చాటుగా కమల నడిగింది సంగతేమిటని. చెప్పింది విని కమలా చిన్నదానివైనా పెద్ద మనసు నీది. నువ్వు ఉత్తమురాలివమ్మా. నా బిడ్డ వోకదారికి తీసుకురా. నాకు నువ్వొకటి నీరజ ఒకటి కాదు' అని చేతులు పట్టుకుంది.
రెండు నెలలు ఏ వోడుదుడుకులు లేకుండా గడిచినై. ప్రశాంతంగా. ఒకరోజు సాయంత్రం వేళకి ఎంతో ఆధునికంగా అలంకరించుకున్న యువతి శ్రీపతి కావాలంటూ వచ్చింది. నెత్తిన మంగళగిరి గాలిగోపురం అంత ఎత్తున శిగ , భుజాలుదాటని జాకెట్ చేతులు, గుండెల్లోకి మెడ, బెత్తెడు వీపువున్న బ్లౌజు , బొడ్డు కిందకి చీరే , మూరెడు వీపు, జానెడు పొట్టా కనపడుతూ , పెదవులకీ బుగ్గలకి కనురెప్పల కీ , కను బొమ్మల వరకు అంతటా రంగు వీటన్నింటితో చాలా వింతగా వుంది.
ఇంట్లో పనివాళ్ళంతా ఈ మనిషిని చూడగానే తప్పుకుపోయినారు. వెనకాడక చొరవగా స్వతంత్రంగా లోపలికి రావటం చూసి కమల తెలియకపోయినా 'ఎవరు కావాలంటూ' అడిగింది.
'మిస్టర్ శ్రీపతి' అని కమల ఎగాదిగా చూస్తూ ఇంగ్లీషులో 'నువ్వెవరు?' అంది.
కమల జవాబు చెప్పకుండా శ్రీపతికి కబురు చేసింది బిక్షాలుతో, శ్రీపతి రావటం చూసి తను వెనుదిరిగి వెళ్ళబోయింది.
శ్రీపతిని చూస్తూనే ఆవిడ తెలుగు రానట్టు ఇంగ్లీషులోనే "హలో శ్రీపతి ఎట్లా వున్నావ్? బాగున్నావా? ఏం చేస్తున్నావ్? యూరప్ నించి ఎప్పుడొచ్చావ్' అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
శ్రీపతి ముఖం కోపంతో జేవురించింది. ఆ మనిషిని చూడగానే రోషంతో వోనికిపోతూ వెళ్ళిపోతున్న కమలని 'అగు నాకోసం కబురంపింది నువ్వు ఈ మనిషిస్తే నేనా' అన్నాడు.
కమల ఔనన్నట్లు తలూపగానే 'నీకాపాటి తెలియక్కర్లేదా ఎవరోస్తే పిలవాలో అక్కర్లేదో' అంటూ వురిమాడు.
కమల భయం భయంగా 'ఈవిడెవరో నాకు తెలియదు. మీకోసం అడిగితె అడ మనిషోచ్చింది కదా అని మీకు కబురు చేశానంటూ వెళ్ళబోయింది. 'ఇట్లాంటి పనేప్పుడూ చేయబోకంటూ మళ్ళీ వురిమాడు.
ఆ వచ్చిన మనిషి వంక చూసి ఏం కావాలన్నాడు శ్రీపతి.
వాళ్ళ సంభాషణంతా ఇంగ్లీషులో జరగటం, ఆ మనిషిని చూస్తేనే శ్రీపతి రోషంతో వణికి పోవడం , కూర్చోమనైనా అనకుండా మాట్లాడడం చూసి కమల కొంచెం అర్ధమైనదానల్లె అరె అనుకుంది.
'అదేమిటి శ్రీపతి ముక్కూ ముఖం తెలియని వాళ్ళల్లె అట్లా మాట్లాడుతున్నావ్. కూర్చోమనటం లేదు బాగున్నావా అనటం లేదు. నేను నీ ఆశని. మర్చిపోయినావా.'
