Previous Page Next Page 
సుహాసిని పేజి 12


    "మన నవ్వుల రాణికి ఎలాంటి మొగుడొస్తాడో?" అంది ప్రతిభ.

    "ఇప్పుడు నా మొగుడి ప్రసక్తి ఎందుకు?"

    "మున్ముందు నీ జీవితమైనా, నా జీవితమైనా ఆధారపడి వున్నది మొగుడి మీదే కదా, మనం ఆడపిల్లలమని మరిచిపోకూడదు...."

    "ఇదంతా ఎందుకు చెబుతున్నావు?"

    "ఆ రోజు దేవేంద్రను మీరంతా అలా నిరసించడం నాకు నచ్చలేదు.

    "దేవేంద్ర ఎవరు?" అంది హాస.

    ప్రతిభ మిగతా స్నేహితురాండ్రవంక చూసింది. మాలతి, సుగుణ, లలిత, కోమలి, వందన- అందరూ బ్లాంక్ ఫీసెస్ పెట్టారు.

    "అరె! దేవేంద్ర మీకెవ్వరికీ గుర్తులేడా?" అంటూ ప్రతిభ వారంరోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసింది.

    అది గుర్తు చేసుకుని అంతా నవ్వుకున్నారు.

    "అవును! అతడి పేరు దేవేంద్రే!" అంది వందన.

    "అవునూ! మా అందరికీ గుర్తులేని దేవేంద్ర నీకెలా గుర్తున్నాడూ?" అంది హాస.

    "జోక్స్ మరిచిపోయి జీవితం గురించి ఆలోచించండి. మనలాంటి మధ్య తరగతి ఆడపిల్లలకు దేవేంద్ర ఒక ఆశాకిరణం...."

    "అబ్బా! వ్యవహారం చాలా దూరం వెళ్ళిందే! అతడో ఆశాకిరణమని నీకెలా తెలుసు?"

    "నువ్వే చెప్పావుగా! నవ్వడం కోసం మనిషి స్వార్ధాన్ని మర్చిపోవాలని! నేను క్షణికానందం కోసం ఓ మంచి మనిషిని ఎగతాళి చేసి మర్చిపోలేను. పదిమంది జీవితాల్లో నవ్వులు నింపగల మనిషిని ప్రోత్సహించడానికి కాసేపు స్వార్ధాన్ని వెనక్కు నెట్టాను. వ్యవహారం కాస్త దూరం వెడితే తప్ప అసలు విషయం తెలియదని గ్రహించాను. అతడితో పరిచయం పెంచుకున్నాను. దేవేంద్ర సామాన్యుడు కాడు. వరకట్నం లేకుండా పెళ్ళి చేసుకునే కుర్రాళ్ళందరినీ ఒక్కచోట పోగు చేస్తున్నాడు.   
అతడు స్థాపించబోయే సంస్థకు మన బోటి వాళ్ళు ప్రోత్సాహమివ్వాలి. అతణ్ణి మనమే నీరస పరిస్తే అది స్త్రీ జాతికే అనర్ధం...."

    "హియర్ హియర్...." అంది కోమలి.

    అంతా చప్పట్లు కొట్టారు.

    "అవునూ- తన సంస్థ గురించి అతడు ఆడపిల్లలకే వచ్చి చెబుతాడేం? ఏ పేపర్లోనో వేయించొచ్చుగా...." అంది హాస.

    "అదీ జరుగుతుంది...."

    "ప్రతిభా! నా మాట విను. ఆ దేవేంద్రను చూస్తే నాకు సదభిప్రాయం కలగలేదు. అతణ్ని నువ్వు నమ్మకు" అంది హాస.

    "అతణ్ణి నమ్మి నేను చెడిపోయాననుకో. నీకేం నష్టం? అప్పుడూ నువ్వు నన్ను చూసి నవ్వగలవుగా...." అంది ప్రతిభ.

    హాస మాట్లాడలేదు కానీ కోమలి మాత్రం, "అనవసరపు వాదులాట మనకెందుగ్గానీ సరదాగా మనం ఓ మగాడ్ని మోసం చేస్తే ఎలాగుంటుందీ అని నాకిప్పుడే అయిడియా వచ్చింది....అంది.

    "మోసమెందుకూ?" అంది హాస.

