విశిష్ట మాత్రం నవ్వలేదు. ఆమె కళ్ళలో నిప్పు రవ్వలు చిందాయి.
"మనిషి జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. కాని దురదృష్టవశాత్తు ఈనాటి సినిమాలు, ఈనాటి పత్రికలు శృంగారానికి పెద్ద పీట వేసి దాన్ని హైలైట్ చేయడం వల్ల సమాజంలో అది వికృత పరిణామాలకు దారితీస్తోంది. యువత మనసులను పెడదారి పట్టిస్తున్నాయి.
దేశంలో ఆడవాళ్ళ మీద ఇన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే అందులో సినిమాలపాత్ర, పత్రికల పాత్ర చాలా వుంది. సినిమాలు చూసి, పత్రికలు చదివి వాళ్ళు చెడిపోతున్నారంటే వాళ్ళు ఒప్పుకోరు. కథ అన్నాక మంచీ చెడు రెండూ వుంటాయి. మంచిని స్వీకరించి చెడుని వదిలేయవచ్చుకదా అంటారు.
కానీ బలహీనమయిన మనసుల మీద చెడు ప్రభావం చూపినంతగా మంచి చూపించలేదు. చెడుని మనిషి త్వరగా అనుకరిస్తాడు. మంచిని అనుకరించడమే కష్టం.
మనిషి సంస్కారవంతుడు కావాలంటే ఇంటి వాతావరణం, తల్లి దండ్రుల పెంపకం కూడా కొంత దోహదం చేస్తాయనుకోండి. ఏమైనప్పటికీ పుట్టకురుపుల్లాంటి మనుషులు ఈ సమాజంలో చాలామందే వున్నారు. అంతెందుకు? మన కాలేజీలోనే వున్నారు.
ఆడపిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళతో ఆడుకొనేవాళ్ళు తెలియని పాఠాలు చెబుతాం రమ్మని ఇంటికి పిలిచి కడుపులు చేసేవాళ్ళు. అదీ - మన ఆచార్యవర్గంలో వుండడం దురదృష్టంలో కల్లా దురదృష్టం."
"ఎవరో వాళ్ళ పేరు చెప్పండి.........?" ఒకరు కాదు, చాలామంది కేకేశారు.
"చెప్పడానికి నాకేమీ భయంలేదు. అదిగో అక్కడ కూర్చొన్న మన ఆంగ్ల ఆచార్యులు! ఆడపిల్లలతో ఆడుకోవడం ఆయన హాబీ!ఇప్పటికే ఎందరో ఆడపిల్లలు ఈయన కామదాహానికి బలి అయ్యారు. ఇంకా అవుతున్నారు."
విశిష్ట తనకేసి వేలుచూపి ఆ మాట చెప్పగానే తోకతొక్కిన త్రాచులా చివ్వున లేచాడు పృధ్వీ.
"ఏయ్! నీకు మతిగాని పోయిందా? నేను ఆడపిల్లలతో ఆడుకొన్నానా? నువ్వు చూశావా? అభాండాలు వేయగానే సరికాదు. రుజువులు చూపాలి."
"అదే నీ అదృష్టం..........." చిన్నగా మందహాసం చేసింది విశిష్ట.
"రుజువులు, సాక్ష్యాలు చూపాలంటే ఆ ఆడపిల్లలు నీవల్ల చెడిపోయిన విషయం బయటపెట్టాలి. తమ కళంకం బయటపడి నలుగురిలో నవ్వులపాలయిపోతామన్న భయంతో వాళ్ళు నీ పేరు బయట పెట్టరు. అదే నీకు ప్లస్ పాయింట్! నువ్వు మరో ఆడపిల్లని మరో ఆడపిల్లని చెడగొట్టడానికి అవకాశం కల్పిస్తోంది"
"నువ్వు మోపిన ఈ అభియోగాన్ని నేను సీరియస్ గానే తీసుకొంటున్నాను. నేను ఏ ఆడపిల్లని మోసగించానో నువ్వు రుజువు చేయాలి. ........ లేదంటే నీ మీద చర్య తీసుకొమ్మని నేను ప్రిన్సిపాల్ గారిని కోరతాను. నిన్ను కాలేజీనుండి సస్పెండ్ చేయిస్తాను. "
"ఒక విమల, ఒక సుచరిత ఇలా ఎందరో నీ అందమైన రూపానికి భ్రమిశారు. నీ తీయని మాటలకు మోసపోయారు. జీవితాలను మోడుగా మార్చుకొన్నారు. చావలేక బ్రతుకుతున్నారు. అయినా నీ పేరు బయటపెట్టలేదు. ఎందుకంటే - తమ బ్రతుకులు బజారున పడతాయని. నీవల్ల వంచితులయిన వాళ్లు ఒక్కరు.......ఒక్కరు బయటపడితే చాలు, నీ ఆటకు 'చెక్' చెప్పొచ్చు. ఈ క్షణం నుండి నీకు 'చెక్' చెప్పే పావుకోసమే నా అన్వేషణ సాగుతుంది.
