కోమల కాస్త కంగారుపడి, చాయ చేతిని పట్టుకుని "చాయక్కా.....మరే.....మరే...." అని ఏడ్చేసింది.
"ఏమైందీ చెప్పి ఏడు?" చాయ చిరాకుపడింది.
కోమల కళ్ళు తుడుచుకుని అటూ-ఇటూ చూస్తూ రహస్యంగా "నేను రాజుతో వెళ్ళిపోతున్నాను" అంది.
చాయ కనుబొమలు పైకి లేపి "ఏ రాజు?" అంది.
"అదే రోజూ రాత్రి ఆటోలో కూరగాయలు తీసుకొస్తాడూ అతనే రాజు" అంది కోమల. ఆ మాట అంటూ వుంటే ఆ అమ్మాయి కళ్ళు చీకట్లో సైతం మిలమిలా మెరిశాయి.
"ఊ.....ఆ రాజుతో వెళ్ళీ" అడిగింది చాయ.
"గుళ్ళో పెళ్ళి చేసుకుంటాం" చెప్పింది కోమల.
"ఊ.....చేసుకునీ...." ఇంకా చెప్పమన్నట్టు చూసింది చాయ.
కోమల చాయవైపు కాస్త వింతగా చూసి "పెళ్ళి చేసుకుంటాం చాయక్కా! ఈ దిక్కుమాలిన అనాధ బతుకుల్లో ఏం వుంది చెప్పు? మనకెవరు పెళ్ళిళ్ళు, పేరంటాలూ చెయ్యరు. ఆ శాంతక్కనీ, వనజనీ చూడు ఎండిన మోడుల్లా ఇక్కడే ఆయా పని చేసుకుంటూ, ముసలివాళ్ళయిపోతున్నారు. అలా కాకుండా మనమూ పెళ్ళి చేసుకోవాలి, ఓ ఇల్లుండాలీ, పిల్లలుండాలీ అంటే ఇలా వెళ్ళిపోక తప్పదుగా?" వాదిస్తున్నట్టుగా అంది.
చాయ ఆమె భుజం మీదనుండి చేతిని తీసివేసి నవ్వుతూ "పెళ్లి చేసుకుంటాడు సరే..... అతను నిన్నెలా పోషిస్తాడూ? ఆ ఆటో తోలే మహారాజుగారు నీకు, నువ్వు కలలు కనే నీ పిల్లలకీ కడుపునిండా తిండీ, ఒంటినిండా బట్టా అయినా ఇవ్వగలడంటావా?" అనడిగింది.
ఆ హేళనకి కోమలకి కోపం వచ్చినట్టుగా "అతని సంపాదన సరిపోకపోతే, నేనూ నాలుగిళ్ళలో పాచిపని చేస్తాను" అంది.
"అంతకాడికి నువ్విలా లేచిపోవడం దేనికే? ఆ పనేదో చెయ్యక్కర్లేకుండానే నీకిక్కడ తిండి పడేస్తున్నారుగా....నువ్విలా పారిపోయి, వాడింట్లో వూడిగం చేసి, వాడికి సర్వసుఖాలూ ఇచ్చి, పిల్లల్ని కని, వాళ్ళకోసం పాచిపని చేసి, ఈ కష్టాలన్నీ ఎందుకు? నీకంతగా వాడిమీద మనసుంటే ఎక్కడికయినా పోయి ఓ పూట గడిపేసిరా! ఆ మేరీ అప్పుడప్పుడూ ఆ మిలట్రీ వాడితో పోతుంటుంది చూడూ.....అలాగనమాట" అంది జ్ఞానబోధ చేస్తున్నట్లుగా చాయ.
కోమలకి ఇంకా కోపం వచ్చింది. "పెళ్లి అంటే ఎంత పవిత్రమైందో నీకేం తెలుసు? అందుకే అలా మాట్లాడుతున్నావు" అంది.
చాయ నిర్లక్ష్యంగా నవ్వి "నీ ఖర్మ. పెనం మీదనుంచి పొయ్యిలో పడుతున్నావని చెప్పాను. వినకపోతే నీ ఇష్టం. పోయిపోయి.....ఆ ఆటో డ్రైవరే దొరికాడా? కాస్త పెద్ద వయసయితే అయిందిగానీ, తన భార్య చనిపోయిన రోజున వచ్చి స్వీట్స్ పంచె ఆ సేట్ ఛమన్ లాల్ నో, రోడ్డురోలర్ లాంటి భార్యతో అవస్థపడుతున్న మన బోర్డుమెంబర్ మోహనరావునో పట్టలేకపోయావా? జీవితం జల్సాగా గడిచిపోయేది" అంది.