    "మనమిప్పుడు బియ్యే ఫైనలియర్లో ఉన్నాం. ఇప్పటికే ఇళ్ళలో పెళ్ళి ప్రయత్నాల హడావుడి పెరిగిపోయింది. మననింకెలాగూ పైకి చదవనివ్వరు. పైగా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనందరికీ మగాళ్ళంటే కొంత అసూయ, కొంత ద్వేషం ఉన్నాయి. చరిత్ర నిండా మగాళ్ళు ఆడపిల్లల్ని మోసం చేసిన కథలే వున్నాయి. మనమూ సరదాగా ఓ మగాడి జీవితంతో ఆడుకుంటే జీవితాంతం నవ్వుకునేందుకు మనకూ ఓ కథ ఉంటుంది...." అంది కోమలి.

    "నాకెవరంటేనూ అసూయలేదు. ఎవరన్నా పగ, ద్వేషం లేవు. ఇలాంటి వాటికి నేనొప్పుకోను" అంది హాస.

    "ఎవరొప్పుకుంటారో చేతులెత్తండి" అంది కోమలి.

    హాస తప్ప అంతా చేతులెత్తారు.

    "ఇది ప్రజారాజ్యం. మెజారిటీకి తలవంచాలి" అంది కోమలి.

    "ఇది ప్రజారాజ్యమని నేనూ ఒప్పుకుంటూ ఇక్కణ్ణించి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాను" అంటూ నవ్వుతూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది హాస.


                                                                       13


    గౌతమ్ చుట్టూ చూశాడు.

    అంతా తమాషాగా ఉంది.

    అక్కడ రంగు రంగుల బుడగలు గాలిలో తెల్తున్నాయి. మనుషులెవ్వరూ నేల మీద నడవడం లేదు. అసలు నేలన్నది కనిపించడంలేదు.

    ఎటు చూసినా పూల మొక్కలు, వింత పరిమళాలు....

    కనిపించే ప్రతి మనిషీ ఆరోగ్యంతో మిసమిసలాడిపోతున్నాడు.

    ఆడవాళ్ళందరూ అర్ధనగ్నంగా వయసు సొగసులు బయటపడుతూ గానమో, నృత్యమో ఏదో ఒకటి చేస్తున్నారు.

    ఎవ్వరూ అతడ్ని పలకరించడం లేదు, పట్టించుకోవడం లేదు.

    గౌతమ్ అక్కడే తిరుగుతూండగా ఒకచోట కనిపించాడతడికి విశ్వామిత్రుడు.

    "స్వామీ!" అన్నాడతడు అప్రయత్నంగా.

    విశ్వామిత్రుడతణ్ణి చూసి, "నిన్నెక్కడో చూసినట్లుందే" అన్నాడు.

    గౌతమ్ అతడికి తమ పరిచయం గుర్తుచేశాడు.

    "ఓహ్, నువ్వా? అయితే యిక్కడికెలా వచ్చావు....?" అన్నాడు విశ్వామిత్రుడు.

    "కానీ నేనిక్కడకు రావాలనుకోలేదు" అన్నాడు గౌతమ్.

    "రావాలనుకుని కూడా అంతా యిక్కడికి రాలేరు అదృష్టవంతుడివి, అన్నీ అనుభవించు" అన్నాడు విశ్వామిత్రుడు.

    "స్వామీ! నేను కోరింది స్వర్గాన్ని కాదు. మోక్షాన్ని....!" అన్నాడు గౌతమ్.

    విశ్వామిత్రుడతడివంక తీవ్రంగా చూసి, "మోక్షం నాకే లేదు. ఇంకా నీకెలా వస్తుంది?" అన్నాడు.

    "అవును స్వామీ! తమరు భూలోకంలో ఎన్నికలిన్నారు.... ఇక్కడేం చేస్తున్నారు?" అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా.

    "మనది భారతదేశం. దేశానికాపేరు నా మనుమడి కారణంగా వచ్చింది. తాతల పేరుతో కొందరు రాజ్యాలేలదామనుకుంటున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన వాడ్ని నేను వారికి విరుగుడుగా మనుమడి పేరుతో రాజ్యమేలాలనుకుంటున్నాను. ఇందుకు నాతో పరిచయమున్న ప్రతి దేవుడి పేరునూ నా యిష్టం వచ్చినట్లుపయోగించుకుంటాను. కాబట్టి ముందుగా దేశనాయకులందరికీ నన్ను తప్పుపట్ట వద్దని నచ్చజెప్పడాని కిక్కడికి వచ్చాను."

