Previous Page Next Page 
తుపాన్ పేజి 12

    మా లోకేశ్వరి మాత్రం నిశాపతి సంగీతం అంటే చేవి కోసుకుంటుంది. సోఫీకి,నిసాపతికి భారతీయ సంగీత సంప్రదాయాన్నిగూర్చీ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉండేవి.సోఫీ పాశ్చ్యాత్య సంగీతం బాగా నేర్చుకుంది.ఆమె గొంతుక మంచి సోఫ్రానో, కాక లీస్వరయుక్తము.

    ఇంక నా సంగీతం అంటారా, నేను పట్నం సుబ్రహ్మణ్యంగారి శిష్యునికి శిష్యుడైనా నీలకంఠయ్యగారి దగ్గిర గాత్రం నేర్చుకున్నాను. కర్ణాటక బాణిలో అందెవేసినచేయనే నన్ను అంటారు. వీణ ఓ మోస్తరు బాగానే నేర్చుకున్నాను. మా లోకేశ్వరి కర్ణాటక బాణి అంటే అంత ఇష్టపడదు. కాని ఉత్తరాది బాణీ అంటే మహా ప్రేమ. నిశాపతి దగ్గిర శుశ్రూష నెరపి, చక్కగా పాడుతుంది. సినిమా పాటలు కన్నవీ బాలవీ, కురిషీద్ వీ, దేవికా రాణివీ,శాంతా ఆప్టేవీ, శాంతా హుబ్లికర్ వీ పాటలు అచ్చం వారివలెనే పాడుతూంటుంది. కళ్ళు మూసుకొని ఆ పాటలు వింటూంటే, ఆయా తారలు పాడుతున్నారని అనుకోవలసిందే!

    తీర్ధమిత్రుడు లోకేశ్వరి అంటే కొంచెం విసుక్కుంటాడు.కాని సోఫీ అంటే చెవి కోసుకుంటాడు.సోఫీని వెన్నంటుతాడు.ఆమె అందాన్ని పొగడుతాడు. ఆమె ఏదిచేస్తే అదే బాగుందంటాడు. అతణ్ని సోఫీ చివాట్లుపెడుతూ ఉంటుంది. అట్టే అల్లరి చేస్తేరెండు మూడు సార్లు చెంపకాయలు  కూడా తగిలించింది.

    కల్పమూర్తి లోకంతో స్నేహంగా ఉంటాడు.కాని సోఫీ అంటే కొంచం సిగ్గుపడతాడు!ఇంగ్లీషు గట్టిగా మాటలాడలేడు.కాబట్టి సోఫీ ఏమనుకుంటుందో అని అతనిభయం. అంచేత సోఫీ ప్రశ్నలు వేస్తూ ఉంటే '' అవును '' కాదు '' అనే అంటాడు. అయినా సోఫీ కల్పమూర్తి అంటే చాలా గౌరవం చేస్తుంది. అతనిమూర్తిత్వం గ్రీకులమూర్తిత్వం అంటుంది. అతడు పూర్వజన్మలో ఏ ఎథీనియన్ వీరుడో అని, ఆనందపడుతుంది. కల్పమూర్తి ఏ ఎన్నేరులోనో, సముద్రంలోనో ఈదుతూ ఉంటే, అతనితో పాటు ఈదుతూ, మా అందరికన్న ముందుపోతుంది.సోఫీ.

    నేనూ బాగానే ఈడుతాను. నేనూ మా సోఫివలెనే పాశ్చ్యాత్యుల  ఈత దుస్తులు తొడిగి, ఈతకు వెడితే నాతో ఉంటాడు తీర్ధమిత్ర్డుడు.త్యాగతి సాదారణంగా ఈదడు. బాగా ఈత వచ్చునన్న సంగతి నాకేలా తెలుసునంటే ఓ రోజున మేమందరమూ ఎన్నేరులో పడవలమీద వెళ్ళి ఈత ప్రారంభించాము. త్యాగతీ, నిశాపతీ లోకేస్వరీ పడవలమీద ఉన్నారు.లోకేశ్వరికీ,నిశాపతికీ ఈత అంటే హడలు.

