Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 12

   

      స్థాణువయింది ఏకాంత అమాయకంగా కనిపించే పెద్దమ్మ 'అమ్మా ఏకాంతా' అంటూ ఎప్పుడూ ఆత్మీయంగా లోనికి ఆహ్వానించే పెద్దమ్మ కూడా తనని నిందించడానికి వెనుకాడడంలేదు.
    
    "ఎందుకు ఏకాంతా" పెదనాన్న గొంతులో ఇప్పుడు తనమీద జుగుప్స కన్నా బాధావేశాలు ధ్వనిస్తున్నాయి. "చదువుకోసమని హైదరాబాదు వెళ్ళినదానివి డబ్బు అవసరమైతే నాకు రాయాల్సింది కాని వ్యభిచారంలో ఎందుకు అడుగుపెట్టావు... అది చాలక హత్య కూడా ఎందుకు చేశావు?"
    
    నేను పతితను కాను అంటూ ఆమె అరవలేదు.
    
    నిశ్శబ్దంగా మార్చి మార్చి చూసింది ఇద్దర్నీ ఈ క్షణందాకా కన్నకలలు కళ్ళను మంటలకు గురిచేస్తుంటే మిగిలిన ఒక్క ఆశాతీగను మోస్తున్న సితార మూగపోయినట్టు ముందు శిలైంది. తర్వాత ఫకాల్న నవ్వింది. ఏం మిగిలిందని బాధపడటానికి? తను నిర్దోషినని నమ్మిస్తే మాత్రం ఒరిగేదేముంది?
    
    వెనక్కి మరలింది ఏకాంత. ఒకనాడు అమ్మతో కలసి బ్రతికిన ఇంటికి సైతం వెళ్ళాలనిపించలేదు.
    
    అసలు ఏ మనిషినీ ఇక కలవాలనిపించలేదు.
    
    ఓ బరితెగించిన ఆడదానిగా అందరూ చూస్తుంటే అందమైన ఉదయాలను, బాల్యంలోని సరదాలను, స్వప్నాల్ని గుర్తుచేసే మామిడితోపు గుండా అడుగులు వేసి ఏటిఒడ్డుకు నడిచింది.
    
    వేదాంత గాంధర్వాన్ని ఆలపిస్తున్న శారదానది తనను గుర్తుపట్టినట్టు చిరుచప్పుడు చేస్తూ ప్రవహిస్తోంది.
    
    ఆమె కళ్ళు మూసుకుంది బడలికగా...
    
                                           *    *    *
    
    "ఎస్"
    
    పోలీస్ స్టేషన్ హౌసాఫీసర్ ఇన్స్ పెక్టర్ ధనుంజయ తలపైకెత్తి చూశాడు ఎదురుగా నిలబడ్డ ఆశ్రితని.
    
    "నా పేరు ఆశ్రిత మీ సహాయం కోరి వచ్చాను."
    
    "వెల్ కమ్" ఉత్సాహంగా కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించలేదు. "చెప్పు"
    
    తరచుగా గూండాలు, జేబుదొంగలతో తప్ప ఆశ్రితలాంటి అందమైన పైగా వయసులో ఉన్న అమ్మాయిలతో స్టేషన్ లో కబుర్లు చెప్పే అవకాశము లేకపోవడంతో ఏకవచనంతోనే సంబోధించాడు ఆమెను ఆపాదమస్తకం పరికిస్తూ.
    
    ఆశ్రిత కోపం తెచ్చుకోలేదు. చాలా క్యాజువల్ గా చూసింది "సరిగ్గా రెండు రోజుల క్రితం నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటనకి తట్టుకోలేని మా నాన్నగారు గుండె ఆగి చనిపోయారు" వివరంగా చెప్పింది ఏ స్థితిలో తన తమ్ముడు ఆత్మహత్య చేసుకుందీ స్పష్టం చేస్తూ.
    
    "మీ తమ్ముడ్ని కాలేజీ నుంచి లాక్కెళ్ళి అలా కొట్టి హింసించిన వ్యక్తి ఎవరు?"
    
    "హోం మినిష్టర్ సూర్నారాయణ"
    
    అలర్టయినట్టుగా కూర్చున్నాడు ధనుంజయ. హఠాత్తుగా తన జ్యూరిస్ డిక్షన్ లో జరిగిందంతా గుర్తుకొచ్చి టేబుల్ మీదున్న మంచినీళ్ళు తాగి "ఏమిటీ.... అయితే హోం మినిస్టర్ గారి మీద కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చావా?" అన్నాడు పైకి లేస్తూ.

    "ఏం హోం మినిస్టర్ చట్టానికి అతీతుడా?" నిశితంగా చూసింది ఆశ్రిత. "ఒక వ్యక్తి చావుకి ప్రత్యక్షంగా కారణమైనా లేక తన చర్య వలన ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితిని సృష్టించినా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ నెం 307 ప్రకారం హత్యా నేరం మిస్టర్ ఇన్స్ పెక్టర్ కాబట్టి సూర్నారాయణ మీద చర్య తీసుకోవడం తప్పు కాదనుకుంటాను."
    
