అయితే, స్త్రీ పురుషులు ఒకరినొకరు చూసుకున్న వేళ మన్మధుడు బాణాలు వేస్తాడన్నది కవి మదిలో మెరిసిన ఊహే కావచ్చు. కానీ ఒక్కో వ్యక్తిని చూడగానే గుండెలలో స్పందన కలుగుతుందనీ, ఆ ప్రేమ అనే అనుభూతి అదృశ్యరూపంలో మనపై వలపు బాణాలు వేస్తుందనీ, అది కేవలం మనోగోచరమని, అది త్వరలో తనకు అనుభవంలోకి రాబోతోందని ఆమెకు తెలియదు.
అందుకే ఏ కలలూ కనకుండానే ప్రశాంతంగా నిద్రపోయిందామె.
* * *
చివరి పరీక్ష రాసి కార్లో ఇంటికి తిరిగి వస్తోంది వైజయంతి. మర్నాడే ఊరు ప్రయాణం. అనుకున్నట్టుగా అవంతిని తీసుకెళ్ళడం కుదరలేదు. అవంతికి రెండు ప్రాక్టికల్ పరీక్షలు మిగిలిపోయాయింకా.
"పరీక్షలయిపోతే తప్పకుండా వచ్చేదాన్ని పోనీలే సిమ్లాలో కలుస్తాంగా ఈ లోపల మీ వాళ్ళతో వారంరోజులు హాయిగా గడిపిరా" అంది.
"ప్రపంచం అంతా నిన్ను వెలివేసి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నీ పక్కన నిలబడేవాడే అసలైన స్నేహితుడు" అన్నారెవరో అవంతి బాధతో వుందన్న విషయం తనకు తెలుసు. పక్కన వుండి ఏమీ చెయ్యలేని పరిస్థితి తెలుసు. కాని దూరంగా వెళ్ళాలంటే తప్పు చేస్తున్న ఫీలింగ్. తను వెళ్ళకపోతే మమ్మీ, డాడీ బాధపడతారు. ఇప్పుడిక వెళ్ళక తప్పదు.
కారు సడన్ బ్రేకుతో ఆగేటప్పటికి ఆలోచనల్లోంచి బయటపడింది వైజయంతి.
ఓ స్త్రీ రోడ్డు కడ్డంగా పరిగెత్తుకు వచ్చి, కారు సడెన్ గా ఆగడంతో ఒక్కసారిగా తూలి బోనెట్ మీద పడింది. వైజయంతి గాభరాగా కారు దిగింది. అప్పుడు చూసింది వెనకే పరుగెత్తుకు వస్తున్న పోలీసుల్ని.
రావడమే ఆ స్త్రీని మొరటుగా లేవనెత్తాడు ఒక పోలీసు.
"తప్పించుకు పారిపోదామనుకుంటున్నావా..... పదవే" లాగాడు. ఆమె తూలి అతడిమీద పడింది.
"ఏమిటి కావాలని మీదపడుతున్నావ్. నీ వేషాలేం సాగవు నా దగ్గర...." హిందీలో అసభ్యకరమైన తిట్లన్ని తిడుతూ కొడుతున్నాడామెను. జనం గుంపుగా నిలబడి తమాషాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా దృశ్యాన్ని.
వైజయంతి కోపం కట్టలు తెంచుకుంది.
"కానిస్టేబుల్, ఎందుకంత మొరటుగా తిడతావ్? ఏం చేసిందామె?" అడిగింది కోపంగా.
"మీకు తెలియదు మేడం? దొంగముండ పర్సు కొట్టేసింది. ఇదేం మొదటిసారి కాదు. జైల్లో పెట్టినా బుద్దిరాలేదు." వైజయంతి కార్లోంచి దిగినందువల్ల ఆ మాత్రం గానైనా మర్యాదగా సమాధానం చెప్పాడు.
"అయితే మాత్రం! అలా కొడుతూ తీస్కెళ్ళాలా? ఎందుకా బూతులు తిట్టడం?"
"బూతులా తల్లీ! ఇంతమంది జనంలోనే ఇలా చూస్తున్నారు. పోలీసుస్టేషన్లో మా గతేమిటో మీకు తెలియదు తల్లీ. మమ్మల్ని న్యాయంగా బ్రతకనీయరు. తప్పుచేయక తప్పదు. వీళ్ళ చేతుల్లో ఆడ ఖైదీలు ఎన్ని బాధలు పడతారో మీకు తెలియదు అందుకే కారు కిందన్నా పడదాం అనుకున్నాను" అంది స్త్రీ.