శ్రీపతి కోపంతో మండిపడుతూ 'నువ్వెవరైనా నా కనవసరం. నా ఆశ ఐదేళ్ళ నాడే చచ్చిపోయింది. ఇప్పటి నువ్వేవరైంది నాకు తెలియదు. నాకు తెలియవలసిన అవసరం లేదు. నువ్వెందు కొచ్చావో చెప్పి వెళ్ళిపో వీలయినంత తొందరగా. నీతో మాట్లాడే వోపికా, తీరికా నాకు లేవు.'
'నో నో శ్రీపతీ. నువ్వు నన్నింకా క్షమించలేదన్నమాట. మర్చిపోలేదన్న మాట. ఇప్పుడు నీతో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. కాస్త కాఫీ ఐనా ఇప్పించు. ఈ ఇంట్లో కాఫీ బాగా చేస్తారు. తాగి వెళ్తా.' నంది ఏమీ జరగనట్లు. చింతా కంతైనా అభిమాన పడకుండా హాయిగా.
శ్రీపతి ఇంకేం చెయ్యలేక బిక్షాలు చేత కాఫీకి కబురు పెట్టాడు తను ఎటో చూస్తూ.
బిక్షాలు బైటి కెళ్లడంతో కమల ట్రే పట్టుకు రావడం చూసి శ్రీపతి ' నువ్వెందుకు తెచ్చావ్ ఇంటి నిండా వున్నా నౌకర్లెమైనారని అరిచాడు.
కమల ఈ మాటలకి కొంచెం ఆశ్చర్యంతో 'ఎవ్వరూ లేరన్నది.
కమల కనపడగానే శ్రీపతిని 'ఎవరీమె' అని అడిగింది ఆశ.
'పాప కోసం' అని చెప్పబోయి పాప సంగతి తేవటం ఇష్టం లేని వాడల్లే 'ఇంట్లో మా పనిమనిషి పన్లకి' అన్నాడు.
'వోహో అంతేనా? నేనింకా నువ్వు పెళ్ళాడవేమో అనుకున్నా' ననడం కాకముందే,
'ఇంకా చాలు అపు నీ ధోరణి' అని అరిచాడు శ్రీపతి.
ఆశ భయంగాని, సిగ్గు గాని పడకుండా 'ఔన్లె అట్లాంటి మనిషిని నువ్వెందుకు చేసుకుంటావూ' అన్నది.
'ఔను. నీబోటి దాన్ని చేసుకున్నాక అదే అనిపిస్తున్నది. ఈ కమల నీలాంటిది కాదు. మంచి మర్యాదా, మమతా, అభిమానం కాంక్షకి, కామానికి తలొగ్గక ఆత్మగౌరవం కోసం ప్రాణాలివ్వగల స్త్రీ. సొంత బిడ్డని ఒదిలేసిపోయిన నీబోటి రాక్షసులుంటే, అట్లాంటి నీ బిడ్డను మనసారా దగ్గరికి తియ్యగల దేవత. నే చేసుకుంటానన్నా ఒప్పుకుంటుందో లేదో. ఐనా నీకట్లాంటి వాళ్ళెం అర్ధమౌతారు?'
కమలకి ఈ మాటలతో విభ్రాంతి , సంతోషం, సిగ్గు అన్నీ చుట్టేసినై. గబగబా లోపలికెళ్ళింది.
లేచి వెళ్తూ వెళ్తూ ఆశ 'రేపొచ్చి పాపని తీసికెళ్త' నన్నది. శ్రీపతి రౌద్రరూపం దాల్చి చెప్పే సమాధానం వినకుండా గబగబా బైటకి నడిచింది చేతిలో హ్యాండ్ బాగ్ వూపుకుంటూ.
అనాదాశ్రమానికి 'వెళ్ళి లోపలికోస్తున్న రాజేశ్వరి ఆశను చూడగానే పాముని చూసినట్టు పక్కకి తప్పుకుని వేరే వాకిట్లోంచి లోపలి కోస్తూనే 'శ్రీపతీ, శ్రీపతీ ఆ వొచ్చింది ఆశ కాదుట్రా? దేనికొచ్చిందని' గాభరాగా అడిగింది.
శ్రీపతి ఇంకా వుగ్ర రూపంలోనే వున్నాడు. 'రేపు పాపని తీసుకెళ్తుందట' అన్నాడు ఆవేశంగా.
