"ఈ సమయంలో దాన్ని అభిప్రాయం అడగటం ఎంత అనవసరమో, ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వడంకూడ అంత అనవసరం!"
"కొద్దిరోజులు పోయాక తల్లిప్రేమ పొంగి నాబిడ్డ నాకు కావాలంటే?"
"అబ్బా! మీరు చాలా దూరం ఆలోచించేట్టున్నారే!" వామనరావు నవ్వలేకనవ్వాడు. "అలా ఎప్పటికీ జరగదని హామీ ఇస్తున్నాను! రేపు అన్నీ సక్రమంగా జరిగి గీతజీవితం ఒకదారిన పడితే పిల్లవిషయం జ్ఞాపకం రాకుండా పోదు! అది అనాధ శరణాలయం పాలైందంటే మనస్సు కలుక్కుమంటుంది! అలా కాకుండా ఒక అయ్య దగ్గర పెరుగుతుందంటే మాకు చాలా నిశ్చింతగా ఉంటుంది!"
గీతాభవానిని తీసుకొని ఆరాత్రే వెళ్ళిపోయాడు వామనరావు.
3
సంధ్యవాలి, ఆకాశరంగంలో చుక్కలదీపాలను రాత్రి వెలిగిస్తున్న వేళ ఇంటిముందు పాపతో రిక్షా దిగాడు సుందరయ్య.
ఇంటికి తాళం వేసిఉంది!
"అత్తమ్మ గుడికి వెళ్ళింది, మామయ్యా!" ప్రక్కింటి కుర్రవాడు వచ్చి తాళంచెవి ఇచ్చిపోయాడు.
సుందరయ్య తాళం తీసి ఇంట్లోకి వచ్చి లైట్ వేశాడు. ఇంట్లో పరుచుకొన్న వెలుతురులో తనతో ఉన్న పాపని చూస్తూంటే సుందరయ్య హృదయంలో తెలియని పులకింత చోటు చేసుకొంది.
'ఇకనుండి మా ఒంటరిజీవితాలకు తోడువు నువ్వు, పాపా! మా చీకటి జీవితాలలో వెలిగిన దీపానివి' పొత్తిళ్ళలోఉన్న పాపని పెదవుల దగ్గరికి తీసుకొని ఆ లేతబుగ్గలమీద తాకీ తాకనట్టుగా ముద్దుపెట్టుకొన్నాడు సుందరయ్య.
రిక్షాలో ఉన్న బాస్కెట్ తెచ్చి లోపలుంచి కూలిడబ్బులు ఇప్పించుకుపోయాడు రిక్షావాడు.
బాస్కెట్ లో పాపకి రెండు జతలబట్టలు, పాలడబ్బాలు, పాలపీక, రెండుగ్లాసులు, మందులు, బేబీపౌడరు-పాపకి ఉపయోగించే సరంజామా అంతా ఉంది! అవన్నీ బజారులో సువర్చల కొని ఇచ్చిందతడికి మందులు రత్నప్రభ ఇచ్చింది. వారం పదిరోజులకోసారివస్తే పాపహెల్త్ చెకప్ చేస్తానందికూడా.
"ఇంట్లో లైట్ వేసిఉంది! ఆయన వచ్చినట్టున్నారు, పిన్నీ! ఆయన్ని అడిగి ఏసంగతీ చెబుతాను!" రాజ్యంగొంతు వినిపించింది.
రాజ్యం అడుగులు టక్కున ఆగిపోయాయి, గడపకవతలే! తెల్లటి పొత్తిలిగుడ్డల మధ్య గులాబీపువ్వు మత్తుగా నిద్రపోతున్నట్టుగా ఉంది పాప! గుప్పిళ్ళు మూసిన ఆచేతులెంతో ముద్దొస్తున్నాయి! రాజ్యంకళ్ళు పత్తికాయల్లా చేసుకొని, బొమ్మలా నిలబడి పోయింది. "ఏమండీ?" కంగారుగా పిలిచింది.
"భయపడకు, భక్తురాలా! నీభక్తికి మెచ్చి నీకు ప్రియమైన కానుక ఇచ్చాను! ఎత్తుకో బిడ్డను!" ఆశరీరవాణి మాట్లాడుతున్నట్టుగా గొంతుమార్చి అన్నాడు సుందరయ్య.
రాజ్యం చేతిలో బుట్టక్రింద ఉంచి పాపని ఎత్తుకొంది. లోపలికి రెండడుగులువేసి, గోడకు బల్లిలా అతుక్కుపోయినిలబడిన భర్తవైపు తిరిగి సంభ్రమంగా అడిగింది. "ఎక్కడిదండీ ఈ బిడ్డ!"
"నీ పూజలకూ, నీయాత్రలకూ దేవుడు సంతసించి ఇచ్చిన వరమిది. పిల్లలూ పిల్లలూ అని కలవరించిపోయావు. నవమాసాలు మోయకుండా, ప్రసూతికష్టం తెలియకుండా బిడ్డ నీ ఒడిలోకి వచ్చింది చూడు!" సుందరయ్య ముందుకు వస్తూ అన్నాడు.
"ఈ బిడ్డ మనకేనా? ఎవరిచ్చారండీ?" నమ్మలేనట్టుగా చూసింది.
"ఒకరికి బరువైన బిడ్డ మనకు విలువైనది. ఎవరిస్తేనేం? ఈ బిడ్డ మనది. ఏ మణమ్మ బిడ్దనో ఆశపడి ఎత్తుకొని, 'ఆ గొడ్రాలి చేయిపడింది. పిల్ల ఒళ్ళు పెనంలా కాలిపోతూంది.' అన్నమాటలు విని భోరుమని ఏడవక్కరలే దింక నువ్వు"
ఆ సంఘటన గుర్తు చేసేసరికి రాజ్యం కళ్ళలో కన్నీటితెర క్రమ్ముకు వచ్చింది. రాజ్యానికి చిన్నప్పటినుండీ చిన్నపిల్లలంటే చెప్పలేనంతఇష్టం! అమ్మకి తనే ఆఖరు కనుక చెల్లెళ్ళు తమ్ముళ్ళు లేరు. ఇరుగు పొరుగు పిల్లల్ని ఎత్తుకు ఆడించేది. వాళ్ళముఖాలు కడిగి బొట్లూ కాటుకలు పెట్టేది. తన పిల్లల పిచ్చి చూసి ఓ అవ్వ నవ్వుతూ ఆశీర్వదించింది. "నీ కడుపునిండా పిల్లలు పుడతారే, రాజ్యం!" అంటూ.
"ఇంత పిచ్చున్నవాళ్ళకి అసలు పిల్లలే కరువౌతారు." అంది, అత్త ఏమాటంటే ఆ మాటకి విరుగుడు చెప్పే అలవాటున్న కోడలు!