మేరీ నర్స్ గా కొత్తగా వచ్చింది. ఆంగ్లో ఇండియన్- చాలా నీటిగా ఉంటుంది. డ్యూటీలో కూడా చాలా శ్రద్ధగా ఉంటుంది. ఝాన్సీ దిగాలుగా ఉండటం గమనించి "అలా ఉన్నారేం మేడమ్!" అని ఆడిగింది.
ఈ నర్స్ ని అడిగితే! ఛ ఛ! తను డాక్టరయిఉండి నర్స్ ని అప్పు అడగటమా- మనసు వెనకాడింది- "కూలి పనైనా చేసుకుని....."
కుమార్ మాటలు మనసులో మెదిలాయి.
అభిమానం చంపుకొని తల దించుకొని "నాకు అత్యవసరంగా నూటయాభై రూపాయలు కావాలి మేరీ" అంది-
"అంతేనా! సాయంత్రమే తెచ్చిస్తాను."
తేలిగ్గా అంది మేరీ.
ఝాన్సీ మనసు కెలాగో అనిపించింది.
"మేరీ! మీ ఇంట్లో డబ్బుకి ఇబ్బందిగా ఉండదా?" అడిగేసింది.
మేడమ్! మేము గొప్పవాళ్ళం కాము. కానీ, ఇంట్లో అందరమూ పనిచేస్తున్నాము. ఉన్నంతలో గడుపుకొని తప్పకుండా ప్రతినెలా కొంత బేంక్ లో వేసుకుంటాము. అమ్మకు యాభైఏళ్ళు- ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది. నాన్న టైపిస్టు- అన్న లెక్చరర్- అందరమూ ఎవరి పనులు వాళ్ళం చేసుకుంటాము డాబులకు దర్జాలకూ పోము- అంచేత సిరిసంపదల్లో ఓలలాడకపోయినా మాకు బాగానే గడుస్తోంది.
"ఇదొక కొత్త పాఠం" తనలో తను అనుకొంది ఝాన్సీ-
మేరీ దగ్గర డబ్బుతీసుకొని కుమార్ కి పంపిస్తూ ఒక ఉత్తరం వ్రాసింది.
"డియర్ కుమార్!
నేను నీకు పంపిస్తోన్న ఈ డబ్బు అప్పుగా కాదు- నీ అడ్వాన్స్ జీతంగా- అదేమిటని అనుకొంటున్నావా? ఇక్కడ నేనొక్కదాన్నీ నిర్వహించలేకపోతున్నాను- నువ్వురావాలి నాకు సాయంగా. ఆఫీషియల్ గా నిన్ను ఆపాయింట్ చెయ్యకపోయినా, నువ్వు వర్క్ చేస్తే ఎవరూ అడ్డుపెట్టరు. ఇద్దరమూ కలిసి పనిచేద్దాం, కలిసి జీతం తీసుకుందాం! మొన్న ఒక ఆపరేషన్ చెయ్యవలసివస్తే చాలా భయం వేసి టౌన్ కి పంపించే ఏర్పాట్లు చేసాను. ఇలా జరిగితే, నా పేరు పాడవుతుంది- ఈ ఉత్తరం అందగానే వచ్చెయ్యి. నీ రాకకోసం ఎదురుచూస్తూ-
నీఝాన్సీ"
తిరుగు టపాలో వచ్చాడు కుమార్- ఝాన్సీ పట్టరాని ఆనందంతో "థ్యాంక్యూ" అని ఆహ్వానించింది- కానీ కుమార్ అనుమానంగా చూస్తూ కొంచెం కష్టంగా "నేను నీతో పంచుకోవాలనుకొన్నది జీతాన్ని కాదు-" అన్నాడు.
"మరేం పంచుకోవాలనుకున్నావు?" అని ఆమె అడగలేదు- ఆమె కేదో భయం వేసింది. ఇద్దరి కుటుంబ పరిస్థితులూ అంతంత మాత్రంగానే వున్నాయి. ఇద్దరిలో ఏ ఒక్కరూ తమ తమ కుటుంబాలలో తమ పెళ్ళిగురించి ప్రకటించేలా లేరు- ఇద్దరి భుజామీదా బరువు బాధ్యతలున్నాయి. ఆ బాధ్యతలు విస్మరించి ఆనందాన్ని జుర్రుకోవాలనుకొనే స్వార్ధం ఇద్దరిలోనూ లేదు.
"యూ సిల్లీ! నేనేదో త్యాగం చేస్తున్నాననుకొంటున్నావా? కాదు మహాశయా! నిన్నే త్యాగం చెయ్యమని అర్ధిస్తున్నాను. నీ ఉద్యోగ ప్రయత్నాలు మానుకొని ఈ సగం జీతంతో తృప్తిపడమంటున్నా-"
జీతంమీద ప్రలోభకంటె. ఝాన్సీకి దగ్గరగా ఉండాలనే ప్రలోభం కుమార్ మనసును లొంగదీసుకొంటూంది- కానీ, అభిమానం అడ్డుపడుతోంది.
"కానీ, ఎక్కడ నన్ను సస్పెండ్ చేసారో ఆ హాస్పిటల్ కి ఎలారాను? అధారిటీస్ దాకా వెళితే నీకే మాటోస్తుంది. ఇంకో డాక్టర్ అవసరమని నువ్వేరాయి"
ఝాన్సీ కోపంతో మాటతూలింది-
"నాకు ఇంకే డాక్టరూ అవసరంలేదు." కుమార్ మనసు గంతులేసింది. అంటే!....." అని నవ్వాడు. ఆమె ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది.