Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 12


    
    అంటే జీతూ చెప్పిందంతా నిజమేనన్నమాట తనేదో అతన్ని ఆషామాషీ వ్యవహారం అనుకుంది. కానే కాదు. మరి తనకోసమే ఈ వూరొస్తే తనను చూడడంగానీ, మాట్లాడడం గానీ చేయడం లేదు. ఏమిటతని ఉద్దేశ్యం?
    
    లిఖిత ఆలోచనలో పడింది.
    
    జితేంద్ర ఆరోజు కనిపించి తన విషయమంతా చెప్పినా ఆమె ఓ పట్టాన నమ్మలేక పోయింది. ఓ అమ్మాయి కోసం నగల దుకాణాన్ని వదిలి ఎవరైనా వచ్చేస్తారా?
    
    అదేదో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది.

 

    ఆ సమయంలోనే రంగనాయకి జితేంద్ర మాట ఎత్తింది. అంతా తెలిసిపోయాక ఇక దాపరికాలు ఎందుకనుకుంది.
    
    "నువ్వు డిటెక్టివ్ వి గదా నాకూ నీతో అవసరం వచ్చింది" అంది మూడురోజుల ముందు.
    
    "అదేమిటో చెప్పు?"
    
    "జితేంద్ర విషయమేమిటో కనుక్కురావాలి"
    
    "అదెంత పని! అలానే రెండు రోజుల్లో కనిపిస్తాను" అని వెళ్ళిన రంగనాయకి తిరిగి ఇదే రావడం.
    
    "అంత ప్రేమున్నవాడు నాకు కనపడడు, నాతో మాట్లాడడు, నన్ను చూడడు. ఆ ఒక్కరోజు తప్ప ఇటొచ్చిన పాపాన పోలేదు" తన సందేహాన్ని రంగనాయకి ముందుంచింది ఆమె.
    
    "నీతో మాట్లాడకపోవచ్చుగానీ, నిన్ను చూస్తూనే వుంటాడు" ఖచ్చితంగా చెప్పింది రంగనాయకి.
    
    ఆమె కరెక్టుగానే వూహించింది. అంత నిశితంగా పరిశీలిస్తుంది కాబట్టి ఆమె డిటెక్టివ్ అయింది.
    
    జితేంద్ర ప్రతిరోజు లిఖితను చూస్తూనే వున్నాడు.
    
    ఉదయం నిద్రలేస్తూనే పశువుల పాకను శుభ్రం చేయటంలో పడిపోతాడు. చిన్నస్వామికి మొత్తం నాలుగు ఆవులు, నాలుగు దూడలు వున్నాయి. వాటి పేడా, అవి తినగా మిగిలిన చెత్తా. అన్నీ పూడ్చి దిబ్బలో వేసేటప్పటికి పదవుతుంది.    
    
    మొదట్లో అతనికి చిన్నస్వామి భార్య సద్ది అన్నమే పోసేది. అతని పనితీరు అతని సిన్సియారిటీ, అతని మెత్తని స్వభావం చూసి టిఫిన్ పెట్టడం ప్రారంభించింది.
    
    టిఫిన్ తిని పొలం వెళ్ళేవాడు. మధ్యాహ్నం కూడా ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు. చిన్నస్వామికి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి పేరు సబిత ఆమెకు పద్దెనిదేళ్ళుంటాయి. బంగారం రంగుతో పసుపు కొమ్ములు రాసుకునే రాయిలా వుంటుంది ఆమె కూడా శరీరకష్టం చేసే మనిషే మగరాయుడిలా అన్ని పనులు చేస్తుంటుంది. చిన్నపిల్లకు పదేళ్ళు ఐదవతరగతి చదువుతుంది.
    
    పొలంలో పనిచేసే జితేంద్రకు సబితే అన్నం తీసుకెళ్ళి పెట్టి తిరిగి వచ్చేస్తుంటుంది.
    
    సాయంకాలం అయిదవుతున్నప్పుడు అతను పొలం నుంచి ఇంటికి బయల్దేరుతాడు.
    
    మధ్యలో ఏట్లో స్నానం చేస్తాడు. ఇంటికొచ్చాక తెల్లటి కాటన్ పైజమా లాల్చీ వేసుకుని బయల్దేరుతాడు.
    
    లిఖిత ఇల్లు దేవాలయం పక్కనే దేవాలయం అరుగుమీద కూర్చుంటే ఆమె ఇంటి కిటికీల్లోంచి లోపలున్న వాళ్ళు కనిపిస్తారు.
    
