"మళ్ళీ ఎప్పుడు కలుస్తావు గ్రాడ్యుయేటూ?" ప్రొఫెసర్ కంఠంలో కనబడిన ఆర్తి అతడ్ని విచలితుడ్ని చేసింది. ఏ ప్రాపంచిక విషయమూ పట్టని ఈ వృద్దుడు తనమీద అభిమానాన్ని పెంచుకున్నాడంటే అది తన అదృష్టం. ఈ నెలరోజుల సాంగత్యంలో తనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. భూమి గురించి, నక్షత్రాల గురించీ.....
"తొందర్లోనే మీ యింటికి వస్తాను."
"రావాలనే ఆశిస్తాను. వెళ్ళొస్తాను గ్రాడ్యుయేటూ. నీ భావిజీవితం శుభప్రదమగుగాక!" అని తిరిగి వెళ్ళిపోయాడు. చాలా నెమ్మదిగా, బలహీనంగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు ఆ వృద్దుడు. అతడు కనుమరుగయ్యేవరకూ అలా చూస్తూ నిలబడ్డాడు. తరువాత ఇంటివైపు కదిలాడు. అతడు ఇల్లు చేరుకొనేసరికి రాత్రి ఏడయింది. మనసులో ఏదో అసంతృప్తి.
.....కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు.
"రేపు జాయినవుతున్నావా?" వడ్డిస్తూ అడిగింది జానకి. తలూపేడు.
"ఏమన్నాడు మీ అయోమయంగారు?"
"చాలా బాధపడ్డాడు. మళ్ళీ తొందర్లో వచ్చెయ్యమన్నాడు."
జానకి నవ్వి, "జీతం మాత్రం ఏమీ ఇవ్వడటనా?" అంది. రమణ మాట్లాడలేదు. భోజనం చేసి పుస్తకం చదువుతూ కూర్చొన్నాడు.
దూరంగా తొమ్మిది కొట్టింది.
ప్రకాశరావు ఇంకా రాలేదు. అతడికి బ్రాకెట్ల పిచ్చి వుంది. క్లోజింగ్ వచ్చేవరకూ రాదు.
వేసవికాలం అయిపోయినా ఇంకా వర్షాలు కురవటంలేదు. పగలు బాగా ఎండగా వుంటోంది. రమణ బయటవరండాలో పక్క వేసుకున్నాడు.
రేపట్నుంచీ తనో ఉద్యోగి నెలతిరిగేసరికి జీతం. అంటే వేలు వేలు కాదు. కానీ ఇంత హీనంగా బతకక్కర్లేదు. వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు. మరి మాలతి సంగతి ఏమిటి? ఒక పరిష్కారం ఆలోచించాలి.
తలక్రింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకొన్నాడు. చల్లటిగాలి అలలు అలలుగా వచ్చి మనస్సు సేద తీరుస్తోంది. ఆకాశం నిర్మలంగా వుంది. నక్షత్రాలు తళతళా మెరుస్తున్నాయి. కొన్ని మినుకు మినుకుమంటూ, కొన్ని ప్రకాశవంతంగా
నక్షత్రాలు, కోట్ల కోట్ల నక్షత్రాలు.
అలాగే పడుకొని, తల కొద్దిగా పక్కకి తిప్పి చూసేడు.
ఉత్తర దిక్కుగా మిగిలిన వాటికంటే ప్రకాశవంతంగా ఒక నక్షత్రం.
ప్రాక్సిమా సెంక్చువరీ......!!
* * *
ఆగష్టు ఒకటి
రమణ ఉద్యోగంలో చేరి అప్పటికి నాలుగు రోజులైంది. ఆ రోజు అతనికి నాలుగు రోజుల జీతమూ వచ్చింది. నలభై రూపాయలు. చాలా తక్కువ. అయినా అందులో ఎంత ఆనందం వుందో ఆ మొదటి జీతం అందుకున్న వాళ్ళకే తెలుస్తుంది.
నలభైలో పదిహేను పెట్టి గోపీకి చొక్కా కొన్నాడు. వదినకి ఏం కొనాలో తోచలేదు. స్వీట్లు కొన్నాడు. అతడి మొహం ఆనందంతో వెలిగిపోతోంది. ఎవరెస్టు అధిరోహించినంత ఆనందంతో వున్నాడు.
ఇంటికొచ్చి చొక్కాగుడ్డ, స్వీట్లూ యిచ్చేడు. మిగతా డబ్బులో ఓ అయిదు వుంచుకొని, మిగతావి వదిన కిచ్చాడు.
"నీ దగ్గరే వుంచవయ్యా" అంది జానకి.
"ఎలాగూ బస్సు ఖర్చులకనీ, లంచ్ కనీ తీసుకుంటాను వదినా!" అన్నాడు ఆమె నవ్వి లోపలి వెళ్ళిపోయింది.
సాయంత్రం ఆరయింది.
రమణ బట్టలు మార్చుకొని బయటకొచ్చేడు. జేబులో అయిదు రూపాయలున్నాయ్. హోటల్ కొచ్చేడు. ప్రొఫెసర్ ని మొదటిసారి కలుసుకున్న హోటల్.
రెండు కేకులు కొన్నాడు.
అవి తీసుకొని ప్రొఫెసర్ పురాతన భవనంవైపు నడిచేడు. అతడు అక్కడికి చేరుకునేసరికి ఆరుంబావయింది.
తలుపు తీసేవుంది. లోపలి నడిచి, తలుపు బలంగా వేసేడు. తరువాత జ్ఞాపకం వచ్చింది- తలుపు బలంగా వేస్తే బయట లాక్ పడుతుందని మళ్ళీ తీసి చూసేడు. అదృష్టవశాత్తూ లాక్ పడలేదు.
