Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 12

                                 

 

                                    6

    శ్రీపతి తాతగారి కాలం నాటి సంగతులే నాకు తెలుసు. అదీ మా అత్తగారు చెప్పటాన. వీళ్ళింట్లో ఆడవాళ్ళు అట్టే కాలం బతికేవాళ్ళు కాదు. ఈ పరిస్థితుల్లో ఏం బతగ్గలరూ ఐనా.వీటికి తోడూ తాగుడు కూడా.
    నాకు చిన్నవయస్సు లోనే మావాళ్ళు పెళ్లి చేసి పంపారు అత్తవారింటికి. మా కుటుంబం కూడా అంత అంతస్తు లేకపోయినా బాగా కలవారే. శ్రీమంతులు. మంచీ మర్యాదా కలవారు. శ్రీపతి తండ్రికి నన్నియ్యవలసిందిగా మామామగారు మూడు సంవత్సరాలు రాయబారాలు జరిపారు. మా నాన్న చివరికి అలివి తప్పి అయిష్టంగానే నన్నిచ్చి చేశారు.
    నేనత్తగారింటికెళ్ళేటప్పటికే శ్రీపతి నాయనమ్మ పోవటం జరిగింది. మా అత్తగారి కప్పటికి నలభైయ్యేళ్ళకి తక్కువే వుండేది. చూట్టానికి నిర్జీవంగా బెండు బొమ్మల్లె . మా మామగారు ఆమె మీద చెయ్యి చేసుకుని రోజు లేదనేవాళ్ళు. అక్కడి వాళ్ళు. ఎప్పుడూ దిగులుగా వుండేది.
    నేనత్తగారింటికి వెళ్ళి ఆవిడకి నమస్కారం చేసిన దృశ్యం నాకింకా కళ్ళకు కట్టినట్లుంది. మంచంలో పడుకునున్నావిడ లేచి, నన్ను లేవనెత్తి , దగ్గరికి తీసుకుని కళ్ళనీళ్ళు కారుస్తూ 'ఈ ఐశ్వర్యం అనే వూబిలో పడకుండా మనలాంటి వాళ్ళు ఏ కూలి నాలి వాళ్ళనో చేసుకుంటే బతకగలిగేవాళ్ళం. ఈ ఇంట్లో మొగవాళ్ళు మానవత్వం లేని పశువులమ్మా. ఆడదానికి విలువ ఇవ్వరు. మనిషిగా చూడరు తల్లీ. నా బతుకేట్లాగో తెల్లవారింది. నీవైనా ముందు నించి జాగ్రత్తపడి హాయిగా బతుకు. వీళ్ళ అత్యాచారాలకి లొంగిబోకు. నా కొడుక్కూడా తండ్రిఅడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. తండ్రిని  మించిన వాడనిపించేట్లు వున్నాడు. తెలివి, సంస్కారం వున్నదానివి ధైర్యస్థైర్యాలతో నిలబడు. సుఖంగా బతుకు' అని కళ్ళ నీళ్ళు కార్చారు. యాడాది తిరక్కుండానే పోయినారు.
    నేను ఏవిధంగా ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవాలా అని ఆలోచించా. కేవలం స్త్రీగా వాళ్ళ దృష్టిలో ఒక జడ పదార్ధంగా మిగలకూడదు. వీళ్ళ అత్యాచారాలకు లొంగ కూడదు. వాళ్ళ ఆటలు కట్టించి నా వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలనుకున్నాను. ఈ నిశ్చయంతో నా పాత అలవాట్లే అవలంబించాను. వాళ్ళ కోసం ఏం మారలేదు. వాళ్ళకి భయపడి దాసోహం అనలేదు. శ్రీపతి తండ్రితో సమానంగా నిలబడ్డాను. అయన మగమహారాన్న భయం గాని, భర్త అన్న అతి వినయం గాని నేను చూపించలేదు. అవసరమైనంత వరకే వాళ్ళతో సహకరించేదాన్ని.
    ఆయనకు వంశామగతమైన దురలవాట్లు చిన్ననాటనే అబ్భినై. విపరీతంగా తాగేవాడు. నే చెప్పినా మానేవాడు కాదు. ఆయన్ని ఏ విధంగాను గౌరవించలేక పోయేదాన్ని ప్రేమించడం అటుంచి.
    నయీ ప్రవర్తన , నే చూపించే స్వాతంత్ర్యం ఆయనలో ఒక విధమైన భయాన్ని రేకెత్తించింది. అప్పటివరకు ఆయన చూసిన ఆడవాళ్ళు , అయన తల్లీ, నాయనమ్మా వొణుకుతూ మూలకు వోత్తుకుని నిలబడటం , ధైర్యంగా జవాబు చెప్పలేకపోవటం , తప్పు లేకపోయినా నోరెత్తకుండా దండన పడటం , ఒళ్ళు దాచుకోటానికి కూడా ప్రయత్నించకుండా దెబ్బలు పడిన వాళ్ళని చూసి చూసి నన్ను చూస్తె ఆయనకి అర్ధం కాలేదు.
    దీనికంతకీ భిన్నమైన నా ప్రవర్తన శ్రీపతి తండ్రికి అంతు పట్టలేదంటే ఆశ్చర్యం లేదు. ఏదైనా తిట్టినా నేను వినిపించుకోకుండా నా పని నేను చూసుకునే దాన్ని. నా ముఖంలో మరి ఏ భావాలు కనపడావో ఏమో సర్దుకునేవాళ్ళు.
    ఒకసారి, అప్పటికి శ్రీపతి పుట్టలేదు, నా వొంటి మీద దేబ్బేసి మళ్ళీ చెయ్యెత్తారు- నేను ఎత్తిన చేతిని ఎత్తినట్టే పట్టుకుని 'మళ్ళీ నా వంటి మీద చెయ్యి పడ్డదంటే మర్యాద దక్కదన్నాను. తన తల్లెల్లె పడివుండనని నాకూ వ్యక్తిత్వం వుందని, మర్యాద నతిక్రమిస్తే విడాకులిచ్చి వెళ్ళిపోతానని ఖండితంగా చెప్పాను.

