Previous Page Next Page 
మోహిత పేజి 13


  

      ఇద్దరూ కాసేపు చేపపిల్లల్లా ఈతలు కొట్టి, మధ్య మధ్యలో కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆ యువకుడు ఆమెను గిచ్చుతున్నప్పుడల్లా ఆ అమ్మాయి ఆనందంతో అరుస్తోంది. అతని గుండెలమీద పడిగుద్దులు కొడుతోంది. కాసేపయ్యాక ఆమె రెండు భుజాలను పట్టుకుని నీళ్ళ అడుక్కి ఆమెను లాక్కొని వెళ్ళిపోయాడు.

 

    ఐదు నిముషాలు గడిచింది. మళ్ళీ నీళ్ళపైకి తేలారిద్దరూ. ఆ అమ్మాయి నీళ్ళలోంచి బయటకొచ్చి, పొడి ఇసుకమీద కూర్చుంది.

 

    అతను కూడా పక్కకొచ్చి కూర్చున్నాడు.

 

    అతని గుండెలమీద తడిని చేత్తో తుడుస్తోంది. పక్కన వున్న అడవిపూలను తుంచి, ఆమె సిగలో సర్దుతున్నాడతను. ఆమె మురిసిపోతూ ముసిముసిగా నవ్వుతోంది.


    
    ఆమె ఏవో కబుర్లు చెపుతూంది. అతను వింటున్నాడు.

 

                                              *    *    *

 

    వెదురు పొదల్ని దగ్గరగా చేర్చేసి లేచి నిలబడ్డాడు.

 

    మైత్రేయ శృంగార ప్రక్రియను కళ్ళారా చూసినా తనలో ఏ మాత్రం ఉద్రేకం కలగలేదెందుకు?

 

    మోహితను అర్థనగ్నంగా చూసినప్పుడు తనలో చంచలత్వం ఎందుకు కలుగుతోంది?

 

    ఆ గిరిజన దంపతులు దృశ్యాన్ని చూడమని మోహిత ఎందుకు చెప్పింది? వెనక్కి తిరిగి అటూ యిటూ చూస్తూ మోహితను వెతుకుతున్నాడు మైత్రేయ.

 

    కామసూత్ర సినిమాలో రేఖ ప్రేమ సూత్రాలు చెప్పినట్లు తనకు మోహిత ప్రేమ దృశ్యాలు చూపెడుతోందా?

 

    ఆలోచిస్తున్న మైత్రేయ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆకస్మాత్తుగా చెట్టుమీద నుంచి దూకి తనకెదురుగా నిలబడిన మోహితని చూసి "చెట్టుమీదేం చేస్తున్నారు?" విస్మయంగా అడిగాడతను.

 

    "నువ్వు చూసిన దృశ్యాన్నే నేనూ లాంగ్ షాట్ లో చూశాను.... బావుంది కదూ.... "ఆమె కళ్ళల్లో కోటికామనల కాంతి.

 

    మైత్రేయ వంటినిండా చెమటలు పట్టేశాయి. అణువణువునా రగులుతున్న కోరిక. తనేం చేస్తున్నాడో తనకే తెలియని ఓ ఉద్విగ్న స్థితిలో పెనువేగంతో ఆమె భుజాల్ని పట్టుకుని గుండెలకు అదుముకున్నాడు.

 

    ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె వారిస్తూ కిందకు ఇసుకలోకి జారిపోయింది.

 

    ఆమెమీద పడ్డాడతను.

 

    అతని చేతుల్నుంచి తప్పించుకుని దూరంగా జరిగిపోయింది.

 

    ఓ బండరాయిమీద కూర్చుందామె.

 

    ఆవేశంగా ముందుకు కదలబోయిన అతన్ని వారిస్తూ-

 

     "జస్ట్ వన్ మినిట్.... మైత్రేయ.... మగాడ్ని నచ్చిన ఆడదానిని ఆ మగాడితో వెళ్ళకుండా ఎవరూ ఆపలేరు. అలాగే మగాడ్ని నచ్చని ఆడదానిని ఆ మగాడితో ఎవరూ వుంచలేరు. నువ్వు నాకు నచ్చావు. నీతో నేను గడుపుతాను. కానీ  ఇలా అడవిలో ట్రైబల్స్ లా కాదు. హాయిగా.... చక్కగా.... ఏ.సీ. రూమ్ లో నీకు నచ్చిన విధంగా" ఒక్కొక్కమాటనూ వత్తిపలుకుతూ అంది మోహిత.


