Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 13

 

    "నమస్కారం , కూర్చిండి!" అంటూ అతనికి కుర్చీ చూపించాను.
    "స్మగ్లర్ రామూని గుర్తించడం లో మీరు చూపిన ప్రతిభ అసామాన్యం. మిమ్మల్ని అభినందించాలని వచ్చాను-" అన్నాడు శోభనాద్రి.
    'చాలా థాంక్స్ . కానీ అతగాడిని ప్రాణాలతో గనక పట్టుకోగలిగితే మీ పొగడ్త నాకు నిజమైన ఆనందాన్ని కలిగించి ఉండేది -" అన్నాడు మళ్ళీ కాస్త దిగాలుపడి.
    అతను అదోలా నవ్వి ఊరుకున్నాడు. నేనే మళ్ళీ అన్నాను. "నా సమర్ధత మీద నమ్మకంతో ఇన్ స్పెక్టర్ స్వామి నన్ను రామూ వెంట పడనిచ్చాడు. తను రామూ స్నేహితుడిని కస్టడీ లోకి తీసుకుని భవనం చుట్టూ పకడ్బందీగా కాపలా ఏర్పాట్లు చేస్తూ ఉండిపోయాడు. రామూ దగ్గర ప్రాణం తీసుకునే విష పదార్దాలు కూడా ఏమీ ఉన్నట్లు లేవు. అందుకే అతను భవనం మీంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అతని వెంట పడ్డప్పుడు కళ్ళు తిరగడం జరగనట్లయితే అతన్ని నేను తప్పక ప్రాణాలతో పట్టుకోగలిగి ఉండేవాడిని."
    'అన్ని వివరాలూ నేను పేపర్లో చదివాను. రామూ లాంటి వాడిని ప్రాణాలతో పట్టుకోడానికి అది నిజంగా గొప్ప అవకాశం . ఏమైతేనేం రామూ ఇక లేడు. కానీ మీకు ఆ సమయంలో అలా కళ్ళు తిరగడం చాలా ఆశ్చర్యం గా ఉంది. అది మీలోని లోపమా? లేక రామూ వేసిన మంత్రమా? అన్నది నాకు తేలడం లేదు.
    'అది నాలోని లోపమే -" అన్నాను నేను.
    శోభనాద్రి లేచి నిలబడ్డాడు. "ఉదాహరణకు ఈ టేబిల్ మీద ఓకే కుర్చీ పెట్టి దాని మీద నిలబడి క్రిందకు చూసారనుకోండి అప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయా? పేపర్లో చదివాననుకొండి , అయినా నమ్మలేకుండా ఉన్నాను...."
    నేను మౌనంగా అతని వంక చూశాను --" మీరు పేపర్లో చదివింది అక్షరాల నిజం, వేగంగా మెట్లు ఎక్కినా ఏడెనిమిదడుగుల ఎత్తు పై నుంచి క్రిందకు చూసినా నాకు కళ్ళు తిరిగి ఇంచుమించు స్పృహ తప్పిన స్థితి వస్తుంది. అయితే మీరీ ప్రశ్న ఎందు కడుగుతున్నారో నాకర్ధం కాలేదు."
    శోభనాద్రి మళ్ళీ కూర్చున్నాడు. "కేవలం కుతూహలం తప్పించి మరే - కారణమూ లేదు -" అని ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా - "మీ వల్ల నాకో సహాయం కావాలి-" అన్నాడు.
    "ఎటువంటి సహాయం?"
    "శోభనాద్రి నవ్వాడు. "కేవలం మీరు తప్ప మరెవ్వరూ పరిష్కరించ లేని సమస్యను పరిష్కరించడం లో సహాయం."
    "మీరు చాలా చమత్కారంగా మాట్లాడతారు." అన్నాను. ఆనందాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ " ముందు మీసమస్య విని మీ ప్రశంసకు నేనర్హుడినో కానో తెల్సుకుంటాను."