కోమల భరించలేనట్టు, చీత్కారంగా "ఛ! ఇదా నువ్విచ్చే సలహా? తండ్రి వయసు వాడినో.....పెళ్ళాం వున్నవాడినో తగులుకోమంటావా? ఆ పని నువ్వే చెయ్యి" అంది.
ఆ మరుక్షణం కోమల చెంప పేలిపోయింది.
చాయ నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ అంది. "నువ్వు ఎంచుకున్న దరిద్రుడుకన్నా బెటర్ వాళ్ళని చూపించాను కానీ, వాళ్ళు నాకు సరిపోతారని కాదు. నేను తలుచుకోవాలే కానీ అలాంటివాళ్ళేం ఖర్మ.....ఇలాంటి పది అనాధాశ్రమాలు కట్టించే స్థోమతున్న కోటీశ్వరులు నాకోసం క్యూలో నిలబడతారు.
ఇంతలో ఆటో వచ్చి గేట్ ముందు ఆగిన శబ్దం, రాంసింగ్ గేటు తీయడం వినిపించింది.
కోమల వెంటనే చాయకి చేతులు జోడించి దండం పెడుతూ "అదిగో....రాజు వచ్చాడు.....నేను నెమ్మదిగా గోడ దూకి పారిపోయి ఆ సందు మొదట్లో నిలబడతాను. అతను ఆటో ఆపి నన్ను ఎక్కించుకెళతాడు. దయచేసి ఈ విషయం నేను వెళ్ళిపోయేదాకా ఎవరికీ తెలియనీకు ప్లీజ్......చాయక్కా.....మాకు పుట్టే మొదటి బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాను" అంది అర్దింపుగా.
చాయ మాట్లాడలేదు. లోపలికొస్తున్న ఆటోని కిటికీలోంచి చూస్తూ నిలబడింది.
కోమల తను రెడీగా సర్ది వుంచుకున్న బట్టల మూటని అందుకుని నెమ్మదిగా "పోయొస్తానక్కా!" అంది.
చాయ తలతిప్పి ఆమెవైపు చూడలేదు.
కోమల నెమ్మదిగా చీకట్లో కలిసిపోయింది.
కూరగాయల బస్తా కిచెన్ లో పడవేసి వచ్చి రాజు ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
చాయ వరండా మీదకి వచ్చి చుట్టూ చూసింది.
వార్డెన్ రూంలో ఇంకా లైటు వెలుగుతోంది. దయామణి చాలా పొద్దుపోయే వరకూ ఏవో పుస్తకాలు చదువుతూ వుంటుంది.
ఆటో సందు చివరిదాకా వెళ్ళి వుంటుందని నిర్దారించుకున్నాక చాయ గట్టిగా అరిచింది. "రాంసింగ్....మేడమ్ .....కోమల పారిపోతోంది..... ఆ రాజుగాడితో లేచిపోతోంది.....పట్టుకోండి.....పట్టుకోండి."
గేటు మూస్తున్న రాంసింగ్ ఆ అరుపులకి అదిరిపడి మెట్ల దగ్గరకి పరుగెత్తుకొచ్చాడు.
దయామణి కూడా తలుపు తీసుకుని, కంగారుగా ఇవతలకి పరిగెత్తుకు వచ్చింది-"ఏమైందీ? ఎవరు పారిపోతున్నారూ?" అని చాయని గట్టిగా అడిగింది.
"అదిగో....ఆ ఆటో డ్రైవర్ రాజుతో కోమల లేచిపోతోంది" అరుస్తూ చెప్పింది చాయ.
అప్పటికే చాలామంది అమ్మాయిలు నిద్రలేచి వరండా మీదకి వచ్చేసారు.
"రాంసింగ్.....త్వరగా వెళ్ళి కోమలిని వెనక్కి తీసుకురా!" దయామణి అరిచింది.
రాంసింగ్ పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
"అమ్మో....కమిటీ వాళ్ళకి తెలిస్తే.....ఇంకేమయినా వుందా....?" దయామణి అదురుతున్న గుండెలమీద చెయ్యివేసుకుని- "ముందు పోలీసులకి ఫోన్ చెయ్యాలి" అని ఆఫీసురూం వైపు పరుగెత్తింది.
చాయ తీరుబడిగా మెట్లమీద కూర్చుని-ఏమైంది? ఏం జరిగింది?" అని అడుగుతున్న అమ్మాయిలకు కోమల ఉదంతం అంతా మరో రెండు మలుపులతో వివరించసాగింది.