"వివాహానికి ముందే నేను ఒకతనిని ప్రేమించాను. కానీ మావాళ్ళ బలవంతం వల్ల వేరొకకతనితో నాకు వివాహం జరిగిపోయింది. కొద్దిరోజులు తర్వాత ఆయనకు నా గతం తెలిసింది. నన్ను నిగ్గదీసి అడిగారు. నేను జరిగిన విషయమంతా ఉన్నదున్నట్లు చెప్పాను. అతనూ నేనూ ప్రేమించుకున్నమాట నిజమేననీ, కానీ అతనితో వివాహంజరుగదని తెలిశాక నేను నా మనసులోంచి అతనిని తొలగించివేశాననీ, ఇప్పుడు అతనిని పూర్తిగా మర్చిపోయాననీ బ్రతిమాలిచెప్పినా ఆయనకు నా మీద నమ్మకం కలుగలేదు.
"ఆ రోజు నుంచీ నన్ను చిత్రవధ చేయడం ప్రారంభించారు. చేసేది లేక ఆయనను వదిలేసి ప్రేమించినతని దగ్గరకు చేరుకున్నాను. అప్పటికే అతని వివాహం అయిపోయింది. అయినా నా పరిస్థితి చూసి నన్ను ఆదరంతో స్వీకరించాడు. జీవితం అంతం చేసుకోవాలన్న నా ఆలోచనను మాన్పించి నాకు మళ్ళీ ధైర్యం చెప్పాడు. ఇద్దరం దేవుని ఎదుటఒకటయాం. దీనివల్ల అతనికీ అతని భార్యకూ మనస్పర్ధలు వచ్చినా తరువాత ఆమె అతనితోసహకరించింది. ఇంక అంతకంటే వేరేమార్గం తోచక అతనితో గడుపుతున్నాను. అతని భార్య మనఃక్లేశానికి కారణమయానన్నబాధ తప్పితేనిజానికి నాకేలోటూలేదిప్పుడు..." చెప్పడంఆపింది అనూరాధ.
హేమకు అనూరాధ ప్రియుడి మీద కోపం రగిలిపోయింది.
"మీకు మీకిష్టం లేని వ్యక్తితో వివాహం జరుగుతుంటే అతనెందుకు పిరికివాడిలా చూస్తుండిపోయాడు? ఆ రోజే మిమ్మల్ని ఎక్కడికయినా తీసుకుపోయి వివాహం చేసుకుంటే ఈ గొడవలన్నీ లేకపోనుగదా?"
అనురాధకామె వాదన నచ్చలేదు.
"అతనేం చేయగలడులెండి! పరిస్థితులలా వచ్చాయ్ అయినా ఇదంతా నా ఖర్మలెండి! ఎవర్ననడానికీ వీల్లేదు."
"ఎందుకు లేదు? అతను మొగవాడు గనక అతనే ధైర్యం చేసి ఉండాల్సింది! పోనీ అతను నిజంగానే మిమ్మల్ని ప్రేమించి ఉన్నాడనుకోండి! అలాంటప్పుడు ఇంకొక అమ్మాయిని ఎలా వివాహం చేసుకున్నాడు?"
"మీరు ఊరికే అపోహ పడుతున్నారు. ప్రేమించినంత మాత్రాన జీవితం నాశనం చేసుకోవాలని ఎక్కడుందీ? ఏ విచార సమయంలోనయినా లేక ఏ సంతోష సమయంలోనయినా జీవితాంతం ఒకరినొకరు గుర్తు చేసుకుంటే అదే ఉన్నతమయిన ప్రేమ అని నేననుకొంటాను. ప్రేమంటే జీవితాలు నాశనం చేసుకోవడంకాదు...." చిరునవ్వుతో అందామె.
"ఏమో మీరింత సౌమ్యంగా ఎలా ఆలోచిస్తున్నారో నాకర్ధం కావటంలేదు...." అంది అసహనంగా.
అనూరాధకు నవ్వు వచ్చింది. మంచో, చెడో అనుభవిస్తోంది తను. అతని మనసు ఎలాంటిదో కూడా తనకు బాగా తెలుసు. మధ్యలో అతని మీద ఈవిడ కింత కోపం ఏమిటి?.
"ఇంకవెళతానండీ!....." అనేసి అక్కడినుంచి తప్పించుకుని బయటకు నడిచిందామె.
హేమ చాలా సేపు అక్కడే కూర్చుండిపోయింది, అనూరాధ గురించి ఆలోచిస్తూ.
