కిటికీ దగ్గర ఒక వూచను చేత్తో పట్టుకు నిలబడి మ్లానవదనంతో విషాదంగా, బయటకు చూడసాగాడు, కిటికీలోంచి బయటనున్న వెలుతురు అతని ముఖంమీద కొంతభాగంలో పడుతూ వెలుగు చీకట్లను ఏర్పరుస్తున్నాయి.
"నారాయణా!"
ఏదో ఊహాలోకంలో విహరిస్తున్న నారాయణకు ఈ పిలుపు వెంటనే వినబడలేదు. కాని ఏదో కలలో తనని ఎవరో పిలుస్తున్నట్లు ఊహాలోకంలోనే భావించుకున్నాడు.
అదే కంఠస్వరం అదేస్థాయిలో మళ్ళీ వచ్చింది.
ఈసారి తెలివి తెచ్చుకుని చటుక్కున వెనక్కి తిరిగి కొంచెం ఉలిక్కిపడి "ఏమిటమ్మా?" అన్నాడు.
"నారాయణా! నిన్ను కాని యిరవైయైదేళ్ళు ఈ చేతుల్తో పెంచినా నీ హృదయాన్ని సగంకంటే యెక్కువ అర్థం చేసుకోలేకపోయాను. దీనికి కారణం నా అంతరంగాన్ని నువ్వు సగంలో సగంకూడా అర్థం చేసుకోలేకపోవడమే కావచ్చు. లేకపోతే కాఫీ త్రాగటం మధ్యలోనే ఆపి వచ్చేయల్సిన అవసరం నాకు కనబడదు" వణుకుతున్న కంఠంతో అని కాఫీ గ్లాసు అతనికి అందించింది.
అందుకుంటూంటే అతని చేయి కంపించింది. అశ్రుప్లావితాలై వున్న తల్లి నేత్రద్వయంలోకి చూస్తూ "అమ్మా!" అన్నాడు గాద్గదికంగా.
శారదాంబ అక్కడినుంచి కదిలి వెళ్ళిపోతూ "నావల్ల యెవరి మనస్సూ కష్టపడటం నేను సహించలేను. నా కోసం ఒకరు బాధపడటం అంతకన్నా నాకు ఇష్టంలేని విషయం ఎవరికీ నావల్ల ఏ యిబ్బందీ కలగకుండా వుండేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. ఇదివరలో నేనెలా ప్రవర్తించినా ఇప్పట్లో నా నైజం అదే. నీకు కూడా అదే చెబుతున్నాను నారాయణా! నా కోసం నువ్వేమీ..... " అంటూ ఆ వాక్యం పూర్తి చేయలేక అక్కడ్నుంచి త్వరత్వరగా రెండు మూడడుగులు వేసింది.
"అమ్మా!"
ఆమె హఠాత్తుగా ఆగిపోయింది. వెనుదిగిరి కొడుకు ముఖంలోకి సూటిగా చూసింది.
"నీ మాట వినలేదే అని బాధపడటం కన్నా, ఎందుకు వినలేదో అని కాస్త ఆలోచించావా?"
రెండు క్షణాలు మౌనంగా గడిచాక మళ్ళీ అతనే "ఇంట్లో ఎవరికీ సరిగ్గా ఆలోచించటం చేతకాదన్న సత్యం నే నేనాడో గుర్తించాను. ఒక్క విషయం అడుగుతాను. మనం రోజులు ఎలా నెట్టుకు వస్తున్నామో నీకు తెలియని విషయమా!"
శారదాంబ మాట్లాడకుండా నిల్చుంది.
"మనం ఎలా బ్రతుకుతున్నాం? సంఘంలో మనకున్న స్థితి ఏమిటి? ప్రకాశం మద్రాసులో ఎట్లా చదువుకుంటున్నాడు? రాధ పెళ్ళి ఎలా ఔతుందీ. ఇవన్నీ నాకేం అక్కర్లేదా? నా పెళ్ళి విషయమే ముఖ్యమా?"
జవాబు చెప్పలేదు తల్లి.
