Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 12

    "అవును! ఒకరు లేందే ఒకరు లేరనుకున్నాం! రేవంత్.
    "ఒకవేళ పెళ్ళయ్యాక ఇది జరిగుంటే...?" క్రాంత్.
    "వదిలేసేవాణ్ణి!శీలం ముఖ్యం నాకు!" స్థిరంగా  అన్నాడు.
    అప్పుడు లేచాడు ఈష్ వేగంగా.
    రేవంత్ కాలర్  పట్టి పైకిలేపాడు. షోల్దర్స్ మీద ఫోర్స్ గా కొడుతూ వెనక్కి వెనక్కి అలలవైపు నెట్టుకెళ్తూ-
    "ఈడియట్... ఇదిరా ప్రేమంటే?! ఇదిరా.... నీ మెంటల్ మెచ్యూరిటీ?! మాకంటే బొలెడు పుస్తకాలు చదువుతావు కదరా... ఇదేనా - నువ్వు నేర్చుకున్న మానసిక పరిపక్వత?! ప్రేమకు అర్థం శరీరమా? ఆ శరీరంలో కలిగే మార్పులు ప్రేమను మారుస్తాయా? నువ్వా  శరీరాన్నే ప్రేమించాలనుకుంటే రోజుకో శరీరాన్ని ప్రేమించుకోరా.... ఆ అమ్మాయి నొదిలేసి! కానీ, ఆ మనసును ప్రేమించి ఉంటే ఆ శరీరానికి అయిన గాయాన్ని మాన్పడానికి ప్రయత్నించరా! ఆమె మనసుకు కాన్ఫిడెన్స్  ఇవ్వరా! తన శరీరం ఇతర భాగాలకు గాయమయినట్టే ఆ గాయాన్ని కూడా గాయంగా మాన్పెయరా! అదీ  అవయవమే... కాదా?! ఆ అవయవానికి గాయమయితేనే శీలం పోతుందారా? కన్నూ, ముక్కూ కాలూ, చెయ్యి.... వీటికి గాయమైతే శీలం ఎలా పోదో- ఆ గాయానికి కూడా శీలం పోదురా!శీలం మనసుకు సంబంధించిన అపురూప భావనరా! వేశ్యల్లో కూడా శీలవతులుండవచ్చు... మానసికంగా! అలాగే పతివ్రతలో  శీలం పోయిఉండవచ్చు మానసికంగా! మనసురా ముఖ్యం... శరీరం కాదు! తన మనసు చెడలేదు కాదురా! నిన్ను ప్రేమించే ఆ మనసు నీకెక్కడ దొరుకుతుందిరా! నీకు అమ్మే శరీరాలు వీధికొకటి దొరుకుతుంది. శరీరాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే నీకు మనసివ్వడమే ఆ అమ్మాయి పోగొట్టుకున్న శీలంరా!"
    "నో! గ్యాంగ్ రేప్ చేసినదాన్ని.., అందులోనూ ప్రెగ్నెంట్ ను నేను ప్రేమించలేను!"
    "రాస్కెల్ .... రేప్ చెయ్యబడడంలో ఆమె తప్పేంటిరా! ఇంకా నీలాంటి పూల్ ను ప్రేమించడం రేప్చెయ్యబడటంకంటే తప్పు! ఎందుకంటే- రేప్ ఆమెకు తెలియకుండా  ఇప్పుడు నువ్వామెను వదిలేస్తే ఆమె మనసును రేప్ చేసిన వాడవవుతావు.... తెలుసా!" కాలర్ పట్టుకుని సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు.
    "తెలీదు! కానీ, చెడిపోయిన ఆడదాన్ని ప్రేమించలేనురా!" రేవంత్ ఇంకా గట్టిగా అన్నాడు.
    "చెడిపోవడానికి నీకసలు డెఫినేషన్ తెలుసురా పూల్?! ఆమెకు తెలియక జరిగిన రేప్ లో ఆమె చెడిపోలేదురా! ఆమెకు తెలిసీ నీలాంటి హార్ట్ లెస్ ఈడియట్ ను ప్రేమించింది చూడూ.... అక్కడ చెడిపోయింది. షిట్! ఎందుకురా నీ చదువూ, సంస్కారం... చెడిపోవడానికి అర్థం తెలీనపుడు! ఒక్కసారి..., ఒక్కసారి తన స్థానంలో నీ చెల్లి నూహించుకో! నువ్వే న్యాయాన్ని కోరుకుంటావో అది చెయ్యి!"
