"నన్ను ఇక్కడ అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి"
"కంగ్రాచ్యులేషన్స్.....మంచి సంగతేగా."
"ఆ ఆర్డర్స్ తో పాటే, ఆయమ్మెల్యే గారూ వచ్చారు"
"సరే! ఒకసారి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పిరా" అమాయకంగా అన్న కుమార్ ముఖంలోకి చూసి నిట్టూర్చింది ఝాన్సీ.
"కుమార్ లోకమంతా నీ మనసు లాంటిదే అనుకోకు మోసపోతావు- కాదు మోసపోయావు. ఈ జనారణ్యంలో ఉన్న ఘాతుక మృగాళసంగతి ఇంకా తెలుసుకోలేదా?"
"తెలుసుకున్నాను- కానీ, ఎప్పటికైనా మృగాలకంటే మానవుడిదే పైచేయి అని కూడా తెలుసుకున్నాను, అవి ఎంతటి కృరమృగాలైనా సరే"
ఏమిటతని ఆత్మవిశ్వాసం!
"కుమార్! ఆ యమ్మెల్యేగారి దగ్గరకు వెళ్ళాను కృతజ్ఞతలు చెప్పటానికి. అతని చూపులూ మాటలూ, నాకేం నచ్చలేదు. నన్ను రేపు అతడి గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు" కుమార్ ముఖం కోపంతో జేవురించింది.
"రాస్కెల్ గట్టి చెప్పుతో తన్నకపోయావా?" అన్నాడు పిడికిలి బిగించి.
"లాభం లేదు కుమార్, ఇలాంటి వాళ్ళను మనము గట్టి చెప్పుతో తన్నలేం. అందుకే. మెత్తని చెప్పుతో కొట్టడానికే నిన్ను రమ్మన్నాను.
"నేను మెత్తని చెప్పునా?" బిత్తరపోతూ అన్నాడు. ఝాన్సీ నవ్వు ఆపుకొంటూ....
"ఒక విధంగా అంతే అనుకో! అతడు నన్ను కుమారి అనుకొంటున్నాడు. నా అప్లికేషన్ లో వివరాలు అతడు చూసి ఉండడు. చూసినా, చదివి అర్ధం చేసుకొనే పరిజ్ఞానం ఉందో, లేదో. ఈసారి నువ్వూ నేనూ కలిసి వెళ్ళి, నిన్ను నా భర్త అని చెప్పి ఇద్దరమూ కృతజ్ఞతలు చెప్పుకొంటే, వాడి రోగం కుదురుతుంది. ఇదే మెత్తని చెప్పుల దెబ్బ అంది.
కుమార్ నీరసపడిపోతూ "ఇదా, నీకు నా అవసరం!" అన్నాడు అతడి వాలకం చూసిఝాన్సీ చిలిపిగా నవ్వుకుంది. ఆ నవ్వు అతడి మనసులో మెరుపులు విరజిమ్మింది.
ఇస్త్రీ ఖద్దరు బట్టలు కట్టుకొని, వంటినిండా సెంట్ పులుముకొని సర్వాసన్నాహాలతో వున్నాడు యమ్మెల్యే.ముందుగా ప్రవేశించిన ఝాన్సీని చూసి యావగా "రా, రా" అన్నాడు. ఝాన్సీ మెత్తగా నవ్వి "మా వారుకూడా వచ్చారు. రండి!" అంది. కుమార్ వచ్చాడు. నిర్ఘాంతపోయాడు యమ్మెల్యే అతనికి పట్టరానికోపం వచ్చింది. సభ్యత కోసమయినా ఆ కోపం అణచుకోవటానికి అతడు ప్రయత్నించ లేదు కుమార్ ముందుకువచ్చి "మా ఝాన్సీ కి ఇక్కడ ఉద్యోగం వేయించినందుకు కృతజ్ఞణ్ని. మీరు ప్రత్యేకించి హరిజనులకు సేవ చేయటానికే పుటిన శ్రీహరిలాంటివారు" అన్నాడు.