    ఇంతలో పక్కన వెళ్ళే ఓ పల్లెవారి పడవలోంచి ఓ పిల్లవాడు మమ్మల్ని తెల్లబోయి నిల్చుని చూస్తూ, నీటిలో పడ్డాడు.వాడు పదవ వేటికి దగ్గిరగా తేలుతున్న మా పడవలోంచి త్యాగతి నీటిలోకి ఒక్క ఉరుకు ఉరికి,ఆ కుఱ్ఱకుంక దగ్గరకు బార ఈతలో పోయాడు. వాడికీ ఈత బాగా వచ్చును కాబోలు బెండులా తేలుతూ ఈదుతున్నాడు.త్యాగతి దిట్టమైన ఈతకాడని అప్పుడు తెలిసింది.

                                       17

    నిశాపతి వెళ్లిపోయాడని సోఫీ ప్రశ్న వేయగానే జవాబు చెప్పాను.

    సోఫీ :వెళ్ళిపోయాడంటే?

    నేను :నందిపర్వతం ఆ ప్రాంతాలకు వెళ్లిపోయాడట.

    లోకే :ఎందుకు వెళ్ళాడు ?

    నేను :సరే !మీ యిద్దరూ లాయరు ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను జవాబు చెప్పకపోతే బ్రతకనిస్తారుగానకనా ! వినండి. నిశాపతి నన్ను ప్రేమించాడు. పెళ్ళి చేసుకోమని కోరాడు. నేను పెళ్ళిచేసుకోనన్నాను.అతడు కించపడి, వెళ్ళిపోయాడు.

    అక్కణ్నుంచి వాళ్ళప్రశ్నలు, నా జవాబు, జరిగిన సంగతి అంతా చెప్పాను.వాళ్ళు తెల్లబోయారు.

    సోఫీ :హేం,నీ కోసం ఏ నలుగురు పురుషులు కాసుకుని ఉన్నారంటావా?

    లోకే :తీర్ధమిత్రుడికి యిదివరకే పెళ్ళి అయినది.అతని భార్య చక్కని చుక్క.ముగ్గురు ముద్దులు గులికే వెన్నముద్దల పాపలు. రెండేళ్ళ వాడు అతనికి కొడుకున్నాడు. ఎనిమిదేళ్ళూ, అయిదేళ్ళూ గల బాలిక లిద్దరు. కనక తీర్ధమిత్రుడికీ, మన హేమానికి పెళ్ళేమిటి ?ఇక కల్పమూర్తి.హేమం తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్ళిద్దరూ తమ అభ్యంతరం లేదనీ, అమ్మాయి ఇష్టమనీ అన్నారు.ఈఅమ్మాయిగారు జవాబు చెప్పదు.పైగా కల్పమూర్తిని ఏడిపిస్తుంది.అతణ్ణి వదలదు. అతనికి ఆశా వదలదు.

    సోఫీ :పాపం,వట్టి వెర్రివాడు.త్యాగతి నాకో పెద్ద సమస్యగా కనబడుతాడు.

    హేమం :ఆంగ్ల స్త్రీలకు భారతీయ పురుషు లెప్పుడూ సమస్యలే వీళ్ళకు.

    సోఫీ :భారతీయ స్త్రీలకు ఆంగ్ల పురుషులు సమస్యలు కాదా అంట?     
           
    లోకే :మీ మగవాళ్ళు మాకు సమస్యలు కారు. మా వాళ్ళే మాకు పెద్ద సమస్యలు. మీ జాతిమాత్రం మాకు పెద్ద సమస్య. మాదేశం మీ వాళ్ళు ఒదలరు.ఏవో మాటలంటారు. మీ జాతి మాట నిలబెట్టుకొనే జాతి అంటారు.మా విషయంలో మాత్రం మీ మాట నీటిమూటే !

    సోఫీ :భారతీయులు ఒక్కమాటమీద నిలుస్తారు!మీ గాంధీ గారికే రోజుకో కొత్త గొంతుక.ఇవాళ ఓటి అంటాడు,రేపు ఓటి అంటాడు.

    లోకే :గాంధీమహాత్ముణ్ణి అంత బాగా అర్ధం చేసుకున్నావు!

    నేను :మళ్ళీ మీ  ఇద్దరూ వాదం మొదలు పెట్టారూ; మా మేడ కాస్తా కదలిపోయిందేమో చూస్తాను.అసలు త్యాగతి సంగతి మొదలుపెట్టి చటుక్కున గాంధీగారి దగ్గిరకు వచ్చి ఊరుకున్నా రేమిటి మీ యిద్దరూ ? ఇంతలో త్యగతే మా దగ్గిరకు వచ్చాడు.

    లోకే : మిమ్మల్ని గురించే మాట్లాడుతున్నారు.మీకు వెయ్యేళ్ళు ఆయుర్దాయం.

 

 Previous Page Next Page