    "నేనిప్పుడేం చెయ్యాలి?" రేవంత్ కూల్ గా అడిగాడు.
    "ముందు తనకు రేప్ జరిగిన సంగతి తెలియజెయ్యి! జరిగినా- 'నీకు నేనున్నాను' అనే మానసిక బలాన్ని ఇవ్వు! ఆ తరువాత ఆ కడుపులో కుళ్ళును కడిగేసి తనను పవిత్రంగా స్వీకరించు! తను వీదిరా! తనను బాగుచేసుకునే బాధ్యత నువ్వు  వహించాలిరా నిజంగా ప్రేమిస్తే! బూటకపు ప్రేమయితే మాత్రం- జీవితంలో మా ఫ్రెండ్ వయినందుకు మాకూ, ప్రేమించినందుకు తనకూ కనిపించకుండా ఎటైనా పోరా! నీలాంటి క్రూక్ ను మేము చూస్తూ భరించలేము!" నింపాదిగానే కానీ, స్థిరంగా చెప్పాడు ఈష్.
    "యస్! ఈష్ ఈజ్ కరెక్ట్! ప్లీజ్ గో అవే ఫ్రం అజ్!" క్రాంత్ అన్నాడు.
    "షటప్! నా విషయం కాబట్టి మీరు ఇష్టం వచ్చిన ఆదర్శాలూ, నిర్వచనాలూ వర్ణించి సలహాలు చెబుతున్నారు! మీ విషయమైతే మీరూ నాలానే ఆలోచించేవారు!" అన్నాడు షర్ట్ సరిచేసుకుంటూ.
    "నెవ్వర్! నెవ్వర్!" అన్నాడు ఈష్.
    "మేము మరీ నీ అంత కుత్సితం కాలేదురా!" కాంత్.
    "నిజంచెప్పు ఈష్... ఒకవేళ స్ఫూర్తికే ఇలా జరిగుంటే నువ్వేం చేసుండేవాడివి?" సూటిగా అడిగాడు రేవంత్.
    గట్టిగా నవ్వాడు ఈష్. రేవంత్ దగ్గరకొచ్చి కళ్ళల్లోకి చూస్తూ-
    "నీలాంటి పూల్స్ దగ్గర ఈ విషయమసలు డిస్కస్ చేసేవాణ్ని కాదు. ముందువెళ్లి- తనకు 'జరిగింది అనుకోకుండాననీ, అది జరగలేదనుకోమనీ చెప్పి, తనకు అండగా నిలిచి ఇమ్మీడియాట్ నాదాన్ని చేసుకునుండేవాడిని!"
    "నిజంగా...!"
    "ముమ్మాటికీ! స్ఫూర్తిమీద నాకు ఇష్టం ఉన్నంతమేరా ముమ్మాటికీ!"
    "అయితే... ఇది జ్ఞాపిక కథ కాదురా - స్ఫూర్తి కథ! నిరూపించుకో నీ ప్రేమ!" కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
    అలాగే స్థాణువయిపోయాడతను. రెప్పకూడా వాల్చలా! చిన్నగా తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. సృహలో లేనట్టు ఉండిపోయాడు.
    షోల్డర్స్ పట్టి కుదిపాడు రేవంత్.
    "ఈష్! ఈష్... ఆర్ యూ ఓ.కే.?"
    "ఫాల్స్! యూ ఆర్ లైయింగ్! హాఁ...! కదా... అబద్దం కదా!" పలవరించినట్లు అన్నాడు.
    "కాదురా....నిజం! స్ఫూర్తి అన్ కాన్షన్ లో రేప్ చెయ్యబడింది. జ్ఞాపిక చూస్తుండగానే! కానీ, స్ఫూర్తికి తెలియదు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్! ఆ విషయం కూడా తనకు తెలీదు. ఇవిగో....డాక్టర్ రిపోర్ట్స్!"
    పిచ్చివాడిలా రిపోర్ట్స్ లాక్కున్నాడు. మొత్తం చదివాడు. నలిపి చింపి విసిరేశాడు. కానీ మౌనంగా, దీర్ఘ మౌనంగా  ఉండిపోయాడు. దిమ్మతిరిగినట్టు ఆగిపోయాడు. గలగలా నవ్వుతున్న తరగలా స్ఫూర్తి అతని కళ్ళముందు మెదిలింది!
    'ఇంటి కెళ్దాం!' సైగ చేశాడు క్రాంత్.