    "నా భార్య ప్రవర్తన ఇటీవల చాలా విచిత్రంగా ఉంటోంది. ఆమె చేష్టలను అర్ధం చేసుకోలేక  నేను సతమత మావుతున్నాను..." అని ఆగాడు శోభనాద్రి.
    నేను మాట్లాడకుండా అతని వంక చూస్తున్నాను.
    శోభనాద్రి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు " ఆమె పిచ్చిదా అని అనిపించేలా ఒకసారి ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఆమెకు పిచ్చి లేదు. ఆమె ప్రవర్తన వెనుక ఏదో గొప్ప రహస్యం దాగి ఉండాలి."
    "ఎవరి ప్రవర్తననైనా అంచనా వేయడం మనిషి మనస్తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మీకు విచిత్రంగా తోచే ఆమె ప్రవర్తన నాకు సామాన్యంగా తోచవచ్చు. కాబట్టి ఆమె ప్రవర్తనను కాస్త వివరించ గోర్తాను --" అన్నాను.
    శోభనాద్రి చేతి వాచీ వంక చూసుకున్నాడు - " ఇప్పుడు టైము పదకొండు ఇరవై అయింది. బహుశా ఆమె ఇప్పుడు ఆంజనేయస్వామి కోవెల ఆవరణలో ఉండవచ్చు -" అని అతను లేచి నిలబడి - "దయుంచి మీరిప్పుడు నాతొ వచ్చే మాటయితే ఆమె ప్రవర్తన ఎలా ఉన్నదీ మీరే స్వయంగా చూడవచ్చు -" అన్నాడు.
    విసుగును ముఖంలో కనబడ నివ్వకుండా ఉంచడానికి ప్రయత్నిస్తూ -- "ఆమె విచిత్ర ప్రవర్తననూ గమనించాక నేనేం చేయాల్సి ఉంటుంది?" అనడిగాను.
    ఇప్పుడు శోభనాద్రి ముఖం దీనంగా మారిపోయింది - "చూడండి రాజుగారూ! నా భార్య అందమైనది. ఆమె మనస్సు రూపం కంటే కూడా అందమైనదని ఆమెతో నాలుగేళ్ళుగా కాపురం చేస్తున్న నాకు తెలుసు. కానీ ఇటీవల ఆమె ప్రవర్తన నన్ను చాలా కలవర పెడుతోంది. ఏదో పోగొట్టుకున్నదానిలా దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూంటుంది. ఏమి అడిగినా జవాబు చెప్పదు. నవ్వి ఊరుకుంటుంది. ఆమెను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆమెలోని మార్పుకూ ఆమె విచిత్ర ప్రవర్తనకూ కారణం తెలుసుకుని ఆమెను మళ్ళీ పూర్వపు మనిషిని చెయ్యాలి. నాకు డబ్బుకు లోటు లేదు. మీ శ్రమకు విలువ కట్టలేను. కానీ మీరు కోరినంత ప్రతిఫలంగా ఇవ్వగలను."
    నేను లేచి నిలబడ్డాను. 'సరేపదండి --" అన్నాను. ఇద్దరం ఇంట్లోంచి బయటకు వచ్చాం. నేను - పనికుర్రాడు ప్రసాద్ తో "-బహుశా నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం కావచ్చు-" అని చెప్పి శోభనాద్రిని అనుసరించాను. వీధి చివర ఆగి ఉన్న కారులో ఇద్దరం ఎక్కాం. శోభనాద్రి కారు డ్రైవ్ చేస్తున్నాడు. నేను దారి గమనిస్తూ ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఉన్నాను.
    "వచ్చేశాం !" అన్నాడు శోభనాద్రి . ఇద్దరమూ కారు దిగాం.
