"ప్రదీప్! ఎలావుంది?"
"మాలతీ! రాత్రి నేను చాలా....సారీ! ఏవన్నా అసహ్యంగా ప్రవర్తించానా?"
మాలతి నవ్వింది. "లేదు."
"రాత్రి యింటికి ఎలా వెళ్ళావు?"
"నీ కారులోనే కాసేపట్లో ఎవరితోనన్నా పంపిస్తాను."
క్షణంపాటు నిశ్శబ్దం.
"ప్రదీప్! రాత్రి ఎందుకు త్రాగావు?"
".... ఆ వాతావరణంలో అలా జరిగిపోయింది. నా ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా."
"ప్రదీప్! రాత్రి నీకేమీ తెలియలేదు."
"అ...వు...ను."
"సరే! రెస్ట్ తీసుకో వుంటాను."
ఫోన్ పెట్టేశాక, ఒక అరగంట అటూ యిటూ అస్థిమితంగా మెసిలి స్నానంచేస్తే ఫ్రెష్ గా వుంటుందని, షాంపూతో తలస్నానం చేసేశాడు. కొంచెం హాయిగా వున్నట్లనిపించింది. రామూ హోటల్ నుండి టిఫిన్ తీసుకొస్తే కొద్దిగా తిన్నాడు.
మెల్లగా పదయింది. ఇవేళ కోర్టుకు పోవాలనిపించింది. ప్రతాపరావుగారి డ్రైవరు అంతకుముందే కారు తీసుకొచ్చి పోర్టికోలో పెట్టి వెళ్ళిపోయాడు.
డ్రెస్ చేసుకుని, బయటకు వచ్చి కారు బయటకు తీశాడు.
* * *
ఆలోచిస్తూ పరధ్యానంగా కారు నడుపుతున్నాడు.
ఒక విశాలమైన వీధిలో కారు సాగిపోతుంది. జనం రద్దీకూడా ఎక్కువలేదు.
ఉన్నట్లుండి, ఆరేళ్ళపాపా కారుకు అడ్డువచ్చింది. ఉలిక్కిపడి సడన్ గా బ్రేక్ వేసేశాడు.
ఒక్క కుదుపుతో కారాగిపోయింది. క్రిందకు దిగి కారుముందు బిక్కముఖం వేసుకుని నిలబడ్డ పాప దగ్గరకు వచ్చాడు.
"పాపా! దెబ్బతగిలిందా?" అన్నాడు లాలనగా.
లేదన్నట్లు తల ఊపింది.
"ఉన్నట్లుండి.... ఎందుకలా అడ్డువచ్చావు?"
"తెలీలేదు.... ఎందుకో.... కళ్ళు సరిగ్గా కనబడనట్లుగా అయింది."
అప్పుడు చూశాడు పాపమొహంలోకి ముద్దుగా, లేతగా, అమాయకంగా వుంది. ముఖం చాలా అందంగా వుంది. కళ్ళు చక్రాల్లా.... విప్పారి.... కాని ఎడంకన్ను ఎందుకో కొంచెం ఎర్రబడివుంది.
"ఎక్కడకు వెళుతున్నావు?"
"స్కూలుకి."
"ఏ స్కూలుకి?"
చెప్పింది.
"నేను దింపుతాను రా."
"వద్దండి" అంది మొహమాటపడుతూ.
"ఫర్వాలేదు రామ్మా" అని బలవంతంచేసి కారులో ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు.
"నీ పేరు?" అనడిగాడు దారిలో.
"రాధ."
"మీనాన్నగారేం చేస్తారు?"
"తెలీదు ఎందులోనో పని."
"రోజూ స్కూలుకి ఎలా వెళతావు?"
"నడిచే."
"బస్సులో వెళ్ళవా?"
"ఉహు."
"ఏం?"
"ఏమో.... తెలేదు... మా నాన్నగారు నడిచే వెళ్ళమన్నారు."
స్కూలు వచ్చింది. ప్రదీప్ కారు ఆపుచేసి డోరు ఓపెన్ చేశాడు.
రాధ కారు దిగి "అంకుల్ టాటా!" అంది.
ప్రదీప్ కూడా చెయ్యి వూపాడు. రాధ కొంతదూరం వెళ్ళి మిగతా పిల్లలతో కలిసిపోయాక కారు మెల్లగా ముందుకు పోనిచ్చాడు.
