Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 12


    "కమాన్.... టేక్ యువర్ సీట్" అంటూ కోక్ టిన్ అందించింది అన్విత.

 

    అతను మొదట మొహమాటపడ్డాడు.

 

    "మావాడు కొంచెం టచ్ మీ నాట్ వ్యవహారం. అన్నిటినీ బోధపడేట్లు చెప్పాలి. ఫర్వాలేదు తీసుకో! గాజు గ్లాసుల్తో ఏవిచ్చినా తీసుకోవాలి. నేనైతే విషమిచ్చినా తీసుకుంటాను" పెద్దగా నవ్వుతూ అన్నాడు రవి.

 

    మధు బీర్ సిప్ చేయగానే రమణ, షాజహాన్ చప్పట్లు కొట్టారు ఆనందంగా.

 

    "మేం ఎంతగా బతిమిలాడినా తాగనివాడివి.... అన్విత ఇచ్చేసరికి తాగేశావు..... ఒరేయ్ ఆడపిల్ల మహిమ అంటే ఇదేరా...." అన్నాడు బుచ్చిబాబు.

 

    రెండు గుటకలు మింగి, గ్లాసుని టేబిల్ మీద పెట్టాడు మధు.

 

    అతని ఆలోచనలన్నీ తనిచ్చిన పూలగుచ్చంమీదే వున్నాయి.

 

    ఆమె గార్డెన్ లోనే చాలా గులాబీలున్నాయని తెల్సుకోకుండా గులాబీ గుచ్ఛాన్ని ఇవ్వడం తన తప్పు.

 

    కొత్తదనంవల్ల, కొత్త వస్తువుపట్ల, ఇష్టమయిన వస్తువుల పట్ల ఎవరికయినా ఆసక్తి వుంటుంది.

 

    జీవితాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? జీవితం నన్ను ప్రేమిస్తోందా? జీవితం సముద్రం అయినప్పుడు..... ఆ సముద్రంలో నువ్వు ప్రయాణించాలనుకున్నప్పుడు ఎంచుకునే ఒడ్డు ఏమిటి?

 

    ఏ దారంట నువ్వు వెళ్తావు?

 

    అంతమంది మధ్యలో ఏకాకితనాన్ని ఫీలవుతున్నాడు మధు.

 

    అతన్నెవరూ పట్టించుకోవడం లేదు.

 

   
                                           *    *    *    

 

    'హృదయం' అంటే ఏమిటి? నిరంతర జలపాతంలా దుమికే ఒక ఎమోషన్. స్త్రీ పురుషుల మధ్య వుండాల్సింది డివోషన్. ప్రాధమిక స్థాయిలో ఆ డివోషన్ ప్రేమలాగా, ఆకర్షణలాగా కన్పిస్తుంది. ఆకర్షణ జల్లెడలోంచి ప్రేమను చిత్రికపడితే ఆరాధన మిగులుతుంది. టీనేజ్ లవ్ లో గానీ, మిడిల్ ఏజ్ సంసారంలోగానీ, వృద్ధాప్య సమాగమంలో కాని ఏ బంధాన్నయినా పదికాలాలపాటు ఉంచే స్థిరమైన అనుబంధానికి గుర్తు నరాల్లోని అజ్ఞాతపు అంతర్లయ.

 

    నిష్కల్మషమైన హృదయం కాగితం లాంటిది. కోరిక నిండిన హృదయము కరెన్సీలాంటిది. రెండూ కాగితాలే. ఆ రెంటికీ మధ్య స్వప్నానికీ, సత్యానికి మధ్య నున్న వ్యత్యాసం లాంటిది.

 

    ఆధునిక యువతరం అమ్మాయిల్ని డీల్ చెయ్యగలడు. అతనికి హృదయం అంటే ఒక ఇష్టం. ఇష్టాన్ని, ఇష్టం కోరుతున్నప్పుడు సెంటిమెంట్స్ అనవసరం. 'లివ్ అండ్ ఎంజాయ్' అతని సిద్ధాంతం.

