Previous Page Next Page 
నల్లతంబి పేజి 13

"వాట్.... శంకర్ నాగ కు అంత ధైర్యం ఎక్కడనుంచి వచ్చింది? నా ఎదురు నిలబడే దమ్ములేనివాడు నన్ను మట్టుబెట్టాలని ప్రయత్నించడమా?" రాజశేఖర్ ఆశ్చర్యంగా అనేశాడు.
"అవునన్నా. ఈ శ్రీనివాసన్ ప్రస్తుతం అతని దగ్గరే పని చేస్తున్నాడు. ఇతడి రూపాన్ని అడ్డుపెట్టుకుని వింత నాటకం ఆడాలని పధకం వేశాడు. కానీ చివరికి నా చెల్లెలు రంగప్రవేశంతో వారి ప్రయత్నం ఫెయిల్ అయింది."
"నో!...ఐ వాంట్ మినిట్ టు మినిట్....ఏం జరిగిందో తెలుసు కోవాలి!"
"చందనను ఒకప్పుడు శ్రీనివాసన్ ప్రేమించిన విషయం శంకర్ నాగ తెలుసుకున్నాడు. అతను తన ముఠాలోనే వున్నాడు కనుక అతనిలా మరొకరికి డ్రెస్ వేసి శరణాలయం వద్ద మాటువేసి మిమ్మల్ని చంపడానికి పథకం చేశాడు. ఒకవేళ ఫెయిల్ కావడమంటూ జరిగితే షూట్ చేసిన వ్యక్తి పారిపోతాడు కనుక, అతను ధరించిన దుస్తుల్ని బట్టి శ్రీనివాసన్ ఆ ప్రయత్నం చేసి వుంటాడని మన దృష్టికి వచ్చేలాచేశాడు శంకర్ నాగ్. చందనను మీరు వివాహం చేసుకున్నారనీ కక్షకొద్దీ అలా చేసివుంటాడని భావించి మనం ముందూవెనకా ఆలోచించకుండా అతన్ని లేపెస్తాం. అసలు చేయించిన వ్యక్తి మాత్రం తెరవేనుకనే వున్దిపోతాడు. ఇదీ ఆ పధకం. "కానీ, జరిగింది మరొకటి. ఆ సమయంలో చందన అక్కడకు రావడం వల్ల మీద రివాల్వర్ ను ఎక్కుపెట్టిన వాణ్ని చూసింది. శ్రీనివాసన్ దుస్తులు ధరించినంత మాత్రాన అతన్ని పోల్చుకోలేదా, కనుక ఎలాంటి సంకోచం లేకుండా అతన్ని షూట్ చేసి మిమ్మల్ని కాపాడుకోగలిగింది."
"ఓకే!....ఇదంతా నిజమని నేనెలా నమ్మేది?" సూటిగా ప్రశ్నించాడు రాజశేఖర్.
"మీ మీద హత్యా ప్రయత్నం చేసినవాడు శంకర్ నాగ్ ముఠాకు చెందిన వాడెవడో అయి వుంతాదనీ అనుకోవడమే కాని, అతనెవరో నాకు మాత్రం ఏం తెలుసు? శ్రీనివాస్ ను అనుమానించి, బందించి తెస్తే అతను చెప్పిన మాటలనుబట్టి అతని వేషంలో మరెవరి చేతనో శంకర్ నాగ్ చేయించి వుంటాడని తెలిసింది."
"మరి? ఇప్పుడు శ్రీనివాసన్ ను తెచ్చి ఈ నాటకం అంతా ఎందుకు ఆడావు మురుగన్? కరుగ్గా వినిపించింది రాజశేఖర్ కంఠం.
"అన్నా....మీరు చందనను వివాహం చేసుకున్నప్పటినుంచీ మీ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడినట్లు గ్రహించాను. మీ యిద్దరూ పడే మనో వ్యధను గమనించాను. చందన లోకం తెలియని పిల్ల... ప్రేమంటే ఏమిటో తెలియని స్థితిలో శ్రీనివాసన్ పై మనసు పడింది. కానీ దాన్ని నేను మొగ్గలోనే తుంచేసి మీకు కట్టబెట్టాను. "అందులో నా స్వార్ధం కూడా వుందన్నా...! వున్న ఒక్కగానొక్క చెల్లెలినీ ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి...వీధి రౌడీకి ఇచ్చి చేసేకంటే మీలాంటి వారికి ఇల్లాలిగా చేయాలనిపించింది. నా చెల్లెల్ని నా కన్నులముందే చూసుకోవచ్చనే ఆశతో మీకిచ్చి చేశాను.
"నమ్మకమైన సేవకుడిగానే కాకుండా బంధుత్వం కూడా కలుపుకోవాలన్న పేరాశ నాలో ఉదయించింది. మీ ఉన్నతిని ఆకాంక్షించే ఆత్మీయునిగా వుండిపోవాలనుకున్నాను. కానీ, నా ప్రయత్నం ఫలించలేదు. మీరు ఇద్దరూ భిన్న ద్రువాలైపోయారు. అందుకే జరిగిన సంఘటనను అవకాశం చేసుకుని ఆమెమీద మీకు వున్న ద్వేషం తొలగిపోతుందని శ్రీనివాసన్ ను బ్రతిమలాడి అతనిచేత నా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టాలని ఇలా చెప్పించానే తప్ప మీకు ద్రోహం చేద్దామనే ఆలోచన నాకెప్పుడూ లేదు."
నిశ్శబ్దం ఆవరించుకున్నదక్కడ.
