"నువ్వలా అన్నావా? స్విమ్మింగ్ ఫూల్ దగ్గరకొస్తే, ముద్దుపెట్టుకుంటానన్లేదూ? చూడు షాజహాన్! మా అన్నయ్య ఎవరో తెలుసా..... మూడో వార్డు కార్పొరేటర్..... మర్యాదగా మాట్లాడు...." కోపంగా అంది కళ్యాణి.
ఆమె మాటలకు ముందు నవ్వు నవ్వాడు షాజహాన్. సరిగ్గా అప్పుడే మధు అక్కడికి వచ్చాడు.
మనసులతో కలవవలసిన మనిషి, మనుషులతో కలవవలసి వస్తే ఎంత ఇబ్బందిగా వుంటుందో అంత ఇబ్బందిగా వుంది మధుకి.
అప్పుడే వచ్చిన మధుని చూశాడు షాజహాన్.
"ఒరేయ్ మధూ! ముద్దు పెట్టుకుంటానంటాననడం తప్పయి పోయిందిరా.... ఆ మాత్రం సోషల్ మూవింగ్ లేకపోతే..... హాట్ పార్టీలకు రావడం ఎందుకూ....? బీర్లు మీద బీర్లు తాగడం ఎందుకు?" వెక్కిరిస్తూ అన్నాడతను.
కళ్యాణిలో రెండు బీరుల నిషా బాగా పనిచేస్తోంది.
"పార్టీలకు ఆడవాళ్ళు రాకూడదా....? వస్తే ముద్దు పెట్టుకుంటానంటావా? నీలాగే మధు, రవి, రమణ వీళ్ళందరూ తాగారు కదా? వాళ్ళందరూ ఎందుకనలేదూ?" విసురుగా అంది కళ్యాణి.
"అందరూ ముద్దు పెట్టుకుంటానంటే నువ్వు ఒప్పుకుంటావేమిటి? అందుకే నేనొక్కడ్నే అడిగాను. వాళ్ళకి దమ్ములేదు కాబట్టి అడగలేదు. నాకు దమ్ముంది కాబట్టి అడిగాను. ఇప్పుడైనా రెడీ...... అన్వితా! మీ అందరి ఎదురుగా కళ్యాణిని నేనిప్పుడు ముద్దు పెట్టుకుంటాను" గ్లాసులో మిగిలిన విస్కీని గడగడా తాగేసి, విసురుగా ఆమెవైపు అడుగులు వేసి, బుసలు కొడుతూ ఎదురుగా నిలుచున్నాడు.
పరిస్థితి అదుపు తప్పుతోందని తెలుస్తూనే వుంది అన్వితకు.
"రవీ! అతన్ని తీసుకెళ్ళిపో" సీరియస్ గా అందామె.
"సారీ! హాయిగా జరగాల్సిన పార్టీ - ఇంకా మందు కూడా మిగిలిపోయింది" అన్నాడు రవి.
"కావలిస్తే ఆ పీటర్ స్కాట్ తీసుకెళ్ళిపో!" అందామె.
"మిత్రులంతా షాజహాన్ ని ఆ ఇంటి బయటకు తీసుకురావడానికి నానాబాధలు పడాల్సి వచ్చింది.
అందరూ గేటువైపు వెళతున్న సమయంలో మధు తను తెచ్చిన గులాబీపూల గుచ్ఛాని గబుక్కున చేతుల్లోకి తీసుకుని, నలిపి చీకట్లోకి విసిరేశాడు. గబగబా మిగతా వాళ్ళలో కల్సిపోయాడు.
షాజహాన్ ఇంట్లో దిగబెట్టే బాధ్యతను బుచ్చిబాబుకి అప్పగించాడు రవి.
"ఇంకా మందుంది...... మా రూమ్ కి వెళదాం పదండి. ఒరే మధు..... రమణా! ఎక్కండి....." తన హీరోహోండా మీద వాళ్ళిద్దర్నీ ఎక్కించుకుని స్టార్ట్ చేశాడు.
"జాగ్రత్త!" అంది గేటు దగ్గర నుంచున్న అన్విత.
"గుడ్ నైట్" నోటివరకూ వచ్చినా చెప్పలేకపోయాడు మధు.
వెళ్ళిపోతున్న ఫ్రెండ్స్ వైపు అలా చూస్తూ, గేటు దగ్గర రెండు నిమిషాల సేపు నిలబడింది. ఆ తర్వాత లోనికి నడిచింది. అప్పటికే పనివాళ్ళు టేబుల్స్ క్లీన్ చేస్తున్నారు.
ఆమె చూపులు నేరుగా టీపాయ్ మీద పడ్డాయి.
అక్కడ పూలగుచ్ఛం లేకపోవడంతో పనిమనిషిని అడిగింది.
"లేదమ్మా..... నేను చూడలేదు" చెప్పింది పనిమనిషి.
"ఏమైంది? తాగిన నిషాలో ఎవరైనా, ఎటైనా పారేశారా?"