 

    మిగతా టేబిల్స్ కు దూరంగా, స్విమ్మింగ్ ఫూల్ పక్కన డిమ్ లైట్ వెలుగులో గ్లాస్ లో బీరుని సిప్ చేస్తున్నాడు రవి. అతనివేపే తదేకంగా చూస్తోంది అన్విత.

 

    "దిసీజ్ ఎ మెమోరబుల్ డే..... మీ టేస్ట్ లన్నీ నాకు నచ్చాయి...." అన్నాడతను.

 

    ఎలాంటి అమ్మాయి అయినా మొదట పొగడ్తకు పొంగిపోతుంది.

 

    "అయ్ టూ లైక్ దిస్ టైప్ ఆఫ్ అట్మాస్పియర్..... మంచి కంపెనీ" అందామె.

 

    "మీరు ఢిల్లీలో ఎవర్నయినా ఇష్టపడ్డారా మిస్ అన్విత?' చాలా క్యాజువల్ గా అడిగాడతను.

 

    "ఎస్! అయ్ లైక్ ఆల్  మై ఫ్రెండ్స్....." అంది అన్విత.

 

    "అయ్ మీన్...... లైకింగ్ మీన్స్ లవ్.... మీరెవరినైనా ప్రేమించారా? అని....."

 

    "ప్రేమా? యూ మీన్ లవ్..... బ్యూటీ ఆల్ వేస్ ఎట్రాక్ట్స్..... అలాగే నన్నూ చాలామంది ప్రేమించారు. అది ప్రేమ అని నేననుకోను. ఇష్టం దగ్గరే ఆగిపోయేది ప్రేమ కాదు. ప్రేమ లేని ఇష్టంతోటే, నావెంట చాలా పనులు చెయ్యటానికి సంసిద్ధులు కావాలి. అంత ధీరత్వం ప్రేమికులకు కావాలంటాడు చలం. అంత ధీరత్వం వున్నవాళ్ళు నాకింతవరకూ తారసపడలేదు. ఆలాంటప్పుడు నేను ప్రేమించటం అనే భావన నాలో ఎందుకు కల్గుతుంది? అందుకే నేనెవర్నీ ప్రేమించలేక పోయాను."

 

    ఆమె మాటల్లో ధ్వనించిన భావాలకు, నిజాయితీకి, స్థిరత్వానికి, కొంచెం లోలోపలే కంగారుపడిపోయాడు రవి.

 


    "ప్రేమంటే ఈ పార్టీలూ, జోక్స్, సోషల్ మూవింగ్.... ఇవే కావు."

 

    "నేనడిగేది పెళ్ళికి దారితీసే లవ్ గురించి" దారి మార్చాడు రవి!

 

    ఒక్కక్షణం విచిత్రంగా చూసింది రవివేపు అన్విత.

 

    "మిస్టర్ రవి! ఈ సీరియస్ టాపిక్ ఇప్పుడు అవసరం అంటారా? పదండి..... టేబుల్ దగ్గరకు వెళదాం."

 

    తన ట్రాప్ లోకి వచ్చేస్తుందనుకున్న అన్విత, సడన్ గా ట్రాక్ మార్చేయడంతో కంగుతిన్న రవి ఇవాల్టికిది చాలు ....పదిరోజుల్లో లైన్లో పడిపోతుందనుకున్నాడు.

 

    "వాట్ మిస్టర్ రమణ అండ్ బుచ్చి..... చాలా స్లోగా ఉన్నారు?" అడిగింది వాళ్ళ టేబుల్ వేపు చూస్తూ.

 

    "రాయల్ ఛాలెంజ్, పీటర్ స్కాట్ కనిపించటం లేదని..... మా షాజహాన్ అంటుంటే...."

 

    "దానికేనా? హాట్ ఉందని చెప్పానుగా" అంటూ లోపలికి నడిచింది అన్విత. ఆమె వెనక వెళ్ళాడు రమణ.

