Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 13

"రాగా! కొంచెం రోజులు నాతో మా బడికి రామ్మా! ప్లీజ్"
"రానంటే రాను. నా లేస్సన్సు పోతాయి. స్కూలు డే వస్తోంది. డాన్సు డ్రామాలో నేనున్నాను రిహార్సల్స్ చేయిస్తున్నారు మా మిసెస్. ఇప్పుడు నేను మానేస్తే నా ప్లేస్ లో మరొకళ్ళని తీసేసుకుంటారు. "ఏడుపు గొంతుతో మొండిగా అంది రాగమాల. ఆ పాప స్కూలు మాననని మారాం చెయ్యడంలో అణువేదకి తెలియని రహస్యమొకటుంది. పంతాలతో అణువేదకి దూరమైనా రాగమాలకి దూరం కాలేని జీవన్ నెలకొకసారైనా కాన్వెంట్ కి వచ్చి రాగని తనతో బయటకి తీసుకెళ్ళి ఐస్ క్రీం వగైరాలు యిప్పించి కొంతసేపు ఆమెతో గడిపి హైదరాబాద్ వచ్చేస్తుంటాడు ఇది ఆ తండ్రి కూతుళ్ళ మధ్య రహస్యం.
ఏడేళ్ళ నిండిన రాగకి లోకం పూర్తిగా తెలియక పోయినా అమ్మా నాన్నా దేబ్బలాడుకుని విడివిడిగా వున్నారని యిదరికి తనంటే ఇష్టమేనని తెలుసు ఒకసారి తల్లిని, "మమ్మీ! మనం డాడీ దగ్గరికి యెందుకు వెళ్ళం?" అని అడిగింది అణు వెంటనే కోపంతో "నోర్ముయి" అని కసిరింది. అంతేకాదు అరాత్రంతా ఏడుస్తూనే గడిపింది. ఉదయం లేచి తల్లి మొహం చూసిన రాగ హడలిపోయింది. తరువాత మరెప్పుడు తల్లి దగ్గర తండ్రి ప్రస్తావన తెచ్చే సాహసం చెయ్యలేదు.
ఎదుగుతున్న పిల్లలకి ఏదైనా నచ్చచెప్పేధోరణిలో బోధపరచాలి కాని అజ్ఞాపిస్తున్నట్లు, నిర్భందిన్నట్లు చెప్పకూడదని అణుకి తెలుసు. అయినా ఎదురుగా వున్న సమస్య ఆమెని స్థిమితంగా నిలవనియడం లేదు.
"పిచ్చి వేషాలు వెయ్యకు ఇవాళ నువు స్కూలుకి వెళ్ళడం లేదు. నాతో వస్తున్నావు" అనేసింది అజ్ఞాపిస్తూన్నట్లు రాగ వయసుకు చిన్నదైనా ఆత్మాభిమానంలో పూర్తిగా తల్లి పోలిక మూతి ముడుచుకుని మాట్లాడకుండా మొహం తిప్పుకుని రోషంగా స్నానాలగదిలోకి వెళ్ళిపోయింది. మూడేళ్ళు నిండకుండానే తనంతట తాను స్నానం చేస్తానని పోట్లాడేది అణువేద పాప. రూపంలో తండ్రి పోలికలున్నా వ్యక్తిత్వంలో తల్లి పోలికలు చాలా వచ్చాయి ఆ పాపకి. అణువేదకి అర్ధమౌతుంది. పాప మనసు గాయపడ్డా ఫరవాలేదు. చాక్లెట్లు, ఐస్ క్రిమ్ లు వగైరా లంచాలు పెట్టి మరిపించుకోవచ్చు. మొదట ప్రధానంగా పాపని కాపాడుకోవాలి. ఎంత అనాలోచిత పనిచేశాడు జేవన్.
విధి లేక తల్లితో డాన్సు స్కూలుకి వెళ్ళింది రాగ, తల్లి కటినంగా ఆజ్ఞాపించినప్పుడు తను లొంగిపోక తప్పదని రాగకి తెలుసు. డాన్సు స్కూల్ లో ఆ పిల్లకి బాగా బోరు కొట్టింది. అక్కడైనా అణురాగని స్వేచ్చగా తిరగనియకుండా స్టాఫ్ తో డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు రాగకి ఏం చెయ్యాలో తోచక స్టాఫ్ రూమ్ లో స్టూల్ మీద వున్న కుజాని క్రిందకి తోసేసి పగలకొట్టి తన కసి తీర్చుకుంది. చుటుక్కున మందలించబోయి వెనక్కి తగ్గింది అణు. రాగని అపుడున్న మూడ్ లో మందలించి ప్రయోజనం లేదు. చాక్లెట్ ఐస్క్రీం కప్ తెప్పించి యిచ్చింది. దాన్ని టేబిల్ మీద నుంచి క్రిందకి తోసేసింది. ఐస్ క్రీం చింది స్టాఫ్ మెంబర్ల చీరల మీద పడింది. వాళ్ళు వెనక్కి గెంతి రాగని మందలించబోయి ప్రిన్సిపాల్ కూతురని రాగతో ఐస్క్రీం ఎందుకు తోసేశావు? నీకేం కావాలి?" అడిగింది అణువేద.
"నేను స్కూలుకి పోతాను."
"వీల్లేదు నేను మళ్ళీ పంపించేవరకు నువు స్కూలుకి వెళ్ళవు. అన్నీ సబ్జెక్ట్స్ లోను నీకు ట్యుషన్ ఎరేంజ్ చేస్తాను.
