Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 12


    "ఐసీ" అన్నాడు సింహాద్రి.
    "ఓ యస్! బ్యూటిఫుల్ మెథడ్ అది! నీకు ఒకవేళ ఇది నచ్చకపోతే రెండో పద్దతుంది"
    సింహాద్రి ఉత్సాహంగా చూశాడు.
    "అదేమిటి?"
    "దాన్ని శాటిలైట్ మెథడ్ అంటారు. అంటే రేసులూ, క్లబ్బులూ, పేకాటలూ ఇలా వీటి చుట్టూ ఇంటికి రాకుండా తిరుగుతూ జీవితం గడిపేయడం అన్నమాట! చివరకు బాగా ఏజ్ ఎక్కువయి అంటే కళ్ళు పూర్తిగా కనిపించని స్థితిలో ఇవన్నీ మానేసి ఇంటి దగ్గర ప్రశాంతంగా జీవితం గడుపుతాడు. ఈ రెండూ కాక మూడో మెథడ్ ఒకటుంది కానీ అది అంత మంచిదికాదని నా పర్సనల్ అభిప్రాయం"
    "ప్రస్తుతానికివి చాల్లే" అన్నాడు సింహాద్రి.
    అతనికిప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్లు అనిపించింది. ఇంతకుముందు తను కొంతమంది "సంవత్సరమంతా" టూర్లు చేసేవాళ్ళను చూశాడుగానీ, వాళ్ళంతా ఇలా ఈ టూరింగ్ లైఫ్ పద్దతి ప్రాక్టీస్ చేస్తున్నారని తనకప్పుడు తెలీలేదు.
    "అంటే పై రెండు పద్దతుల్లో నీకేది నచ్చినట్లు?" అడిగాడు చిరంజీవి.
    "ఏదీ లేదు"
    చిరంజీవి ఆశ్చర్యపోయాడు.
    "మరి?"
    "మరేం లేదు. ముందు నేనీ పెళ్లి తప్పించుకోవాలి! ఎలాగో చెప్పు?"
    చిరంజీవికి చిరాకు పుట్టుకొచ్చింది.
    "ఇందాక చెప్పాను కదా"
    "ఏమిటది?"
    "మీ మావయ్యా మొఖం చట్నీ చేసెయ్ మని"
    "ఊహూ; అది కుదరదురా"
    "ఎందుకని"
    "అలా చేస్తే మావయ్యక్కోపం వస్తుందేమో"
    "వస్తే రానీ"
    "వ్వాట్?"
    "అవునోయ్! వస్తే రానీ - భయమేమిటి?"
    "పిచ్చివాడా! నేనేలాంటి తలతిక్క పనిచేసినా నా ఆస్తి నాకు అప్పజెప్పడం జరగని పని అని గత రెండేళ్ళుగా వార్నింగులిస్తున్నాడు"
    "ఏడ్చాడు"
    "వాట్.. ఏమిటన్నావ్?"
    "ఏడ్చాడన్నాను"
    "ఎందుకు?"
    "లేపోతే ఏమిట్రా? ఆస్తి అప్పజెప్పక పోవడం మీ మామ మావ వల్ల కూడా కాదు. ట్రస్టీ అంటే గడువు తీరగానే ఆ ఆస్తి నీకప్పగించి తీరాల్సిందే! ఇది రూలు. ఇవ్వనంటే మరుక్షణం జైల్లో వుంటాడు. నేను కొన్నాళ్ళు లాయర్ ఇంటి పక్కనున్నానుగా! అందుకని 'లా' అంతా మనకు కొట్టినపిండే"
    "నిజంగానా?" ఆశ్చర్యంగా అడిగాడు సింహాద్రి.
    "నగ్న సత్యం"
    "ఎంత ఘోరం జరిగిపోయింది? ఈ విషయం తెలీక నేను మావయ్య ఆడించినట్టల్లా ఆడుతున్నాను"
    "అయితే ఇకనుంచీ ఆ ఉచిత నాట్య ప్రదర్శనలు ఆపేసేయ్"
    "ఓకే! ఎగ్రీడ్"
    "అసలు మీ మావయ్యకు ఆ పిల్లనే నీకిచ్చి చేయాలని ఏమిటంత అనురాగం"
    "అదో పెద్ద కథ అని ఆరోజు నీతో అన్నాను గుర్తులేదూ?"