    రేవంత్ ఈష్ భుజాలు పట్టుకుని దగ్గరగా సన్నిహితంగా నడిపించుకెళ్లాడు. స్నేహితుడికి అనుకుని, అతనిలో లీనమయి అతని ఆధారంగా అడుగులు కదిపాడు మౌనంగా మౌనంగా.., మౌనంగా!
    రేప్ చూసిన జ్ఞాపికంటే, రేప్ జరిగినా తెలియని స్ఫూర్తికంటే.., తన స్ఫూర్తిని- తనకే చెందాల్సిన స్ఫూర్తిని- తను పువ్వులా దోసిట్లో జీవితాంతం మోయాలనుకున్న స్ఫూర్తిని.... గ్యాంగ్ రేప్ చేశారనే విషయం అతన్ని షాక్ చేసింది. ఎన్ని ఓల్టేజ్ లంటే.... జీవశ్చవాన్ని చేసేన్ని ఓల్డేజీల షాక్ తగలినట్టు నిస్త్రాణమైపోయాడతడు.
                                          8
    కాలేజ్ లో క్లాసెస్ అయిపోయాక బయటపడ్డారు స్టూడెంట్స్ అందరూ- బిలబిలగా, గోలగోలగా, ఏదోఏదో మాట్లాడుకుంటూ!
    గ్నపికా, కామినీ,స్ఫూర్తీ, రేవతి నడుస్తున్నారు మెల్లగా! నెక్స్ట వర్ లేదు. హాస్టల్ కెళ్లిపోవాలి. వెహికల్ పార్కింగ్ దగ్గరికెళ్లేసరికి- స్ఫూర్తి కైనటి క్ ను అనుకుని నిలుచునున్నాడు ఈష్.
    "హాయ్ఁ...! ఏంటీ.... వెహికల్ షెడ్ వాచ్ మన్ గా అప్పాయింటయ్యావా? వెరీగుడ్.... వెరీగుడ్! మా వెహికల్సింక సేఫ్! ఎవ్వరూ సీట్స్ కొయ్యరు!" అంది స్ఫూర్తి.
    "ఏయ్ పిచ్చిమొద్దూ.... మురిసిపోతున్నావ్! వాచ్ మనో, చీట్ మనో- చూసుకొవే... నీ వెహికల్ పార్ట్సేవయినా  పోయాయేమో!" స్ఫూర్తిని రెచ్చగొట్టింది రేవతి.
    "య్యా! యార్... నా డిక్కీలో హ్యాటుండాలి- ఉందా?" వంగి డిక్కీ తీయబోయింది.
    టక్కున స్పూర్తి చెయ్యి పట్టుకుని- "స్ఫూర్తీ... కాసేపు నాతో బయటకొస్తావా?" సూటిగా, సీరియస్ గా అడిగాడు ఈష్.
    "ఇప్పుడు మనమేం ఇండోర్ లో లేమే! బయటే ఉన్నామే...!" అని వెనక్కి తిరిగి చూసింది- జోక్ కు ముగ్గురూ నవ్వుతారని!
    రేవతి ఒక్కతే కిసుక్కున నవ్వింది! మిగతా ఇద్దరూ సీరియస్ గా కామ్ గా ఉన్నారు.    స్పూర్తి చేతిలోంచి కైనటిక్  కీ తీసుకుని స్టార్ట్ చేసి, "కమాన్..!" అన్నాడు.
    మెత్తదనపు కమాండ్..! ఆ కమాండ్ కు స్పూర్తి మనసు లొంగిపోయింది.
    ఎక్కబోయేంతలో... రేవతి వెళ్లి- "దానికి ఒంట్లో బాలా! వామిటింగ్స్...."
    జ్ఞాపిక టక్కున రేవతి నోరు మూసింది. కైనటిక్ సాగిపోయింది.
    వెనుక నుంచి రేవతి "బై...." అని రెండుచేతులూ ఊపింది-జ్ఞాపిక చేతులు లాగేసి. "వచ్చేపుడు ఐస్ క్రీం పట్రావే.... ఫ్యామిలీ ప్యాక్!" అనరిచింది రేవతి.
    రేవతి తలమీద టపాటపా కొటారు కామినీ, జ్ఞాపిక.
    "ఎందుకే... నన్ను ప్రతిసారీ కొడతారు?!"
