విశారద అతని పక్కకు జరిగి పడుకుని కళ్ళు మూసుకుంది.
"నిద్ర వస్తోందా?"
"ఊ."
"నాకోసం కూచుని కూచుని శ్రమ, పైగా తెల్లవారుఝామునే నిద్ర లేవాలి."
"ఇందులో శ్రమేముంది? మా అందరికోసం, కుటుంబాన్ని పైకి తీసుకురావడం కోసం మీరు పడే శ్రమలో ఇది ఎన్నో వంతు?"
"నిజంగా, మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నావా?"
"నిజం మీ ముందు నేను ఏ విషయంలోనూ అబద్దం చెప్పను."
జగదీష్ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
"విశారదా! ఒక్క సంగతి అడగనా?"
ఆమె అతనివైపు పూర్తిగా తిరిగింది. బెడ్ లైట్ వెలుతురులో ఆమె కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి.
"ఏమిటది?"
"నువ్వు..."
"ఊ..."
"నీలో..."
"చెప్పండి" ఆమె కళ్ళు నవ్వుతూ, ప్రేమగా చూస్తున్నాయి.
"నీ మనసులో..."
"ఎందుకలా తటపటాయిస్తారు? అడగండి."
"నాకు తెలియనిది, చెప్పకూడనిది సందర్భమేదయినా సరే, దాచి ఉంచిందేమైనా ఉందా?"
విశారద నవ్వింది. "మీ కెందుకొచ్చిందా అనుమానం?" అనడగలేదు.
"నాలో, ఏ ఒక్క అణువులోనైనా... మీకు తెలియనిది, మీకు తెలీకుండా దాచుకునే శక్తి నాలోలేదు."
సంతోషంతో, గర్వంతో అతని హృదయం ఉప్పొంగింది. ఇంకా దగ్గరగా జరిగి, చేతులామె చుట్టూ వేశాడు.
4
విశారదలో రోజు రోజుకీ పిల్లల గురించి అసహనం పెరగసాగింది. పైకి ప్రేమగా ఉన్నట్లే కనిపిస్తారు. 'డాడీ, మమ్మీ' అని ఆప్యాయంగానే పలకరిస్తూ ఉంటారు. కాని ఏ విషయంలో కూడా తాము చెప్పినట్లు వాళ్ళు చెయ్యరు. వాళ్ళకు తోచినట్లే చేస్తూ ఉంటారు.
వినూత్న ప్రవర్తన ఈ మధ్య మరీ బాధ కలిగిస్తోంది. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు పోతుంది. గంటల తరబడి రాదు. ఒకసారి ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళానంటుంది. ఓసారి పిక్నిక్ కు వెళ్ళానంటుంది. ఓసారి ఏ ఫ్రెండ్ దో పుట్టినరోజయితే హోటల్ కి పార్టీకి వెళ్లి వచ్చానంటుంది. ఎప్పుడూ ఎక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి. గంటలతరబడి ఫోన్ కు అతుక్కుపోయి కూర్చుంటుంది. గుసగుసలాడినట్లు, సుతారంగా మాట్లాడినట్లు, ముసిముసి నవ్వులు నవ్వినట్లు ఆ ఫోన్ లో సంభాషణ అలా విరామం లేకుండా సాగిపోతూ ఉంటుంది.
పగలయితే ఏదో అని సరిపెట్టుకోవచ్చు. వారానికి ఒకటి, రెండుసార్లు రాత్రుళ్ళు కూడా ఆలస్యంగా వస్తుంది.