    
    క్షణంసేపు ఆలోచించాడు మైత్రేయ.

 

    "ఆ గెస్ట్ హౌస్ లో ఏ.సీ.రూమ్ వుందా?" కోపంగా అడిగాడు.

 

    స్త్రీ విషయంలో ప్రతి మగవాడిలోనూ మూడు రకాలయిన బలహీనత లుంటాయి. అభిమానం, ప్రేమ, కాంక్ష- కొంతమంది మగవాళ్ళు స్త్రీ చూపే కేవలం అభిమానానికే ఆమె చుట్టూ శలభాల్లా తిరుగుతారు. మరికొంతమంది మగవాళ్ళకు స్త్రీ నుంచి ప్రేమ కావాలి. ఆ ప్రేమ వికటిస్తే ద్వేషంగా మారుతుంది. మూడోది కాంక్ష. క్షాంక్షచుట్టూ అల్లుకునే బంధం క్షణకాలమయినా, శాశ్వతమయినా దాని ఆకర్షణ గొప్పది.

 

    మోహ సముద్రంలో కొట్టుకుపోయే ఆకర్షణ అది.

 

    సత్యాసత్యాలకు అతీతంగా కనే కలల సాలెగూడు అది.

 

    'ఆ గూటిలో చిక్కుకున్న మగాడు బయటకు రావడానికి చాలాకాలం పడుతుందనే' విషయం మోహితకు బాగా తెల్సు.

 

    అందుకే అతి తక్కువ సమయంలో మైత్రేయను తనకు అనుకూలంగా తన మాటను వేదమంత్రంలా పాటించే వ్యక్తిగా చేసుకున్నందుకు ప్రస్తుతం ఆమె సంతోషిస్తోంది.

 

                                            *    *    *

 

    గుండెలనిండా పొగపీల్చి ఆమెవేపు చూశాడు మైత్రేయ.

 

    "మిష్టర్ మైత్రేయ...... మీ సిన్సియారిటీ మీద దృఢమయిన మీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాకు కావలసిన వ్యక్తి ఇంత త్వరగా దొరుకుతాడని నేననుకోలేదు. ఎనీహౌ...... గాడ్ ఈజ్ గ్రేట్. టెస్ట్ లో మీరు సెలక్ట్ అయ్యారు" అంది మోహిత. అతని చేతివేళ్ళ చివర కాలుతున్న సిగరెట్ వేపు చూస్తూ.

 

    "టెస్ట్ లో పాసవడం ఏంటీ...." ఆశ్చర్యంగా అడిగాడతను.

 

    "నేన్నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నావు.... నీ  కోరికను నేను తీరుస్తాను. కానీ ఒక షరతు.అంతకుముందు నేను దేనికోసం బతుకుతున్నానో ఆ కోరికను నువ్వు నెరవేర్చాలి" ఉద్వేగంగా అంది మోహిత.

 

    "ఏమిటా కోరిక?"

 

    "అదొక మారణహోమం..... నాకు అన్యాయం చేసి, హాయిగా బతుకుతున్న మహేంద్ర, జయంత్, ఆదిత్యలు భూమ్మీద వుండకూడదు. ఆ ముగ్గురు వ్యక్తుల్నీ, మరో కంటివాడికి తెలియకుండా మర్డర్ చెయ్యాలి. చెయ్యగలవా?" సూటిగా ప్రశ్నించిందామె.

 

    ఆ సమయంలో మోహిత ఏం చెప్పినా, మరో ఆలోచన లేకుండా చేయడానికి సిద్ధంగా వున్నాడు మైత్రేయ

 

    కానీ  మోహిత అంత ప్రమాకరమయిన కోర్కె కోరుతుందని మైత్రేయ వూహించలేకపోయాడు. అందుకే కొద్దిక్షణాలు శిలలా బిగుసుకుపోయాడు.

