"1888 నుంచి 1912 దాకా సుమారు పది కిలోమీటర్ల దూరం ఓడలని ఎస్కార్ట్ చేస్తూ సముద్రంలో నుంచి సన్నని చానల్ ద్వారా పోర్టుకి తీసుకువచ్చే యీ డాల్ఫిన్ న్యూజిలాండ్ ప్రాంతంలోనిది."
"వండర్ ఫుల్....మిస్టర్ రాజేంద్ర 1970 లో ఓ పత్రికా సంపాదకుడు ఓ రచయితకి ఆవు శరీరంపై చెక్ రాస్తే దాన్ని ఆనర్ చేసింది ఓ బేంక్....ఇది జరిగింది ఏ దేశంలో....ఆ రచయిత ఎవరు?"
రాజేంద్రలో చలనం లేదు.
కణతలు నొక్కుకుంటూ ఆలోచించాడు...
బజర్ మోగింది ముఫ్ఫై సెకండ్లు పూర్తయినట్టుగా.
"మిస్టర్ విశ్వనాథ్ ఇట్స్ యువర్ టర్న్ నౌ..."
"బ్రిటిష్ హ్యూమర్ మేగజిన్ 'పంచ్'కి చెందిన ఎడిటర్ రాసిన ఆ చెక్కు రచయిత ఏ పి హెర్బర్ట్ కి చెందినది."
ఆడిటోరియం లో రెస్పాన్స్ లేకపోయినా అభినంధనగా విస్సుని చూసాడు సత్యేంద్రబసు "ఇట్స్ మార్వలెస్ మిస్టర్ విశ్వనాథ్....నౌ ది క్వశ్చన్ గోస్ టు రాజేంద్ర అగైన్...మిస్టర్ రాజేంద్ర మలేరియా అనే పదం ఏ భాష నుంచి వచ్చింది."
"ఇటాలియన్ MALARIA మనం తరచూ వాడే పదం మలేరియాకి మూలం....అంటే చెడుగాలి అని అర్ధం..."
"నైస్ నౌ మిస్టర్ విశ్వనాథ్ ప్రముఖ హాలీవుడ్ నటుడు డస్టిస్ హాఫ్ మేన్ నటుడిగా ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రం పేరు రైస్ మేన్ అందులో అతడు పేషెంట్ గా నటించాడు... ఆ జబ్బు పేరేమిటి"
నిశ్శబ్దం...
జవాబు తెలీక కాదు...జవసత్వాలుడిగి పోయినట్టు శరీరం పట్టు తప్పుతోంది... బడలికగా కుర్చీ హేండిల్ పై వాలిపోతుంటే ఉద్విగ్నంగా అతడ్ని సమీపించాడు సత్యేంద్రబసు "మిస్టర్ విశ్వనాథ్..."
కనురెప్పల్ని బరువుగా పైకి లేపుతూ అన్నాడు విస్సు "SAVANT SYNDROME"
"యు ఆర్ రైట్....ఆర్యూ ఓకే" నెమ్మదిగా అడిగాడు అనుమానంగా చూస్తూ.
"ప్లీజ్ గో ఎహెడ్" శక్తిని కూడగట్టుకుంటూ అన్న విస్సుని చూసి అంతసేపు పట్టించుకోని కృషి అనుమానంగా డయాస్ వేపు నడిచింది.
ఒకవేళ కృషి మరింత లోతుగా జరిగిందేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి వుంటే శాల్ కి దిగ్గునగా నేలపై ధారకడుతున్న రక్తాన్ని గమనించేది.
"మిస్టర్ రాజేంద్ర సవంత్ సిండ్రోమ్ లక్షణాలు చెప్పండి."
ఏ క్షణంలో అయినా నేల కూలేట్టున్న విస్సుని గమనిస్తూ ఉత్సాహంగా చెప్పుకుపోయాడు రాజేంద్ర. "సవంత్ అంటే తెలివైనవాడూ అని అర్ధం. అరుదైన ఈ జబ్బులోని ప్రత్యేకత ఈఈ జబ్బుగల మనిషి నలభై వేల సంవత్సరాల క్రితం ఓ తేదీని బట్టి క్షణాల్లో అది ఆదివారమో సోమవారమో చెప్పగలడు. కాని రెండూ ప్లస్ రెండూ ఎంతో చెప్పలేడు"
"యూ ఆల్ రైట్ ను మిస్టర్ విశ్వనాథ్. క్రీస్తుశకం 1773 నుంచి 1873 దాకా అమెరికాలోని డాక్టర్లు రక్తానికి బదులు రోగులకి ఎక్కించిన ద్రవం ఏది?"
