ఇద్దరూ రోడ్డు మీదా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు.
"ఈ నడి రోడ్డుమీదా ఆ ప్రశ్న?"
"ఏం పబ్లిక్ రోడ్డు అయితే మాత్రం పెళ్ళి సంగతి మాట్లాడుకోకూడదా?"
ఆమె ప్రశ్న సబబే అనిపించిందతనికి.
కానీ, ప్రస్తుతం ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిస్థితిలో అతను లేడు. అందుకే ఆమెకు సూటిగా జవాబివ్వలేకపోతున్నాడతను.
"ఏమిటి మాట్లాడవు?"
ఆమె ఆ విషయాన్ని వదలకుండా మరోసారి రెట్టించి అడిగింది.
"పెళ్ళి గురించేనా?"
"అవును..." చిరుకోపంతో ఆమె పెదవులు అదురుతున్నాయి.
"కొన్నాళ్ళు ఆగితే బాగుంటుందేమో..."
"ఆడపిల్లనై వుండి నేనెందుకు తొందరపడుతున్నానో అర్ధం చేసుకోలేక పోతున్నావు.... ఈ వారంలోనే మా మమ్మీ, డాడీ, ఇండియా వస్తున్నారు. తరువాత పరిస్థితి ఎలా వుంటుందో చెప్పడం కష్టం...వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళినా తీసుకెళ్ళవచ్చు..... లేదా వాళ్ళు ఇండియాలోనే వుండిపోవచ్చు. అందుకే వాళ్ళు వచ్చే లోపు మనం ఒక నిర్ణయానికి రావడము మంచిది..."
ఒక నిమిషం తరువాత...
"అవును....కానీ మన ఇద్దరి వయస్సు చాల తక్కువ. ఎట్ లీస్ట్ ఇద్దరికీ పద్దెనిమిది అయినా దాటితే మంచిదేనని..."
అతను మరేదో చెప్పబోయాడు.
అతని మాటలకు అడ్డువస్తూ__
"ఇష్... ఆ మాట ఎన్నిసార్లు గుర్తుచేస్తాను... నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడినప్పుడు.... ఆదివారం సాయంత్రం షికారుకు వెళ్ళినప్పుడు. ఎవరూ చూడకుండా వీలున్నప్పుడల్లా నా బుగ్గమీద ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మన వయస్సు సంగతి నీకు గుర్తుకు రాలేదా?"
ఆమె సీరియస్ గా అన్న మాటలకు గతుక్కుమన్నాడతను.
"అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావో చెప్పు"
"నాకదంతా అనవసరం రేపటిలోగా మనం అర్జెంటుగా పెళ్ళి చేసుకునే మార్గం ఆలోచించి చెప్పు..." ఆమె గొంతు స్థిరంగా అంది.
"అలాగే" అన్నాడతను....
సమాధానం అయితే చెప్పాడు కానీ జాజిబాలవైపు ఆశ్చర్యంగా చూశాడు.
ఆమె పట్టు పట్టిందంటే వదలదని అతనికి తెలుసు.
"ఇక ఇక్కడే ఆగుదాం... ముందు నేను వెళతాను... పది నిమిషాల తరువాత రా నువ్వు..." అని విసవిసా నడుచుకుంటూ వెళ్ళి పోయిందామె.
ఆమె ఎంత కోపంతో వున్నదో ఆమె నడకే చెబుతుందనుకున్నాడు.
రాంగో ఆలోచనల్లో ఎన్నో సమస్యలు కనిపించాయి.
'ఆమె మమ్మీ డాడీ తమ పెళ్ళికి ఒప్పుకుంటారా?'
తామిద్దరు పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్ళిచేసుకోవాలంటే ఏం చేయాలి.
ఎటైనా పారిపోయి పెళ్ళి చేసుకుని బ్రతికేస్తేనో...
అలా బ్రతకాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి...
అవును....ఎలా?
మెల్లగా నడిచి జాజిబాల ఇంటి దగ్గరకు వచ్చాడు.
ఏం చేయాలి?
జాజిబాలను ఎలా పెళ్ళి చేసుకోవాలి?
ఇల్లు రావడంతో ఏ నిర్ణయానికి రాకముందే ఇంటి తలుపుతట్టాడు రాంగో.
జాజిబాల వచ్చి తలుపుతీసింది.
అతన్ని చూసి ఏమీ పలకరించకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయిందామె.
ఆమె కోపం ఇంబ్కా తగ్గలేదనుకుంటా చిరునవ్వుతో తలుపు గడియ పెట్టి మధ్యహాలులో నుంచి వున్న మెట్లెక్కి పైనున్న తన గదికి చేరుకున్నాడతను.
[6]
అతని ఆలోచనలకు సరైన పరిష్కారం మరుసటి రోజు ఉదయం ఆఫీసులో దొరికింది.
బాస్ హైదరాబాద్ వెళ్ళి కాష్ కలెక్ట్ చేసుకురమ్మని చెప్పిన పని మీదనే ఆగిపోయింది అతని దృష్టి.
బాగా ఆలోచించిన మీదట తన నిర్ణయాన్ని జాజిబాలతో చెప్పాడు.
ముందు వ్యతిరేకించినా అంతకుమించి మరోదారి లేక అతను చెప్పినట్టే చేయడానికి సిద్దపడిందామె.
ఫలితంగా ఆమెకూడా రాంగోతోపాటు హైదరాబాద్ వచ్చేస్తున్నది...
ఆమె కోసమే నిరీక్షిస్తున్నాడు రాంగో....
అంతటితో అతని ఆలోచన్లు తిరిగి ఇంకాస్సేపటికి బయలుదేరడానికి సిద్దంగా నిండిపోతున్న బస్ పైకి మరలాయి....
ఎందుకైనా మంచిదని ముందుగానే రెండు సీట్లు రిజర్వేషన్ చేయించుకునే ఎదురుచూస్తున్నాడతను.
బస్ స్టాండ్ రద్దీగా వుంది.
బ్రహ్మ సృష్టించన అనంత కోటి జీవరాశులకు ఉదాహరణగా వున్నది.
సరిగ్గా ఐదు నిమిషాలు ఉందనగా జాజిబాల ఆటో దిగుతూ కనిపించింది.
ఆమెకోసం నిరీక్షిస్తున్న అతను ఆమె కనిపించగానే ఉవ్వెత్తున ఎగిసి దూకే జలపాతంలా ముందుకు కదిలి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు.
రాంగో ఆమెవైపు స్తబ్దంగా చూస్తూ ఉండిపోయాడు.
అంత ఆలోచనలోనూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాడతను.
నెమలి కంఠం రంగు షిఫాన్ చీర....అద్దినట్టుగా వున్న డార్క్ కలర్ బ్లౌజ్ పైన పచ్చగా మెరుస్తున్న మెడ...కంఠం మీద మిలమిలా మెరుస్తున్న ముత్యాలదండ.... చెవికివున్న లోలాకులు....
ఓ కళా ఖండంలా వుంది ఆమె అలంకరణ!