"ఆరోజు కనబడ్డావంతే ఎక్కడికెళ్ళావ్?" బావిలోంచి అడగడంతో ఆమె గొంతు కొత్తగా వినిపించింది అతనికి.
"ఇక్కడే వున్నాను. రోజూ మీకు నేను కనిపించక పోయినా మీరు నాకు కనిపిస్తుంటారు కదా"
అంటే రంగనాయకి చెప్పింది నిజమేనన్నమాట.
"ఎలా కన్పిస్తాను?"
"దేవాలయం అరుగుమీద కూర్చుంటాను. అక్కడినుంచీ మీ ఇంటి కిటికీలు కనిపిస్తాయి. మీరు ఇంట్లో తిరుగుతుంటారు గదా! అప్పుడు మీ రూపమో, మీ నీడో ఈ అభాగ్యుడి కళ్ళలో పడుతుంది. దాంతో తిరిగి వచ్చేస్తుంటాను"
"మరి నాతో మాట్లాడాలనిపించదా?"
"ఎందుకు మాట్లాడడం?"
ఆ జవాబుకు ఆమె ఖంగుతింది. అలా అయితే చూడడం కూడా ఎందుకు?
అదే ప్రశ్న వేసింది.
"నాకు అలా చూడడం ఇష్టం కాబట్టి మీతో నేను మాట్లాడడం ఇష్టమని చెప్పండి- అప్పుడొచ్చి మాట్లాడతాను."
"అంటే నాకిష్టం లేకపోతే ఏమీ చెయ్యవా?"
"చేయను గాక చేయను. నేను మిమ్మల్ని ప్రేమించడానికి నాకు ఎంత హక్కుందో, అలా మీకు నన్ను ప్రేమించడానికి, తిరస్కరించడానికి అంతే హక్కుంది. నా హక్కుల్ని ఎలా కాపాడుకుంటానో అలా మీ హక్కుల్ని కాపాడడానికి నా ప్రాణాలయినా ఇస్తాను. ఓల్టేర్ ఈ విషయంలో చెప్పిన మాటల్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి"
చదివింది పదో తరగతి అన్నాడు. ఓల్టేర్, రూసోలాంటి పేర్లు ఎలా తెలుసు? అయినా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అకడమిక్ చదువులే అవసరం లేదు.
"ఏమిటి ఇటొచ్చావ్?"
"చిన్నస్వామి మోటార్ కూడా ఇక్కడే వుంది కదా కరెంట్ వచ్చే టైమైంది. వంకాయలతోట ఎండిపోతోంది. మోటార్ వేద్దామని వస్తే మీరు కనిపించారు"
అప్పుడు గమనించింది ఆమె అతను లుంగీ ఎగ్గట్టుకొని వున్నాడు పైన బ్లూ షర్ట్.
"మోకాలికి ఏమిటి దెబ్బ?" ఆందోళనతో అడిగింది. అతను మోచిప్పమీద ఎర్రగా రంగు కాగితం అంటించినట్లు గుండ్రంగా చర్మం లేచిపోయి వుంది.
"అదా! నిన్న సాయంత్రం దెబ్బ తగిలింది!"
"ఎలా?"
"రోజూ సాయంకాలం మిమ్మల్ని చూడడానికి వస్తాను కదా నిన్న కూడా అలానే వచ్చాను. కానీ ఎంతకీ కనబళ్ళేదు మీరు మిమ్మల్ని చూడకుండా వెళ్ళకూడదనుకున్నాను. సాయంకాలం కరిగిపోయి రాత్రి అయింది. అప్పుడే మబ్బులన్నీ ఆకాశం మీద దాడి చేసినట్టు చేరిపోయాయి. వర్షం మొదలయింది"
"అవును రాత్రి వర్షం కురిసింది అప్పుడేం జరిగింది?"
"నేను మీ కిటికీ వంకే చూస్తున్నాను. జల్లు లోపల పడ్డట్టుంది మీ వాళ్ళెవరో తలుపులు మూశారు"
"మా అమ్మ"
"తిరిగి కిటికీలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఓ పక్క ఆకలి, మరోపక్క వర్షపు జల్లు అయినా అవేమీ బాధించలేదు నన్ను అలా కూర్చుండిపోయాను. వర్షం ఎక్కువైంది. రోడ్లమీద కాలువలు పారడం ప్రారంభమైంది.