    "ఏమిటా కథ?"
    "మావయ్య ఫ్రెండ్ భావయ్య దగ్గర చచ్చేంత డబ్బు ఉంది. మామయ్యకు అలా బోలెడు డబ్బు ఒకేచోట పోగడిపోవడం నచ్చలేదు. అంచేత అతనిని యాభయివేల రూపాయలయినా, పధ్నాలుగు లక్షల రూపాయలయినా అప్పు ఇమ్మన్నాడు. ఛాయిస్ ఆ రెండింటిమధ్యే ఉండడం వల్ల భావయ్య యాభై వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయితే ఓ కండిషన్ పెట్టాడు"
    "ఏమిటది?"
    "భావయ్య కూతురికి నాననిచ్చి పెళ్లి చేయడానికి మావయ్య వప్పుకోవాలి. అలా చేస్తే ఆ యాభయివేలూ ఫ్రీగా తీసుకోవచ్చు. తిరిగి ఇవ్వనక్కర్లేదు."
    "న్యాయంగా చూస్తే నీ విలువ పాతిక రూపాయల కంటే ఎక్కువ వుండదు కదా! మరలా ఎందుకు కండిషన్ పెట్టినట్లు?"
    "నా విలువ యాభయి వేలుండని మాట నిజమేగానీ ఆ పిల్లను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్న వాడెవడికయినా సరే లక్షరూపాయలు వరకూ ఖర్చు చేయడానికి సిద్దపడ్డాడు భావయ్య."
    "ఎందుకని?"
    "ఈ ఫోటో చూస్తే అర్ధం కాలేదూ? ఆఫ్ కోర్స్ అదింకా ఆడపిల్లే అని వారు వాదించేట్లయితే"
    "ఓకే- ఓకే నెక్స్ట్?"
    "అసలు ఇదంతా కాక ఒరిజినల్ వ్యవహారం ఒకటుంది"
    "ఏమిటది?"
    "నేను కొన్ని యుగాలుగా శ్రీదేవి అనే దేవతని ఆరాధిస్తున్నాను"
    "కొన్ని యుగాలుగానా?"
    "అంటే నిజంగా కాదనుకో చాలాకాలం నుంచీ. అంటే మరీ ఎక్కువ కాదు- రెండు రోజులనుంచీ అన్నమాట"
    "ఎవరా శ్రీదేవి?"
    "తెలీదు"
    "ఎంతకాలం నుంచీ స్నేహం?"
    "అస్సలింతవరకూ ఆ అమ్మాయిని చూళ్ళేదు"
    "ఆ అమ్మాయి నిన్ను చూసిందా?"
    "అసలు నాలాంటి హాండ్ సమ్ ఫెలో ఒకడున్నాడనే ఆ పిల్లకు తెలీదు"
    చిరంజీవి చిరాకు పుట్టుకొచ్చింది.
    "ఇలా ఊరూ వేరూ అడ్రసూ లేని ఆడపిల్లలను ప్రేమించడం కొత్త హాబీయా?"
    "ఆ అమ్మాయికి అడ్రసుంది"
    "ఏమిటది?"
    "బాంబ్ నిలయం- విశాఖపట్నం"
    "బాంబ్ నిలయమా?"
    "అవును"
    "అంటే బాంబ్ లూ గట్రాతో నిండివుండే ప్రదేశమా?"
    "అదింకా తెలీదురా! కనీసం ఓ బాంబయినా వుండి వుంటుందని అనుమానం"
    "మరలాంటి బాంబుల మధ్య జీవితం గడిపే పిల్లను ప్రేమిస్తే ప్రమాదం కదా"
    "అదే కొంచెం ఇదిగా వుందిరా"
    "ఇంతకూ ఆ పిల్లను నువ్వెక్కడ చూశావ్?"
    "అదో పెద్ద కథరా"

 Previous Page Next Page