కోపంగా అడిగింది. తనిచ్చిన పూలగుచ్ఛాన్ని పట్టించుకోలేదని అనుకున్న మధు, దాన్ని తనే నలిపేసి వెళ్ళిపోయాడు. దాని గురించి అతడు వెళ్ళిపోయాక అన్విత సీరియస్ గా పట్టించుకున్న విషయం అతనికి తెలిసుంటే, అతనిలో నిగూఢంగా దాగివున్న ధైర్యం బయటకొచ్చేదేమో!
అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనబడకపోవడంతో, ఇంట్లోకెళ్ళిపోయి కాసేపు హాల్లో కూర్చుంది - నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ.
సరిగ్గా అదే సమయంలో అన్నపూర్ణమ్మ మీటింగ్ నుంచి వచ్చింది.
"సారీ బేబీ! లేటైంది. పార్టీ అయిపోయిందట - నీ ఫ్రెండ్స్ ని నేను మిస్సయ్యాను. ఎనీహౌ -ఈసారి నేను పారీ యిస్తాను.
ఇవాళ ప్రపంచంలో ఫెమినిజం గురించి నేను ఎంత గొప్పగా మాట్లాడానో తెలుసా? వండ్రఫుల్!" చెప్పుకుపోతోందావిడ.
ఆవిడ చేతిలో కనిపించిన బొచ్చుకుక్క వైపు చూస్తోంది అన్విత.
"బైదిబై- మరిచిపోయాను. కలెక్టర్ గారి భార్య మిసెస్ భార్గవీరావు ఈ ఆల్సేషియన్ ప్రెజెంట్ చేసింది. బావుంది కదూ? నీకు కంపెనీ ఇస్తుందని తెచ్చా" అందామె.
"గుడ్ నైట్ నానమ్మా! నాకు నిద్ర వస్తోంది" అంటూ మేడమీద తన రూమ్ లో కెళ్ళిపోయింది అన్విత. మిస్సయిపోయిన పూలగుచ్ఛం గురించి ఆలోచిస్తూ.
బెడ్ మీద వాలగానే రెండు నిమిషాల్లో ఆమెకు కళ్ళమీదకు నిద్ర వచ్చేసింది.
* * *
మైదానం నారాయణకు గానీ, వాళ్ళావిడకు గానీ కనిపించకుండా బాత్ రూమ్ లో దూరి స్నానం చేసి రూమ్ లో కొచ్చి డ్రెస్ వేసుకుంటున్న సమయంలో......
'అల్లుడూ! ఒకసారి కిందకొస్తావా...... వేడి వేడి టిఫిన్ చేద్దూగానీ" నారాయణ భార్య గొంతు విని, కిటికీలోంచి కిందకు చూశాడు మధు.
"అల్లుడా! ఇదేం కొత్త పిలుపు? ఇవాళ హాయిగా క్యాంటిన్ లో కెళ్ళి టిఫిన్ చేద్దామానుకున్నాను. ఈవిడ టిఫిన్ చేస్తేగాని వదలదు' అనుకుంటూ కిందకి దిగి-
డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు.
"కూర్చో అల్లుడూ.......! ఈకిష్టమని ఉదయాన్నే వేడి -వేడి వడలు చేశాను. కందిపచ్చడి కూడా చేశాను" మధును చూడగానే కిచెన్ లోంచే అందావిడ.
'అల్లుడు' అని పిలిచినా పిలుపు వినగానే బెడ్ రూమ్ లో తలదువ్వుకుంటూ తనలో తనే మురిసిపోతున్న మైదానం నారాయణ ముఖంలో రంగులు మారిపోయాయి.
దీనికిదేం వరసల పిచ్చి? ఏ వరసలూ పెట్టి పిలవొద్దని నిన్న గంటసేపు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. కానీ వినలేదు. ఇప్పుడు గట్టిగా చెప్పాలి అని మనసులో అనుకున్నవాడై-
"ఏం మధూ.... నిన్న రాత్రి ఎటెళ్ళిపోయావ్? నీకోసం తొమ్మిది గంటల వరకూ చూసి మేం వెళ్ళిపోయాం" అన్నాడు నారాయణ.
"సినిమాకెళ్ళాను సార్!" అన్నాడు మధు.
"ఏం సినిమా?"
"వెడ్డింగ్ సింగర్ సార్!"
"మేం కూడా అదే సినిమాకి వెళ్ళామే..... నువ్వెక్కడా కనిపించలేదు" ప్లేట్లలో వడల్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ అందావిడ.
"బాల్కనీగానీ, ఫస్ట్ క్లాస్ గానీ టిక్కెట్ దొరకలేదు సార్! సెకండ్ క్లాస్ లో ఆ చివర కూర్చున్నానన్న మాట...." అబద్ధం ఆడాడు మధు.
"హాలంతా ఖాళీగా వుందే..... కదూ ఆండాలూ?"
"అవునే..... ఖాళీగా వుందే?"