"పాలు"
"ఫైన్ నౌ మిస్టర్ రాజేంద్ర....ముఖ్యంగా మంచినీళ్ళ చెరువుల్నుంచి పట్టిన పచ్చి చేపల్ని లేక సరిగా ఉడకబెట్టని చేపల్ని తింటే జరిగే అనర్ధం ఏమిటి"
"జీర్ణం కాదు" టక్కున అన్నాడు రాజేంద్ర.
"సైంటిఫిక్ గా జవాబు కావాలి"
తెల్లమొహం వేసుకు చూస్తూ ఉండిపోయాడు రాజేంద్ర.
"అలాంటి చేపల్ని తిన్న వ్యక్తి కడుపులో టేప్ నార్మ్స్ చేపల ద్వారా ప్రవేశించి సుమారు పదమూడు సంవత్సరాలపాటు స్థావరం ఏర్పరచుకొని పది అడుగుల పొడవుదాకా పెరుగుతాయి. ఆ వ్యక్తిని రక్తలేమికి గురిచేస్తాయి" చెప్పాడు విస్సు మగతగా.
"ఇంకా ముఫ్ఫై సెకండ్లు పూర్తికాలేదు" జోక్యం చేసుకున్నాడు రాజేంద్ర." కాబట్టి చెప్పింది చెల్లదు."
రాజేంద్రకి వత్తాసుగా అతడి బలగానికి చెందిన విద్యార్ధులంతా ఆడిటోరియంలో కేకలు పెట్టడం ప్రారంభించారు. "యస్....ఇది చెల్లదు."
ఏ స్థితిలో విస్సూ ఈ నియమాన్ని ఉల్లంఘించిందీ తెలీని సత్యేంద్ర క్షణం అతడ్ని చూసి అన్నాడు. "యస్ ఇప్పటి పది మార్కులు క్విజ్ మాస్టర్ కి చెందుతాయి."
"ఓకే" అన్నాడు విస్సు నిస్త్రాణంగా చేతిని పైకెత్తి.
"సో మిమ్మల్నే మరో ప్రశ్న అడుగుతున్నాను. మనిషిలో మరుపుకి కారణమైన ఆల్జిమీర్స్ డిసీజ్ ని మొదట గుర్తించిన వ్యక్తి ఎవరు?"
"అలోయిస్ ఆల్జిమీర్ అనే జర్మన్ నెర్వ్ ఎక్స్ పర్ట్ 1907లో ఇది గుర్తించారు."
"రైట్ నౌ మిస్టర్ రాజేంద్ర. ప్రపంచంలో అత్యధిక సర్క్యులేషన్ గల దిన పత్రిక ఏది."
"అమెరికాకి చెందిన న్యూయార్క్ టైమ్స్."
"రాంగ్" టక్కున ఖండించిన సత్యేంద్ర ఈ సారి ముఫ్ఫై సెకండ్లు పూర్తయ్యేదాకా ఆగి బజర్ మోగగానే విశ్వనాథ్ ని చూస్తూ అన్నాడు "నౌ ఇట్స్ యువర్ టర్న్ మిస్టర్ విశ్వనాథ్."
"జపాన్ కి చెందిన దినపత్రిక యూమూరీ సింబన్ 1874లో ప్రారంభమైన ఈ పత్రిక సర్క్యులేషన్ పధ్నాలుగున్నర మిలియన్ లు అంటే ముప్పై ఎనిమిది శాతం ప్రజలు దీన్ని రోజూ చదువుతుంటారు."
"రైట్" రాజేంద్ర మొహంలో పెరుగుతున్న టెన్షన్ని చూస్తూ అడిగాడు సత్యేంద్ర. "మిస్టర్ రాజేంద్ర గజెట్ అనే పదానికి మూలం ఏది?"