నువ్వు వట్టి కామాంధుడివని, పవిత్రమైన ఆచార్య పదవిలో వుండతగవని నేను రుజువుచేసిన రోజు..... నువ్వు ఈ జాబ్ కు రిజైన్ చేసి వెళ్ళాలి."
పృధ్వీ ముఖం కోపంతో బిగుసుకుపోయి అసహ్యంగా తయారైంది. అతడి దౌడ ఎముకలు పటపటలాడుతూ పైకీ క్రిందికీ కదిలాయి.
"చెక్ చెప్పడానికి నువ్వు కష్టపడక్కరలేదు విశిష్టా! నేనే చెబుతాను చెక్" అంటూ లేచింది కరుణ.
సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది.
"సహ విద్యార్ధులూ, ఆచార్యదేవులూ, అందరూ వినండి. ఈయన మాయాజాలంలో చిక్కుకొన్న అభాగ్యులలో నేనొకదాన్ని. నిజానికి ఆయన్ని నిందించకూడదేమో!
ఇది వయసు చేసిన మాయాజాలమేమో! కాలేజీకి వచ్చేది చదువుకోసమని మరిచిపోయి, వయసు గారపడీలోపడి వలపుగాలికి కొట్టుకుపోయి, నన్ను నేను తెలుసుకొనేసరికి. నన్ను నేను కోల్పోయాను. అవును - నేను చెడిపోయాను.
చెడిపోయింది మాత్రం ఈ పృధ్వీ వల్లే.......! ఉన్నతమైన ఆచార్య పదవిలో వుండి ఆడపిల్లలతో ఆడుకొనే తుచ్చమైన మనసున్నవాడు. ఈ విద్యాలయానికే చీడపురుగు లాంటివాడు. పెళ్ళి చేసుకుంటానని తీయటి మాటలు చెప్పాడు.
నన్ను నేను కోల్పోయాక ప్లేట్ మార్చాడు. నాకూ తనకూ మధ్య గురుశిష్యుల సంబంధం తప్ప ఇంకేం లేదన్నాడు...." జరిగిందంతా వివరంగా చెప్పింది.
"ఇదంతా అబద్దం. ఒక పథకం ప్రకారం పన్నిన కుట్ర. దీనివెనుక ఎవరో వుండి నామీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. స్టూడెంట్స్ అంటే నా బిడ్డల్లాంటివాళ్ళు . వాళ్ళమీద నాకు మరో భావం ఎంతమాత్రం కలగదు. నేను పెళ్ళికాని బ్రహ్మచారిని కావటం అలుసుగా తీసుకొని ఇలాంటి అభాండాలు వేస్తున్నారనిపిస్తోంది" ఎంతో అమాయకంగా, నిజాయితీగా అన్నాడు పృధ్వీ.
అక్కడ బరువైన నిశ్శబ్దం చోటుచేసుకుంది.
సుభాషిణి లేచి గొంతు సవరించుకొని సీరియస్ గా అంది- "ఒక పెళ్ళికాని ఆడపిల్ల ఇందరిలో నిలబడి తను ప్రేమించి మోసపోయానని, చెడిపోయానని చెప్పుకొంటున్నదంటే అది ఎవరో కుట్ర, అల్లిన కథ అని ఎలా అనుకుంటాం పృధ్వీగారూ? మీ గురించి కొంత నేనూ విన్నాను. వేసిన వేషాలు చాలు.
ఈ అమ్మాయికైనా అన్యాయం చెయ్యకండి. చక్కగా మా ముందు దండలు మార్చుకున్నాసరే! రిజిస్టరు మ్యారేజ్ చేసుకున్నా సరే. మీరిద్దరూ ఒకటి కావడమే మాకు కావలసింది."
"మీరు కరుణని తప్పక వివాహం చేసుకోవాలి సార్! ఆమెను మీరు వివాహమాడందే వదలం........" స్టూడెంట్స్ అరిచారు.