 

    లిక్కర్ క్యాబినెట్ వైపు నడిచింది అన్విత.

 

    మౌనంగా, లాం లో పచార్లు చేస్తున్న మధుకి హాల్లో వాళ్ళిద్దరూ కిటికీలోంచి కనిపిస్తున్నారు.

 

    "మిస్..... అన్విత..... ఎట్మాస్పియర్ మీకు చాలా కొత్త..... జాగ్రత్త" అంటూ తనే లిక్కర్ క్యాబినెట్ లోంచి ఒక రాయల్ ఛాలెంజ్, ఒక పీటర్ స్కాట్ బాటిల్ తీసుకున్నాడు రమణ.

 

    "అంటే?" విచిత్రం కనుబొమలెగరేస్తూ అడిగింది అన్విత.

 

    "మీ ఢిల్లీ సొసైటీ వేరు..... అక్కడ చీటింగ్ వుండదు. సిన్సియర్ ఫ్రెండ్ షిప్ వుంటుంది. ఈ ఏరియాల్లో లవ్ అంటే కేవలం సెక్స్ మాత్రమే..... మీరు కొంచెం జాగ్రత్తగా  వుండాలి. ఎందుకు ముందుగా హెచ్చరిస్తున్నానంటే..... అయ్ లైక్ యూ...... అయ్ లైక్ యువర్ సెన్సిటివ్ ఫీలింగ్స్" ఆడవాళ్ళ విషయంలో రమణ రూట్ వేరు. చాలా పాలిష్డ్ రూట్.

 

    సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళే అమ్మాయి అయినా అతని మాటల్ని నమ్మేస్తుంది. అదీ అతని కేరక్టర్.

 

    "ఎవరి గురించి మీరు హెచ్చరిస్తున్నారు" అడిగిందామె.

 

    "రవి గురించి!" గొంతు తగ్గించి చెప్పాడతను.

 

    నవ్వింది అన్విత.

 

    "ఎందుకు నవ్వుతారు?' అడిగాడతను.

 

    "మిస్టర్ రమణా! నాకు ఢిల్లీలో గర్ల్ ఫ్రెండ్స్ సర్కిల్ కన్నా, బాయ్ ఫ్రెండ్స్ సర్కిలే ఎక్కువ. ఎన్నిరకాల మెంటాలిటీస్ చూసుంటాను? నాతో మాట్లాడటానికి, నన్ను ప్రేమించటానికి 'బెట్స్' కాసేవారు. జస్ట్ ఫర్ ఫన్..... సరదాగా వుండేది" పాత ఫ్రెండ్స్ విషయం చెప్తోందామె.

 

    "బెట్ లో ఎవరూ నెగ్గలేదా?" ఆసక్తిగా అడిగాడు ఆమె మాటల్ని కట్ చేస్తూ.

 

    "నాగురించి బెట్ కట్టేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోతారు! రండీ....." అంటూ హాల్లోంచి బయటకొచ్చింది.

 

    అక్కడ మధు పోర్టికో రెండో స్తంభం పక్కన వున్న ముచ్చటైన గాజుకుండీవేపు చూస్తున్నాడు.

 

    "హలో మధూ! అందరూ అక్కడుంటే- ఇక్కడేం చేస్తున్నారు? మీకు ప్రకృతి ఆరాధనంటే చాలా ఇష్టంగా వుందే- గులాబీపూలు - పూలకుండీలు" నవ్విందామె.

 

    గులాబీపూల ప్రసక్తి తేగానే, మళ్ళీ కుంచించుకుపోయాడు మధు.

 

    "ఇంకా ఖరీదైన బహుమతి తేవాల్సింది....." దూరంగా టీపాయ్ మీద కన్పిస్తున్న గులాబీపూల గుచ్ఛంవైపు చూస్తూ అనుకున్నాడు.

 

    రమణ బాటిల్స్ తో ముందుకెళ్ళిపోయాడు.