"GAZETTE అనే పదానికి మూలం ఇటాలియన్ GAZETTA"
"మిస్టర్ విశ్వనాథ్. 'గజెట్టా' అనే పదానికి ఓ మూలం వుంది అదేమిటి?"
"1563లో ఇటలీకి చెందిన వెనిస్ నగరంలో ప్రజలు బహిరంగంగా చదివే వార్తలకి ఓ కాపర్ నాణేన్ని చెల్లించేవారు. ఆ నాణెం పేరు గజెట్టా"
"వండర్ ఫుల్ నౌ మిస్టర్ రాజేంద్ర. ఓ ప్రపంచ ప్రముఖ శాస్త్రజ్ఞుడు ప్రారంభించైనా దినపత్రిక పేరు గ్రాండ్ ట్రంక్ హెరాల్డు. ఎవరా శాస్త్రజ్ఞుడు. ఆ పత్రిక ప్రత్యేకతేమిటి."
రాజేంద్ర మొహం వివర్ణమైపోయింది.
ఈ ప్రశ్నకి జవాబు తెలియకపోవడంతో ఉక్రోషంగా దిగువనున్న రంగధాం కేసి చూశాడు. తప్పదు. తను ఓడిపోతున్నాడు. తప్పదు తన తండ్రి పరపతి సైతం మట్టికొట్టుకుపోతుంది.
బజర్ మోగిన చప్పుడు వినిపించింది.
ఆ క్షణాన రంగధాం లేచి బయటికి వెళ్ళటాన్ని రాజేంద్ర తప్ప అక్కడెవరూ గమనించలేదు.
"మిస్టర్ విశ్వనాథ్ జవాబు చెప్పాల్సింది ఇక మీరే"
"గ్రాండ్ ట్రంక్ హెరాల్డుని ప్రారంభించింది ప్రముఖ శాస్త్రజ్ఞుడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈ దిన పత్రిక ప్రత్యేకత ఇది ప్రతిరోజూ నడుస్తున్న ట్రైన్ లో ప్రింటయ్యేది."
"మార్వలెస్ నౌ మిస్టర్ రాజేంద్ర. ప్రపంచంలో యింతవరకూ జరిగిన అంత్యక్రియల్లో అతి ఖరీదైనదిగా చెప్పుకునేదెవరిది"
"1989వ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున చనిపోయిన జపాన్ చక్రవర్తి హీరో హిటో అంత్యక్రియలకి ఖర్చుచేసింది సుమారు ఎనభై మిలియను డాలర్లు. ప్రపంచంలో యింతవరకూ అత్యధిక మొత్తం ఖర్చు చేయబడిన అంత్యక్రియ ఇదే."
"రైట్, నౌ మిస్టర్ విశ్వనాథ్. క్రీస్తు శకం 1772 వ సంవత్సరానికి చెందిన ఓ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని ఓ ప్రాంతానికి చెందిన స్త్రీలు ప్రసవిస్తుండగా నొప్పులు మగవాళ్ళకి వచ్చేవి. అలా రావడానికి కారణం మంత్రసాని తన శక్తితో ఆ నొప్పిని భర్తకి ట్రాన్స్ ఫర్ చేయడమే ఇది సైన్సుకి అందని ఓ మిస్టరీ అయినా అసలు ఆ ప్రాంతం ఏది."
"స్కాట్ లాండ్స్ కి చెందిన డంప్రైస్."
"రైట్ మరో మూఢనమ్మకానికి చెందిన ప్రశ్న మిస్టర్ రాజేంద్ర. ప్రాచీన కాలం నుంచీ ఓ దేశంలో వున్న నమ్మకం ఏ బిడ్డయినా పుట్టేటప్పుడు గోడ గడియారం మూడు, ఆరు, తొమ్మిది లేక పన్నెండు గంటలు కొడితే ఆ బిడ్డకి దెయ్యాల్ని చూసే శక్తి వస్తుందట. అది ఏ దేశం?"
"బ్రిటన్"
"రైట్ నౌ మిస్టర్ విశ్వనాథ్. దృష్టిదోషం నుంచి తప్పించుకోటానికి పెళ్ళితంతు పూర్తి అయ్యేంత దాకా వధువు కళ్ళు మూసుకునే వుంటుంది. ఈ ఆచారం ఏదేశానికి చెందింది."