"నేనొచ్చేసరికి సినిమా స్టార్టయిపొయిందండీ! అప్పటికి టిక్కెట్లు బ్లాకు వాళ్ళు కొనేశారు. వాళ్ళకి బాగా లసొచ్చి వుంటుందండీ."
"ఓహో..... అదీ నిజమే అయుంటుందిలెండి..... అది కాదల్లుడూ అందులో హీరో, హీరోయిన్ డాన్స్ ఎంత బావుంటుందో కదా....... అది చూశాక నిన్ను అల్లుడూ అని పిలవాలని నిర్ణయించుకున్నాను......." అంది ఆండాలు.
"అంటే..... మధుతో డాన్స్ చెయ్యడానికా?" కోపంగా అన్నాడు నారాయణ.
"ఏం తప్పా? కొంచెం జులపాల జుట్టు పెంచుకుంటే మన మధు ఆ హీరోలా వుండడేంటి? ఏమంటావ్ అల్లుడూ?" అంది ఆండాలు.
నారాయణ గజిబిజిగా ఆండాలువైపు, మధు వైపు చూస్తున్నాడు.
మధు గబగబా టిఫిన్ చేసేస్తున్నాడు. అక్కడ నుంచి త్వరగా తప్పించుకోవాలి.
రెండో విడత వడల్ని తేవడానికి కిచెన్ లోకి ఆండాలు వెళ్ళినప్పుడు గబగబా వెనకే వెళ్ళి-
భార్య భుజాల్ని పట్టుకుని వెనక్కి తిప్పి, "వరుసలు వద్దొన్నానా...... మానెయ్..... అంతే!" అన్నాడు గొంతు తగ్గించి.
"అలాగేలేండి...... అందుకా మీ మొగం వడలా అయిపోయింది? మీరున్నప్పుడు ఏ వరసతోనూ పిలవనులెండి. వెళ్ళి టిఫిన్ చెయ్యండి" అంది నారాయణను అసలు పట్టించుకోకుండా.
"నీ సంగతి రాత్రికి చెప్తాను" అంటూ కిచెన్ లోంచి బయటకు వచ్చేసరికి అక్కడ మధు కనిపించలేదు.
గబగబా టిఫిన్ చేసేసి, బయటికొచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు.
సిటీబస్ స్టాప్ లో నుంచున్న మధుని చూసి స్కూటర్ ఆపి-
"ఎక్కు....." అన్నాడు నారాయణ సీరియస్ గా.
మౌనంగా స్కూటర్ ఎక్కి కూర్చున్నాడతను. లోలోపల విసుక్కుంటూ.
"చూడు మధూ..... నేను ఇంట్లో మా ఆవిడ విషయంలో కొంచెం గట్టిగా ఎందుకు ప్రవర్తిస్తానో నాకు తెలుసు. నాకు యాభై ఒకటి. ఎంత మంది ఆడవాళ్ళ మనస్తత్వాల్ని పరిశీలించి వుంటాను? ఏ ఆడపిల్లనూ మనం నమ్మగూడదు. స్త్రీ ఒకడిని ప్రేమిస్తుంది. ఇంకొకడితో కాలం గడుపుతుంది. ఆమె వ్యక్తం చేసే ప్రేమ..... ప్రేమ కాదు. ద్వేషం! ద్వేషం కాదు- వాళ్ళు చీరల్ని విడిచేసినట్టుగా భావాల్ని, అభిప్రాయల్నీ మార్చేసుకోగలరు. అంచేత ఏ స్త్రీనైనా నమ్మినట్టు నటించు..... కానీ నమ్మకు...." చెప్పుకుపోతున్నాడు నారాయణ.
ఆయన మాటల్ని వినడం ఎప్పుడో మానేశాడు. ప్రస్తుతం అతని ఆలోచనలు అన్విత చుట్టే తిరుగుతున్నాయి.
* * *
పార్టీ రోజున అన్విత వాళ్ళింట్లో పర్సనల్ గా మాట్లాడటం ఎంతో థ్రిల్లింగ్ గా వుంది రవికి.
తనకి రెస్పెక్ట్ ఇచ్చి చనువుగా జోకులెయ్యడం ఎక్సయిటింగ్ గా వుంది రమణకి.
తను ఆమెను ప్రేమిస్తున్నాడో లేదో తెలీని పరిస్థితిలో వున్నాడు మధు.
ప్రస్తుతం ముగ్గురూ వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు ఫ్రెండ్స్ తో వున్నారు. మధు ప్రత్యేకంగా, మౌనంగా అన్వితను అభిమానిస్తున్నాడన్న విషయం మిగతా ఇద్దరికీ తెలీదు.
గంటసేపు జిమ్ లో ఎక్సర్ సైజ్ చేసి టవల్ తో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కుర్చీలో రిలాక్స్ గా కూర్చున్నాడు రవి. త్రిబులెక్స్ సిగరెట్ తీసి వెలిగించాడు.