 

    "ఇలాంటి పార్టీలకు మీరెప్పుడూ వెళ్ళలేదా?" అతని దగ్గరగా వస్తూ అందామె. ఆమె వంటికి రాసుకున్న సెంట్ పరిమళం అతని ముక్కుపుటాలకు ఉప్పెనలా తగిలింది.

 

    "ఇలాంటి పార్టీలు మీకెలా అందుబాటులో వుంటాయి? మీరంతా మినీ  పీపుల్"  అన్నట్టుగా  వినిపించాయి. ఆ మాటలు మధుకి.

 

    "లేదు..... వెళ్ళలేదు..." అన్నాడు మధు కుంచించుకుపోతూ.

 

    "మా ఇంట్లో రోజూ రకరకాల పార్టీలు జరుగుతుంటాయి.

 

    మా డాడీ వస్తే, ఆయనతోపాటు ఫారిన్ ఫ్రెండ్స్ వస్తారు. రాత్రంతా ఎంత బావుంటుందో తెలుసా? ఆ టైమ్ లో మా  ఇల్లు తాజ్  రెసిడెన్స్ లా వుంటుంది" అందామె.

 

    నగిషీలతో ఉన్న గాజు కుండీలోని మొక్కకున్న లేతాకుల్ని పట్టుకుని చూస్తున్నాడతను.

 

    అది ఆర్టిఫిషియల్ ప్లాంట్  అని తెలియడానికి అతనికి అరక్షణం సమయం పట్టింది.

 

    "ఆ మధ్య నేను ఇక్కడకు రావడానికి ముందు హైదరాబాద్ లో ఒక రోజున్నాను. చార్మినార్ దగ్గర సెకండ్ హాండ్ లో కొన్నాను..... నిజాం నవాబు  ప్యాలెస్ లో  వుండేదిట..... ఇంకోటి ఈసారి వెళ్ళేటప్పుడు కొనాలి" అందామె.

 

    ఎ మనిషికైనా తను అనుకున్నది, తను కోరుకున్నదీ పొందినప్పుడే నిజమైన ఆనందం, తృప్తి లభిస్తాయేమో?

 

    వెనుక నడుస్తున్న మధుని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయింది అన్విత.

 

    స్విమ్మింగ్ ఫూల్ వైపు నడిచి, నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని ఒడ్డున కూర్చున్నాడతను.

 

    అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు.

 

    ఏవో గట్టిగా మాటలు విన్పిస్తుంటే టేబుల్స్ వేపు చూశాడు.

 

    షాజహాన్ కళ్యాణితో ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు. షాజహాన్ ని పక్కకు లాగుతున్నాడు రవి.

 

    లేచి టేబుల్స్ వైపు నడిచాడు మధు.

 

    "ఒరే రవీ..... గుండూ..... మీరెందుకు ఈ పార్టీకొచ్చారో నాకు  తెలుసు.... నాకు నిషా వచ్చేసినా.... నేను  చెప్పనుగాక చెప్పను...." గట్టిగా అంటున్నాడతను.

 

    "ఒరే షాజీ! పదరా  పోదాం" రవి ముందుకు లాగుతున్నాడు.

 

    "ఎందుకురా వెళ్ళడం.... ఇంకా ముందుంది కదా! చూడు అన్వితా! నువ్వు నాకు  అల్లా ఇచ్చిన బహిన్ వి. నేనేం అన్నాను..... మన కళ్యాణి ఎవరు? మన క్లాస్ మేటే గదా? క్లాస్ మేట్ కాబట్టే, పాపా! నువ్వు బావుంటావన్నాను.....  నా లవర్ సుష్మా నాకు లేకపోతే నిన్నే ప్రేమించేవాడ్ని అన్నాను తప్పా? ఇందులో అశ్లీలం, అసభ్యత ఎక్కడైనా వున్నాయా....  చెప్పండ్రా?" అరుస్తూ అన్నాడు షాజహాన్.

 Previous Page Next Page