"ప్రకాశం డబ్బులేక అక్కడ ఎంత ఇబ్బంది పడుతుంటాడో నీకేమైనా తెలుసా? తృణమో, ఫణమో మనం పంపిస్తున్నాం. ఇహ- ఆ ఆస్కారం కూడా వాడికి లేకుండా చేయలా? వాడి లా కోర్సు యెట్లా పూర్తి అవుతుంది?"
ఓ క్షణం ఆగి "వాడి లా పూర్తయేవరకూ నేను పెళ్ళిచేసుకోదలచుకోలేదు. అంతేకాదు; రాధ పెళ్ళి అయేదాకా నేను పెళ్ళి చేసుకోను. వయస్సుతోపాటే పెళ్ళి అన్న సూత్రాన్ని నేను అంగీకరించను. జీవితానికి ముఖ్యంగా కావలసింది పెళ్ళి అని నేననుకోను, నన్ను సగం సగం కాకుండా పూర్తిగా అర్థం చేసుకో అమ్మా!" అంటూ ఇహ అక్కడ ఆగకుండా తల్లిని తప్పుకుని బయటకు వెళ్ళిపోయాడు.
ఆశ్చర్య చకితురాలయిన ఆమె అలాగే చాలా సేపు నిలబడిపోయింది. ఆమె తెచ్చిన కాఫీ బల్లమీద అలాగే వుంది. ఒక్కక్షణం దాని వంక సజల నేత్రాలతో చూసి, పమిట చెంగుతో కళ్ళు తుడుచుకొని "నాయనా" అంది రుద్దకంఠంతో.
ప్రకాశరావు కోసం నారాయణ కష్టపడి ఎలాగో ఇరవై అయిదు రూపాయలు సంపాదించాడు. నారాయణ బ్యాంకులో పనిచేస్తాడు. అతని జీతం బొటాబొటిగా నూరు రూపాయలు. నూరు రూపాయలు అంత పెద్ద కుంటుబానికి ఏ విధంగా సరిపోతాయి? అతని జీతం రావటానికి ఇంకా కొన్ని రోజులు వ్యవధి వుంది. ఓ స్నేహితుడి దగ్గర బ్రతిమలాడి అప్పుతీసుకున్నాడు. అటే తీసుకుపోయి పోస్టాఫీసుకి వెళ్ళి మనియార్డర్ చేసి వచ్చాడు.
పొద్దున్న జరిగిన విషయాలన్నీ అతని స్మృతిపధంలో మెదులుతున్నాయి. తన మాటలవల్ల తల్లికేమయినా కష్టం కలిగిందేమో తెలీదు. కాని ఆ పరిస్థితిలో తను అంతకన్నా మాట్లాడగలిగిందీ, చేయగలిగిందీ ఏమీ లేదని అతను భావించాడు. పెళ్ళి చేసుకునే యీడు వచ్చిందని అతనికి తెలుసు. ఏదయినా సుఖపడితే, ఆనందాన్ని కలిగించే జీవితం అనుభవిస్తే ఈ వయస్సులోనే అనీ అతనికి తెలుసు. కాని అతని తలలో అనేక ఆలోచనలు వున్నాయి. అవన్నీ తీరేదాకా అంతే.
ఆ సాయంత్రం ఇంటికి చేరేసరికి అయిదు దాటింది. అతనికి చాలా తలనొప్పిగా వుంది. దార్లో కాఫీ తాగుదామనుకున్నాడు. కాని జేబులో ఏమీ డబ్బు లేకపోవడం చూసుకుని లోపలినుంచి పెల్లుబికి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుని విసుక్కుంటూ ఇంటికి వచ్చాడు.
వాకిట్లో అరుగుమీద గంగాధరంగారు, చిదంబరం ఒకరి ప్రక్క నొకరు కూర్చుని వున్నారు. కొంచెం దూరంలో గుమ్మంకాడ ముసలావిడ నిల్చుని వుంది.
నారాయణ రావటంచూసి "వచ్చాడుగా నాయనా" అంది ముసలావిడ.
గంగాధరంగారు నారాయణ వంక ఒకసారి సాభిప్రాయం చూసి నవ్వుకున్నాడు.
"అబ్బాయిని రోజూ చూస్తున్నామనుకోండి. కానీ మా పిల్ల విషయమేమిటి చెప్పు?" అన్నాడు గంగాధరంగారు.