విశారదకు అనుక్షణం టెన్షన్ గా ఉంటోంది. భర్తతో ఈ సమస్య గురించి చర్చించుదామా అంటే అతనసలే సున్నితమనస్కుడు. క్రికెట్ పోటీలో ఇండియా ఓడిపోతే, గవాస్కర్ సరిగ్గా బాటింగ్ చెయ్యలేకపోతే, కపిల్ దేవ్ బాగా బౌలింగ్ చెయ్యలేకపోతే విలవిలలాడిపోతాడు. రెండు, మూడు రోజులు అన్నం తినలేదు. అలాంటి మృదు స్వభావుడికి ఈ సంగతులన్నీ చెబితే మానసికంగా మథన పడిపోతాడు. అతను పిల్లల్నెంత ప్రేమిస్తాడో తనకి తెలుసు. వాళ్ళ వ్యక్తిత్వాల నెంత గౌరవిస్తాడో తెలుసు. ఆ ప్రేమనూ, వాళ్ళకిచ్చే గౌరవాన్నీ నిలబెట్టుకోలేక వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారన్న సత్యం తనకు తెలుసు.
ఓ రాత్రి పదకొండు దాటినా వినూత్న ఇంటికి రాలేదు. ఆరోజు రాజాచంద్ర జ్వరంతో ఇంటికి వచ్చాడు. సాయంత్రం విశారదే అతన్ని పక్కన కూచోబెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆయనిచ్చిన మందులు వాడి, ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉందంటే స్లీపింగ్ టాబ్లెట్ కూడా ఇచ్చింది.
ఇంట్లో పిల్లలెవరూ లేరు.
భర్త నిద్రపోయాక హాల్లోకి వచ్చి చాలా వ్యాకులపాటుతో కూచుంది.
ఓ అరగంట గడిచాక బయట స్కూటర్ చప్పుడయింది. విశారద ఆత్రుతగా కిటికీ దగ్గరకొచ్చి కర్టెన్ పక్కకి తొలగించి చూసింది. వినూత్న ఎవరో అబ్బాయితో స్కూటర్ మీద వచ్చింది. స్కూటర్ ఇంటిముందు ఆగితే చూసింది. ఆమె చెయ్యి ఆ అబ్బాయి చుట్టూ చుట్టుకుని ఉంది. స్కూటర్ పూర్తిగా ఆగాక వినూత్న నాజూగ్గా కిందకు దిగింది. ఇద్దరూ ఓ నిమిషంసేపు చాలా చిన్నగా మాట్లాడుకుంటూ నిలబడ్డారు. రాత్రివేళలో, చీకట్లో తన కూతురు ఓ యువకుడితో అలా మాట్లాడుతూ రోడ్డుమీద నిలబడటం ఆమెకు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఈ దృశ్యం అర్ధనారీశ్వరరావు కళ్ళబడితే అతను తమ కుటుంబం మీద హీనమైన అభిప్రాయం ఏర్పరచుకుంటాడని తెలుసు. కొంచెంసేపటికి ఆ యువకుడు వినూత్న చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆ చేతిని పెదవుల దగ్గరకు తీసుకున్నాడు. విశారద కళ్ళు మూసుకుంది. స్కూటర్ వెళ్ళిపోతున్న చప్పుడు ఓ నిముషం గడిచాక వినూత్న లోపలికి వచ్చింది.
"మమ్మీ! ఇంకా నిద్రపోలేదా!" అనడిగింది తల్లిని చూసి.
విశారద మాట్లాడకుండా కూతుర్ని పట్టి పట్టి చూస్తోంది. "ఎందుకని? నువ్వు అనవసరంగా టెన్షన్ ఫీలవుతావు మమ్మీ"
"మీ నాన్నగారికి జ్వరంగా ఉంది" అంది విశారద.
"అయ్యో! చూసి వస్తానుండు" అని వినూత్న గదిలోకి వెళ్ళబోయింది.
"ఆయన స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని మంచి నిద్రలో ఉన్నారు."
"పోనీలే, రేప్పొద్దుట చూస్తాను మమ్మీ" అంటూ వినూత్న తన గదిలోకి వెళ్ళబోతుంది.
"వినూత్నా! కొంచమాగు."
"ఏమిటి మమ్మీ?"
"నీతో కొంచెం మాట్లాడాలి."