"పదవే పెద్ద నీతులు వల్లిస్తున్నావు" ఆమెను గబగబా లాక్కుపోయాడు పోలీసు.
వైజయంతి కార్లో కూర్చుంది ఆలోచిస్తూ ఎప్పుడూ లేని కొత్త ప్రశ్నలు మొలకెత్తాయి ఆమెలో.
"మన దేశంలో మహిళా పోలీసులు ఎందుకు లేరు? ఆ ఉద్యోగాలకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లనా లేక స్త్రీలకు ఆ అవకాశం యివ్వడం లేదా? ఆమెకు తెలిసినంతవరకు పోలీసు ఆఫీసరుగా అప్పటివరకు సెలక్టయింది ఒక స్త్రీయే, అదీ ఆ సంవత్సరమే ఆమె కిరణ్ బేడీ భారతదేశంలో మొదటి లేడీ ఐ.పి.యస్. ఆఫీసరు పోలీసు ఆఫీసర్లుగా, ఫైలట్లుగా స్త్రీలు ముందుకు రాలేకపోతున్నా రెందువల్ల? కేవలం శారీరకమైన శక్తి లేకపోవడం వల్లనేనా?
కారు ఇల్లు చేరడంతో ఆమె ఆలోచనలకు బ్రేక్ పడింది. ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకోవడంలో ఆ విషయం మరుగున పడిపోయింది.
5
ఫస్టుక్లాసు కంపార్టుమెంట్ లో నాలుగో వ్యక్తి ఓ అరవయి అయిదేళ్ళ రిటైర్డు మేజర్. ఆయనా డాక్టరే పేరు కృష్ణశర్మ. వాళ్ళు ముగ్గురూ డాక్టర్లకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. వైజయంతి పై బెర్తుమీద కెక్కేసింది తన పుస్తకాలు తీసుకుని- మొదటి డైరీ తెరిచింది.
మూడేళ్ళక్రితం హైదరాబాద్ నించి ఢిల్లీ వెళుతున్నప్పుడు ఏదో చెప్పలేని భయం. ఆందోళన ఈ మూడేళ్ళలో ఎంత మార్పు - వయసులో చదువులో పెరిగిన విజ్ఞానమే కాకుండా తనలో చెప్పుకోదగ్గ గుణాలు రెండు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు నిశితమైన పరిశీలణ ఆలోచన.
ఒక చిన్న విషయాన్ని సాధించిన అనుభవమే ఆత్మ విశ్వాసానికి పునాది అవుతుంది. ఆ పునాదిమీద అంతస్థుల మీద అంతస్థులు కట్టాలనే అభిలాష కలుగుతుంది. అదో వ్యసనమే కావచ్చు. మనో వికాసమే కాకుండా శారీరక వ్యాయామం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనే నిజం అవంతి చెప్పేవరకు తెలియదు. మొదటి సంవత్సరం ఎన్.సి.సి. లో చేరింది. రెగ్యులర్ గా క్లాసెస్ కు అటెండవుతూ క్యాంపులకు కూడా రెండేళ్ళు వెళ్ళింది. అప్పటికే ఉదయం వ్యాయామం బాగా అలవాటయిపోవడంతో అదంతా శ్రమగా అనిపించలేదు. మార్చ్ ఫాస్టులో, షూటింగులో బహుమతులందుకుంది. కాలేజీ తరపున ఆ సంవత్సరం దినోత్సవంలో పాల్గొని బెస్టు క్యాండిడేట్ గా గోల్డ్ మెడల్ అందుకోవడం మర్చిపోలేని ఎచీవ్ మెంట్. అదీ ఒక్క సంవత్సరంలోనే ఆ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం అని అవంతి మెచ్చుకుంది.
బాగా చదవడం, ఫస్టుర్యాంకు తెచ్చుకోవడం మాత్రమే చాలనుకునే అమాయకత్వం నించి, కేవలం ఒక స్త్రీగా కాకుండా పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలన్న సత్యాన్ని తెలుసుకోవడం అవంతి దగ్గిర నేర్చుకున్న మొదటి విషయం. నేనేమిటి? నా భవిష్యత్తు ఎలా మలచుకోవాలి అని ఆలోచించడం మొదలయింది. పుస్తకాలు చదవడం, అవంతితో వాటి గురించి డిస్కస్ చేయడం హాబీగా మారింది. అసలు పుస్తకాలే చదవని స్టేజినించి చదివిన వాటి గురించి ఆలోచించటం, నేను చదివిన వాటిలో నాకు నఃచిన పుస్తకం యిది అని నిర్ణయించుకోగల స్థితికి రావడం చెప్పుకోదగ్గ విషయం, విజయం.
