Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 14

                                 

 

                                      7
    ఆశ కమల ఇంత చక్కగా ఇంగ్లీషు మాట్లాటం విని నిశ్చేష్టురాలైంది . కాని క్రమంగా తెరుకోటం మొదలు పెట్టింది. కమల మాటల్లో వున్న నిజం కొరడాతో కొట్టినట్టు తోస్తున్నా చెక్కు చెదరడం లేదు. కాని శ్రీపతి వెర్రి సంతోషంతో మరీ రెచ్చిపోయి 'శ్రీపతి నువ్వు చెప్తావా లేదా పాపని తీసుకురమ్మని' అని అరిచింది.
    శ్రీపతి నవ్వుకుంటూ 'నువ్వు అడగవలసిన వాళ్ళనే అడిగావు. నేవోద్దనడం లేదే" అన్నాడు.
    ఆశ కమల వైపు తిరిగి 'మధ్యలో నీ పెత్తనం ఏమిటి బోడి పెత్తనం . నా బిడ్డని నేను చూసుకోవాలి. తీసుకురా ఆలశ్యం చెయ్యకుండా. ఐనా - కన్నతల్లి మనసు నీకేం తెలుస్తుంది' అన్నది.
    'ఔను నిజమే నాకేం తెలుస్తుంది ఇట్లాంటి కన్నతల్లి హృదయం , కన్నప్రేమ తోసేసి , కామంతో కళ్ళు మూసుకు పోయి, కన్న బిడ్డని వదిలిపోయిన తల్లి మనసు, పసికందు అని ఐనా ;లేకుండా అవతల బికారు గొప్పవాళ్ళు కాగానే తిరిగి చూడకుండా వదిలేసిపోయిన తల్లి మనసు, తనకు పిల్లతో పనిలేదంటూ సర్వహక్కులూ వోడులుకుని కాయితం మీద సంతకం పెట్టి డబ్బు చూసి పరిగెత్తిన తల్లి పాషాణ హృదయం , ఇన్నేళ్ళుగా కన్నబిడ్డ ఎట్లా వుందో చూసుకోవాలని కూడా అనిపించని ఆ వజ్ర హృదయం, ఈనాటికీ అక్కడి వాళ్ళ చేత అంపకాలు చేయించుకుని మళ్ళీ పాపని  అడ్డు పెట్టుకుని ఒక పాచిక వేసి చూట్టానికి యత్నించిన నీబోటి తల్లి మనసు నాకేం తెలుస్తుంది . నిజమే. నిన్న వచ్చినప్పుడైనా పాపని మనసారా తలిచావా? పాప క్షేమం అడిగావా , కనీసం పాప ఎట్లా వుందో, ఎంత పెరిగిందో అనైనా చూడాలనిపించిందా నీకు? ఆ పాలుగారే చక్కటి ముఖం చూడాలని నీ కెట్లా అనిపించలేదు? కన్న బిడ్డని చూడాలని అనిపించని నువ్వూ ఒక తల్లివేనా? నిజమే. మరి కన్నతల్లి మనస్సు ఇట్లాగే వుంటుందేమో బిడ్డ పట్ల నాకు తెలియదంటూ వెనక్కు తిరిగింది.
    ముఖాన నెత్తురు చుక్క లేకుండా నుంచుని వుంది ఆశ.
    శ్రీపతి మాత్రం 'త్రీ ఛీర్స్ కమలా, త్రీ చీర్స్' అని అరుస్తున్నాడు.
    ఆశ ఒక పనిపిల్ల తనినింత అవమానిస్తుందా అన్న రోషం అవమానం పట్టలేక కమలని కొట్టటానికి చేయ్యేత్తింది. నా బిడ్డని తీసుకుపోటానికి అడ్డం నువ్వెవరూ' అంటూ.
    చటుక్కున శ్రీపతి ఆ చెయ్యి పట్టుకుని 'ఆశా, ఇంక చాలు. ఇక బైటికి నడు. ఇంతవరకు ఏదో లెమ్మని చూశాను. ఇంతకు తెగించిన నిన్ను ఇంక మెడపట్టి బైటికి గెంటాల్సిందే' అంటూ గర్జించాడు.
    అంతలో అంతవరకూ వేచి వున్న శ్రీనివాసరావు గారు లోపల కొచ్చారు లాయరుతో. వోస్తూనే 'పాప మీద నీకెలాంటి హక్కు లేదు పత్రం ప్రకారం. ఇంక నువ్వు నీ కుతంత్రాలన్నీ మాని వచ్చిన దారినే ఇంటికి పో' అన్నాడు.