అలా చలిలో, ఈదురుగాలిలో కూర్చుండిపోయాను. చలీ, ఆకలి తెలియకుండా ఏం చేశానో తెలుసా? మీ పేరును స్మరిస్తూ వుండిపోయాను. చిత్రంగా ఆకలీ, చలీ బాధించడం మానేశాయి. దేవుని స్మరించుకుంటే బాధలన్నీ పోవడం నిజమైతే అంతకంటే ఎక్కువగా ఆరాధించే మీ పేరు స్మరించుకుంటే బాధలన్నీ పోవడం నిజమైతే అంతకంటే ఎక్కువగా ఆరాధించే మీ పేరు స్మరించుకుంటే బాధలన్నీ పోవాలి గదా అన్నదే నా లాజిక్కు అలాగే జరిగింది."
ఆమె చిత్రంగా చూస్తూ వుండిపోయింది.
"పదకొండు గంటలకు అనుకుంటాను. వర్షం ఆగిపోయింది. వెంటనే కరెంట్ వచ్చింది. చూస్తే కిటికీ తెరిచి వుంది"
"ఉక్కగా వుంటే గాలికోసం తెరిచాను నేనే"
"చీకటి కదా అందుకే మీకు తెలియలేదు. కరెంటు వచ్చాక అలా చూస్తూ కూర్చున్నాను. రెండుగంటల కనుకుంటాను మీరు- అంటే మీ నీడ కనిపించింది"
"దాహంగా వుంటే లేచాను"
"అదిగో అప్పుడే మీ నీడ కనిపించింది. హాపీగా అక్కన్నుంచి బయల్దేరడానికి అరుగుమీదనుంచి కాళ్ళు కింద పెట్టాను. కాని కాళ్ళు పడింది నేలమీద కాదు- డ్రయినేజి కాలువలో"
"తరువాత?"
"అలా కాలు స్లిప్ అయి పడిపోయాను. మోకాలి చిప్ప గీక్కుపోయింది"
"నొప్పి పోవటానికి ఏమైనా మందేశావా?"
"ఇంటికెళ్ళాక బాగా నొప్పిగా అనిపించింది. అయినా నా దగ్గర మంత్రముంది కదా- మీ పేరు- అలా స్మరించుకొంటూ నిద్రలోకి జారిపోయాను"
ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. గుండెనెవరో లాగేస్తున్నట్టు బాధ.
తనను తనే సర్దుకుని బట్టలుతకడానికి బకెట్ వైపు తిరిగింది. అలా తిరగడంలో ఆమె చేయి తగిలి బకెట్ బావిలో పడిపోయింది.
"అయ్యో- బకెట్ - బట్టలు" ఆమె కంగారుగా తల పైకెత్తి అతని వైపు చూసింది.
"మునిగిపోతోంది" అతను ఠక్కున గొంతు క్కూర్చుని అన్నాడు.
"మరి దూకు లోపలికి వెళ్ళిపోతే దొరకదు"
అతను మరిక ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడయితే ఆమె దూకమందో అతను దూకేశాడు.
అలా బావి లోపలికి దూకుతూ అరిచాడు "నాకు ఈత రాదు"
తనకి ఈత రాదంటూ బావిలో దూకిన జితేంద్రను చూస్తూ క్షణకాలం అలా వుండిపోయింది లిఖిత. ఏం చేయాలో పాలుపోలేదు. గట్టిగా అరుద్దామనుకుంది గానీ గొంతుకు సంకెళ్ళు వేసినట్టు మాట పెగలలేదు. గబగబా మెట్లెక్కి పైకి వచ్చింది. అప్పటికి సర్దుకుంది ఆమె.
అప్పటికింకా పన్నెండు కాలేదు కాబట్టి కూలీలు పొలాల్లో వున్నారు మాట విన్పించేంత దూరంలో ఇద్దరు వ్యక్తులు మడువలు దున్నుతున్నారు వాళ్ళని పోల్చుకుని గట్టిగా కేకేసింది.
ఆమె గొంతులోని ఆందోళనను కనిపెట్టి వాళ్ళిద్దరూ ఒక ఉదుటున అక్కడికి చేరుకొన్నారు.
"చిన్నస్వామి ఇంట్లో వుండే కుర్రాడు బావిలో పడిపోయాడు అతనికి ఈత రాదట" ఒప్పజెప్పినట్టు చెప్పింది. అప్పటికే నాలుకమీద తడి ఆరిపోయింది.