"చెప్పేదేముంది, కొత్తగనుకనా? జానకి విషయం నాకు తెలీదా"
"తెలుసుననుకోండి. అబ్బాయి సరిగ్గా చూచుకోలేదా మరి?"
"చూసేవుంటాడు, జానకిని వాడు ఎరగకపోవటమేమిటి? ఏరా నారాయణా?" అంది ముసలావిడ.
నారాయణ ఏమీ బదులు చెప్పక గుడ్లప్పగించి చూస్తూ వూరుకునే సరికి "ఇంతమంది ఎదుట అందులోనూ కాబోయే మామగారి ఎదుట వాడు నిజం ఏమి చెబుతాడు?" అని నవ్వింది వెకిలిగా.
"అంతే ననుకోండి" అని గంగాధరంగారు శ్రుతికలిపి "మిగతా విషయాలు మాట్లాడుకోవాలిగదా" అన్నాడు.
"కట్నం కానుకల విషయంలో ఖచ్చితంగా వుండాలని నా అభిప్రాయం."
"ఎందుకు కాదూ! మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి?"
ముసలావిడ చెప్పుకుపోసాగింది "కట్నం మూడువేలకి తక్కువ తీసుకుందామని మేమెప్పుడూ అనుకోలేదు. ఇహ ఆడపడుచుల లాంఛనాల విషయం అదీ అంటారా?"
నారాయణకి అరికాలిమంట నెత్తికెక్కింది, "ఎవరి విషయం బామ్మా నువ్వు అనేది?" అన్నాడు కోపాన్ని చంపుకొంటూ కొంచెం ముందుకువచ్చి.
ముసలావిడ విడ్డూరంగా నోరు నొక్కుకుని "సరేసరి, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు అదేం ప్రశ్నరా వాజమ్మా! ఇదంతా నీకోసం కదాట్రా?" అంది.
నారాయణ ఇంకా అదే ధోరణిలో "నాకోసం ఇదంతా చేయమని ఎవరు చెప్పారు బామ్మా?"
"హయ్యొ, హయ్యొ! అదేమిట్రా! ఒకళ్ళు చెప్పవలసిన విషయమా ఇది! ఇన్నేళ్ళొచ్చాయి, ఆ మాత్రం నాకు తెలియదంటావా?"
"తెలిస్తే ఇలా ఎందుకు చేశావు" అని నారాయణ వెంటనే అంటించాడు.
అక్కడి వాళ్ళందరూ ఈ ధోరణికి విస్తుపోయి, "అయితే ఏమిట్రా నువ్వింతకీ అనేది?"
"నేననేది ఏమీ లేదు. మిమ్మల్నే అనొద్దంటున్నాను. నా విషయం నాకు తెలుసు. అనవసరంగా జోక్యం కలిగించుకొని మీరంతా లేనిపోని కోపతాపాలకి గురికావటం ఎందుకు? మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. నన్ను యిబ్బందిలో పెట్టటానికి యిందులో ఎవరూ ప్రయత్నించకండి" అంటూ అక్కడ ఆగకుండా లోపలి చర చరమని వెళ్ళిపోయాడు.
ఒక క్షణకాలం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అదీ మామూలు నిశ్శబ్దం కాదు. దీని అడుగున భయం, ఉద్రేకం, అసహ్యం, యీర్ష్య అనే కంటికి కనిపించని వస్తువులు దాక్కుని వున్నాయి.
కష్టంమీద తెచ్చిపెట్టుకున్న చిరునవ్వును ఇంకా కొంత కష్టంమీదు అట్టే పెట్టుకుంటూ "సరే అలాగే కానియ్యండి" అన్నాడు గంగాధరంగారు.
"ఎలాగ?" బిక్క మొహంతో చిదంబరం యీ ప్రశ్నను వెంటనే వేశాడు.
గంగాధరంగారికి నారాయణ అన్న ప్రతిమాటా గుర్తువుంది. అతను లోపలకు వెళ్ళిపోతూ తనవంక చూసిన కోరచూపులు కూడా ములుకుల్లా ఆయన్ని బాధపెడుతున్నాయి.