ఆ రాత్రి శ్రీనివాసరావ్ నిద్రపోయాకలేచి కూర్చుని అనూరాధ జీవితమే కథగా రాయసాగింది. కథ పూర్తయ్యే వరకు మనసులో అశాంతిగానే ఉంది. కథలో అనూరాధ ప్రియుడినీ భర్తనీ ఇద్దరినీ దోషులుగా చేసిచూపింది. అప్పటిగ్గాని ఆమె మనసులోని కోపం చల్లారలేదు. కథ పూర్తయ్యే సరికి రాత్రి రెండయిపోయింది. ముగింపు దశలో ఉండగా శ్రీనివాసరావ్ కి మెలకువవచ్చింది.
"హేమా!" కలవరపాటుతో పిలిచాడతను.
"ఊ!".
"ఏం చేస్తున్నావ్?" లేచి కూర్చుంటూ అడిగాడు.
ఆమె చిరునవ్వు నవ్వింది. "ఏదో రాసుకుంటున్నాను...."
"ఏమిటది? ఉత్తరమా?"
"కాదు!"
"మరి?"
ఆమె నవ్వేసింది సిగ్గుతో. శ్రీనివాసరావ్ కళ్ళు నలుముకొంటూ లేచి ఆమె దగ్గరకొచ్చి కాగితాలు చూశాడు. మరు నిమిషంలో అతనికి అర్ధం అయిపోయింది.
"ఏమిటి? కథ రాస్తున్నావా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"ప్రయత్నిస్తున్నాను".
"ఇంతకుముందేమయినా రాశావా?"
"కాలేజ్ మాగజైన్స్ కీ, సావనీర్స్ కీ రాశాను! పత్రికల కెప్పుడూరాయలేదు".
"ఇవన్నీ మధ్యాహ్నం రాసుకోవాలి. రాత్రిళ్ళు నిద్ర పాడుచేసుకోవడమెందుకు?" ఆమెను రెండు చేతులతో చుట్టి కనురెప్పలమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడతను.
"కొంచెం ఆగండి! పది నిమిషాల్లో అయిపోతుంది." వదిలించుకొంటూ అందామె.
అతను వదిలేసి వెళ్ళి మళ్ళీ మంచంమీద పడుకున్నాడు. కథ పూర్తిచేసి తనూ అతని పక్కనే వరిగిపోయింది ఆమె. ఆమెకు మెలకువవచ్చేసరికి అతను ఆఫీసు కెళ్ళడానికి సిద్దమవుతూ కనిపించాడు.
చటుక్కునలేచి కూర్చుని టేబుల్ మీదున్న టైమ్ పీస్ వంక చూసింది. తొమ్మిదవుతోంది.
"అరె! నన్ను లేపలేదేం?"అడిగింది నొచ్చుకుంటూ.
'పాపం కథరాసి అలసిపోయావ్ కదా!" వ్యంగ్యంగా అన్నాడతను.'
'మరి మీరు కాఫీ కూడా తాగకుండానే వెళ్ళిపోతున్నారా?" అతను నవ్వాడు. "ఫరవాలేదులే! హోటల్లో తాగుతాను."
ఆమె అతని దగ్గరగా వచ్చింది. "సారీ!" అంది అతని కళ్ళలోకి చూస్తూ.
ఆమెను తన గుండెలకు హత్తుకొని చెక్కిలిమీద చుంబించాడతను.
"మరేం ఫరవాలేదు. నువ్వు విశ్రాంతి తీసుకోవడమేమంచిదని నేనూ నిన్ను లేపలేదు!" అన్నాడు అనునయంగా. అతను వెళ్ళిపోయాకవంటింటిలోకి నడిచిందామె. స్టవ్ దగ్గర కెళ్ళాలంటే బద్దకంగా ఉంది. ఈ సమయంలో వంట చేయబుద్ది కావటం లేదు. కానీ అర్జంటుగా కాఫీ కావాలిముందు. పాలు కాయకుండా అలాగే గిన్నెలో ఉంచాడు శ్రీనివాసరావ్. హేమకు కోపం ముంచుకొచ్చిందతని మీద.
పాలుకాచి తామిద్దరికీ కొంచెం కాఫీ తయారుచేస్తే అతని సొమ్మేంపోతుంది? రోజూ తనే చేస్తోంది కదా? ఏదో కారణంచేత తను లేవలేకపోతే ఆ పని అతను చేయకూడదా? భార్యకు కాఫీ పెట్టి ఇవ్వడం అతనికి తలవంపులుగా భావిస్తున్నాడేమో! ఈ మగాళ్ళు ఎన్నిజన్మలెత్తినా అంతే! ఆడదాన్ని ఎలా 'ట్రీట్' చేయాలో తెలుసుకోలేరు. విసుక్కుంటూనే కాఫీ కాచుకొని తాగింది హేమ. అప్పటికిగాని ఆమెకు బడలికపోయినట్లు లేదు.
