Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 12

 

      "ఈ జ్ఞాపకం నాకు మరపురానిది!" రక్తం కారుతున్న చేతిని చూసుకుంటూ అన్నాడు చందూ.
   
    "ట్రిక్క... ఆయనకి షేక్ హాండ్ ఇవ్వమ్మా!" అంది.
   
    "వద్దు..... హోల్ బాడీ అంతా ఇప్పటికే షేక్ అవుతోంది" అన్నాడు భయంగా.   
   
    "భలే ఫన్నీగా మాట్లాడ్తారే?" ఆ అమ్మాయి నవ్వుతూ ట్రిక్క మెడకి గొలుసు కట్టింది.
   
    "హి.... హీ.. ఫన్నీగా మాట్లాడడం, అప్పుడప్పుడూ పిచ్చికుక్కల చేత కరిపించుకోవడం నా హాబీ!" అన్నాడు.
   
    "ఓ.....సారీ!" ఆ అమ్మాయి తన చున్నీని అతనికి కట్టుకట్టింది.
   
    ఆ అమ్మాయి మృదుకరస్పర్శకి చందూ తన బాధంతా మరిచి మైమరచిపోయాడు!
   
    "మీ పేరూ?" అడిగాడు.
   
    "మేధ" అంది.
   
    "నా పేరు చందూ. రండి ఎక్కడికెళ్ళాలో చెప్తే డ్రాప్ చేస్తాను" అన్నాడు.
   
    "అబ్బే.... వద్దండీ.... వాకింగ్ కి కదా వచ్చాం" అంది మేధ.

    "బాగా అలసిపోయారు. పదండీ" అన్నాడు చందూ.
   
    మేధ మొహమాటంగానే "పదండీ" అంది.
   
    ఇద్దరూ కలిసి పచ్చిక మీదనుండి రోడ్డు మీదకి నడుచుకుంటూ వచ్చారు.
   
    "ఎక్కడికెళ్ళాలి" ఆటో మీటర్ ఆన్ చేస్తూ అడిగాడు చందూ.
   
    "ఆటోనా?" ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి.
   
    "ఏం ఆటో ఎక్కరా?" అడిగాడు చందూ.
   
    "ఇది... ఇది మీదేనా." ఆ అమ్మాయి ఇంకా ఆశ్చర్యంగానే అడిగింది.
   
    "కాదు..... అద్దెకి తీసుకున్నాను. సొంతం కాకపోతే ఎక్కరా?" అడిగాడు చందూ.
   
    ఆ అమ్మాయి ఒక్కక్షణం ఆలోచించి "సరే.... కానీ డబ్బులు తీసుకోవాలి" అంటూ ఎక్కి కూర్చుంది.
   
    "భలేవారే! ఎందుకు తీసుకోనూ?" అన్నాడు చందూ.
   
    ఆ రోజునుంచీ ఆ అమ్మాయి ఆటో ఎక్కుతూనే ఉంది! చందూ రోజూ ఓ కథ చెప్తూనే ఉన్నాడు. (కానీ వెనక సీట్లో ఆ అమ్మాయి పక్కన కూర్చొని)
   
    "అదీ సంక్షిప్తంగా జరిగిన కథ" అన్నాడు అంతా చెప్పాక.
   
    "సంక్షిప్తంగా ఏం కాదు. సంపూర్ణ శబ్ద చిత్రమే చెప్పావు!" విసుక్కున్నాడు శ్రీధర్.
   
    "ఎవరి అమ్మాయో కనుక్కున్నావా?" అంది ధరణి కుతూహలంగా.
   
    "ప్రేమించుకునేటప్పుడు అలాంటి డౌట్స్ రాకూడదు! ఇంటర్వెల్ తర్వాత పెళ్ళి ప్రసక్తి రాగానే ఆ వివరాలు బైట పడాలి!" సీరియస్ గా ఆటో ఆపుచేస్తూ అన్నాడు చందూ. "...ఇక దిగండి."
   
    ధరణి దిగి బ్యాగ్ తెరుస్తూ ఉండగా, "ఖాతాలో పద్దు రాయి, మా పెళ్ళి ఖర్చులకి తీసుకుంటాను" అని ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
   
    శ్రీధర్ ధరణితో "అమాయకుడు! వీడెట్లా బతుకుతాడూ?" అన్నాడు.
   