 

    "డోన్ట్ వర్రీ మైత్రేయా! నీ వెంటే నేనుంటాను. పర్ ఫెక్ట్ మర్డర్ ప్లాన్ నేనిస్తాను. దానిని నువ్వు అమలు చేస్తే చాలు. నీ జోలికి పోలీసులు రాకుండా చేసుకునే  బాధ్యత నాది. మొదటి మర్డర్ జరగ్గానే నేను నీదానిని అవుతాను. మూడో మర్డర్ తర్వాత..... నువ్వూ, నేనూ పెళ్ళి చేసుకుందాం సరేనా?" అతని కుడిచేతిని తనచేతిలోకి తీసుకుంటూ అంది మోహిత.

 

    "ఈ లిస్ట్ లో రాజేంద్రకుమార్ ఎందుకు లేడు?" అడిగాడు మైత్రేయ విస్మయంగా.

 

    "వాడ్ని చంపాలో. జీవశ్చవంలా వుంచాలో నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు" ఆ మాటల్లో తీవ్రమయిన కసి ధ్వనించింది.

 

    ఆమెలోని పట్టుదల, కసి, ఆవేశం, ఆగ్రహం కలిసి ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాయి. ఆ క్షణాన మోహిత అతనికి కొత్తగా కన్పించింది.

 

    నువ్వూ, నేనూ పెళ్ళి చేసుకుందాం. ఆ మాటలు మైత్రేయలో ఎంతో ఉత్తేజాన్ని నింపాయి. గొప్ప సౌందర్యం తన స్వంతమవుతున్న భావన అతనిలో మత్తుమందులా పనిచేస్తోంది.  

 

    "నన్ను తమ రాక్షసకామానికి వుపయోగించుకున్న ఎస్పీ మహేంద్ర ప్రస్తుతం విజయవాడలో వుంటున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ శ్రీశైలంలో వుంటున్నాడు. లాయర్ ఆదిత్య పెరిగిన హోదాతో గుంటూరులో వుంటున్నాడు" చెప్పింది మోహిత.

 

    మైత్రేయకి ఆ సమయంలో అకస్మాత్తుగా ఇందుమతి జ్ఞాపకానికొచ్చింది. ఇందులోని అమాయకత్వం, ఆమె మాటల్లో వ్యక్తమయ్యే అభిమానం ఆమె చేతల ద్వారా అర్థమయ్యే సున్నితమయిన ప్రేమంటే మైత్రేయకి చాలా ఇష్టం.

 

    ఆమె తనని ప్రేమిస్తోంది. అంతకుమించిన ఆరాధన తనపై వుంది. జీవితంలో మొదటి ముద్దుని ఇచ్చిన వ్యక్తిని మరిచిపోవడం కష్టం. మొదటి ముద్దు ఎప్పటికీ మానని గాయంలాంటిది.

 

    మోహిత మీద ఆకర్షణకు, మోహాన్ని పెంచుకుని, తను ఇందుకు దూరమయిపోతున్నాడా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారి గుండెల్లో వెయ్యి గుండుసూదులు దిగబడినట్లుగా అయిపోయింది మైత్రేయ హృదయం.

 

    "ఏంటాలోచిస్తున్నావ్ మైత్రేయ? కొంత రిస్క్ తప్పదు. యూ కెన్ ఈజీలీ టాకిల్ ద రిస్క్.... ఐనో దట్... నీ మనసులో ఏవైనా భయాలు, సందేహాలూ వుంటే ఇప్పుడే చెప్పెయ్" సూటిగా అడిగింది మోహిత.

 

    "నో ... నో .... నాకు భయాలూ, సందేహాలూ ఏమీలేవు. అయామ్ రెడీ..... నీకోసం..... నేనేమయినా చెయ్యడానికి సిద్ధంగా వున్నాను. ఐ లవ్ యూ.... ఐ వాంట్ యూ.... నీ కోసం చాలా వదులుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేస్తే" సీరియస్ గా అన్నాడు మైత్రేయ.

 

    మైత్రేయ అమాయకత్వానికి జాలిపడి ఆ వెంటనే నవ్వేసింది మోహిత.

