"అన్నా....ఇక నేనెప్పుడూ మీకు కనిపించను. దూరంగా వెళ్ళిపోతాను....జరిగినదాంట్లో చందన దోషంలేదు. ఆమెను అనుమానించకంది" కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు శ్రీనివాసన్.
రాజశేఖర్ భ్రుకుటిముడిపడింది.
"చందన తప్పులేదు....ఆమె నిర్దోషి. కాబట్టి ఆమెను స్వీకరించండి...." అని తనకు హితబోధ చేస్తున్నాడేమిటి? అతని ప్రవర్తనలో ఏదో లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది రాజశేఖర్ కు.
నటిస్తున్నాడతను. నటించవలసిన దానికన్నా ఎక్కువగా నటిస్తున్నాడతను ఓవర్ యాక్షన్!
అప్పుడు రాజశేఖర్ ముఖంలో చిరునవ్వు అలుముకుంది.
అతను ప్రేమంటే ఏమిటో తెలియని ఒక వీధి గూండా! అయితే, ఆమెపట్ల ఇంత ప్రేమాభిమానాలు పెంచుకుని ఎలా వదులుకున్నాడు? ఆ కోణంలోనుంచి ఆలోచించినా అతని మాటల్లోని నిజాయితీని శంకించవలసిందే!
"మురుగన్, అతన్ని ఆపు...." రాజశేఖర్ కంఠం ఖంగుమంది.
వంచిన తల పైకెత్తకుండా గది బయటకు వెళ్ళబోతున్న శ్రీనివాసన్ ఉలిక్కిపడి ఆగిపోయాడు.
టేబుల్ సొరుగులాగి రివాల్వరును బయటకు తీశాడు రాజశేఖర్. చాంబర్ ను తెరిచి బుల్లెట్స్ ను లోడ్ చేయసాగాడు. మురుగన్ అది గమనించి బిత్తరపోయాడు. ఏమిటతని ఉద్దేశ్యం?.....ఇప్పుడేకదా శ్రీనివాసన్ ని వెళ్ళిపొమ్మన్నాడు! తిరిగి ఇంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా? రివాల్వర్ తీసి లోడ్ చేస్తున్నాడంటే అతనిని చంపేస్తాడా? తనకు తెలిసినంత వరకూ రాజశేఖర్ ఇంతవరకూ ఎవరినీ హత్య చేయలేదు. మరి ఇప్పుడుద్ రివాల్వర్ తో అతనికి ఏం పని? శ్రీనివాసన్ చెప్పినా మాటలు నమ్మకం లేక షూట్ చేద్దామనే నిర్ణయానికి వచ్చాడా? పరిపరివిధాల సాగిపోతున్నాయి మురుగన్ ఆలోచనలు.
"చందనా! శ్రీనివాసన్ చెప్పింది నిజమే నంటావా?"
తడబడిపోయిందామె. తననే ప్రత్యేకించి ఆ ప్రశ్న వేయడంలో అతని వుద్దేశ్యం ఏమిటి?
తన భర్త హంతకుడు కాబోతున్నాడా?
"శ్రీనివాసన్! జరిగిన దానిలో చందన తప్పు లేదంటావు. అంతే కదూ..."
పచ్చివెలక్కాయ గొంతుకడ్డుపడ్డట్టు గుటకలు మ్రింగాడు శ్రీనివాసన్. రాజశేఖర్ ఆంతర్యం ఏమిటో అసలు అతనికి అంతుపట్టడం లేదు. క్షణక్షణానికీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఎవరిని చంపడానికి రివాల్వర్ ని తీశాడు. మురుగన్ ని చంపేస్తాడా లేక చందనను షూట్ చేస్తాడా? అదీ కాదంటే తనపై హత్యాప్రయత్నం చేసినందుకు తననే కాలుస్తాడా?
ముగ్గురిలో ఎవ్వరూ పెదవి విప్పి మాట్టాడలేకపోతున్నారు. వారి ముఖాలలో ఆందోళన కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.
వాళ్ళ పెదవులు అదురుతున్నాయి. లోలోపల వణికిపోతున్నారు.
"ఏమిటలా బెల్లంకొట్టిన రాళ్ళల్లా నిలబడిపోయారు? నా ప్రశ్నలు మీకెవ్వరికీ వినిపించడం లేదా....సరే నేనే తెల్చుకుంటాను!" అంటూ చందన వైపు రివాల్వరును గురిపెట్టాడు రాజశేఖర్.
మురుగన్ ముఖానికి చిరు చెమటలు పట్టాయి.
చందన స్థాణువులా నిలబడిపోయింది.
"అన్నా....వద్దన్నా....నా చెల్లెల్ని ఏమీ చేయొద్దు. తెలిసికానీ, తెలియక కానీ నా చెల్లెలువల్ల ఏదయినా తప్పు జరిగివుంటే, దానికి నేనే బాధ్యుడిని! ఆ శిక్ష ఏదో నాకే విధించండి. నా ఒక్కగానొక్క చెల్లెల్ని చంపకండి" కళ్ళనీళ్ళ పర్యంతం వాపోయాడు మురుగన్.