                                 
    ఆడది ఎదురునిల్చి ధైర్యంగా సవాల్ చేసి మాట్లాడటం అంటే ఏమిటో , ఇట్లాంటి సంఘటన జరగ్గలదన్న వూహే లేని అయన, మహంకాళి రూపంలో వున్న నన్ను చూసి భయపడి వెనక్కి తగ్గారు. తరవాత నన్ను తప్పించుకు తిరిగేవాళ్ళు.
    శ్రీపతి పసితనంలో తను పిలవగానే నేను పలకలెదని పూర్వం జరిగింది మర్చిపోయి నా మీద చెయ్యి చేసుకున్నారు.
    నేను ఎవరికీ తెలియకుండా మా నాన్నకి టెలిగ్రాం ఇప్పించాను వెంటనే రమ్మనమని. అయన మా ఈ శ్రీనివాసరావు బాబాయిని పంపించారు ఏమందో అంటూ.
    బాబాయి వొచ్చేటప్పటికీ నేను అంతా సర్దుకున్నాను. నా ఈ సన్నాహాలు చూసి శ్రీపతి తండ్రి కంగారు పడ్డాడు. నన్ను నయానో భయానో బెదిరించాలని చూసి విఫలుడైనాడు.
    శ్రీనివాసరావు బాబాయి రావడంతో నీరు కారిపోయాడు. కొడుకుతో సహా పుట్టింటి కెళ్ళి తన మీద వాజ్యం వేస్తానని ఆయనకి తెలుసు. తన దురలవాట్లకి ఈ ఆస్తి మీద వొచ్చే రాబడి చాలటం లేదు. కొడుక్కి, నాకూ బాగాలు పంచితే ఇంక మిగిలేదేముంది?
    ఇక లాభం లేదని నా దగ్గర కొచ్చి నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి నా విషయాల్లో ఇంకా జోక్యం చేసుకోనని నా ఇష్టం వచ్చినట్లు వుండనిస్తానని శ్రీపతి మీద ప్రమాణం చేసిన మీదట నేను సర్దికుని చెప్పాను బాబాయికి. మావాళ్ళ మీద బెంగతో పిలిపించానని అంతకన్నా ఏమీ లేదని నచ్చచెప్పి పంపించాను.
    తరవాత అయన నాన్ను శత్రువుని చూసినట్టు చూసేవాడు. ఏమీ పట్టించుకునేదాన్ని కాదు. తరవాత నీరజ పుట్టింది.
    నీరజకి రెండేళ్ళప్పుడు అయన ఒకరోజు బాగా తాగి వొళ్ళు తెలియని స్థితిలో గుర్రపు స్వారీ చేస్తూ శరవేగంతో పరుగెత్తించారుట గుర్రాన్ని. ఆ పరుగులో అది కాలు మడత పడి పడ్డది. ఈయనంత తెలివిలో లేకపోవటాన పాటు తప్పించుకోలేక పోయినారు. గుర్రం అక్కడే పోయింది. కొన్నాళ్ళు తీసుకుని అయన పోయినారు.
    ఆ యింటి ప్రభావం నా బిడ్డలమీద పడడం ఇష్టం లేక  పుట్టింటి కొచ్చేశాను. అక్కడ ఆస్తి వ్యవహారాలు శ్రీనివాసరావు బాబాయ్ చూస్తూ వుండేవాడు. శ్రీపతి కాలేజీ కొచ్చేవరకూ అక్కడే వున్నాను. తరువాత ఈ ఇల్లు స్వాధీనం చేయించుకుని ఇందులో కొచ్చాను. బాబాయ్ తెలివిగా నా ఆస్తి పాస్తుల్ని అధికం చేశారు. బాగా వృద్దిలోకి తెచ్చారు వ్యాపారం అవీనూ.
    ఈ పరిస్థితుల్లో ఆశ శ్రీపతి పూర్వీకుల సంగతులన్నీ సేకరించి శ్రీపతి కూడా అంతేనని కోర్టు కెక్కింది. శ్రీపతి విషయం రుజువు కాకపోవడంతో కోర్టు నాకొక పట్టాన అంగీకరించలేదు.కాని మనసు విరిగిన శ్రీపతి ఈ విడాకులకి ఇష్టం తెలియచేయ్యడంతో ఒప్పుకున్నారు. ఇదమ్మా కమలా ఈ ఇంటి చరిత్ర. నీకు ముందే చెప్పవలసింది . కాని పొరపాటైంది. చాలా పొద్దు పోయింది. పడుకోమని లేచి వెళ్ళింది.