    రెప్పలార్పకుండా చూశాడు ధనుంజయ. రాజేష్ కి సంబంధించిన మరణంలో ఎలాంటి రిపోర్టునీ తీసుకోకూడదన్నది కమీషనర్ సవ్యసాచి గారి ఆదేశం.
    
    "అయితే నీకు సెక్షన్ నెంబర్లు కూడా తెలుసన్నమాట" అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ.
    
    ఆశ్రిత తొణకలేదు. "కేవలం సెక్షన్ నెంబర్లు మాత్రమేకాదు ఇన్స్ పెక్టర్! సుమారు 132 సంవత్సరాల క్రితం కాన్ స్టిట్యూట్ చేయబడ్డ పోలీస్ వ్యవస్థ, దానికి సంబంధించిన భారత శిక్షాస్మృతి జమ్మూ కాశ్మీర్ కు తప్ప భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి వర్తిస్తుందని తెలుసు. నేరస్తుడు ఏ స్థాయిలో వున్నా చట్టరీత్యా అతడు శిక్షార్హుడనీ తెలుసు."
    
    "నీకు పిచ్చిపట్టిందా?"
    
    ఓ అమ్మాయి తనకే తెలియని చాలా విషయాలు మాట్లాడ్డం నచ్చనట్టుగా అరిచాడు. "నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? రాష్ట్ర శాంతి భద్రతలకి ఇన్ ఛార్జి అయిన హోంమినిస్టర్ మీద నేను చర్య తీసుకోవాలా?"
    
    "ఏం తీసుకోకూదదా?"
    
    "ఇది డెమోక్రసీ అమ్మడూ... నువ్వు నేరస్తుడిగా చెబుతున్నది ప్రజలు పట్టంకట్టిన ఓ మినిష్టర్ని."
    
    "పోలీసులు కేవలం ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా నడుచుకోవాల్సింది ఆటోక్రసీ లేదూ డిక్టేటర్ షిప్ ప్రభుత్వాలున్నప్పుడు మాత్రమే ఇన్స్ పెక్టర్....డెమొక్రసీలో ప్రజల కోసం ప్రజా రక్షకులుగా వ్యవహరించాలి."
    
    ధనుంజయ మామూలు పోలీసాఫీసర్ అయివుంటే ఆమె మాటలకు కంగారుపడేవాడే కానీ అతడు బతకనేర్చిన పోలీసాఫీసర్ అటు సూర్నారాయణకి, ఇటు కమీషనర్ కి తొత్తుగా బతుకుతూ వారి ఆదేశాలమీద ఎలాంటి అఘాయిత్యం చేయడానికయినా సిద్దపడే మనస్తత్వం కలవాడు.
    
    "వయసులో వున్నావు"
    
    హఠాత్తుగా అతడు తన వయసు గురించి మాట్లాడ్డంతో ముందు అవాక్కయింది.
    
    "పైగా అందంగా వున్నావు" ధనుంజయ అవహేళనగా అన్నాడు రెట్టిస్తూ.
    
    సహజంగా ధైర్యవంతురాలు ఆమె పైగా ఇప్పుడు మానసికంగా నలిగిపోయి వుంది కూడా. "నేను వయసులో వున్నా, అందంగా వున్నా ఇప్పుడు అడవిలో నిలబడి మాట్లాడ్డం లేదు కాబట్టి నాది అరణ్యరోదన అయ్యే అవకాశం లేదు"
    
    "ఏం చేద్దామని?" ఉక్రోషంగా రెండడుగులు ముందుకేశాడు.
    
    "సింపుల్ మిస్టర్ ఇన్స్ పెక్టర్! మీరుమర్యాదగా నా కంప్లయింట్ తీసుకుని లీగల్ గా ప్రొసీడ్ కాకపోతే నేను చేతులు ముడుచుకు కూర్చోను. సిటిజన్ గా పర్సనల్ లిబర్టీ, పర్సనల్ ప్రొటెక్షన్ కి సంబంధించిన ఆర్టికల్స్ 19 నుంచి 22 దాకా పత్రికలకు తెలియజెపుతాను. ఓ రాజకీయ నాయకుడికి కొమ్ముకాస్తున్న మీ అవినీతి గురించి ఏకరువు పెట్టి నేను అనుకున్నది సాధిస్తాను."
    
    "అప్పుడు నేనేం చేస్తానో తెలుసా?" తోడేలులా నవవాడు ధనుంజయ. "నిన్నో రాడికల్ అని చెప్పి సెల్ లో వేస్తాను... నీ పైత్యం తగ్గకపోతే సెల్ లోనే నిన్ను రేప్ చేసి ఆనక నిన్ను షూట్ చేసి శవాన్ని సిటీ పొలిమేరల్లో పడేస్తాను. ఎన్ కౌంటర్ లో చచ్చానని ఆ పత్రికలకే తెలియచేస్తాను..." అంటూ ఊరుకోలేదు ధనుంజయ-ఆమె చేయి పట్టుకున్నాడు.
    
    స్టేషన్ లోని కానిస్టేబుల్స్ వినోదంగా చూస్తుంటే విదిలించుకోవాలని విఫల ప్రయత్నం చేస్తున్న ఆమెను సెల్ లోకి లాక్కెళుతున్నాడు.

 Previous Page Next Page