తరువాత తను రాసిన కథ తీసుకుని మరోసారి చదువుకుంది. అందులో కథంటే "వ్యాసం" గుణాలు ఎక్కువగా ఉన్నాయ్. అయినా ఫరవాలేదు. మిగతావాళ్ళు రాసే కథలకేమీ తీసిపోదది. వెంటనే ఆ కథను తీసుకుని పోస్టాఫీస్ కి బయల్దేరిందామె. ఆ పని పూర్తి చేసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండయిపోయింది. ఆకలి విపరీతంగా వేయసాగింది. ఆకలితోపాటు శ్రీనివాసరావ్ మీద కోపం పెరిగిపోసాగింది.
తనదారిన తను హోటల్ కెళ్ళి కాఫీ టిఫిన్ తీసుకున్నారు. "ఇంటి దగ్గర పెళ్ళానికికూడా కాఫీ, టిఫినూ తీసుకెళ్ళి ఇద్దాం" అన్న ఆలోచనేలేదు మనిషికి. అతనూ మిగతావాళ్ళ లాగానే స్వార్ధపరుడు. తనేదో భ్రమించింది కాని అతనూ మామూలుమొగాడే. అతనిలో తనూహించిన ప్రత్యేకత ఏమీ లేదు. అతను చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతనతక్కువ.
అతని మీద కోపం కొద్దీ భోజనం చేయకుండానే పడుకొందామె. శ్రీనివాసరావ్ ఆఫీస్ నుంచి వస్తూనే ఆమె పడుకుని ఉండటం చూచి కలవరపడ్డాడు.
"పడుకున్నావెందుకు హేమా?" అంటూ ఆత్రుతగా అడిగాడు.
"ఏమీలేదు! ఊరికినే!" ఆమె మాటలతో కొంత సంతృప్తి కలిగిందతనికి. డ్రస్ మార్చుకుని ఆమె దగ్గరకూర్చున్నాడు. "టీ ఇస్తావా?" అడిగాడు ఆప్యాయంగా.
"హోటల్లో తాగలేదా?" అడిగిందామెకోపం అణచుకుంటూ.
"హోటల్లోనా? ఎందుకు?"
"ఏమో! పొద్దున్న వెళ్ళేప్పుడు హోటల్లో తాగుతానన్నారుగా?" ఆమెకు కోపం వచ్చిందని గ్రహించాడు శ్రీనివాసరావ్. ఆమెను లేవనెత్తి తన కౌగిట్లోకి తీసుకున్నాడు. "పొద్దున్న నువ్వు నిద్ర లేవలేదని హోటల్లోనే కాఫీ, భోజనం చేశాను. నీకు వంట్లో నలతగా ఉందా ఏమిటి? రోజూ నేనొచ్చేసరికి 'టీ' రడీగా ఉంచేదానివి గదా!"
"అవును! మీక్కావలసింది అన్నీ సమయానికి అమర్చడం? అంతేగా! కూర్చోండి! ఇప్పుడే 'టీ' తెస్తాను!" వంటింటివేపు నడుస్తూ అందామె. ఆమె వెనుకే తనూ నడిచాడతను. వంటింట్లో అన్నీ ఖాళీ గిన్నెలు కనిపించేసరికి అతనికి అనుమానం వచ్చింది.
"హేమా! భోజనం చేశావా నువ్వు?" చటుక్కున ఆమెను తనవేపు తిప్పుకుంటూ అడిగాడు.
"ఇప్పుడు నా సంగతి ఎందుకు లెండి. ముందు మీకు 'టీ' ఇస్తాను......"
శ్రీనివాసరావ్ కి హృదయం ద్రవించిపోయింది.
"హేమా! ఉదయం నుంచీ భోజనం చేయకుండానే గడిపావా? ఎందుకు హేమా? ఏమయింది?" గాబరాగా అడిగాడు. "భోజనం చేయాలనిపించలేదు! అంతే!"
"ఎందుకని?"
'ఏమో!"
"హేమా! ప్లీజ్! సరిగ్గా మాట్లాడు! నా మీద కోపం వచ్చిందా? నేనేమయినా అన్నానా నిన్ను?"