    ఆశ ఇప్పటికీ నిజంగానే  పరాజయం అంగీకరించింది. అణగారిన మాతృహృదయం కమల మాటలకి మేల్కొని, వెళ్ళక ముందోక్కసారి పాపని చూడమని తొందర పెట్టింది. కన్నీళ్ళతో, కమల చేతులు పట్టుకుని ఒక్కమాటు పాపని చూపించమని ప్రాధేయ పడింది.
    కన్నతల్లిగా ఆశ చేసిన వేడుకోలుకి కమల కరిగిపోయి పాపని తీసుకొచ్చింది.
    తెల్లగా బొద్దుగా నొక్కుల జుట్టుతో కాంతిగా మెరిసే కళ్ళతో ముద్దుగా వున్న పాపని చూసేటప్పటికి ఆశ మనసు కట్టలు తెంచుకుని ప్రవహించింది. పాపా రా తల్లీ' అంటూచేతులు రాసింది.
    'కాని పాప కమలని వాటేసుకుని ''ఎవరు కమలీ అది' అంటూ చాటు నించి ఆశను చూసింది.
    ఎవ్వరూ ఏ సమాధానం ఇవ్వలేదు.
    ఆశే 'అమ్మని' అన్నది వచ్చీ రాని తెలుగులో.
    పాప ' ఛీ నువ్వు అమ్మవి కావు. ఇదుగో నా అమ్మ' అంటూ కమలీని చూపించి చేతు లేత్తింది ఎత్తుకోమని. కమల వెంటనే ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది.
    ఇది చూసి ఆశ దుఃఖిస్తూ 'నిజమే దేవుడి లాంటి శ్రీపతికి ద్రోహం చేశాను. పాపం, పుణ్యం ఎరగని పసికందుకి దూరమైనాను. నాకు నిష్కృతి లేదు. నీవే పాపకి సరైన తల్లివి. పాప తెలిసే నిన్ను ఎన్నుకుంది' అంటూ పరుగుతో వెళ్ళిపోయింది.
    ఎక్కడి వాళ్ళక్కడ బొమ్మలల్లె నిల్చుని పోయినారు. కమల పాప నెత్తుకుని వెనక్కి తిరిగింది లోపలికి వెళ్ళటానికి.
    శ్రీపతి పొంగివస్తున్న ప్రేమతో ఆవేశంగా ' పాపా' అంటూ పిలిచాడు. పాప చూసింది. కాని ఇంతవరకూ జరిగిన ఈ వింత నాటకానికి పెద్దవాళ్ళే మ్రాన్పడగా ఈ పసిమనసు తట్టుకోలేక పోయింది. కమలను కరుచుకుని దిగి రాలేదు.
    శ్రీపతి కూడా ఈ మూడు రోజులుగా జరుగుతున్న రభసతో మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాడు. పాప కమలనే కరుచుకు రాననడంతో ఆవేశం పట్టలేక 'కమల అగు' అని అరిచాడు.
    కమల ఆగటం, తిరిగి రావటం జరిగింది. పాపని మళ్ళీ పిలిచాడు. పాప ఇంకా గట్టిగా కమలని కరుచుకుని ఏడుపు ప్రారంభించింది.
    'అరె పసిదాన్ని బెదరగోడతారేం' అన్న కమల మాటలకి శ్రీపతి ' జీతాలకి పనిచేసే వాళ్ళ కున్న పాటి మమతలు కన్నతండ్రి కుండవు కాబోలన్నాడు.
    ఆశ మాటలకి రాజేశ్వరి 'శ్రీపతి' అని అరవటం శ్రీనివాసరావు గారు బైటికి వెళ్ళటం జరిగింది. కమల ముఖం పాలిపోయిందే కాని పెదవి విప్పలేదు.
    శ్రీపతి 'పాపనివ్వు' అంటూ దగ్గరికి వెళ్ళటంతో పాప ఏడుపు పెద్దది చేసింది.
    ఇంతవరకూ వూరుకోకలిగిన కమల ఇంక సహనం కోల్పోయింది. అవమానం అభిమానం పట్టలేక 'చేతనైతే తీసుకోవచ్చు. కాని ప్రేమతో చేయ్యకలిగే పనులు అధికారంతో చెయ్యలేరు.'జీతానికి పనిచేస్తున్న నన్ను' విడిచి మీదగ్గరికి రాదు . ఏమీకాని నన్ను మనస్పూర్తిగా 'అమ్మ 'అంటుంది' మిమ్మల్ని నాన్న అని ఇప్పటికి నోరారా పిలవలేదు. కావాలంటే అడిగి చూడండి.' అంది రోషంతో ముక్కుపుటాలు అదురు తుండగా.
    'పాపా నేనేమౌతానమ్మా నీకూ?'
    పాప వెంటనే 'అమ్మ' అన్నది.
    కమల 'ఆయనో' అని శ్రీపతిని చూపించింది.

