Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 12


    తనూజ వుంటున్నది చిన్నమేడలో పైభాగంలోని చిన్న పోర్షన్, రెండు గదులూ, కిచెన్ కానీ ఇల్లు చాలా నీట్ గా అలంకరింపబడి వుంది.
    
    తనూజ ఎప్పుడూ సింపుల్ గానే డ్రస్ చేసుకుంటుంది. ఇవేళకూడా సాధారణమైన చీరెకట్టుకుని వున్నా కొత్త కాంతితో వెలిగిపోతోంది. అతన్ని చూడగానే ఆమెముఖం వికసించింది.
    
    "రండి" అంది చాలా మర్యాదగా ఆహ్వానిస్తూ.
    
    రాజీవ్ లోపలకడుగు పెట్టాడు. ఇంట్లో ఆమెతప్ప ఇంకెవరూ కనబడలేదు.
    
    "కూచోండి."
    
    అతను ఫేముకుర్హ్చీలో కూర్చుంటూ "మీ అమ్మా నాన్న..."
    
    "ఎవరూ లేరు. ఇంట్లో నేనొక్కదాన్నే వుంటున్నాను" అంది తనూజ నవ్వుతూ.
    
    రాజీవ్ తొట్రుపాటు పడలేదు. ఏ వ్యక్తినీ చులకనగా చూసే స్వభావం అతనిలో లేదు.
    
    "మరి ఎందుకలా అబద్దం చెప్పావు?"
    
    "అలా చెబితేగాని మీరు రారని."
    
    "ఎందుకలా అనుకున్నావు?"
    
    "మీ స్వభావం నాకు తెలుసుకనుక."
    
    ఒక నిముషం వాతావరణం బరువెక్కినట్టు నిశ్శబ్దంతో గడిచింది.
    
    "కోపమొచ్చిందా?" అనడిగింది తనూజ చాలా మెల్లగా.
    
    "లేదు."
    
    "మీరు కోపగించుకోరని నాకు తెలుసు."
    
    అతనేమీ మాట్లాడలేదు. నవ్వి వూరుకున్నాడు.
    
    "అసలు నాకు జీవితంలో ఎవరూ లేరు.  అమ్మా-నాన్న,  అన్నయ్యలు ఎవరూ లేరు. అమ్మా-నాన్న చిన్నప్పుడే పోతే, దూరపు బంధువులెవరో చేరదీసి, పెంచి పెద్దదాన్ని చేశారు. ఇప్పుడు వాళ్ళూ లేరు. జీవితంలో నేను ఒంటరిని."
    
    "ఈవేళ నీకెన్నో ఏడు వచ్చింది?"
    
    "నిజం చెప్పమంటారా? అబద్దం చెప్పమంటారా?"
    
    "నిజం చెపితే విలువ పెరుగుతుంది. అబద్దం చెబితే గౌరవం తగ్గుతుంది."    

    "ఇరవైరెండు నిండి ఇరవైమూడు వచ్చాయి."
    
    "స్త్రీకి మానసికంగా, శారీరకంగా నిండుతనం వహ్చే వయసిదే. ఇరవై లోపయితే లేతధానం, ఇరవై అయిదు పైనయితే భారీతనం కనబడతాయి."
    
    తనూజ నవ్వింది. "మీరు ఆడవాళ్ళ గురించి బాగా స్టడీ చేసినట్టున్నారే."
    
    "నా కసలు ఆడవాళ్ళతో ఎక్కువ పరిచయంలేదు.  నా మిసెస్ తో తప్ప బయటివాళ్ళతో ఎక్కువ మాట్లాడను. మాట్లాడాలంటే భయంకూడా."
    
    "ఇప్పుడు నేను పరిచయమవుతున్నానుగా, మీ భయాన్ని పోగొడతాను లెండి."
    
    రాజీవ్ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళలోకి ఓసారి చూసి తల ప్రక్కకి తిప్పుకున్నాడు.
    
    తనూజ ఓ నిముషం మెదలకుండా నిలబడి "టిఫిన్ తీసుకొస్తాను" అంటూ లోపలకెళ్ళింది.
    
    డ్రాయింగ్ రూం చాలా చిన్నదిగా వుంది. ఫర్నిచర్, మిగతా డెకరేషన్ ముచ్చటగా అమర్చబడి వున్నాయి. ఒక ప్రక్కన పోర్టబుల్ టి.వి.
    
    తనూజ ఓ ప్లేట్ లో గులాబ్ జాం వున్న ప్లేట్, అజ్మీర కళాఖండ్, ఇంకో చిన్న ప్లేటులో కారప్పూస తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది.
    
    "ఇవాళ నీ బర్త్ డే నీకేమీ ప్రజెంటేషన్ తీసుకురాకుండా వచ్చాను" అన్నాడు రాజీవ్ చాలా మొహమాటంగా.
    
    "మీరు నా ఆహ్వానాన్ని మన్నించి రావడమే నాకిచ్చిన ప్రజెంటేషన్."
    
    "అవును నన్ను తప్ప ఇంకెవర్నీ ఎందుకు పిలవలేదు?"
    
    "నేను అందరితో క్లోజ్ గా మూవ్ కావచ్చుగానీ నాకు మనుషులంటే నమ్మకం తక్కువ."
    
    "అలా అనటంకంటే నీమీద నీకు నమ్మకం లేదంటే బాగుంటుందేమో."
    
    "ఏమో మరి నేను సరిగ్గా చెప్పలేను. తీసుకోండి"
    
    అతను ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ "నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం" అన్నాడు.
    
    "ఎలాంటి స్వీట్స్?"
    
    "ఇప్పుడు నువ్విచ్చిన లాంటివే."
    
    తనూజ నవ్వి వూరుకుంది.
    
    "నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు?"
    
    "చెప్పానుగా నాకు మనుషులంటే నమ్మకం తక్కువని. పెళ్ళయిన దగ్గర్నుంచీ ఒకరంటే ఒకరు పడిచావటంకన్నా , అర్ధంలేని అలకలు, ఒకరిమీద ఒకరు కోపగించుకోవడాలు, తీవ్రస్థాయిలో అపార్ధాలు, అనుమానాలు, ఒకరినొకరు మానసికంగా హింసించుకోవటాలు, యిద్దరిమధ్యా నటన విబేధాలు విడిపోవటాలు... సంసారమంటే ఇంతేననిపిస్తుంది. కోరి ఎందుకు ఈ ఊబిలోకి దిగిపోవడం?"
    
    "నీ అభిప్రాయం తప్పు ఎవరో కొందర్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడటం సబబుకాదు. జీవితకాలం ఎంతో అన్యోన్యంగా జీవించే భార్యా భర్తలుంటారు. వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ, అనురాగం, అద్వితీయమైన మమకారం తప్ప నువ్వు చెప్పిన మోసం, నటన, భ్రాంతి- వీటికవకాశం లేనేలేదు."
    
    అతను ప్లేట్ టీపాయ్ మీద పెట్టేశాడు.
    
    "అదేమిటి? స్వీట్ అంటే యిష్టమని, పూర్తిగా తినకుండా వదిలేశారేం?"
    
    "ఎంత స్వీట్ యిష్టమైనా మితిమీరి తింటే మొహం మొత్తుతుంది."
    
    "ఎంత తిన్నా మొహం మొత్తని స్వీటేదైనా వుందా?"
    
    "వుంది."
    
    "ఏమిటది?"
    
    "భార్య."
    
    "కొన్నాళ్ళకదీ మొహం మొత్తుతుందేమో?"
    
    "అలా జరగదు."

 Previous Page Next Page