ఫస్టియర్ లో హిందీలో తప్ప అన్నింటిలోనూ ఫస్టుమార్కులు వచ్చాయి. అయితే మరో పదిమంది అమ్మాయిలకు ఒకటి రెండు తక్కువగా అన్నేసి మార్కులూ వచ్చాయి. అది మంచి కాంపిటీషన్ ఆ సంవత్సరం అలా బాగా గడిచింది.
వైజయంతి రెండో డైరీ తెరిచింది.
అవంతి యూనివర్సిటీ ఫస్టు వచ్చింది. అదే యూనివర్సిటీలో ఎమ్.ఎస్.సి. లో చేరింది.
రెండో సంవత్సరంలో కొన్ని మనఃక్లేశాన్ని కలిగించిన సంఘటనలు.
స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్లప్పుడు జనరల్ సెక్రటరీగా పోటీ చెయ్యమని అడిగారు. క్లాసు పిల్లలే కాకుండా ఫైనలియర్ వాళ్ళు కోడా తనకంత పాప్యులారిటీ వుందన్న విషయం అప్పుడే తెలిసింది. అవంతిని కూడా సంప్రదించకుండా ఒప్పుకుంది. కాని డబ్బు ఎలాంటి అహంకారాన్ని పెంచుతుందో, అధికారం కోసం ఎంతగా ప్రాకులాడతారో అనుభవమయింది. అంత డిసిప్లిన్ వున్న కాలేజిలో ఎలక్షన్ల గురించి అంత గొడవ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదామె. కాని పైకి కనిపించకుండానే కొందరమ్మాయిలు ఎలక్షన్లని వార్ ఫుటింగ్ లో తీసుకున్నారు. పోటీలోంచి విరమించుకోవాలానే స్థితికి వచ్చేసింది ఒకసారి. మళ్ళీ అంతరంగ పోరాటం. అంత త్వరగా అపజయాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? గెలిచినా, ఓడినా అది స్పోర్టివ్ గా తీసుకోవాలి అని నిశ్చయించుకుంది. అయితే కొద్దిపాటి మెజారిటీతో జనరల్ సెక్రటరీగా వైజయంతె గెలిచింది. అయితే ప్రెసిడెంటుగా, కల్చరర్ సెక్రటరీగా అధికారం కోసం ప్రాకులాడే అమ్మాయిలే గెలవడం దురదృష్టకరం. కాలేజీలో ఎన్నో చేయాలనుకుంది. అడుగడుగునా అవాంతరాలే మిగతా కాలేజీల్తో పోల్చుకుంటే అప్పటివరకు ఆ కాలేజీ చదువుల్లోనే ఫస్టుగా వుంటోంది. ఇతర కాంపిటీషన్స్ లో అంతగా పాల్గొనడం జరగలేదు. వైజయంతి ఆ లోటు పూర్తి చేయాలని నిశ్చయించుకుంది. ఆటల్లోనూ, యితర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ టాలెంట్ వున్నవాళ్ళను ప్రోత్సహించి ఇంటర్ కాలేజీ పోటీల్లో పాల్గొనేటట్లు చేయాలని అలాంటి టాలెంట్ వున్నవాళ్ళందర్నీ విడిగా పిల్చి మాట్లాడింది.
ఇంటికి ఆలస్యంగా వెళితే అమ్మా నాన్న కోప్పడతారని కొందరు, మా ఇల్లు చాలాదూరం, చీకటిపడితే వెళ్ళటం కష్టమని మరికొందరు, మా యింట్లో ఇలాంటి వాటికి ఒప్పుకోరని కొందరు సాకులు చెపుతున్నారు. కాలేజీ రూల్స్ ప్రకారం క్లాసులు జరిగే సమయంలో ప్రాక్టీసు చేసుకునే వీలులేదు. వైజయంతి మిగతా యూనియన్ మెంబర్లను సంప్రదించింది.
"మీ అమ్మా నాన్నా నిన్నేమీ అనరు. కాని మా వాళ్ళు అలాకాదు, అయిదు నిమిషాలు ఆలస్యమయితే కోప్పడతారు" అన్నారు వాళ్ళు వ్యంగ్యంగా "నీకేం నువ్విష్టం వచ్చినట్లు తిరుగుతావు. మేము అలాంటి వాళ్ళం కాదు" అన్న ధోరణిలో .