అతడు లోపలి వెళ్ళేసరికి ప్రొఫెసర్ యధాప్రకారం కాగితాలు ముందేసుకొని కూర్చొని వున్నాడు. రమణని చూసి "రా! గ్రాడ్యుయేటూ..... రా!" అని ఆహ్వానించేడు. "ఆ నక్షత్రం గురించి ఇంకా కొన్ని విషయాలు సేకరించేను."
"నక్షత్రాల సంగతి తర్వాత ముందీ స్వీటు తినండి. నా మొదటి జీతంతో కొన్నది" అని కేకు అందించేడు.
"రెండూ నేనే తింటే నీకేమన్నా అభ్యంతరమా? భోజనం చేసి మూడ్రోజులైంది....."
రమణ కళ్ళనీళ్ళు కనబడనివ్వకుండా చప్పున తల తిప్పుకొని "తినండి" అన్నాడు రుద్దమైన కంఠంతో.
అతడు ఆత్రంగా తినటం పూర్తిచేసి, "ఊ-చెప్పు ఏమిటి విశేషాలు?" అని అడిగేడు.
"మీరే చెప్పాలి."
ప్రొఫెసర్ తన కాగితాలవైపు క్షణం తదేకంగా చూశాడు. "నేను చెప్పేది ఏదైనా వుంటే అది ఆ నక్షత్రం గురించే....." అన్నాడు. "దాంట్లో వేడి అంతగా లేదన్నది తేలిపోయింది. ఎందుకంటే - ఏమాత్రం వేడివున్నా మనం ఈపాటికి మసి అయిపోయి వుండేవాళ్ళం. పోతే అయస్కాంత శక్తి సంగతి తేల్చాలి."
రమణ మాట్లాడలేదు. అతని కిదంతా అర్ధరహితంగా కనబడింది. గతం సంగతి వేరు. అప్పటికి అతడికి ఉద్యోగం లేదు. కానీ ఇప్పుడు ఇంకా చాలా పనులున్నాయి.
అతడా ఆలోచనల్లో ఉండగానే ఫ్రొఫెసర్ ఓ కాగితం తీసిచ్చేడు. "నేను వ్రాసిన ఉత్తరానికి ఓ కాపీ చేసి ఉంచాను" అన్నాడు. రమణ దాన్ని అందుకొని చదవసాగేడు.
"ప్రియమైన ప్రధానమంత్రి జగదీష్ చంద్ర గారికి,
నేను క్షేమమే. మీరూ క్షేమమే అని తలుస్తాను. లోగడ నేను మీకో ఉత్తరం వ్రాసి వుంటిని. మీరు ఈ మధ్య ఇటువైపు రాలేదా? పోనీలెండి. మీతో ముఖ్యమైన విషయం చెబుదామని ఈ ఉత్తరం రాస్తున్నాను., ప్రాక్సిమా సెంక్చువరీ భూమివైపు వస్తున్నది. ఆ విషయం మీకు చెబ్దామని.....మరి వుంటాను.
అభినందనల్తో-
ప్రొఫెసర్ అయోమయం.
పి.యస్ :- ఈ నక్షత్రానికి గానీ ఆకర్షణశక్తి వున్నట్లయితే భూమ్మీద వస్తువులు వెళ్ళిడానికి అతుక్కుంటాయి.
రమణ ఉత్తరం మడిచి యిచ్చేశాడు. లాభంలేదు. ఈ మతిలేని ప్రొఫెసర్ మెదడుని ఎవరూ సరిచెయ్యలేరు. పదిహేనేళ్ళ అమ్మాయిలు అభిమాన నటులకి వ్రాసినట్టు ఈయన ప్రైమ్మినిష్ఠరు ఆఫ్ ఇండియాకి వ్రాస్తున్నాడు. పెర్వర్షన్ అంటే ఇదే కాబోలు.
* * *
గోపాలకృష్ణ ఎగ్బోటే చేతిలో ఆ ఉత్తరం వుంది. దాన్ని చూసి అతడు చాలాసేపు నవ్వుకొన్నాడు. ప్రధానమంత్రికి చాలా రకాలయిన ఉత్తరాలు వస్తూంటాయి. కొన్ని తిడుతూ, కొన్ని దేశ సమస్యళ గురించీ, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్సూ, అభ్యర్ధనలూ- అప్పుడప్పుడు ప్రేమలేఖలు కూడా.
కానీ ఇలాంటి ఉత్తరాలు రావటం మాత్రం చాలా తక్కువ.
అతడి ముందు 'రాక్'లు వున్నాయి. ఒకటి ఫస్టు సెక్రటరీకి వెళ్ళాల్సిన ఉత్తరాలు. వాటిలో కొన్నిఏరి, ఫస్టు సెక్రటరీ ప్రధానమంత్రికి పంపుతాడు. రెండో రాక్ లో తను జవాబు వ్రాయాల్సిన ఉత్తరాలు పడేస్తాడు. మూడో రాక్ లో ఉత్తరాల మీద ఏ చర్యా తీసుకోవాల్సిన పనిలేదు.
ప్రొఫెసర్ ఉత్తరం మూడో రాక్ చేరుకొంది.
మూడు 'రాక్స్'లోకి ఉత్తరాలు విడదీసిన తర్వాత మొత్తం మూడు ఫైళ్ళూ ప్రధానమంత్రికి వెళతాయి. ఆ ఫైల్సు మాత్రం ఆయన చూడదలుచుకుంటే పరిశీలించటానికే.