"గుడ్ మార్నింగ్ అంకుల్" అంది తులసి చిరునవ్వుతో.
తులసి వరస చూసేసరికి స్మితారాణికి కోపం ముంచుకొచ్చేసింది.
"ఏయ్! పద లోపలకు. " అంటూ ఆమెను వెనక్కు లాగి తలుపులు వేయబోయింది. భవానీశంకర్ అందుకు అవకాశం ఇవ్వకుండా గడపలో కుర్చుండిపోయాడు తులసి ముందు.
"హాయి హాయి హాయి మైడియర్ లిటిల్ బ్యూటీ ఫుల్ స్టూడెంట్ హౌ ఆర్ యూ?"
"ఫైన్ అంకుల్"
"నేను చెప్పిన ఇంగ్లీషు పొయిట్రీ వచ్చేసిందా డియర్?"
"ఓ! అప్పజెప్పనాంకుల్!"
"వెల్ కం డియర్!"
తులసి అప్పజేప్పటానికి నోరు తెరిచేంతలో రాణి టక్కున ఆమె నోటికి తన చేయి అడ్డం పెట్టి నోరు మూసేసింది. అతనే తులసికి ట్యూషన్ చెప్పుతోన్న వ్యక్తీ అని తెలిసేసరికి ఆమె కోపం మరింత పెరిగిపోయింది.
"ఇప్పుడేమీ అక్కరలేదు......." అంది కోపం అణుచుకుంటూ."
తులసికి ఆమె కోపం అర్ధం కాక సైలెంటయిపోయింది.
"సో - మా తులసి టీచర్ మీరేనన్నమాట" అంది తల పంకిస్తూ.
"సెంట్ పర్సెంట్ కరెక్టు! అందుకే తులసి ఈసారి టరమ్ ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్టు వచ్చింది."
గర్వంగా చెప్పాడు భవానీ శంకర్.
"కాని మీరు ట్యూషన్ యివ్వకుండా ఉన్నట్లయితే స్కూలు ఫస్టు వచ్చేది" హేళనగా అంది.
"ఆఫ్ కోర్స్! స్కూల్ ఫస్టు వచ్చేదేమో గాని - అది వితవుట్ జనరల్ నాలెడ్జి కామ్రేడ్! కేవలం స్కూలు పుస్తకాలే చదువుతూ, స్కూల్ ఫస్టుగా వస్తూ జనరల్ నాలడ్జిలేకపోవటం వాళ్ళ మీరెంత యిబ్బంది పడుతున్నారు చూడండి పాపం! నాలాంటి గ్రేట్ టాలెంటెడ్ ఫెలో తో ఫ్రెండ్ షిప్ చేసుకోవాలని మనసులో వున్నా, ఈ అద్బుతఅవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు."
"మీకంటే ఎక్కువ జనరల్ నాలెడ్జి ఉంది మాకు" రోషంగా అందామె!
"నో నో! అయ్ కాంట్ బిలీవ్ డియర్! ఎనీవే ఓ చిన్న జనరల్ నాలెడ్జి టెస్టు పెడతాను. మా స్టూడెంట్ గెలుస్తుందో , మీరు గెలుస్తారో చూద్దాం."
"ఏం అక్కర్లేదు" - అంటూ తులసి చేయి పట్టుకుని లోపలకు లాక్కెళ్ళబోయింది.
భవనీశంకర్ చటుక్కున తులసి రెండో చెయ్యి పట్టుకుని " ఆపేశాడు.
"కమాన్ మైడియర్ స్టూడెంట్. జనరల్ నాలెడ్జి కాంపీటీషన్లో కొశ్చన్ నంబర్ వన్"
తులసి ఉత్సాహంగా ముందుకొచ్చింది స్మిత చేయి విసురుగా పదిలించుకుని.
"అడుగంకుల్"
"పాత దేవదాసు సినిమాలోని ఘంటశాల పాట ఒకటి ఈ మధ్య మరో తెలుగు సినిమాలో కాపీ కొట్టారు. ఆ పాటేమిటో ఆ సినిమా పేరేమిటో చెప్పుకో చూద్దాం!"
"ఓ! అదా! వెరీ ఈజీ అంకుల్! 'సంసారం ఓ చదరంగం ' స్నిమా అంకుల్ అది! పాటేమో "జగమే మాయ, బ్రతుకే మాయ!" గొల్లపూడి జానకి కాంబినేషన్ తో పాడించారు" టకటక చెప్పేసిందామె.
భవానీ శంకర్ అనందం పట్టలేక చప్పట్లు కొట్టాడు.
"ఒండర్ ఫుల్ మైడియర్ చైల్డు! ఇప్పుడు సెకెండ్ రౌండ్ ప్రశ్న కుమారి స్మితారాణి చెప్తారు."
"నేను చెప్ప........."
"దంపతులం - అది దంపతులం" అనే పాత ఆదిదంపతులు సినిమాలో నాగేశ్వరరావ్, జయసుధలు పాడారు కదా! అదే పాట నూతన్ ప్రసాద్, విజయల మీద ఈ మధ్య మరో చిత్రంలో పారడీ పాడించారు - ఏ సినిమా అది?"
"ఇలాంటి చెత్త ప్రశ్నలకు జవాబుచెప్పాల్సిన అవసరం నాకు లేదు" ఉడికిపోతూ అంది స్మితా రాణి.
"అంటే ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలీదన్నమాట! కమాన్ మైడియర్ స్టూడెంట్ నువ్ చెప్పగలవా?"
"ఓ వెరీ ఈజీ అంకుల్! పున్నమి చంద్రుడు సినిమా."
"టెరిఫిక్ నాలెడ్జి మైడియర్ లిటిల్ గాళ్" అంటూ తులసిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడతను.
స్మితకు కోపం అగలేదింక!
"వెధవ తెలుగు సినిమాల గురించి తెలియడం జనరల్ నాలేడ్జా- పిల్లలను సర్వనాశనం చేస్తారు మీలాంటి వాళ్ళు టీచర్లయితే"
"అలా అనకండి మేడమ్! నేటి తెలుగు సినిమాలే రేపటి రాజకీయాలు, నేటి సినిమా హీరోలే రేపటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు , నేటి ........"
"తులసీ - నువ్ లోపలకు పద" అతని మాటలు కట్ చేస్తూ అంది స్మితారాణి.
తులసి అంటీ కోపం చూసి భవానీ శంకర్ చంకదిగి లోపలకు నడిచింది.
స్మిత ఆమెతోపాటు లోపలకు నడిచి తలుపు మూసేయబోయింది. భవానీ శంకర్ చప్పున ఆమెకు అడ్డుపడ్డాడు.
"ఒక్క విషయం స్మితాజీ, మీతో కొంచెం మాట్లాడాలి!"
"నాకేం మాట్లాడాల్సిన అవసరం లేదు"
"నేను మాట్లాడాల్సింది మీ గురించే మిస్"
"ఏమిటది?"
"మీ మీద హత్యాప్రయత్నం జరగబోతోందని నాకు అనుమానంగా వుంది."