    అలా అరుగుమీద కూర్చుని కిటికీలకు తన కళ్ళు తగిలించేస్తాడు. లిఖిత రూపం కన్నా ఆమె నీడనే బాగా పోల్చుకోగలడు అతను ఎందుకంటే ఎక్కువసార్లు ఆమెకంటే ఆమె నీడే అతనికి బాగా అనిపిస్తుంది కాబట్టి ఆ నీడను చూసే అతను సంతోషపడి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు.
    
    అందుకే రోజూ అతను తనను చూస్తున్నాడని లిఖితకు తెలీదు.
    
    "మరి నే వెళ్ళొస్తా బస్సు దిగి ఇంటికైనా పోకుండా నేరుగా ఇటొచ్చాను" అని రంగనాయకి వెళ్ళడానికి లేచింది.
    
    "వుండు- నీ ఫీజు తెచ్చిస్తా" అని లిఖిత ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆమె వారించింది. "ఇదేమి డిటెక్టివ్ పని కాదుగా కేవలం చిన్న సాయం దానికి ఫీజు తీసుకోను"
    
    లిఖిత కృతజ్ఞతతో చూసింది.
    
    ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది.
    
    రంగనాయకి చెప్పిందంటే అది నిజమై వుండాలి. అతను రోజూ తనను చూస్తున్నాడా? రోడ్డుమీద అలా వెళుతూ తనని గమనిస్తున్నాడా? అలా అయితే ఒకసారైనా కనబడాలే. ఇంతవరకు తాను అతనిని గమనించలేదు.
    
    తనని ఎలా చూస్తున్నాడో కనిపెట్టుకుని రంగనాయకి పురమాయించాలి కాబోలు.
    
    ఏదయినా పనిచేయకుండా వుంటే ఆలోచనలు బుర్రను తినేస్తాయనిపించి బట్టలుతకడానికి బయల్దేరింది.
    
    మామూలుగా అయితే ఇంటి దగ్గరే మోటరుంది. అక్కడే బట్టలు వుతుక్కుంటుంది. కానీ రెండు రోజులుగా అది చెడిపోయింది. అందుకే ఆమె కొత్తబావికి బయల్దేరింది.
    
    ఆమె ఇంటివెనక ఓ ఫర్లాంగు దూరంలో ఆ బావి వుంది.
    
    అదెప్పుడో కట్టిన బావి. మరి దాన్ని 'కొత్త బావి' అని ఎందుకు పిలుస్తారో ఆమెకు తెలీదు. పల్లెటూర్లలో బావులకు కూడా పేర్లుంటాయి.
    
    అప్పుడు టైమ్ పదిగంటలైంది. అంతకుముందు రోజు వానపడి వుండడంతో మబ్బులన్నీ మాయమై ఎండ పెద్దింటి ఆడపడుచు కోపంలా తీక్షణంగా వుంది. గాలి ఎండను భరించలేక ఎక్కడో దాక్కున్నట్టు చెట్ల ఆకులు కూడా కదలడం లేదు.
    
    లిఖిత ప్లాస్టిక్ బకెట్ నిండా బట్టలు కుక్కుకుని బావి దగ్గరికి చేరుకుంది.
    
    బావి చుట్టూ చెట్లు వుండడం వల్ల ఎవరో తనకోసం గొడుగు పడుతున్నట్టుంది లిఖితకు.    

    అక్కడ మూడు మోటార్లున్నాయి. అందులో ఒకటి ఆమె చిన్నాన్నది. దాన్ని వేసుకుని నీళ్ళు పట్టుకోవాలని స్విచ్ నొక్కింది కానీ నీళ్ళు రాలేదు. మోటారు కూడా కదల్లేదు.

 

    పదకొండు గంటల వరకు కరెంటు కోత అన్న విషయం మరిచిపోయి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంది.
    
    ఇహ మిగిలింది బావిలోకి దిగడమే. ఆమెకి ఈతరాదు. అయినా మెట్లు బాగా వున్నాయి కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదనుకుని దిగింది.
    
    బట్టలు ఒక్కొక్కటే వుతకడం ప్రారంభించింది.
    
    "గుడ్ మార్నింగ్" అని వినబడేసరికి తలెత్తింది.
    
    బావి పైన జితేంద్ర.
    
    అతను అక్కడ కనిపించడం ఆమెకి చాలా ఆనందాన్నిచ్చింది. గుండె కొట్టుకోవడంలో అంత లయ ఉందని మొదటిసారి ఫీలయ్యింది ఆమె.

 Previous Page Next Page