Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 12


    ఆ గదిలో యింకోమనిషి వున్న ధ్యాసే లేనట్లు అయిదు నిముషాల్లో గాఢ నిద్రలో మునిగిపోయాడు.
    మామూలుగా తెల్లవారు ఝామున నాలుగింటికల్లా మెలకువ వొచ్చింది. లైటువేస్తే ఆమెకు నిద్రా భంగం కలుగుతుందని టేబిల్ లైట్ వేసుకున్నాడు. ఇద్దరికీ మధ్య కర్టెన్ లా కట్టిన దుప్పటి ఎప్పుడు వూడిపోయిందోగాని నేల మీద పడిపోయింది.
    అప్రయత్నంగా ఆమెవైపు చూశాడు. ఇక్కడికి వచ్చినప్పటిలా ఫ్రాక్ లో కుండా పరికిణీ, వోణీ వేసుకుని వుంది. వోణీ జారిపోయి వుంది. పరికిణీ, గౌను, అడవిలో చిలిపిగా, అమాయకంగా అప్పుడే వికసిస్తున్న వొంటరి పువ్వులా లేతగా బేలగా వుంది. పిడికెట్లో ఇమిడిపోయే సౌందర్యంలా గుప్పెడు అందంలా, యిష్టంలేకుండా అరవిచ్చిన యవ్వన రేఖలా మిలమిల లాడుతోంది.
    క్షణంసేపు ఆమెకు నిద్రాభంగం కలుగుతుందేమో అనుకున్నాడు.
    కాని ఆ సమయంలో తబలామీద సాధనచెయ్యందే అతనికి తోచదు. అందుకని గోడకు పెట్టివున్న తబలాలు తీసి ముందేసుకుని మృదువుగా వాటి మీద చేతులు కదలించాడు.
    ధాధిన్ ధిన్ ధా; ధాధి ధిన్ ధా
    తాతిన్ తిన్ తా; తాధిన్ ధిన్ ధా
    శబ్ద తరంగాలు ఎవరో క్రమ్ముకొస్తూన్నట్లు అలలు అలలుగా, అంచెలంచెలుగా వ్యాపిస్తున్నాయి.
    అతన్లో ఓ కళాకారుడిగా ఏదో ఆరాటం.
    ఒక విధంగా చెప్పాలంటే రెస్ట్ లెస్ నెస్.
    పొందవలసింది అందకుండా జారిపోతున్నట్లు, కనబడ వలసింది కనిపించకుండా దోబూచులాడుతున్నట్లు, ఎవ్వరో జాలిగా నిట్టూరుస్తున్నట్లు, ఎక్కడో వొంటరిగా ఓ పావురం గుసగుసలాడినట్లు, నిశీధంలో జుట్టు విరబోసుకుని ఓ విరహిణి నర్తించినట్లు.....
    ధాధిన్ ధిన్ థా-ధాధిన్ ధిన్ ధా
    తాతిన్ తిన్ థా-తాధిన్ ధిన్ ధా
    మనోక్షేత్రంలొ ఎవరిదో రూపం, ప్రపంచంలోని అందాన్నంతా పుణికి పుచ్చుకుని, వివిధ సౌందర్యాలుగా కవ్వించే సోయగాలుగా కలబోసి, కదిలే వింత విన్యాసాలుగా సృష్టిని ఆక్రమించి.....చిలిపి కన్నీరుగా, విషాద మైన చిరునవ్వులా, అల్లరి వేదనం తాలయమేళవించి....
    అనంత ధ్వనులతో....లయరూపాలుగా కరిగి
    మధురశృతిగా మిగిలి.....
    ఆతాదాత్మ్యలోకి వెడితే అతనికివొళ్ళు తెలీదు. ఏదో ఆవహించినట్లు, ఎక్కడికో తేలిపోతున్నట్లు, ఆ అనుభూతుల్లో లీనమై పోతాడు.
    ప్రియంవద ఆ తరంగనాదాలకు ఎప్పుడో నిద్రలేచిందనీ, సర్వం మరిచి అతనివంక కళ్ళార్పకుండా చూస్తోందనీ అతనికి తెలీదు.
    