    "మనవాడికి లేనిది వాడి గర్ల్ ఫ్రెండ్ పేరులో ఉందిగా. బాగానే బతికేస్తారులెండి! లోపలికి పదండి" అంది ధరణి.
   
                                      4
   
    "ఫ్లాగ్ షిప్ అంటే తెలుసా?" అడిగారు మేజర్ వర్మ.
   
    శ్రీధర్ సీరియస్ గా "ఏమిటీ?" అన్నాడు.
   
    "యుద్దంలో ఇరుపక్షాల సైనికులూ మధ్యలో కలిసి టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకుని టెన్షన్ రిలీజ్ చేసుకుంటారు. మళ్ళీ శత్రుత్వం, యుద్ధం, యధావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటివే భార్యాభర్తలకి ఈ మేరేజ్ ఏనివర్సరీలూ, షష్టిపూర్తులూ!" అన్నారు.
   
    "చాల్లేండి! అన్యోన్యంగా వుండే దంపతులని చెడగొట్టకండి" అంది వర్మగారి భార్య.
   
    ధరణీ, శ్రీధర్ నవ్వేశారు.
   
    "ఇంట్లో కూడా ఈ మిలటరీ భాషే మాట్లాడ్తూ ప్రాణం తీస్తూ వుంటే ఎలా చెప్పమ్మా? ఈయనే కాదు... మావాడొస్తే వాడూ ఇదే తీరు" కొడుకుని తలుచుకాగానే ఆవిడ కంట్లో నీరు తిరిగింది.
   
    డ్రింక్స్ ట్రే పట్టుకుని వచ్చిన బోయ్ దగ్గర్నుండి గ్లాసులు అందుకుని అతిధులకి యిస్తోంది ఓ అమ్మాయి.
   
    "ఆంటీ..... ఈ అమ్మాయి ఎవరూ?" అంది ధరణి.
   
    "అరే.....నీకు తెలియదా? అల్కా...మా కోడలు, అల్కాఇట్రా" పిలిచిందావిడ.
   
    "ధరణి! మా శ్రీధర్ భార్య, శ్రీధర్ తెలుసుగా, ఆనంద్ కి చిన్నప్పటి క్లాస్ మేట్"; అని పరిచయం చేసింది.
   
    ఆ అమ్మాయి నమ్రతగా నమస్కరించింది. చాలా అందంగా ఉంది! ధరణి చూపు నిలిపినచోటు గమనించి వర్మ్గగారి భార్య "ఆరో నెల! మా ఆనంద్ ఇష్టపడ్డాడు. మొన్న సెలవుల్లో వచ్చినప్పుడు పెళ్ళి చేసేసుకున్నాడు. మాకే లేట్ గా చెప్పాడు. బారసాలలో చెప్పకుండా త్వరగానే చెప్పాడని సంతోషించాం" అందావిడ నవ్వుతూ.
   
    అల్కా నవ్వింది.
   
    "అమ్మాయి మహారాష్ట్రియన్! తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది" అన్నారు వర్మగారు.

    అల్కా వర్మగారి వీల్ చైర్ ముందుకి జరుపుతూ, వచ్చిన అతిధుల దగ్గరికి తీసుకువెళ్ళింది.
   
    "ఆనంద్ ఇలా చెప్పకుండా చేసుకోవడం ఎందుకూ? చెప్పినా అంకుల్ గానీ, మీరుగానీ కాదనేవారు కాదుగా?" అడిగాడు శ్రీధర్.
   
    ఆవిడ నవ్వేసి "వాడికి అన్నీ తొందరే! వాడికే కాదు, ఈ మిలట్రీ వాళ్ళకే అంత!" అంది.
   
    'పెద్ద పెద్ద విషయాలనుకుని, ఊరకే బుర్రలు పాడుచేసుకూనీ, గొడవలు పడీ జీవితాలు వేస్ట్ చేసుకోకుండా ఉన్నంతలో ప్రతిదాన్నీ ఆనందంగా స్వీకరించి హాయిగా బ్రతకడం ఈ ఇంట్లో చూసి నేర్చుకోవాలి!' అనుకుంది ధరణి.
   
    డిన్నర్ టైంలో వర్మగారు శ్రీధర్ దగ్గరకొచ్చి "వాట్ మై బాయ్....ఏదీ తినడం లేదేంటీ? బొజ్జవస్తే వదిలేస్తాను అని మా ధరణి బెదిరిస్తోందా?" అని పెద్దగా నవ్వారు.
   