"ఓకే! నీమాట ఎందుకు కాదనాలి. సరే, నిన్ను షూట్ చేస్తాను" మురుగన్ వైపు రివాల్వర్ ను తిప్పాడు రాజశేఖర్.
చందన ఒక్క ఉదుటున పరుగెత్తుకు వెళ్ళి అన్నకు అడ్డు నిలుచుంది.
"నా అన్న ఏం తప్పు చేశాడని చంపుతున్నారు? ఇప్పటి వరకూ మీవద్ద విశ్వాసపాత్రునిగా పనిచేసినందుకు నా అన్నకు మీరు ఇచ్చే బహుమానం ఇదా? మీకు ఎవరిమీదా కక్ష్యవుంటే వారిమీద పగ తీర్చుకోండి తప్ప అన్నెం పున్నెం తెలియని అమాయకుడిని చంపినందువల్ల మీకు ఒరిగేది ఏముంటుంది?"
"బాగుంది....మీ అన్నాచెల్లెళ్ళ అపూర్వమైన అనురాగం చాలా బాగుంది. ఆల్ రైట్. ఈ సీన్ క్రియేట్ కావడానికి కారకుడు నీ మాజీ ప్రియుడు. అతన్ని షూట్ చేయడంలో మీకెవరికీ ఎలాంటి అభ్యంతరం లేదుగా" అన్నాడు రాజశేఖర్ విలాసంగా.
సంభాషణను అటువైపునుంచి ఇటు చతురతగా తీసుకు వచ్చాడు రాజశేఖర్. అతని చేతిలోని రివాల్వరు ఇప్పుడు శ్రీనివాసన్ వైపుకు గురిపెట్టి వుంది.
శ్రీనివాసన్ నిలువెల్లా ముచ్చెమట్లతో వణికిపోతున్నాడు. "వద్దు అన్నా.....నన్ను చంపొద్దు అన్నా" అతను ప్రాధేయపడుతున్నాడు.
చందన నోరు పెగలడం లేదు.
నిలువు గుడ్లేసుకుని చూస్తుందిపోయాడు మురుగన్.
"ధన్" మంటూ ప్రేలింది రివాల్వరు.
రివాల్వరులో నుంచి బుల్లెట్ సూటిగా దూసుకుపోయింది శ్రీనివాసన్ వైపు...
మరుక్షణం గావుకేక పెట్టాడతను.
అది గమనించి హిస్టీరియా పేషంట్ లా అతనికన్నా బిగ్గరగా కేకపెట్టి స్పృహతప్పింది చందన.
అంతే....మరుక్షణం ఆ గదిలో చప్పట్లు మారుమ్రోగాయి.
"వెల్.... వెరీవెల్! ఎవరి పాత్రలు వాళ్ళు అధ్బుతంగా నటించారు!"
ఆశ్చర్యపోతూ శ్రీనివాసన్ వైపు చూశాడు మురుగన్. విచిత్రంగా అతనింకా ప్రాణాలతోనే సజీవంగానే వున్నాడు!
రివాల్వర్ లో లోడ్ చేసినవి డమ్మీ బుల్లెట్స్! అందుకే అట్టహాసం చేసింది తప్ప....అతనికేమీ కాలేదు.
చందన ముఖం మీద నీళ్ళు చిలకరించాడు రాజశేఖర్. ఆమెకు అప్పుడే స్పృహ వచ్చింది.
"యూ లయ్యర్స్...మీరంతా కలిసి నన్నెందుకు మోసం చేశారు?" రాజశేఖర్ కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి.
అందరూ మౌనంగా తలవంచుకున్నారు.
"మీ ముగ్గురు చెప్పినవన్నీ అబద్దాలేనని నిరూపించింది చందన."
చందన తెల్లబోయింది.
"అర్ధం కాలేదా?....మాజీ ప్రియుణ్ణి నిజంగానే షూట్ చేశానని భావించి ఆ ఆలోచనకే కెవ్వుమని కేకపెట్టి స్పృహ తప్పింది చందన. నీమీద అంత ప్రేమ వున్నప్పుడు, నన్ను నువ్వు రివాల్వర్ తో కాల్చబోతుంటే నిన్నెలా గాయపరిచిందంటావ్....? మీరు చెప్పే కట్టుకథలన్నీ నన్ను ఇంకా నమ్మమంటారు!"
అతని లాజిక్ కి బిత్తరపోయాడు మురుగన్.
"అన్నా....నన్ను క్షమించన్నా.....దీని కంతటికీ కారణం నేనే" మురుగన్ పశ్చాత్తాపం గోచరిస్తున్నది.
"ఆ విషయం నాకు తెలుసు. నీనోటితోనే చెప్పించాలని ఇంతవరకూ ఆగాను. అసలు ఈ నాటకం ఎందుకు ఆడావు?...ఏమాశించి ఇలా చేశావు?"
తన ప్రయత్నం అతను ముందే పసికట్టాడని తెలియడంతో మురుగన్ షాక్ అయిపోయాడు.
"నీ మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. ఆ ప్రయత్నం చేసింది శంకర్ నాగ్ ముఠా"