 

    "ఆవేశపడకు మైత్రేయా! నీకేం కావాలో దాన్ని నేనిస్తాను. నా కోరిక నెరవేర్చు. వాళ్ళు ముగ్గురూ భయంకరంగా చావాలి..... అదే నా లక్ష్యం..... నా ప్లాన్ చెప్తాను విను" చెప్పసాగింది మోహిత.

 

    అరగంట గడిచింది.

 

    అంతా విన్నాక "నీది వండ్రపుల్ క్రిమినల్ బ్రెయిన్" అన్నాడు మైత్రేయ.

 

    "పరిస్థితులే మనుషుల్ని క్రిమినల్స్ చేస్తాయి. నిజానికి క్రిమినల్స్ అందరూ క్రిమినల్స్ కారు. చట్టం దృష్టిలో నేరాలు, వ్యక్తిగత జీవితపు అనుభవం దృష్టిలో నేరం కాకపోవచ్చు.

 

    ఉదాహరణకు నా జీవితాన్ని తీసుకో! ఒక దూర్మార్గపు భర్త వుంటాడు. బతుకంతా డూప్లిసిటీతో బయటకు మంచివాడిలా నటిస్తూ, నాలుగ్గదుల మధ్య భార్యను బందీలా వంచిస్తాడు. తన ఎదుగుదలకు, తన అవసరాలకు, తన ఆస్తులు పెంచుకొనేందుకు, హోదాని ప్రదర్శించు కొనేందుకు, ఆర్ధిక పునాదుల్ని పటిష్టం చేసుకొని, పైపైకి ఎగబాకేందుకు, గద్దెలమీద ఎక్కేందుకు భర్తే బ్రోకరై, భార్యని తార్చే నీచులు ఎక్కువైపోతున్న సమాజమిది. భార్యని పెట్టుబడిగా మార్చుకొనే దౌర్భాగ్యుల్ని ఈ సమాజం గౌరవించటం ఎంత అన్యాయం? అలాంటి సమయంలోనే ఆ భార్య తనకు నచ్చిన పద్ధతిలో ప్రవర్తిస్తుంది. పురుషాహంకారాన్ని, గౌరవప్రదమయిన బాధ్యతగా నమ్మే సొసైటీలో ఆ భార్య ఎన్నో నిందల్ని భరించాల్సి వస్తుంది. అందుకే మన పాత చట్టాల్ని మార్చాల్సిన అవసరం వుందని నేనంటాను. మగవాళ్ళు చేసే నేరాలు, ఆడవాళ్లు చేసే నేరాలకు ప్రత్యేకమయిన చట్టాలుండాలి. మానవత్వం దిశగా తీర్పులుండాలి. స్త్రీల మీద సానుభూతితో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ల వల్ల స్త్రీలకు ఏం లాభం జరుగుతోంది? స్త్రీ నేరాలమీద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులవల్ల స్త్రీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందా?

 

    పోలీసు స్టేషన్లను, కోర్టులనీ నియంత్రించే చట్టం ఎప్పుడో పాతబడి పోయింది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ హైటెక్ నేరాలు. మన రాజ్యాంగాన్ని తిరగరాయాలి, మన చట్టాన్ని తిరగరాయాలి" ఆవేశంగా చెప్పి మైత్రేయ కళ్ళల్లోకి సూటిగా చూసింది మోహిత.

 

    మోహిత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ.

 

    ఈమె చాలా అరుదైన మనిషి..... అరుదైన వ్యక్తిత్వం మనసులో అనుకున్నాడతను.

 

    మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది మోహిత.

 

    "మైత్రేయా! నా గురించి నీకన్నీ తెలుసు. మరి నీ గురించి నేను తెల్సుకోవాలనుకుంటున్నాను."

 

    సడన్ గా టాపిక్ ను  మార్చేసిన మోహిత ముఖంలోకి కొద్దిక్షణాలు విస్మయంగా చూసి తన గతమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు మైత్రేయ.

 

    అంతా విన్నాక-

 

    "అయితే నీకూ ఇందూకూ మధ్య నేనొచ్చానా? ఇందంటే నీకిష్టమేనా?" స్త్రీ సహజమయిన ఆసక్తితో అడిగింది మోహిత.

 

    "నేనంటే ఇందుకు చాలా ఇష్టం" చెప్పాడతను.

 Previous Page Next Page