                             *    *    *
    
    మహేష్ కాలేజీకి వెళ్ళిపోయాక ప్రియంవద స్నానం చేసి గదిలో ఏమీతోచక బయటకు వొచ్చి నిలబడింది. ఆమె తనతోబాటు రెండుమూడు జతలకన్నా ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు. ఈపూట అతన్నడిగి యిస్త్రీకి వెయ్యాలనుకుంది. తనతో బాటు తెచ్చుకున్న పంజాబీ డ్రెస్ వేసుకుంది.
    ఆ యింటికి కొంచెం దూరంగా వున్న మేడలోంచి ఓ కారు బయటకు వొచ్చింది. అక్కడ్నుంచి మెల్లగా దాటి ప్రియంవద నిలబడ్డ చోటుకు వచ్చి ఆగింది.
    "మహేష్ వెళ్ళిపోయాడా?" అనడిగింది. డ్రైవింగ్ సీట్లో వున్న సునంద.
    "వెళ్ళిపోయారండీ".
    "అయ్యో" అనుకుంది సునంద. డ్రెస్ చేసుకునేసరికి ఆలస్యమై పోయింది" అన్నది నొచ్చుకుంటున్నట్లుగా.
    "అంతేనండీ ఆడపిల్లలు డ్రెస్ చేసుకునేసరికి కొన్ని ముఖ్యమైన పనులు మిస్ అయిపోతుంటాయి".
    సునంద ఆ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూసింది. "నీపేరు ప్రియంవద కదూ" అంది.
    "అవునండీ బహుశా మా బావ చెప్పివుంటాడు మీకు?"
    సునంద కారు దిగి ఆ అమ్మాయి దగ్గర కొచ్చింది. "ఒక్కదానివే వొచ్చవే- పెద్ద వాళ్ళెవరూ లేకుండా" అంది.
    "మా బావ చెప్పలేదా అండీ".
    "లేదే".
    "నేనూ-ఓ అమ్మాయిని ప్రేమించానండీ. మా యింట్లోవాళ్ళు యిష్టపడకపోతే పారిపోయి వొచ్చేశానండీ"
    "బంగారంలాంటిబావను పెట్టుకుని ఇంకో అబ్బాయిని ప్రేమించిందా? ఆ అబ్బాయి యింతకంటే బంగారంలా వుంటాడేమో" అనుకుంది సునంద.
    "లోపలకు రండి. నిల్చుని మాట్లాడుతున్నారేం?"
    దాదాపు కొన్ని నెలలుగా మహేష్ పరిచయమైనా-ఆ గదిలోకెప్పుడూ అడుగు పెట్టలేదు సునంద.
    "కూర్చోండి" అన్నది ప్రియంవద.
    ఎక్కడకూర్చోనూ?....అన్నట్లు చూస్తోంది సునంద.
    "ఆ కుర్చీలో కూచోండి".
    "కుర్చీ కాళ్ళు కదిలి వుంటుందా, వూడుతుందా అన్నట్లు వుంది. సునంద ఓ సారి కదిపిచూసి తృప్తిపడి దానిలో కూర్చుంది. ప్రియంవద మంచంమీద కూర్చుంది.
    "నువ్విక్కడ వున్నావని మీ యింట్లో తెలుసా?"
    "తెలీదండీ అమ్మో! తెలిస్తే నన్ను లాక్కెళ్ళిపోరూ?"
    "అవునూ, నువ్వు యిక్కడికే రావటానికి కారణమేమిటి?"
    "మా బావకు నేనంటే యిష్టమండీ. అందుకని నా మొర ఆలకించి, అరుస్తాడనీ".
    "మీ బావకు నువ్వంటే ఇష్టమా? ఎలాంటి యిష్టం"
    "అది నాకు చెప్పటం తెలీదండి. కాని చాలా యిష్టం".
    "అదిసరే. గది ఒక్కటే వున్నట్లుంది. పాపం యిక్కడ నీకు చాలా యిబ్బందిగా వుండి వుంటుంది".
    "ఇబ్బందేం లేదండి. సుఖంగానే వుంది".
    "సుఖంగానే వుందా? అంటే ఎలాంటి సుఖం?"
    "ఎలాంటి సుఖమంటే.....అది నేనుసరిగ్గా చెప్పలేనుగానీ, యిబ్బందేమీ లేకుండా బాగానే వుందండీ".
    "నువ్వు స్నానం......అదీ...."
    "బాత్ రూం వుంది కదండీ".
    "బట్టలూ అవీ కట్టుకోవటం".
    "ఇక్కడేనండి. ఇంకెక్కడ కట్టుకుంటానండి".
    "మరి మీ బావ గదిలో ఉంటాడు కదా"!
    "ఉంటే ఏవండి? పుస్తకాల్లో మునిగిపోయి వుంటాడండి తల ఎత్తి చూడండి".
    "ఒకవేళ మధ్యలో తలెత్తిచూస్తే"

 Previous Page Next Page