                           
    ఈమూడు రోజులుగా గడ్డం కూడా చేసుకోకుండా , తిండి నిద్ర సరిగ్గా లేక  ఎర్రటి కళ్ళతో చిరాకు పడుతూ, ఆవేశంతో , కోపంతో కాస్త భయంకరంగా వున్న శ్రీపతిని చూసి పాప క్షణంలో 'బూచి' అన్నది.
    దాంతో శ్రీపతికి ఒళ్ళు తెలియలేదు. ఆందోళనగా నవ్వాపుకుంటున్న కమలని చూస్తె కోపం ఆగలేదు. చెళ్ళున ఒక్క చెంప దెబ్బ కొట్టాడు.
    ఆ దెబ్బతో అక్కడి నలుగురూ నాలుగు విధాలుగా ఐనారు. పాప ' బూచి' అమ్మని కొట్టాడంటూ ఏడవటం మొదలుపెట్టింది.
    'శ్రీపతీ! ఆప్రాచ్యుడా! పరాయి ఆడపిల్ల , అందులో కమల లాంటి దాని మీద చెయ్యి చేసుకున్నావురా. నీ తాత తండ్రుల విషపు నేత్తురేగా నీలో కూడా ప్రవహిస్తున్నదినూ. ఆశ సరిగ్గానే నీమీద కేసు పెట్టిందిరా. నీ తండ్రి ఛాయా నీమీద పడకుండా పెంచాలని చూశాను. కాని పుడకతో ఇచ్చిన ఆ రాక్షసత్వం ఎక్కడికి పోతుందిరా' అంటూ కమల దగ్గరి కొచ్చింది.
    అప్పటికి శ్రీపతి ఆవేశం దిగిపోయింది. ముఖాన నెత్తురు చుక్క లేకుండా కందిన చెంపతో తన్నొక రక్షాసుడిగా చూస్తున్న కమల చూపులు బాకులై గుచ్చుకున్నై. తల్లి మాటలు చెవుల్లో గింగుర్లైతున్నై. తన మనసే తనని ఎదురుతిరిగి నిందిస్తున్నది. గాలివానకి వూగే చేట్టల్లె అల్లాడుతున్నాడు. నిలవలేక తన గదిలోకి పారి పోయినాడు.
    కమల కేదీ తెలిసినట్టు లేదు. నిద్దట్లో మనిషల్లే పాపని బుజానేసుకుని ప్రాణం లేనట్టు లోపలికెళ్ళింది. రాజేశ్వరి ఆ కమలని పలకరించటానికి ధైర్యం చాలలేదు.

 Previous Page Next Page