    "అందుకు వారొప్పుకుంటారా?"

    "ఎందుకొప్పుకోరు? భావిభారత సామ్రాటుని కాదంటే భూలోకంలో వారికి పూజాపునస్కారాలుంటాయా?"

    గౌతమ్ ఇంకా అడగబోతూంటే, "నీ కథకు నా కథను జోడించడం నా కిష్టం లేదు. నీ గొడవేమిటో త్వరగా చెప్పు......." అన్నాడు విశ్వామిత్రుడు.

    గౌతమ్ విశ్వామిత్రుణ్ణి కలిసేక తనకు జరిగిన అనుభవాలన్ని చెప్పాడు.

    విశ్వామిత్రుడతడ్ని ఓ పారిజాత వృక్షం క్రిందకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఓ దేవతల జంట శృంగార క్రీడలో వున్నారు.

    "నేను చెప్పేది విను" అన్నాడు విశ్వామిత్రుడు.

    గౌతమ్ ఆ దేవతల జంటనే చూస్తున్నాడు.

    "నువ్వు నేను చెప్పేది వినడం లేదు" అన్నాడు విశ్వామిత్రుడు.

    "స్వామీ, ఇక్కడ నాకు దృష్టి నిలకడగా లేదు" అన్నాడు గౌతమ్.

    విశ్వామిత్రుడతణ్ణి మరో చోటకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ రతీదేవి కొన్ని జంటలకు వాత్సాయన కామ సూత్రాలను సోదాహరణంగా వివరిస్తోంది.

    "ఎటు చూసినా శృంగారమే, మరేమీ లేదా యిక్కడ?" అన్నాడు గౌతమ్.

    "శృంగారం స్వర్గంలో లేదు. నీ మనసులో వుంది. నీ మనసుకు నచ్చినవన్నీ అనుభవంలోకి తెచ్చేదే స్వర్గం...." అన్నాడు విశ్వామిత్రుడు.

    "అంటే?"

    "స్వర్గానికి వచ్చిన రసిపాపి శృంగారపు లోతులు తెలుసుకుంటాడు. వేదాంతి వేదాంత సారాన్ని తెలుసుకుంటాడు. నీలో శృంగారవాంఛ వుంది. అవి తీరేదాకా నీవు మహాత్ముడివి కాలేవు,"

    "నాకు మహాత్ముడు కావాలనిలేదు."

    అప్పుడు విశ్వామిత్రుడతడికి జ్ఞానబోధ చేశాడు.

    నాశనం లేని ఆత్మశక్తికి మానవ శరీరాన్ని ధరింపజేస్తే మనిషి అవుతాడు. ఆ మనిషి తన బుద్ధిని ఉపయోగిస్తూనే శరీరావసరాలన్నీ తీర్చుకోవాలి. లేకుంటే శరీరం మనిషికి స్థిమితం లేకుండా చేసి బుద్ధిని పెడదార్లు పట్టిస్తుంది. కామిగాక మోక్షగామి కావడమన్నది మనిషి విషయంలో అక్షరాలా నిజం.

    "అయితే నేనేం చేయాలి?"

    భూలోకానికి తిరిగి వెళ్ళి పెళ్ళి చేసుకో."

    "కానీ నేను చచ్చిపోయానుగా...."

    "నువ్వెలా చస్తావు? నీ వల్ల భూలోకానికెంతో మేలు జరగాల్సి ఉంది...."

    "కానీ నేను ఎలుకల మందు తిన్నాను...."

    "వెర్రివాడా, నువ్వు ఎలుకల మందనుకున్నది మైదాపిండి. మైదాపిండి అడిగిన ఓ మందభాగ్యుడీకి ఎలుకలమందు వెళ్ళింది. కిరాణా కొట్లో మీ యిద్దరి అయిటమ్సూ తారుమారయ్యాయి. చావన్నది నీ కోరికను బట్టి రాదు. అది నీకు రాసిపెట్టుండాలి...."

 Previous Page Next Page