"మామూలు పరిస్థితులలో ఏమయ్యేదో ఏం చెప్పేవాడినో కానీ ఇప్పుడు కుటుంబం పెద్దగా బాధ్యతపైబడింది."
"ఏది చెప్పాలన్నా ఆలోచించి చెప్పాలి"
"ఇప్పుడు నీ సలహా కావాలి"
కల్లు చిట్లించి పెదవులు విచ్చుకునేట్లుగా అదో విధంగా చూసింది అసలు ఆ చూపులోనే ఆమె అభిప్రాయం వ్యక్తమైంది. "నన్ను సంపూర్ణంగా గాంధర్వ విధిగా స్వీకరించావే? ఇలా అనొచ్చా? నీకు మరో అభిప్రాయం కావాలా" అన్నట్లుగా వుంది ఆ చూపు.
మెల్లిగా అంది "మధూ! నీ బాధ్యత గొప్పదే! గురుతరమైందే. తండ్రి తరువాత తండ్రి అంతటివాడివి జయ బాధ్యత నీదే? నీవు ఓ అడుగు ముందుకు వేసేముందుగా నీ రూపం పోసుకుంటున్న శిశువు భవిష్యత్తుని ఆలోచించు. తర్వాత- నాకు యీ రోజుల్లో విపరీతంగా సులభంగా దొరుకుతున్న ఏ విషమైనా ఇవ్వు"
ఆనందమూ, దుఃఖమూ కలిగినయి. ఆమెమాటలు అతన్ని చాలా బాధపెట్టాయి. దానితో దృఢనిశ్చయంతో అన్నాడు.
"మణీ"
ఇక మన పెళ్ళి విషయంలో సందేహమే లేదు.
నిన్ను పెళ్ళిచేసుకునేది ఖాయం.
అయితే మా నాన్నకి యీ విషయం ఎలా చెప్పాలో తోచటంలేదు, పైగా నీవు చెప్పిన విషయంవల్ల ఇక ఆలసించటానికి వీల్లేదు మనం రేపే సివిల్ మేరేజ్ కి దరఖాస్తు చేద్దాం.
"నేనన్నా విషయాల్లో నీ మనసునొచ్చినవి వున్నందుకు నన్ను మన్నించు.
మబ్బు తొలగిన ఆకాశంలా అయింది మణి ముఖం. కృతజ్ఞతతో గువ్వలా ఒదిగిపోయిందతని కౌగిట్లో.
* * *
"అత్తయ్యా! యీ సమయంలోనే మీరు ధైర్యం వహించాలి.
మామగారికి వచ్చిన కష్టం సామాన్యమైంది కాదు.
అలా అని మీరు ఆయన ఎదుట పదే పదే ఆ విషయం ప్రస్తావిస్తూవుంటే మానసికంగా ఆయన చాలా దెబ్బతింటారు.
శారీరకంగా ఎన్ని లోపాలున్నా మానసికంగా ఆయన చాలా దెబ్బతిననంత వరకూ ఫరవాలేదు.
మీరు ఆయన్ని పసిపిల్లాడికంటే జాగ్రత్తగా చూసుకోవాలి.
పిల్లలు నోరు తెరచి అడగలేరు మాటలురాక. మాటలు వచ్చీ అభిమానంతో కించతో ఈయన అడగలేరు.
అందుకే మీరే ఆయన అవసరాల్ని గుర్తించి ఆదరంతో ఆప్యాయతతో అందించాలి."
సుధామయి చెప్పిన మాటలు విని నిట్టూర్చింది అన్నపూర్ణ.
"నిజమేనమ్మా! ఇక ఆయనకి కన్నూ కాలూ నేనే."
"మీరలా బెంబేలు పడరాదు అత్తయ్యా! మీకేం ముత్యాల్లాంటి ఇద్దరబ్బాయిలున్నారు. మధు సంపాదిస్తున్నాడు, ఇంకో రెండేళ్ళుపోతే సుధాకర్ చేతికొస్తాడు. కాదంటే జయప్రదదే కొంచెం సమస్య."
"ప్రాణాలపై వున్న సమస్య అదేనమ్మా సుధా! దాన్ని మావారి పినతల్లి కూతురు విశాలాక్షీ కొడుక్కి ఇవ్వాలని వెళ్ళొచ్చారు ఆయన? దాని దరిద్రమో మా దరిద్రమో ఆయన అక్కడనుంచి తిరిగివస్తుండగానే ఏక్సిడెంటు అయింది."
"వాళ్ళేమన్నారు?"
"అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లనిచ్చి పిల్లని చేసుకోమందట ఆయన ఏమాట చెపుతానని వచ్చారు ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది మొన్న ఈయన్ని చూడటానికి వచ్చినప్పుడు యీ విషయమే రాలేదు."
"అత్తయ్యా!"
"ఏమ్మా?"
"నాదో సలహా అత్తయ్యా"
"చెప్పమ్మా"
"ఏమీ అనుకోరు కదా!"
నవ్వింది అన్నపూర్ణ "సుధా! నన్ను చిన్నప్పటి నుంచీ చూశావు నీవు అత్తయ్యగుణం తెలిసిన దానివే! మళ్ళీ అలా అడుగుతావేం"
"జయప్రదని ఆ ఇంటికి ఇవ్వండి కానీ ఆ ఇంటి అమ్మాయిని తెచ్చుకోకండి. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడే ఈ ఏక్సిడెంటు అయింది, ఇంకెన్ని జరుగుతాయో..."
ఆలోచనల్లో పడింది ఆమె.
"ఏదో చెప్పానని అనుకోవద్దండి వాళ్ళమ్మాయిని సరిగ్గా చూడలేదని వాళ్ళూ, మీ అమ్మాయిని సరిగ్గా చూడటం లేదని మీరు పరస్పరం దెప్పిపొడుచుకోవటాలు అవీ వస్తాయి బుద్ధిమంతులెవరూ దీనికి అంగీకరించరు ఇవ్వటమో - తెచ్చుకోవటమో? ఏదో ఒకటి అంతే!"
"చిన్నదానినైనా సరిగ్గా చెప్పావమ్మా" అంది ఆమె.
అంతలో మధూ వాళ్ళు రావటంతో సుధామయి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
* * *
దాదాపు నెలరోజులు గడిచాయి.
ఆరోజు సాయంకాలం ఫేక్టరీనుంచి వచ్చి రిలాక్స్ అయి వీక్లీ చూస్తున్న కొడుకుని వసారాలో పడక్కుర్చీలో పడుకున్న సుందర్రావు కేకేశాడు.