ఈ మాటతో పిడుగు రాలిన వాతావరణం ఏర్పడ్డడిక్కడ, రాజేశ్వరి మ్రాన్పడి నుంచుంది. అప్పుడే ఈ హడావుడి లోపలి కోస్తున్న శ్రీనివాసరావు గారు ఇది విని స్తంభించి పోయినారు. ఎవరికీ నోటమాట రాలేదు. ఇదంతా విన్న కమల కాళ్ళూ చేతులు ఆడినట్లు నుంచుంది.
కొంతసేపటికి శ్రీనివాసరావు గారే ముందు తేరుకుని కళ్ళనీళ్ళు కారుస్తున్న రాజేశ్వరిని చూసి 'అదేమిటమాయ్ అట్లా బెంబేలు పడతావ్.... పిల్ల మీది హక్కులన్నీ వదులుకుంటూ ఆశ రాసిచ్చిన కాయితం వుంది కదా. ఇప్పుడెం చెయ్యగల్గుదు? ఏదో నాలుగు డబ్బులు రాల్చుకుందామని వచ్చిఉంటుందంతే . ఐనా నేనిప్పుడే లాయర్ ని కలుసుకుని వస్తానుండు' అంటూ కాయితాలు తీసుకుని గబగబా బైటి కెళ్ళారు.
ఆరోజు యింట్లో ఎవరికీ సరిగ్గా ఆన్నం నిద్రా లేదు. ఎవరి వూహ ప్రపంచంలో వాళ్ళు జాగారం చేశారు. రాజేశ్వరి కమల పాపని ఆశ కళ్ళ పడకుండా చూడాలను కున్నారు.
ఈలోగా శ్రీనివాసరావుగారు తనదగ్గర పనిచేసే నమ్మకమైన మనిషిని ఆశ వూరికి పంపాడు విమానంలో. అసలు సంగతి సందర్భాలు తెలుసుకు రమ్మనమని.
మర్నాడు ఆశ ఎందుకనో రాలేదు.
ఆశ ఊరెళ్ళిన మనిషి తిరిగొచ్చాడు. ఆశ బావకి వ్యాపారంలో ఇంకా బాగా కలిసి వొచ్చిందిట. తనతో పాటు వ్యాపారం చేస్తున్న ఒక లక్షాధికారి ఏకైక పుత్రికని పెళ్ళి చేసుకున్నాడుట. ఆశకి వుద్వాసన చెప్పాడుట. నువ్వే పడోచ్చావు కాని నేనేమైనా నిన్ను రమ్మన్నానా , చేసుకున్నానా అని. దాంతో ఆశ గాలిమేడలు కూలి చివరి సారిగా ఒక ఎత్తు వేసి కొంతదబ్బు లాగుదామని వచ్చిందని చెప్పాడు.
మూడోనాడు ఆశ ఇంకా విలాసంగా ఆధునికంగా ముస్తాబై వొచ్చింది. వస్తూనే రోజూ విడవకుండా స్నేహంగా మాట్లాడు కుంటున్నట్టు, ఇన్నేళ్ళ ఎడబాటే లేనట్టు 'హలో శ్రీపతి' అంటూ మళ్ళీ మాటలు మొదలెట్టింది . శ్రీపతి వైఖరి పట్టించుకోకుండా.
ఈరోజు శ్రీపతి కోపం కొంచెం తగ్గించుకుని స్థాణువలే కూర్చున్నాడు. లాయర్ ద్వారా ఆశకి హక్కులేదని తెలుసుకుని.
ఆశ మాత్రం నోరు మూసుకోకుండా వాగుతూ ఇంకా ఆశగానే ఏం శ్రీపతి మనం జరిగింది మర్చిపోయి మళ్ళీ పెళ్ళి చేసుకుని హాయిగా ఉందామా పాప కోసం? అన్నది.
అంతసిగ్గు , ఆత్మగౌరవం విడిచి దిగజారిపోయి మాట్లాడుతున్న ఆశను చూసి శ్రీపతి ఈమనిషి ఆనాడు నేనెట్లా ప్రేమించాననుకుని పెళ్ళాడా,లా ని ఆశ్చర్య పోతూ ఆశ మాటలకి తన తెలివి తక్కువతనానికి హాలు దద్దరిల్లేటట్లు నవ్వాడు.