"ఏం పోగడక్కర్లేదు పొండి" అన్నాడతడు మర్యాద లేకుండా, తన దర్పాన్నంతా చూపిస్తూ. ఇద్దరూ బయటికి వచ్చి పరస్పరం చేతులు కలుపుకుని విరగబడి నవ్వుకున్నారు. ఒక్కసారిగా ఇద్దరూ కలిసిన తమ చేతులను చూసుకున్నారు. ఇద్దరిలో ఎవ్వరూ విడదీసుకోలేకపోయారు, నెమ్మదిగా కుమార్ తన చేతిని విడిపించుకున్నాడు.
నవ్వుకొంటున్న ఆ ఇద్దర్నీ చూసి, సుందరమ్మ "ఏం జరిగింది?" అని అడిగింది. నవ్వుకొంటూనే ఝాన్సీ జరిగింది చెప్పింది- సుందరమ్మ తనూ నవ్వి "మీ తల్లిదండ్రులు నీకు మంచి పేరే పెట్టారు" అంది.
"మీకు మీ తల్లిదండ్రులు మంచి పేరే పెట్టారు" అన్నాడు కుమార్ కల్పించుకుని. ఆడవాళ్ళిద్దరూ గతుక్కుమన్నారు. తమ దేశంలో మంచి మనసుతో ఇలా మాట్లాడే వారు అరుదు. కానీ, అక్కనో, చెల్లెలినో ఆత్మీయంగా పొగుడుతున్నట్లు అతి నిర్మలంగా ఉన్నాయి అతని కళ్ళు.
"నేను ఇవాళే వెళ్ళిపోతున్నాను" అంది సుందరమ్మ.
"ఇల్లు దొరికిందా? ఏదయినా పని దొరికిందా:" అంది ఝాన్సీ.
"మీతో ఈ సంగతి ఎలా చెప్పాలో తెలియటం లేదు. అబద్ధం అసలు చెప్పలేను. నన్ను కెన్నెడీ బాబు చేరదీసారు- ఆయనే మంచి యిల్లు చూశారు. అక్కడికి పోతున్నాను."
ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఝాన్సీ కుమార్ లలో ఎవరూ ప్రతి సమాధానం ఈయలేకపోయారు వంచిన, తల ఎత్తలేకపోయారు. సుందరమ్మ కూడా మాట్లాడలేక ఇద్దరికీ చేతులుజోడించి తన మూటతో వెళ్ళిపోయింది.
ఆ వాతావరణం భరించలేనట్లు నిలబడి, "ఇంక నేను వెళ్తాను" అన్నాడు. ఝాన్సీ జాలిగా చూసింది. ఏదో చెప్పాలని తాపత్రయం. ఏమీ మాట్లాడలేని నిన్సహాయత ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి.
"ఝన్సీ! నువ్వేమీ అనుకోకపోతే" సంకోచంతో ఆగిపోయాడు.
"చెప్పండి" ఉత్కంఠతో ఆడిగింది.
"నాకు కొంచెం డబ్బుకావాలి. జస్ట్ నూటయాభయి రూపాయలు...."
ఝన్సీ ముఖం వడిలిపోయింది. అది చూసి నెర్వస్ గా "అప్పుగా......వీలయినంత త్వరలో తీరుస్తాను." అన్నాడు.
ఝాన్సీ పొడిగా నవ్వింది.
"నన్ను క్షమించండి. ఈనెల నాకు సగం రోజుల జీతమే వచ్చింది, అంతకు ముందంతా ఆనరరీగానే పని చేసాను. జీతం రాగానే ఒక్క యాభయి నా దగ్గర ఉంచుకుని అమ్మకు పంపేశాను. ఆ యాభయి ఇమ్మంటే ఇస్తాను."
"వద్దులే నీకెలా గడుస్తుందీ! అయామ్ సారీ."
"ఆ మాట అనవలసింది నేను - మీరేమీ అనుకోకపోతే....."
"చెప్పు"
"ఇదిగో మీరిచ్చిన ఈ బంగారు ఉంగరం మాత్రం ఉంది. పోనీ ఇది అమ్మి..........."
ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు కుమార్.
"ఎందుకు నవ్వుతున్నారు?"
"నేను నిన్ను అప్పు ఎందుకడిగానో తెలుసా?"
"ఇంట్లో ఇబ్బందులు....."
"అవి ఎప్పుడూ ఉండేవే. నువ్వు రమ్మని టెలిగ్రాం ఇవ్వగానే నా దగ్గర డబ్బులేకపోయింది. విధిలేక నీ ఉంగరం తాకట్టు పెట్టాను. సాధారణంగా నేనేదీ సీరియస్ గా తీసుకోను. కానీ ఇది నేను భరించలేకుండా ఉన్నాను. ఎలాగయినా ఆ ఉంగరం తాకట్టు విడిపించాలని....నువ్వేమో......"
ఇద్దరూ జాలిగా నవ్వుకున్నారు.
"నేను అమ్మకు డబ్బుపంపమని రాస్తాను, తప్పకుండా పంపుతుంది. పంపగానే....."
"డోంట్ వర్రీ! నేను ఎలాగయినా, కూలిపనయినా చేసుకొని, ఆ ఉంగరం విడిపించుకొంటాను" కుమార్ వెళ్ళిపోయాడు. తన ముందున్న వెలుగు మాయమయినట్లు తోచింది ఆమెకి.
తల్లి రాసిన ఉత్తరాన్ని ఒక విధమయిన నిరాశతో విప్పింది ఝాన్సీ- ఎందుకంటే, తల్లిదగ్గరనుండి మనియార్డర్ ఎదురు చూసిందామె, రాలేదు. ఉత్తరంలో ఏముందో?
చి|| ఝాన్సీకి,
ఆశీస్సులు! నీవు వ్రాసిన ఉత్తరము అంది సంగతులు తెలిసినవి. ఈ మధ్య అక్క కొడుకు పుట్టినరోజు చేసినాము. సుకుమార్, నళిని బట్టలు కొనుక్కున్నారు. పాపం, అక్కకి చీరలు లేవని నేనే ఒకటి కొనిపెట్టినాను. వాళ్ళు నన్ను కూడా కొనమని బలవంత పెట్టినారు. నేను కొనలేదు. అక్క కూడా కొనమని బలవంత పెట్టినారు. నేను కొనలేదు. అక్కతానే వెళ్ళి కొనితెచ్చింది కాదంటే కష్టపెట్టుకుంటుందేమోనని కట్టుకున్నాను. అక్కకొడుకు పుట్టినరోజు పండుగకు ఎవరూ బహుమానాలు సరిగా తీసుకురాలేదు రోజురోజుకీ మనుష్యుల్లో మంచీ మర్యాదలేకుండా పోతున్నాయి.
ప్రస్తుతం చేతిలో డబ్బులేక నీకు పంపలేకపోతున్నాను- అక్కడెవరిదగ్గరైనా ఎలాగైనా సర్దుకో. సుకుమార్, నళిని బాగానే చదువుకొంటున్నారు- నీ ఆరోగ్యం జాగ్రత్త- పేరుకి డాక్టరువేకాని, ఏదీ చూసుకోవు.
ఆశీర్వచనములతో,
అమ్మ........"
ఉత్తరం చదివిన ఝాన్సీ మనసు భగ్గుమంది. ఈ సమయంలో పుట్టినరోజులూ వేడుకలూనా? అందులోనూ మొగుడొదిలేసిన అక్క కొడుక్కి.... ఛ ఛ ఏం మనుష్యులు? అవతల కుమార్ చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతోంది- తమ్ముడు పాలేరులా పనిచేస్తున్నాడు- వీళ్ళంతా కొత్తబట్టలు కొనుక్కుని పుట్టినరోజు వేడుకలు చేసుకొంటున్నారు. ఈ కుటుంబాలింతేనా? "కూలిపనైనాచేసి ఉంగరం విడిపించుకుంటాను" కుమార్ మాటలు మనసులో దొర్లుతున్నాయి ఎలాగైనా అతడికి డబ్బుసర్థాలి.