"ఎట్లా అవ్వాలని వుంటే అట్లానే కానివ్వండి."
"అంటే మీ మాటల్లోని భావం నాకు బోధపడటం లేదు."
గంగాధరం దీనికేమో సమాధానం చెప్పేలోపలే ముసలావిడ అందుకుని యిలా అంది : "దీనికి మీరింకా ఏమీ అనుకోకండి గంగాధరంగారు, వాడు చిన్నవాడు. మంచి చెడ్డలు తెలీవు. ముందూ వెనకా చూడకుండా పెద్దమనిషి వున్నాడనన్నా ఆలోచించకుందా ఏదో వాగేశాడు. దీన్ని మీరేం మనసులో పెట్టుకోకూడదు."
పారిపోబోతున్న చిరునవ్వును పెదాలమీద అట్టేపెట్టుకుని ఒకసారి తలపంకించారు వారు.
"వాడికింకా అనుభవంలేదు. బాధ్యతలు తెలీవు. ఎట్లా అయినా ఒప్పించి, ఈ పెళ్ళి జరిగేటట్లు చూసే భారం నాది."
గంగాధరంగారు లేచి "వస్తామండి" అని శెలవు పుచ్చుకొని వెళ్ళబోయాడు.
ఆయన్ని గుమ్మందాకా పంపటానికి వెళ్ళిన చిదంబరం "అయితే మీరు రేపు పేకాటకి వస్తారుగా" అన్నాడు.
"అలాగే" అని ఆయన మరో చిరునవ్వు విసిరి వెళ్ళిపోయాడు.
చిదంబరం తన అసమర్ధతకి చింతపడుతూ, కొడుకుమీద విసుక్కుంటూ లోపలి వచ్చేశాడు. ఇటువంటి సమయాల్లో ప్రతి యింట్లో జరిగే విషయమే ఆరోజు ఇంట్లో జరిగింది. నారాయణ భోజనం చేయలేదు. అతను చేయకుండా వుంటే ఇంకా కొంతమందో, కొద్దిమందో వస్తే ముసలావిడ వంటయిల్లు తొక్కలేదు. ఆవిడ తెలివిగలదే. ఆ రోజుకి పెళ్ళి ప్రసక్తి తీసుకురాకుండా ఒక మూలకుపోయి గింజుకుంటూ పడుకుంది. చిదంబరం మాత్రం ఆ వాతావరణంలో వుండటం భయంవేసి, భార్య వడ్డించగా తలవంచుకుని అన్నం తినేసి, చలిగాలి తగలకుండా దుప్పటి మీద కప్పుకుని ఎటో వెళ్ళిపోయాడు. శారదాంబ పిల్లలకి అన్నం పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకుంది.
నారాయణ అంతులేని ఆలోచన్లతో బాధపడి ఏ అర్థరాత్రికో కన్నుమూశాడు.
9
ఒక మనోహరమైన సాయంత్రం రాధ ప్రక్కన కూర్చుని సుభద్రమ్మగారు చెప్పుకుపోతోంది.
"మనం చిన్నప్పుడు జరిగిన విషయాలకూ, ఇప్పుడు జరుగుతున్న విషయాలకూ పోల్చుకుంటే ఒకప్పుడివి జరిగాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అవన్నీ ఒక కలల్లాగ కనిపిస్తాయి. మా ప్రమీలా, శ్రీపతీ ఒక నాటికి యిలా చిలుకా గోరింకల్లా వుంటారని వుండగలుగుతారని నేననుకున్నానా! పెళ్ళయిన కొత్తలో ఏమి హడావుడి చేసేవాడూ! ఏమిటి!!"
రాధ ఆవిడని ఆపి కుతూహలంగా "ఆ హడావుడి ఏమిటి పిన్నిగారూ?" అని అడిగింది.
"ఏముంది పెళ్ళయిన మరునాటినుంచీ ఇక్కడకు తయారయ్యేవాడు. భార్య మీద అతనికి అంత వెర్రివుండేది. అది వెర్రి అను, మమకారం అను, నీకూ తెలుసుగా. మరి ఇంక చదువేం సాగుతుంది. వరుసగా దండయాత్రలు సాగించాడు." అని పకపకమని నవ్వసాగింది.