"మొరాకో"
"రైట్ మిస్టర్ రాజేంద్ర ప్రపంచంలో మంత్రి పదవినలంకరించిన తొలి మహిళ"
"సియావో బండారు నాయకే"
"రాంగ్"
రాజేంద్ర మొహం పాలిపోయింది.
బజర్ చప్పుడు వింటూ విశ్వనాథ్ ని అడిగాడు సత్యేంద్ర "ఇట్స్ యు టు ఆన్సర్ మిస్టర్ విశ్వనాథ్"
"పార్దన్మీ"
"మీరు జవాబు చెప్పాలి.
మొహంపై అలుముకుంటున్న ప్రేతకళ అతడి ఆలోచనాశక్తిని హరించివేస్తుంటే "ఏం జరిగింది మీకు" అన్నాడు సత్యేంద్ర ఆందోళనగా "ప్రపంచ రాజకీయాలలో మంత్రి పదవిని అలంకరించిన తొలి మహిళ ఎవరు?"
"1917లో..." పదాల్ని కూడబలుకుతున్నాడు విస్సు. అదికాదు. తెలిసింది కూడా సరిగా జ్ఞప్తికి రావడం లేదు. "లెనిన్ బోల్షివిక్ గవర్నమెంట్ లో..."
"కేరీ ఆన్" ఉత్సాహ పరిచాడు సత్యేంద్ర "కమాన్ మీరు కరెక్టుగానే ఆలోచిస్తున్నారు"
"ఇది అన్యాయం" అరిచాడు రాజేంద్ర ఆవేశంగా లేచి... "చెప్పలేని వాడిచేత క్లూ యిచ్చి మరీ చెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు క్విజ్ మాస్టర్"
"ప్లీజ్ బీ సీటెడ్" ఆదేశంలా అన్నాడు సత్యేంద్ర రాజేంద్రని చూస్తూ "ఈ పోటీలో క్విజ్ మాస్టర్ న్యాయ నిర్ణేత నన్ను నిలదీయడం నియమాల్ని ఉల్లంఘించటం అవుతుంది"
రాజేంద్ర అవాక్కయిపోవడంతో అతడికి వత్తాసుగా చప్పట్లు కొట్టాలనుకున్న విద్యార్ధులూ నిశ్శబ్దంగా వుండిపోయారు.
ఈ చర్చలకీ చప్పట్లకీ అతీతంగా ఓ భ్రాంతి లాంటి స్థాయికి ఎప్పుడో చేరిపోయిన విస్సు కూడ బలుక్కుంతూ అన్నాడు "లెనిన్ గవర్నమెంట్ లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేసిన అలెగ్జాండ్రా కొలంతాయ్ తొలి మహిళ."
"యూ ఆర్ వెరి కరెక్ట్ మిస్టర్ విశ్వనాథ్....ఇట్స్ యువర్ టర్న్ మిస్టర్ రాజేంద్ర - ప్రపంచంలో అరవై శాతం లాయర్లు వున్న దేశం ఏది."
"ఇండియా..."
"రాంగ్...."
"చైనా"
"రాంగ్"
"బ్రిటన్"
బజర్ మోగడంతో విశ్వనాథ్ ని అడిగాడు సత్యేంద్ర. ఈసారి గొడవకి అవకాశం లేకుండా ప్రశ్నని రిపీట్ చేశాడు. "మిస్టర్ విశ్వనాథ్ ప్రపంచంలోని అరవై శాతం లాయర్లున్న దేశం..."
"అమెరికా"
"కరెక్ట్-" క్షణం రాజేంద్రకేసి చూసి అడిగాడు "ప్రపంచంలో తొలి స్టంట్ మేన్ ఎవరు"
"పాస్" ఉక్రోషంగా అరిచాడు రాజేంద్ర...
బజర్ మోగగానే చెప్పాడు విశ్వనాథ్ "1808 లో ది గ్రేట్ ట్రెయిన్ రోబరీలో నటించిన ఫ్రేంక్ హానేల్"