    అది ఆంజనేయస్వామి కోవెల. ఆరోజు మంగళవారం కావడం కారణంగా కోవెల దగ్గర చాలా రద్దీగా ఉంది. శోభనాద్రి నా చేయి పట్టుకుని నడుస్తున్నాడు. నేను జనాన్ని గమనిస్తున్నాను. "అటు చూడండి -- " అన్నాడు శోభనాద్రి- చూపుడు వేలితో దూరంగా మంటపం లో కూర్చుని వున్న ఒక స్త్రీ మూర్తిని చూపించి.
    నాకళ్ళు జిగేల్ మన్నాయి. ఆమె శోభనాద్రి భార్య అయి ఉంటె అతను చాలా అదృష్ట వంతుడనిపించింది. అంతేకాదు శోభనాద్రి మనిషి అంత బాగుండదు. ఆమె దిగులుగా ఉండడానికి కారణం హటాత్తుగా ఈ విషయాన్ని గుర్తించడమేమోనని కూడా నా మగ బుద్దికి తోచింది. ఆమె నీలపురంగు చీర అదే రంగు జాకెట్టు వేసుకుని ఉంది. ఆమె ముందు పువ్వులు కుప్పగా ఉన్నాయి. ఆమె మాల అల్లుతోంది. చాలా పేద మాల అది.
    శోభనాద్రి నా చేయి నొక్కాడు -- " మాల కట్టాడానికి తను ఇంతదూరం రావాలా చెప్పండి?" పోనీ ఆ మాల దేవుడి కోసమా అంటే అందుకూ కాదు. ఈక్షణం నుంచీ ఆమె ఏమి చేసేది మీరు గమనించి మీ అభిప్రాయాన్ని ఈరోజు రాత్రి 7 గంటలకు నాకు ఫోన్ చేసి చెప్పగోర్తాను-- "టెలిఫోన్ నెంబరూ ఉన్న ఒక కార్డు తీసి ఇచ్చాడు-" మీరు అన్యదా భావించనంటే మరి నేనూ వెళ్లొస్తాను -" అని నా సమాధానం కోసం ఆగకుండానే వెళ్ళి పోయాడు.
    నేను అన్యదా బావించలేదు. నాకు శోభనాద్రి చాలా చక్కని పని అప్పజేప్పాడని తోస్తోంది. ఎందుకంటె ఆమెను ఒక రోజంతా ఏం కర్మ - కొన్ని సంవత్సరాల తరబడి అయినా చాలా చూస్తూఉండి పోగలను.......

                                                               3
    ఆమె మాల కట్టడం పూర్తయింది. నెమ్మదిగా సర్దుకుని లేచి నిలబడింది. ఆమె సౌందర్యం ముఖంలో మాత్రమే కాదు చక్కని నిగ్రహం అమెది.
    ఆమె కదిలింది -- రాజహంసలా! నేనూ కదిలాను -- మంత్ర ముగ్దుడిలా!
    ఆమె కోవెల లోంచి బయటకు వచ్చింది. శోభానాద్రి చెప్పింది నిజమే! ఆమె కోవెలకు దైవ దర్శనార్ధం రాలేదు. కేవలం మాల కట్టడానికే వచ్చినట్లుంది. బయటకు వచ్చాక ఆమె మాలను చిన్న చిన్న తుంపులుగా చేసి కనపడ్డ చిన్నపిల్లలకు ఇచ్చి వాళ్ళ బుగ్గలు పుణకడం చేస్తూ వచ్చింది. ఆమె అలా ముందుకు కదులుతూనే ఉంది. నేనామెను అనుసరిస్తూనే ఉన్నాను.
    ఆమె చేతిలో ఇప్పుడు పెద్ద మాల లేదు. , కానీ ఒక మూరెడు పొడవు మాల ఉన్నట్లుంది. దానిని తన అందమైన చేతి సంచిలో సొగసు ఉట్టి పడేలా జార విడిచింది.
    ఆమె ఇంకా నడుస్తూనే ఉంది. నేనామెను అనుసరిస్తూనే ఉన్నాను.

 Previous Page Next Page