    "అదేం కాదు అంకుల్! ఆనంద్ కూడా ఇలాంటి అకేషన్స్ లో ఉంటే బావుండేది" అన్నాడు శ్రీధర్.
   
    "అకేషన్స్ వచ్చినప్పుడు మనుషులు ఉండటం మా జాతికి కుదరదు. మనుషులు వచ్చినప్పుడే అకేషన్స్ ఏర్పాటు చేసుకోవాలి!" అన్నారాయన.
   
    "ఆనంద్ ని ఆర్మీలో చేర్పించకుండా ఉంటే బావుండేది" అన్నాడు శ్రీధర్.
   
    "వ్వాట్?" అదిరిపడ్డట్లు చూశారు వర్మగారు. "అసలు కొడుకుని కన్నదే ఆర్మీలో భర్తీ చెయ్యడానికయ్యా చూడూ... నా సర్వీసు పూర్తికాకుండానే నేనిలా పనికిరాకుండా తయారై వెనక్కొచ్చేశాను" తన కాళ్ళవైపు చూసుకుంటూ బాధగా అన్నారు. అంతలోనే ఉత్సాహంగా "ఆనంద్ లో నా శేషజీవితాన్ని చూసుకుంటున్నాను. నా కొడుకుని చూసి గర్వపడ్తాను" అన్నారు.
   
    "కానీ .... రిస్క్...." నసిగాడు శ్రీధర్.
   
    ఆయన పరమ ఆశ్చర్యంగా చూశారు. "రిస్కా? అంటే ప్రాణానికి ప్రమాదమనా నీ ఉద్దేశం?" అన్నారు.
   
    ధరణి వారి దగ్గరకోస్తూ "ఏమిటీ?" అంది వర్మగారు నవ్వుతూ "చూడమ్మా నీ భర్త 'ఆర్మీలో ఆనంద్ చేరడం రిస్క్' అంటున్నాడు. మా నాన్నగారు యుద్దంలో పోయారు. నేను యుద్దంలో నా రెండు కాళ్ళూ పోగొట్టుకున్నాను. అయినా మా ఆనంద్ ఆర్మీలోనే కొనసాగడం మాకు తృప్తినిస్తోంది" అన్నారు.
   
    "అదే.... అందుకే రిస్క్ అన్నాను" అన్నాడు శ్రీధర్.
   
    "శ్రీధర్, మీ తాతగారు ఎలా పోయారూ?" అడిగాడు వర్మ.
   
    "మామూలుగానే పెద్దతనంవల్ల".
   
    "అదే మంచం మీదా, కిందా?"
   
    "మీ నాన్నగారూ?"
   
    "అలాగే! నిద్రలో పోయారు."
   
    "మరి నువ్వు మంచంమీద నిద్రపోవడం మానేశావా? రిస్క్ కాదా? వాళ్ళిద్దరూ అలాగేగా పోయారూ?" అడిగారు ఆయన.
   
    ధరణి ఆయనవైపు అలాగే ఆరాధనగా చూస్తుండిపోయింది.
   
    "మై సస్! ఆర్మీలోకి వెళ్ళకపోయినా, రిస్క్ తీసుకోకపోయినా మన ఆయుష్షు తీరితే పోవలసిందే! ఎవరూ ఇక్కడ పర్మనెంట్ గా ఉంటామని పర్మిషన్ తీసుకుపుట్టలేదు. ఉన్న నాలుగు రోజులూ ఏం చేశామన్నదే ముఖ్యం! ఎంతకాలం ఉన్నామన్నది కాదు! నా మనవణ్ణి కూడా రేపు ఆర్మీలోనే చేర్పిస్తాను. అల్మాకూడా మా ఆర్మీ వాళ్ళ అమ్మాయే! వాళ్ళ అన్నయ్య 'పరమవీరచక్ర' తీసుకున్న రణధీర్!" గర్వంగా అన్నారు.
   
    ధరణి శ్రీధర్ వైపు చూసింది. శ్రీధర్ నిజాయితీగా అన్నాడు. "నిజం అంకుల్! బతికిన నాలుగురోజులూ ధైర్యంగా బతకాలి. ఎవరం పర్మనెంట్ గా ఉండిపోయేవాళ్ళం కాదు. అసలు నాకిప్పుడు ఎంతో బాధగా ఉంది. నేనూ ఆనంద్ తోబాటు ఆర్మీలో జాయిన్ అవాల్సింది"

 Previous Page Next Page