    ఆరాత్రంతా కమలకి నిద్ర పట్టలేదు. శ్రీపతిని గురించిన ఆలోచనలతో - ఎంతో విశదమైన సంఘటనలు జరిగినై అతని జీవితంలో. ఇంత చిన్నవయసులోనే అనుకుంది. జాలి అభిమానంతో మనకంతా నిండిపోయింది. శ్రీపతి అంటే.
    మర్నాడు శ్రీపతి ఎక్కడా కనపడలేదు. గది వదిలి కాలు బైట పెట్టలేదని తెలుసుకుంది. శ్రీపతికి క్షమాపణ చెప్పుకోటానికి నిశ్చయించుకున్న కమల కేంతకీ అతను బైట కనపడలేదు. ఆ సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కొలను ప్రక్కన మాలతి చెట్టు కింద విచారంగా ఆలోచిస్తూ శ్రీపతి కనిపించాడు. కమల దగ్గరి కెళ్ళినా ఆమె రాకనే గుర్తించలేదు శ్రీపతి. కమల మెల్లగా గొంతు సవరించుకోటం విని తలెత్తి చూసి నిరసనగా అసహనంగా చూసి తల దించేసుకున్నాడు.
    'నేను నిన్న చాలా తొందరపడి మాట జారాను. కోపంతో నన్ను నేను నిగ్రహించుకోలేక పోయినాను. కాని రాత్రంతా బాధపడి చివరికి మీ దగ్గర నాతప్పు ఒప్పుకోటానికి నిశ్చయించుకున్నాను. నా తప్పు క్షమించండి. ఇప్పటికైనా మీరు క్షమించగలిగితేనే వుంటాను. లేకపోతె నేను మీరన్నట్టుగానే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇంక మీ ఇష్టం' అని మెల్లగా అని వూరుకుంది.
    శ్రీపతి మొదట్లో అసహనంగా విన్నా తరవాత ప్రశాంతంగానే విన్నాడు. కమల ముఖంలో ఇప్పుడేట్లాంటి కోపం గాని అహం గాని, నిర్లక్ష్యం కాని లేవు. పైగా జాలి, అభిమానం , పశ్చాత్తాపం ముస్సీరి గోన్నాయ్యా ముఖాన్ని . తేరిపార చూశాడు అందులో ఏ కల్మషం కనపడలేదు శ్రీపతికి. నిజమైన పశ్చాత్తాపం తప్ప. మనసు మెత్తపడుతున్న శ్రీపతి ఆలోచనలు అంతలో మళ్ళీ మొదటికొచ్చినై.
    కాని క్షమాపణ అందుకోవటం ఎట్లా వున్నా నువ్వు పని మానుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. మధురి కారణంగా నీవిక్కడ వుండచ్చు. కాని నువ్వు కేవలం పనికి కుదిరిన మనిషివన్నది మాత్రం యే పరిస్థితుల్లోనూ మరవద్దు.'
    కమలకి రాత్రి రాజేశ్వరి చెప్పిన వాళ్ళ తండ్ర్రి తాతలు తలుపుకొచ్చారీ మాటలతో. రోషం తలెత్తింది. కాని అణుచుకుని తను నిజంగా అంతేకదా అనుకుని మరోమాట లేకుండా వెనుతిరిగింది.
    కమల ముఖంలో ఇప్పుడు కనపడ్డ విచారం, రోషం చూసిన శ్రీపతి ఒక్క క్షణం మధనపడ్డాడు. పిలిచి మంచిగా మాట్లాడాలను కున్నాడు కాని అహం అడ్డొచ్చింది.
    శ్రీపతి , కమల ఎప్పుడైనా తారసపడ్డా యధోచితంగా వుండేవాళ్ళు. మునపటి లాగా శ్రీపతి వెటకారపు మాటీపోటీ మాటలనడం లేదు. కొంచెం నెమ్మదిగానే వుంటున్నాడు.
    రాజేశ్వరి ఈవిషయం ఎట్లా పరిణమిస్తుందో అనుకుని పడ్డ భయం తేలిపోయింది. అంతే కాకుండా శ్రీపతిలో కొంచెం కొంచెం మార్పు కూడా కనిపిస్తున్నది. క్రమంగా మెత్తపడుతున్నట్టు కనపడుతున్నాడు. ఈమార్పు ఆమెకి సంతోషాన్ని కలిగించింది.

 Previous Page Next Page