Previous Page Next Page 
రెండోమనసు పేజి 12


    "ప్రస్తుతానికింత కంటే మంచి ఇల్లు దొరకదు సావిత్రీ! కొన్ని రోజులు ఎలాగోలా గడపాలి!" నొచ్చుకుంటూ అన్నాడు చలపతి.
    "ఫర్వాలేదులే! ఇప్పుడీ ఇంటికే మయిందనీ! బాగానే ఉంది?" తేలిగ్గా అంది సావిత్రీ.
    "సామాన్లు కూడా ఏమీ లేవు! నీకు కొన్ని రోజులు కష్టంగానే వుంటుంది. ఉన్నవాటితో అడ్జస్ట్ అవటం!"
    "అదంతా నేను చూసుకొంటాగా?" నవ్వుతూ అందామె.
    "అదేం కుదర్దు. అంతా నువ్వు చూసుకోవటానికి వీలు లేదు. నువ్వెవరివో నీకు తెలుసా? దేవుడు పొరబాటున ఇలాంటి బీద కొంపలో పడేసిన దేవతవి! దేవత లేక్కడయినా పనులు చేస్తారా! కష్టాలు పడతారా? అంచేత నువ్వు నిజానికి ఏ పనీ చేయడం నాకిష్టం లేదు!
    ఏవేం చేయాలో నాకు చెప్పు! నేను చేసేస్తాను! వంట కూడా నేనే చేస్తాను! అలా నువ్వేస్తావేమిటి? నేనేం సరదాకి మాట్లాడటం లేదు! నా మనసులో మాటే చెపుతున్నాను. నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నాకు కోపం వస్తుందమ్మాయ్!"
    "బాగుంది! అన్నీ మీరే చేసుకొంటే నేనెందుకిక?"
    "నాకు కంపెనీ ఇవ్వడానికి! అంతే! అందుకే నిన్ను ఏరి కోరీ చేసుకొన్నాను! తెలిసిందా?"
    "కంపెనీ ఇవ్వడానికి పెళ్ళామెందుకు?"
    "ఇప్పుడు చెప్పు! రాత్రికి వంటెం చెయ్యాలి!"
    "నేను చెప్పను!" చిరుకోపంతో అంది సావిత్రి.
    "ఎందుకని?"
    "లేకపోతే ఏమిటి? మీరు వంట చేస్తుంటే నేను కూర్చొని చూడాలా! నాకేం బావుండ లేదిది! పోనీ ఓ పని చేయండి. దగ్గర కూర్చుని నాకన్నీ అందివ్వండి!క్ నేను వంట చేస్తాను సరేనా?"
    "ఓ మోస్తరుగా ఉందీ స్కీమ్! సరే! ప్రస్తుతానికలాగే కానీ! తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం!" నవ్వుతూ అని ఆమెతో పాటు వంటింటి వేపు నడిచాడు చలపతి.
    ఇద్దరకూ "టీ" తయారు చేసిందామె.
    "టీ అద్భుతంగా ఉంది సావిత్రీ. మూడు ఒకేసారి ఒకే మనిషిలో ఎన్ని సుగుణాలు ఎన్ని వధ్యలు పెడతాడో చూడు! అందం, ఆకర్షణ, సౌశీల్యం, పాకశాస్త్రం ఇవన్నీ ఒకే స్త్రీలో ఉండటం ఎక్కడయినా చూశావా?"
    లేదు! మీరు చూశారా?"
    "ఎదుర్గా చూస్తోందేమిటనుకొన్నావ్ మరి?"
    మీరు మరి పోగిడేయకండి? కళ్ళకలా రంభలాగా కనబడుతున్ననేమో గానీ నిజానికి నేను అంత గొప్ప అందగత్తె నేం కాదు!" నవ్వాపుకొంటూ అంది సావిత్రి.
    "ఈ స్టేట్ మెంట్ నేనొప్పుకోను! తరువాత వంట కార్యక్రమం త్వరగా కానీ! మనం సాయంత్రం షికారు కెళ్ళాలి! ఇప్పుడు నేన్నీకు ఏం సహాయం చేయాలో చెప్పు!"
    "ఆ డబ్బాలన్నీ ఇటు అందివ్వండి."
    చలపతి పనిలో నిమగ్నమయిపోయాడు. వంట పూర్తీ అయేసరికి చీకటి పడిపోయింది. ఇద్దరూ బయటి కెళ్ళడానికి ముస్తాబవుతొంటే బయట నుంచి ఎవరో పిలిచినట్లు వినిపించింది.
    "ఎవరూ?" కర్టెన్ పక్కకు లాగి చూస్తూ అన్నాడు చలపతి. బయట గొడుగు చేతిలో పట్టుకొని నుంచున్న మామయ్యను చూడగానే గతుక్కుమన్నాడు.


