! అమ్మగారు చెప్పిన పేరు పెట్టేద్దాం" అన్నాడు.
సాయంకాలం రాజ్యం పాపని ఎత్తుకొని బయల్దేరుతూంటే "రిక్షాలో వెళ్ళు" అన్నాడు సుందరయ్య.
"రెండు సందులు తిరిగితే వచ్చేఇంటికి రిక్షా ఎందుకండీ?"
"వీధిలో వాళ్ళంతా దిష్టి పెడతారు పాపకు!"
"అబ్బకి ఎంత అపురూపమో!"
"అమ్మకి అపురూపం కానట్టు!"
రిక్షాదిగి పాపని భుజం మీద వేసుకొని ఇంట్లోకి వస్తూన్న రాజ్యాన్ని చూసి "నీకు మాతృకళ వచ్చేసిందే, రాజ్యం!" అంది సువర్చల. అంటూనే పాపకోసం చేతులు చాచింది. "కొంచెం చిక్కినట్టు కనిపించడం లేదూ!"
"పుట్టినప్పటి నీరుతీసి సన్నబడతారట కదండీ? మా ఎదురింటి అండాళుపిన్ని చెప్పింది!"
"నెలవెడుతూంటే ఒళ్ళు చేయడం మొదలు పెడతారు పిల్లలు! పాపకి డబ్బా పాలు పడ్డాయా?"
"పడినట్టేనండీ!"
"వారానికోసారి అయినా మా రత్నదగ్గరికి వెళ్ళి చూపెట్టడం మరువకు! కూర్చో, రాజ్యం!" ఎదురుగా కుర్చీ చూపించింది సువర్చల.
పాపక్రింద రబ్బరు షీటు సరిజేసి కూర్చొంది రాజ్యం. "పాపకి ఏం పేరు పెట్టాలో అడిగి రమ్మన్నారండీ మీ డ్రైవరు"
"పేరు మనిషికి గొప్పతనం తేదు! పేరుకు గొప్పదనం మనిషి తేవాలి! 'గాంధీ' 'జవహర్' 'ఇందిర' లా"
"గొప్పతనం కోసం కాదండీ! చక్కటి పేరుకావాలని! మీరు ఏ పేరు చెపితే ఆ పేరు పెడదామంటున్నాడు ఆయన! అమ్మాయిగారి పేరు పెడదామా! ఆ పేరుతో పిలుస్తుంటే ఆ పాపని చూచుకొన్నట్టుగా ఉంటుంది మీకు!"
"ఆ అర్దాయుష్యం దాని పేరెందుకులే!" కూతురి మరణం గుర్తు వస్తేచాలు సువర్చలముఖంలో కళ తగ్గిపోతుంది. "దేవికారాణి పేరు కొంచెం కలిసేట్టు చెప్పనా? 'ప్రేమికారాణి'! అందరికీ ప్రేమాస్పదురాలు కావాలి ఈ పాప! అందరి ప్రేమకూ రాణి కావాలి!"