ఆ నవ్వుకి ఆశ వులిక్కి పడ్డది. ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి లేచి కూర్చున్నాడు. కమల మాత్రం ఆగలేక హల్లో కొచ్చింది చూట్టానికి.
ఆశకి ఇప్పటిదాకా పరిస్థితి ఏనాటి ఆశాజనకంగా లేదు. శ్రీపతి సంగతి తెలిసినది కాబట్టి ఆ నవ్వుతో ఇంక లాభం లేదనుకుంది. కోపం ముంచుకొస్తున్నది. ఆ సమయంలో కోపం వెళ్ళగక్కటానికి శ్రీపతంటే భయం గనక ఎట్లాగా అని చూస్తున్నది. ఆశ కమలని చూడగానే 'ఏయ్ పాపని తీసుకురా' అని కేక పెట్టింది.
కమల వినిపించుకోకుండా ఎవర్నో అన్నట్టు వెనక్కి తిరగటం చూసి శ్రీపతి మళ్ళీ నవ్వటం మొదలెట్టాడు.
ఆశ ఆవేశంతో లేచి కమల చెయ్యి పట్టుకుని ' పాపని చూపించు' అన్నది.
ఆశ మాటలేమిటో కూడా అర్ధం కానట్టు నుంచున్న కమలను చూసి తను ఇంగ్లీషులో అడగటాన అర్ధం కాలేదనుకుని ఆశ కమల చెయ్యి పట్టుకుని శ్రీపతి దగ్గరికి తీసుకొచ్చింది.
'శ్రీపతీ నువ్వు తీసుకు రమ్మనమని చెప్పు.'
'నే చెప్పినా తెస్తుందో లేదో'
నీవుచేప్తే వినకపోవడానికి తనేవరు?'
'పాప సంరక్షకురాలు. నేను సర్వహక్కులు ఇచ్చాను పాప మీద.'
ఆ మాటలకి కమల ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది.
'ఎవరికీ ? ఈమనిషికా' అని ఆశ చిన్న పొలికేక పెట్టింది.
'ఔను . అన్ని అర్హతలువున్నై కనకనే పాపని అప్పచెప్పానన్నాడు' శ్రీపతి.
'ఏమిటి అన్నిఅర్హతలు వున్నది ఈమేకా మారుగా ఒక్క ఇంగ్లీషు ముక్క రాని ఈ చవటకా , సంస్కారం,సంప్రదాయం లేని ఈ అజ్ఞానపు పనిమనిషా నా పాపని పెంచేది? శ్రీపతి నీకు మతిపోయింది.'
దానికి జవాబుగా కమల స్వచ్చమైన ఇంగ్లీషులో 'న్యాయంగా కష్టించి , పనిచేసి సంపాదించుకున్నంత మాత్రాన మనుషుల సంస్కారం పోదు. పగటి వేషాలల్లె రంగులు పూసుకుని అడా మగా తేడా లేకుండా మోసగత్తె లై తిరగడమే సంస్కారమా? సాధారణ సంసారి స్త్రీగా వుంటే గామర్లా? పసిపిల్లని పెంచటానికి కావలసినవి ఇవ్వి కావు. ఆప్యాయత, మమత, అభిమానం ప్రేమతో పిల్లల మానసిక ప్రవృత్తిని అర్ధం చేసుకుని వాళ్ళని దగ్గరికి తియ్యకలిగి వుండాలి, వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించకలగాలి. పసిపిల్లలు అమాయకులు,మాయా మర్మం , కుట్ర కుచ్చితం తెలియని అమృత మూర్తులు. వాళ్లకి మన భాషోభేషజాలతో , వేష భాషలతో , నటనతో పని లేదు. అడ్డం లాంటి వాళ్ళ మనసులు మనలోని మంచి చెడ్డలని ఇట్టే పట్టేస్తాయ్. వాళ్ళ నించి మనం ఏం దాచుకోలెం. పిల్లల్ని మనం ప్రేమించినప్పుడు , వాళ్ళ బాగోగులు చూడగలిగినప్పుడు నువ్వు వల్లించిన ఇవ్వేవీ అక్కర్లేదు' అంది.
శ్రీపతి చప్పట్లు కొడుతూ 'హియర్, హియర్' అని గావుకేకలు పెట్టాడు.