ఇహలోకం విడిచిపెట్టిన ఇల్లాలు చరిత్ర
కచ్చడాల ఆచారానికి ప్రత్యక్ష ప్రమాణం
పోచెంజర్ కచ్చడం
కొన్ని ఇనుప కచ్చడాళ్లను వర్ణించినాను. కొన్ని మ్యూజియములలో ఉన్న ఇనుప కచ్చడాళ్ల ఫోటోలను ఇచ్చినాను. వాటికీ మన ఆచారాలలో ఉన్న మరుగుబిళ్ళవంటి విషయాలకూ గల సంబంధం చెప్పాను. ఇతర దేశాలలో వున్న ఆచారాలు నిరూపించాను. వాటికి సంబంధించిన కథలు వ్రాశాను.
అయినా ఒక్క ప్రశ్న మాత్రం మిగులుతూనే వుంది. ఈ కచ్చడాలే కట్టుకొని ఉండిన స్త్రీలని ఎవరయినా చూచారా? అది ప్రశ్న. ఇప్పటికీ కొందరు అవధూతలో సాధువులో మగవారు ఆ ఇనుప కచ్చడాలతో జీవిస్తున్నారని ఇంతకుముందే మనవి చేశాను.
ఆడువారు ఈ కచ్చడాలతో ఉండడం పురాతన విషయం. వాటితో ఉన్నవారిని చూడటానికిగాని, చూచినవారితో మనం మాటలాడటానికిగాని, రెండు మూడు శతాబ్దాలయిన తరువాత, ఇప్పుడు మనకు అవకాశంలేదు.
గ్రంధస్తంగా ఉన్న విషయాలు తరువాత మనవి చేస్తాను. కాని, అదంతా శబ్దప్రమాణం అవుతుంది. పైని చెప్పిన విషయాలు అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం కావాలంటారు. చక్షురక్షర సంయోగం కలుగుతేనే గాని నమ్మం అంటారు కదా:
దీనికి భాగ్యవశంగా ఒక్క విషయం వుంది.
మ్యూనిచ్ నగరంలో పాచింజర్ గారి దగ్గర ఒక ఇనుపకచ్చడం వుంది. ఇదివారికి లభించిన విధం మొన్న చూచాయిగా తెలియ జేశాను. దీనిలో గొప్ప విశేషం ఈ ప్రత్యక్ష ప్రమాణమే. కాబట్టి ఈ కచ్చడం గురించి కొంచెం వినిపిస్తాను.
ఆస్ట్రియాలో వుత్తర భాగాన్ని ఒక చర్చికి మరామత్తులు చేస్తు తవ్వుతుండగా 1889 వ సంవత్సరంలో ఈ కచ్చడం కనబడింది. ఎలాగంటే-
కొన్ని రాతిపలకలు తవ్వి ఎత్తుతుండగా భూగర్భంలో ఒక గోయిలాగా కనపడ్డది. బాగాచూస్తే అది చచ్చిన కళేబరాన్ని పాతిపెట్టడానికి చేసిన పెట్టె అని బోధపడ్డది. లోపల సత్తురేకులో ఆ పెట్టెయే కనబడ్డది.
ఆ సత్తు రేకుపెట్టె తెరిచినప్పుడు పాచింజెర్ గారు అక్కడనే వున్నారు.
పెట్టె పైకప్పు పగులకొట్టగానే, చివికిపోయిన చెక్క పలకలు కనబడ్డాయి. వాటినీ మెల్లగా తొలగించగా మనుష్య శరీర అస్థిపంజరం బయటపడ్డది.
తలవెంట్రుకలు చక్కగా జడవేసి మలచివున్నాయి - నాటకాలలో స్త్రీ వేషాలు పెట్టుకునే విగ్గులలాగా.
చక్కని వాడి పల్వరుస, చిత్ర విచిత్రంగా అల్లిన ఆ జడ అంతా చూస్తే, ఆ స్త్రీ మంచి యవ్వనంలోనే చనిపోయిందని అంగీకరించారు.
శరీరంమీద వున్న గుడ్డ మీద భాగం కొంచెం బాగానే వుందిగాని అడుగుభాగంలో అంతా మన్ను అయిపోయింది.
ఆ గుడ్డలు కొంచెం తొలగించి చూడగా, బోర ఎముకలు, కడుపు డొక్క కనపడ్డవి.
నడుముచుట్టు ఇనుపపట్కా లాంటిది కనిపించింది. ఇది నాలుగయిదు ముక్కలు అతికిన బెల్టు. దీని ముందు భాగానికి తగిలి కాలిజోడు అట్టవంటి ఆకారంతో ఒక రేకు వుంది.
ఈ రేకును రెండు చిన్న తాళాలతో బెల్టుకు కలిపి వుంచారు. ఈ తాళాలు చాలా వరకు త్రుప్పుపట్టిపోయాయి, ఆ అస్తిపంజరం కింద భాగంలో, ఇలాంటిదే మరొక రేకు ముక్క తగిల్చి వుంది.
అది చూచి ఆ చర్చి అధికారి ఒకడు ఇది "ఇనుపకచ్చడం" అని దానిని మీదికి ఊడదీశాడు. పాచింజెర్ గారు దానిని అడిగి భద్రంగా తమ బసకు తెచ్చి ఇప్పటికీ వుంచారు.
దాని పటమే ఈ వ్యాసంలోని చిత్రము. దీని కొలతలు గూడా వున్నాయి. ముందున్న రేకులో కోలని రంధ్రమున్న, వెనుకరేకున పవ్వువంటి కన్నమున్ను, మూత్ర మలద్వారాలు. ఈ మూత్ర ద్వారములో లోపలి అంచులో ముండ్లు ముండ్లుగా వుంచారు. ఈ ప్రక్కను 21 ముండ్లు, ఆ ప్రక్కను 21 ముండ్లు, మొత్తం 42.
పాపం! ఏ ఇల్లాలో తన పాతివ్రత్యాన్ని ఇంత కట్టుదిట్టంగా కాపాడుకుంది! ఏ మహానుభావుడో తన ప్రేయసిపై తనకున్న అధికారాన్నీ హక్కునూ ఇంత ఘోరంగా చెలాయించాడు.!