"నా రివాల్వర్ తో చందనకు ఏం అవసరం వచ్చింది? ...అదీగాక, ఆ సమయంలో అనాధ శరణాలయం దగ్గరకు ఎలా రాగలిగింది...?" చందన వైపు చూస్తూ ప్రశ్నించాడు రాజశేఖర్.
"అనుక్షణమూ మనసు చంపుకుని బ్రతికే కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు అనిపించి రివాల్వర్ తీసుకున్నాను. మీ ఎదుటనేనన్ను నేను కాల్చుకు చావాలని వచ్చాను. ముందుగానే నన్ను మీరు గమనిస్తే నా ప్రయత్నం ఫలించదు కాబట్టి, నక్కి నక్కి లోనికి వచ్చాను. అంతలో ఎవరో మిమ్మల్ని కాల్చబోవడం చూసి నా వునికిని మరిచిపోయి వాడిని షూట్ చేశాను" అన్నది చందన.
"అన్నా!... మీ ఇద్దరినీ కలపాలని తాపత్రయ పడ్డాను కానీ నాకెలాంటి దురుద్దేశం లేదు. శ్రీనివాసన్ ని ఒప్పించి ఈ విధంగా నాటకం ఆడడానికి కారకున్ని నేనే....మీరేం శిక్షవేసినా ఆనందంగా అనుభవిస్తాను." మురుగన్ గొంతు గద్గదికం అయింది.
చెల్లెలిపట్ల, తనపట్ల వున్న అతని సెంట్ మెంట్ కి కదలిపోయాడు రాజశేఖర్.
చందనను లోనికి వెళ్ళమని కళ్ళతో సైగ చేశాడు. తలవంచుకు వెళ్ళిపోయిందామె.
"బ్యాడ్ లక్ మై ఫ్రెండ్...! ఎనీ వే.... ప్రేమ గుడ్డిదికాదు. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అంతవరకు మనం నిమిత్త మాత్రులమే. యు కెన్ గో...."
రాజశేఖర్ వేదాంత ధోరణిలో శ్రీనివాసన్ భుజం తడుతూ అన్నాడు.
భారంగా కదిలాడు శ్రీనివాసన్.
"అన్నా.....శంకర్ నాగ్ మనమీద కక్షకట్టాడు....ముందు మనం వాడి విషయం ఆలోచించాలి" రహస్యం చెబుతున్నట్టు దగ్గరగా వచ్చి చెప్పాడు మురుగన్.
దీర్ఘాలోచనలో పడిపోయాడు రాజశేఖర్.
                                               *    *    *
మద్రాసు మహానగరం.
వడపళని....సౌత్ శివన్ కోయిల స్ట్రీట్ లో వున్న నాలుగు అంతస్తుల భవనం శాంతి నిలయం. అది రాజశేఖర్ ది.
సంఘంలో పేరు ప్రఖ్యాతులతోపాటు ప్రభుత్వపరంగా కూడా ఎంతో పలుకుబదివిన్న గొప్పవ్యక్తి. తమిళనాడు మొత్తంమీద క్రిమినల్స్ సైకాలజీ తెలిసిన ఏకైక వ్యక్తి రాజశేఖర్.
నేరస్తులను చేరదీసి, వారిలో మంచి మానవతను మేల్కొలిపి సమాజానికి పనికివచ్చే వాటిని తీర్చిదిద్దడానికి తన జీవిత కాలాన్ని వెచ్చిస్తున్నాడతను.
బోస్టన్ స్కూల్స్ నుండి విడుదలయిన యువకులను పెడత్రోవ పట్టనీయకుండా, వారి అభిరుచుల అనుగుణంగా మలచి, వారిలో నేర బీజాన్ని తిరిగి మొలకేత్తనీయకుండా చేయడంలో రాజశేఖర్ కృషి ఎంతయినా అభినందనీయం!
డబ్బు సంపాదన మీద ఏ మాత్రం అత్యాశ లేదతనికి. ధనార్జన కన్నా తల చుట్టూ వున్నవారికి ఏదయినా మంచి చేయాలనే తపన వున్నవాడతను. అంత మంచి మనస్సుతో అందరి మన్ననలనూ అందుకున్నాడు రాజశేఖర్.
రాజశేఖర్ గురించి పూర్తిగా తెల్సుకున్నాకనే, తాను దర్యాప్తు చేస్తున్న కేసుల విషయమై అతని సహాయం కోరి వచ్చాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
"అన్నా! ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైల్వే ఇన్ స్పెక్టర్ మిమ్మల్ని కలవాలని అపాయింట్ మెంట్ అడుగుతున్నాడు."
మురుగన్ చెప్పిన మాటకు క్షణంపాటు వింతగా ముడివడింది రాజశేఖర్ భ్రుకుటి.
"ఎందుకో కనుక్కున్నావా?"
"మీతో ఏదో మాట్టాడాలట"
"నాతో అవసరం ఏమిటో? అయినా, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసాయనకు నాతో పనేం వుంటుంది?"
'అదే అడిగానన్నా! డిపార్టుమెంటు విషయమై మీతో పనుండి వచ్చానని చెప్పాడు. ఈ రోజు అంతా టైట్ ప్రోగ్రాం వుంది, ఇవాళ కలవడం కుదరదు అని చెప్పానన్నా - అయినా అతను వినడం లేదు. ఎలాగయినా కలుసుకుని తీరవలసిందే అని పట్టుబట్టాడు. ఏదో కేసు వ్యవహారంలో మీ సాయంకోరి వచ్చాడనుకుంటా."

 Previous Page Next Page