"నాకు ట్యుషన్ అక్కర్లేదు నేనే చదువుకోగలను"
"సరే అయితే సాయంత్రం తాతగారింటికి వెళ్ళి ఆలోచించుకుందాం"
"నేను తాతగారింటికి రాను"
"ఏం? ఎందుకు రావు? తాత నీకు స్వీట్లు, బొమ్మలు ఇస్తారుగా!"
"బామ్మ దాడి గురించి అడుగుతుంది. "చటుక్కున తలదించేసుకుంది అణువేద. రాగకి తండ్రి దగ్గర బాగా చనువని తెలుసు ఇప్పటి తండ్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఆ పిల్ల భరించలేకపోవటం ఆమెకు ఆనందాన్ని బాధని కూడా కలిగిస్తుంది. చూస్తుండగా జీవితం రెండు పాయలుగా ఛిలి ఎంత ముందుకు సాగిపోయింది?
కాస్సేపు రాగ మాట మర్చిపోయి తరువాతి రెండు మూడు నెలల్లో డాన్స్ స్కూల్ పిల్లల చేత యిప్పించవలసిన ప్రోగ్రాం గురించి ఆలోచించసాగింది అణువేద.
పక్క క్లాసు రూమ్ లో ఏదో కలకలం వినిపించేసరికి ఆ గదిలోకి వెళ్ళింది. డాన్స్ చేస్తున్న పిల్లలంతా ఒకరి మీద మరొకరు పడి భయంగా అరుస్తున్నారు. డాన్స్ టీచర్లు నిస్సహాయంగా చూస్తుండగా గెడ్డం కింద వేలు పెట్టుకుని నవుతూ చూస్తోంది రాగ.
"ఏం జరిగింది ?' అడిగింది అణువేద.
"పిల్లలు డాన్స్ చేస్తోంటే మీ అమ్మాయి నేల మీద కార్పెట్ లాగేసింది." చెప్పింది డాన్స్ టిచర్. కూతురు తిక్క అర్ధమౌతుంది "తప్పుకదూ!" మందలించింది.
"సారీ మమ్మీ! సారీ టిచర్! సారీ ఫ్రెండ్స్" అల్లరిగా నవుతూనే ముద్దు ముద్దుగా చెప్పింది.
అ సాయంత్రం డాన్స్ కాలేజి నుంచి తిన్నగా మేనమామ సుందరేశ్వరరావు యింటికి వెళ్లింది అణువేద. భార్యాభర్తలు హల్లో కూర్చుని టి.వి చూస్తున్నారు. "రా! రా!" ఆప్యాయంగా ఆహ్వానించాడు సుందరేశ్వరరావు. కూర్చోగానే" మీ అయన కబుర్లేమైనా తెలుస్తున్నాయా?" అడిగింది మేనత్త. ఈ కుశల ప్రశ్న యెప్పుడు ఆనవాయితీ అడుగుతుంది ఆవిడ. ఉక్రోషంగా చూస్తుంది రాగ. ఆ చూపుల్లో వేదన అర్ధం కాదు ఆ పెద్దావిడకి.
"రాగా! నువు కాస్సేపు లోపలికి వెళ్ళి వోదినతో ఆడుకో" రాగని లోపలి గదిలోకి పంపించి ఫోన్ కాల్ విషయం చెప్పింది అణువేద. మొదట దంపతులిద్దరూ "ఆ!"
అని నివ్వెరపోయారు. తరువాత సుందరేశ్వరరావు "ఛ!ఛ! జీవన్ యిలాంటి పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో సాతికుడిగా కనిపించేవాడు" అన్నాడు.
"అదిసరే! ఇంతకీ ఇప్పుడేం చెయ్యాలి? ఎన్నాళ్ళని స్కూలు మానిపించను?
ఎంతవరకని కాపలా కాయగలను? ఈ డాన్సు స్కూలు యిదంతా వొదిలి పెట్టి ఎక్కడికి పోగలను?"
"పోలీసు కంప్లయింట్ యిస్తే!"
 కోపంగా కల్పించుకుంది మేనత్త. "పోలీసు కంప్లయింటు ఇస్తారా? ఏమని ఇస్తారు? ఏం ఆధారముంది మీకు? తిని కూచుని భర్త మీద పోలీసు రిపోర్టు యిస్తే యిహ యీ జన్మలో భార్యాభర్తలు కలుసుకుంటారా?అది గాక ఆ గిరీశం ఎవడో నిజాయితీ పరుడని నమ్మకమేమిటి? మీరు పోలీసు రిపోర్టు యిస్తే తన మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారని జీవన్ ఎదురు కేసు పెడితే ఏం చేస్తారు?"
ఏం సమాధానం చెప్పాలో తోచలేదు సుందరేశ్వరరావుకి. అంతలో సుందరేశ్వరరావు కూతురు వందన పరిగెత్తుకుంటూ వచ్చి, "నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా రాగ వీధిలోకి పారిపోయింది" అని చెప్పింది.
మారుతీకారు పక్కన పోలిసుల్ని చూసి చేతిలో పెట్రోల్ టిన్ కింద పడేసి వెనక్కి పారిపోబోయాడు జాన్ గోవింద్. గోవింద్ సింగ్ సుబ్బయ్య అతని చెయ్యి పట్టుకుని అపు చేశాడు. "ఇప్పుడిలా వెనక్కి పరిగెడితే ఎవరికైనా అంతకు ముందు లేని అనుమానాలు కల్గుతాయి.

 Previous Page Next Page