* * *
ఆ సాయంత్రం కోర్టునించి తిరిగివస్తుంటే మళ్ళీ రోడ్డుమీద రాధ కనబడింది.
కారాపి, "పాపా! రా యింటిదగ్గర దింపుతాను" అన్నాడు.
రాధ మొహమాటపడుతూ నిలబడింది.
"ఫర్వాలేదు రామ్మా!" అని అటువైపు కారుతలుపు తెరిచాడు.
పాప యెక్కి కూర్చుంది.
పాప డైరెక్ట్ చేస్తుంటే, ఆ విధంగా పోనిచ్చి ఆమె యింటిదగ్గరకు తీసుకెళ్ళాడు.
చిన్నయిల్లు. అంటే ఓ యింట్లో చిన్నపోర్షన్ రెండు మూడు గదులుంటాయేమో.
పాప కారుదిగి వస్తుంటే ఆ ఇంట్లోని మనుషులు వచ్చి చిత్రంగా చూశారు. మనుషులంటే.... యిద్దరమ్మాయిలు ఓ అమ్మాయికి పద్దెనిమిదేళ్ళుంటాయి, ఇంకో అమ్మాయికి పదహారేళ్ళుంటాయి. వాళ్ళని చూస్తుంటే ఎంత దిగువ తరగతి, మధ్య తరగతి కుటుంబీకులో వెంటనే తెలిసిపోతుంది కాని ఆ ఇద్దరిముఖాల్లో కళా, కాంతీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. వెనగ్గా ఒకాయన వచ్చాడు. యాభైఏళ్ళు దాటివుంటాయి. తల బాగా నెరసిపోయింది.
పాప కారుదిగి ఏంచెయ్యాలో తెలీక బిక్కముఖం వేసుకుని చూస్తుంది.
ప్రదీప్ కారుదిగి "పాప ప్రొద్దుట కారుక్రింద పడబోయింది. ఎందుకో ఒంట్లో బాగాలేదనిపించింది" అన్నాడు.
"రాధ నాకూతురే నాపేరు హనుమంతరావు, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్నాను" అన్నాడు.
"లోపలకురా అంకుల్" అంది రాధ కొంచెం దైర్యం తెచ్చుకుని.
"ఈసారి వస్తానమ్మా" అని ఆయనకూడా వస్తానని చెప్పి ప్రదీప్ కరెక్కాడు.
* * *
ఆ సాయంత్రం ఇంట్లో ఏమీ తోచలేదు. నిన్న సాయంత్రపు అనుభవమే వెంట తరుముతుంది.
"అయ్యగారూ! క్యారియర్ తీసుకురానా" అన్నాడు రాము.
"వద్దురా" అన్నాడు.
"అయ్యగారూ! మీరు ఒక్కరోజుకూడా సరిగ్గా భోజనం చెయ్యటంలేదు.
"వొరేయ్, నన్ను విసిగించక అవతలకు వెళ్ళు."
రాము ఏమీ అనలేక ప్రక్కగదిలోకి వెళ్ళిపోయాడు.
క్రమంగా చీకటిపడింది. ప్రదీప్ యింటిలో వుండలేకపోయాడు. రామూని యింటికి వెళ్ళిపొమ్మని చెప్పి, డోర్ లాక్ చేసి కారులో బయల్దేరాడు.
పదినిముషాల్లో కారు ఓ బార్ ముందాగింది.
ఇంతకు ముందెప్పుడూ అతను బార్స్ కు వెళ్ళలేదు. ఎక్కువగా సొసైటీలో మూవ్ కాని మనిషి అవటంచేత పార్టీలకు అటెండ్ అవటం, అదీ వుండేది కాదు.
లోపలకు వెళ్ళగానే కొద్దిగా మొహమాటమనిపించింది. ఆ ఏ.సి. హాల్లో కనిపించీ కనిపించనట్లు వున్న మసక వెల్తుర్లో - టేబుల్ దగ్గర చాలామంది, కాని ఎవరూకూడా వొంటరిగా లేరు. జట్లుగానో, కనీసం ఇద్దరు ముగ్గురు కలిసివున్న జట్లుగానో కనిపించారు. అక్కడక్కడ పురుషులతో కలిసి స్త్రీలు కూడా వున్నారు.
ఖాళీగా వున్న టేబిల్ దగ్గరకెళ్ళి కూర్చున్నాడు.