    "పిచ్చిమొహమాఁ.... వాళ్ళు లవ్ ఫేర్! లవ్ చేసుకోవడానికెళ్తుంటే- 'ఐస్ క్రీం పట్రా, ఆముదం సీసా పట్రా...' అని నువ్వేంటే ఆర్దర్లేస్తున్నావ్! వాళ్ళేం పచారీ  కొట్టుకెళ్లట్లేదు!" కామిని తిట్టింది.
    "దీనికి దేవుడు ఒళ్ళు తప్పితే బ్రెయినివ్వలేదే!" అంది జ్ఞాపిక.
    "ఎందుకివ్వలేదు...చక్కగా ఇచ్చాడు! వాళ్ళు వెళ్తోంది లవ్ చేసుకోవడానికని నాకూ తెలుసు! ఆ లవ్ లో పడి ఈష్ స్ఫూర్తి ఏదడిగితే అది కొనిస్తాడుగా... అందుకే 'ఫ్యామిలీ ప్యాక్ ' అడిగా - మీక్కూడా పనికొస్తుందని! మీమీద నాకున్న ప్రేమ- నామీద మీకు లేదు."
    "సర్లేపద! నీ ప్రేమ కారి కాలువలు కడుతోంది కానీ!" అని కామిని- రేవతి చెయ్యి పట్టుకుని లాగింది. రేవంత్, క్రాంత్ లు జాయినయ్యారు. రేవతి వాళ్ళను సపోర్ట్  చేసుకుని అల్లరి మొదలెట్టింది మళ్లీ.
    నిజంగా ఒక్కరు అల్లరి చేసేవాళ్ళుంటే.... వాళ్ళ వాతావరణమంతా అల్లరిగా ఆనందంగా ఉంటుంది. అసలు అప్పుడప్పుడూ అందరూ అల్లరి చేస్తుంటేనే బావుంటుందేమో!
                                                                         *    *    *
    కైనటిక్ పార్క్  చేసి చెట్టుకింద కూర్చున్నాడు ఈష్ మౌనంగా వెళ్లి.
    స్ఫూర్తి కూడా వెళ్లింది.  
    "ఏయ్ఁ....అందరం కలిసి వస్తే  చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళంగా!" అంది పక్కనే కూర్చుంటూ.
    "మనం ఎంజాయ్ చెయ్యడానికి రాలా! జీవితం నిర్ణయించుకోవడానికొచ్చాం!"
    "ఏంటీ...భారీ డైలాగులు?!"
    ""డైలాగులు కాదు. నువ్వంటే నాకిష్టం! నేనంటే నీకిష్టమా? లేకపోతే 'లేదు' అని ఒక్కముక్కలో చెప్పేయ్! మొహమాటం వద్దు."
    "ఇష్టమే..!"
    "నాది త్రీ మంత్స్ లో ఫైనలియర్ అయిపోతుంది. స్టేట్స్ వెళ్లిపోయే ప్రోగ్రామ్ లో ఉన్నాను... తెలుసుగా!"
    "ఓల్డ్ న్యూస్!"
    "ఈలోపు నేను పెళ్ళి చేసుకుందామనుకున్నాను. నీకేవయినా అభ్యంతరమా?"
    "నీ పెళ్ళికి ఇంత ముందుగా పిలవాలా నన్ను? ఆ పిలిచేదేదో అందర్లో పిలిస్తే పోయేదిగా... అందర్తోపాటు! ఇంతదూరం తీసుకొచ్చి ప్రత్యేకంగా పిలవాలా?!"
    "అవును. నేను చేసుకునేది నిన్నే కాబట్టి!"
    చివ్వున తలెత్తి చలింపుగా చూసింది. ఊపిరాగాపోయింది. ఎలాగో గొంతు తెచ్చుకుని-
    "ఎవరయినా సరే.... తొందరపడటం సహజం! నీ తొందరపాటు అర్థంచేసుకోగలను. మళ్లీ ఒకసారి ఆలోచించుకోవడానికి టైమ్ తీసుకో!" అంది మనసులోకి తొంగిచూస్తూ.
    "నాకక్కర్లేదు! నీక్కావాలా?" ఏ తడబాటూ, తొందరపాటూ లేదు గొంతులో.
    "నువ్వు నాకు చెందితే నాకంటే అదృష్టవంతులెవరుంటారు ఈష్! కానీ, నేను నీకు చెందడం నీకు అదృష్టంగా భావించాలిగా నువ్వు!"
    "భావించాను కాబట్టే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను"
    "నన్నే ఎందుకు చేసుకోవాలనుకున్నావు?"