                                                                 * * *

    "రండి!" అన్నాడు ఆహ్వానిస్తూ.
    లోపలి కొచ్చి మంచం మీద కూర్చున్నాడు శ్రీరాములు. సావిత్రికి అతనిని చూసేసరికి భయం వేసింది. ఏ గొడవా కాకూడని వేయి దేముళ్ళకు మొక్కకోసాగింది.
    "అయితే ఇదంతా నువ్వే చేశావన్నమాట!" చలపతి వంక తీక్షణంగా చూస్తూ అన్నాడు శ్రీరాములు.
    "మీకు చెపితే ఒప్పుకోరని తెలుసు! అందుకే చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది!" అన్నాడు చలపతి ధైర్యం తెచ్చుకుంటూ.
    సావిత్రి మెడలో మంగళసూత్రం వంక చూసి మరీ మండిపడ్డాడాయన.
    "పెంచి పెద్దా చేసిన వాళ్ళకి మంచి మర్యాద ఇచ్చావ్! జాలి తలచి మంచి సంబంధం చూస్తోంటే , కులం లేని దానితో వచ్చేసి మంచి గుణపాఠం నేర్పావ్!" ఉద్రేకపదిపోతూ అన్నాడాయన.
    సావిత్రికి కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    "మన ఇంటి గౌరవం కాస్తా సర్వనాశనం చేశావ్. అయినా నిన్నని ఏం లాభం? నిన్ను మాయ జేసి ఎత్తుకొచ్చినదీన్ననాలి!"
    చలపతి ఈ మాటతో కోపం పట్టలేకపోయాడు.
    "ఇంక బయటకు నడుస్తారా?"
    "అంటావురా! ఎందుకనవ్! నేనేం నీ ఇంట్లో పడి వుంటానికి రాలేదు. ఈ దౌర్భాగ్యపు పని చేసింది నువ్వా, కాదా అని తేల్చుకోడానికి కొచ్చాను -------ఛీ!" అంటూ లేచి ఇంట్లో నుంచి బయటకు నడిచాడు.
    చాలా సేపటివరకూ మాములు మనుష్యులు కాలేకపోయారిద్దరూ. ముందు చలపతే తేరుకున్నాడు.
    "అవ్వాల్సిన గొడవంతా అయిపొయింది సావిత్రీ! మన విషయం అందరూ వదిలేసినట్లే అనుకోవచ్చు ఇక!" సావిత్రి ఏం మాట్లాడలేదు.
    అతను అలా నిందించటం ఆమెకు బాధగా ఉంది. కొన్ని సినిమాల్లోనూ, నవలల్లోనూ, ఇలాంటి సన్నివేశాల్లో దీవించి వెళ్ళడం చూసింది.
    అలాగే తనకు జరుగుతుందన్న నమ్మకం లేకపోయినా, కనీసం తననలా తూలనాడటం జరగదని భావించింది.
    "అలా తిరిగొద్దామా?" అడిగాడు చలపతి.
    "ఊహూ! నా కెక్కడికి రావాలని లేదు" మంచం మీద ఒరిగిపోతూ అంది సావిత్రి.
    "ఇలాంటివి మనం వెంటనే మర్చిపోవాలి. సావిత్రీ! మనసులో పెట్టుకొని బాధ పడినందు వల్ల లాభం లేదు" ఓర్పుగా అన్నాడు చలపతి.
    సావిత్రి కళ్ళలో నీళ్ళు మెరుస్తూనే వుంది. ఆమె పక్కనే పడుకొని తనవేపు తిప్పుకున్నాడు చలపతి.
    "ఏడుస్తున్నావా?" బాధగా అడిగాడు.
    "ఇంక ఎవరూ మనింటికి రారు కదూ?" దుఃఖం అపుకొంటూ అంది సావిత్రి.
    "అవును! మనకి మిగిలింది కేవలం స్నేహితులే"
    "పోనీలెండి! ఎవర్రాకపోతే మాత్రమే? నాకు మీరున్నారు, మీకు నేనున్నాను! ఇంతే చాలు!" తనని తనే అనునయించుకుంటూ అందామె.
    చలపతి ఆమె శిరస్సుని తన గుండెలకు హత్తుకొని నుదుట మీద ముద్దు పెట్టుకొన్నాడు.
    మరికొద్ది సేపటి తరవాత తేరుకుని ఇద్దరూ భోజనాలు ముగించారు.
    "రేపట్నుంచి నేను ఆఫీసు కెళ్ళాలి, నువ్వొక్కర్తెవూ ఎలా వుంటావో నని భయంగా వుంది?" అన్నది చలపతి.
    "భయమెండుకూ? పక్కింటామె తోడుంటుంది గా! మీరు వచ్చేవరకూ ఆవిడతో మాట్లాడుతూ కుర్చుంటాను!" నవ్వుతూ అంది సావిత్రి.
    "అల్ రైట్! బాగానే ఉందీ పద్దతి" తేలిక పడుతూ అన్నాడు చలపతి.
    సావిత్రిని వదిలి ఉండడం తనవల్ల కాదనిపించింది . గత్యంతరం లేక ఆఫీసుకి బయలుదేరాడు. ఆఫీసంతా అతని కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి దృష్టిలో తనో హీరో అయిపోయాడు.

 Previous Page Next Page