    "నువ్వంటే నాకిష్టం! ఇన్నాళ్లూ ఈ విషయం చెప్పి మన చదువులు డిస్టర్బ్  చేసుకోవడం ఇష్టంలేక ఫ్రెండ్ గా ఉండిపోయా! ఇప్పుడు  సమయం వచ్చింది....చెప్పా!"
    "ఇంక రెణ్ణెల్ల టైముందిగా!"
    "అయినా...నాకిప్పుడే సమాధానం కావాలి."
    "అమ్మానూ, నాన్ననూ అడగక్కర్లేదా ఇద్దరం?!"
    "ముందు మనం తేల్చుకుంటే తర్వాత వాళ్ళ దగ్గరికెళ్లోచ్చు!"
    "నాకు అభ్యంతరం లేదు."
    "అయితే... నేను ఇప్పుడే రిజిష్ట్రార్ ఆఫీసులో నిన్ను పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను" స్థిరంగా అన్నాడు.
    ఉలిక్కిపడింది.
    "ఇంత సడెన్ గా....ఇప్పుడా!అదేంటి....పిచ్చి కోరిక! పిడుగుపడ్డట్టు చెప్పాలా.... పెళ్ళి చేసుకుందామని!"
    "అవును. పిచ్చి కోరికే! తీర్చలేవా?" లాలనగా అడిగాడు.
    "అమ్మానాన్నలూ, పెద్దలు , అందరి సమక్షంలో దర్జాగా చేసుకుందాం!"
    "నాకిష్టంలేదు ఆ ఆర్భాటం! పెళ్ళిచేసుకుని ఫోన్ చేద్దాం- మనిద్దరి  పెళ్ళయి పోయిందని!" 'మనిద్దరమే ముఖ్యం ఈ సృష్టిలో' అన్నట్టు
    "ఇంత అర్జెంట్ డెసిషన్ ఎందుకు?" అయోమయంగా అడిగింది.
    "అవసరం కాబట్టి! ఇష్టం లేకపోతే చెప్పు! తీసుకున్న డేట్  రిజిష్ట్రార్ ఆఫీస్ లో కాన్సిల్ చేస్తాను. అయితే ఇంకెప్పుడూ తీసుకోను జీవితంలో!"
    అర్థంకాలా స్ఫూర్తికి.
    "ఏంటో.... పెళ్ళంటే నీకేదో ప్రాక్టికల్ క్లాస్ అటెండ్ చేసినంత ఈజీగా ఉంది!" టెన్షన్ వచ్చేసింది స్ఫూర్తికి.
    "అవును! ప్రాక్టికల్ క్లాస్! జీవితపు థియరీకి పెళ్ళి ప్రాక్టికల్ ఎక్స్ పర్ మెంట్! నాతో కలిసి చెయ్యలేవా!" కళ్ళలోకి చూశాడు తన నీడలు కదులుతున్న కనుపాపలలోకి.
    "కనీసం జ్ఞాపిక, కామీ, రేవతీ...."
    "అంతేకదా! పదా!" కైనటిక్ స్టార్టయింది.
    వీళ్ళు వెళ్లేసరికి అక్కడ రేవంత్, క్రాంత్, జ్ఞాపిక, కామినీ, రేవతీ అందరూ ఉన్నారు. అయితే నీట్ గా డ్రస్సప్పయి!
    కామిని స్ఫూర్తిని ప్రక్కరూమ్ లోకి తీస్కెళ్లింది.
    కాసేపట్లో ఇద్దరూ బయటకొచ్చారు. పట్టుచీరలో ఉంది స్ఫూర్తి.
    ముందే సూట్ లో ఉన్న ఈష్ ఆమె చెయ్యందుకున్నాడు.
    ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
    సంతకం పెడుతూ అమ్మానాన్నలను తలుచుకుంది. కళ్ళల్లో నీళ్లు!
    జ్ఞాపిక స్పూర్తి భుజంమీద చెయ్యేసింది. కామినీ, రేవతి వచ్చి అనుకుని నిలబడ్డారు.
    రేవంత్ దండలు ఇచ్చాడు. ఇద్దరూ వేసుకొగానే చప్పట్లతో కంగ్రాట్స్ చెప్పి, సాక్షి సంతకాలు చేసి ఫోటోస్ తీసుకున్నారు.
    వాళ్ళిద్దర్నీ వదిలేసి అందరూ వెళ్లిపోయారు.

 Previous Page Next Page