"సంజీవి. మళ్ళీ మొదటికే వచ్చావు. అసలు మనం ఈ నెల్లూరులో ఎవరికీ తెలీనిచోట ఎందుకుంటున్నాం? నేను చేసేదేమిటో నీకు తెలుసు. అందుకే నా వల్ల నీ జీవితం నాశనం కావడం నా కిష్టంలేదు. ఎప్పుడు కటకటాలపాలు అవుతానో నాకే తెలియదు. ఇప్పటికే నిన్ను నా వెంట తిప్పుకుని ఎంతో తప్పుచేశాను. ఏ క్షణంలో పట్టుపడతానో తెలియని జీవితం నాది. ఆ విషయం తెలిసి కూడా పెళ్ళి పేరుతో నీ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోకు" ఆవేదన ధ్వనించింది అతని స్వరంలో.
"అధికారీ! నీ మనసు నాకు తెలుసు. అందుకే నిన్ను వదులుకోలేకపోతున్నాను. నువ్వు వద్దన్నా నువ్వుచేసే దోపిడీల్లో నీతోపాటు మగ వేషంలో ఎందుకొస్తున్నానో తెలుసా... ఏ క్షణంలో ఏం జరిగినా ఆ సమయంలో నా కిష్టమైన వ్యక్తి ప్రక్కనే నేనుండాలనే తపన. నీ కష్టంలో, సుఖంలో, బాధలో ఎప్పటికప్పుడు సగం పంచుకుని నీ జీవిత భాగస్వామిని కావాలనే నా కోరిక. నిన్ను అనుక్షణం నా కంటికి రెప్పలా కాపాడుకోవాలనే ఆరాటంలో నువ్వెన్నిసార్లు రావద్దని వారించినా ప్రతిసారీ నీ వెంటనే వుంటున్నాను. కానీ, నువ్వేమీ నా మనసుని గ్రహించకుండా బండరాయిలా వుండిపోతున్నావు. ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తావంటే నేనూరు నా మనసుని గ్రహించకుండా బండరాయిలా వుండిపోతున్నావు. ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తావంటే నేనూరుకోను. ఎవరు అవునన్నా, కాదన్నా నువ్వే నా మొగుడివి!" ఆమె మనసులోని దృఢ నిశ్చయం ధ్వనించింది.
ఏమని ఆమెని మంధలించాలో, ఏమి చెప్పి ఆమె నిర్ణయంలో మార్పు తీసుకురావాలో....తనపై ఆశలు పెంచుకోవద్దని ఇంకెలా మందలించాలో తెలియక-తనలో తనే సతమతమైపోతున్నాడు అధికారి.
ఇంతవరకు ఎన్నోరైలు దోపిడీలు చేసిన గజదొంగ ఎవరో ఎవరికీ తెలియకపోయినా, ఆ నిజం తనకి తెలుసు. దానికి ప్రత్యక్ష సాక్షి సంజీవి! అదృష్టం ఎప్పుడూ తమ పక్షానే వుండదని తెలుసుకనుకనే పెళ్ళి విషయంలో ఆమె ఆశలను ఖండిస్తూవస్తున్నాడు. కానీ సంజీవి మొండిపిల్ల కావడంతో వద్దని చెప్పినా ఆ పనే చేస్తానంటోంది. సంజీవికి ఎలా నచ్చ జెప్పడం!
"అధికారీ-నన్ను పెళ్ళిచేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే పోనీయ్. నీలాంటి మగపిల్లవాడు నాకు కావాలి. అందుకు ఏం చేయాలో చెప్పు. సంసారం చేసుకోవడానికి తాళిబొట్టే కట్టనవసరంలేదు. మనసులు కలిస్తే చాలు-ఏమంటావ్?" కావాలనే అతన్ని రెచ్చగొట్టే ధోరణిలో మరో నాటకానికి నాంది పలికింది సంజీవి.
"అలాచేస్తే అది కామం అనిపించుకుంటుందే కాని ప్రేమకాదు. కానీ, ఆడదానికి నిగ్రహించుకునే శక్తి వుండాలి అన్నది మరచిపోకు."
"నిన్ను కాకపోతే అసలు జీవితంలో వేరెవ్వరినీ పెళ్ళి చేసుకోను" ఆమె గొంతు మూగబోయింది.
ఆమెను ఆ స్థితిలో చూసిన అతని మనసు చివుక్కుమన్నది.
"నిన్ను బాధ పెట్టాలని నా అభిమతంకాదు సంజీవి! నాతో జీవితాన్ని పంచుకుంటే నీ జీవితం నిరర్ధకమవుతుంది. ఈ నేరస్తుని కడుపునా పుట్టి వాడు నేరస్తుని బిడ్డగా ముద్రపదతాడు. అందుకే నాకు పెళ్ళీ వద్దు, పిల్లలూ వద్దు."
నిముస్జంపాటు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.
"నిన్ను తాలి కట్టమంటున్నానే తప్ప, నిజానికి ఆ పని నేనెప్పుడో చేశాను" అని జాకెట్ లో నుంచి మంగళ సూత్రాన్ని తీసి చూపించింది సంజీవి.
అది చూసి అవాక్కయిపోయాడు అధికారి.
"నువ్వెటూ కట్టవని నాకు నేను కట్టుకున్నాను. ఎందుకో తెలుసా! చుట్టుపక్కన వాళ్ళ సూటిపోటి మాటలను భరించలేక, వాళ్ళ నోళ్ళు మూయించడానికి. నువ్వు నన్ను లేపుకువచ్చావనీ, ఇంకా మనసు పెళ్ళి కాలేదనీ రకరకాలుగా అనుకుంటుంటే భరించలేకపోయాను నన్ను అంటే పట్టించుకోలేదు. కానీ నిన్ను అనేసరికి ఉక్రోషం వచ్చి నీకు చెప్పకుండా నేనే ఈ పని చేశాను. ఏ బాధనయినా భరించవచ్చు కానీ....ఈ అవమానభారాన్ని సహించడం చాలాకష్టం."
అమాయకంగా చెప్పుకుపోతున్న ఆమెవైపు విచిత్రంగా చూశాడు అధికారి.
"చూడు సంజీవి....ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎంతకాలం భయపడుతూ జీవిస్తాం" అన్నాడతడు.
"ఏమో....నా ప్రక్కన నువ్వుంటే నాకు కొండంత ధైర్యం. కానీ నువ్వేమో నన్ను కావాలనే దూరంగా వుంచుతున్నావు. చదువుకోమని పోరుపెట్టి, పుస్తకాలు తెప్పించి ప్రయివేట్ గా పరీక్షలు కట్టించావు. నాకు ఇష్టం లేకపోయినా చదువుతున్నాను. ఎందుకో తెలుసా- నీకు ఇష్టమైంది కాబట్టి....అనుక్షణం ప్రమాదాల్లో సైతం నీ వెంటనే వుండేదెందుకని ప్రాణం పోయినా నీతో కలిసి హాయిగా మృత్యువును కౌగలించుకోవచ్చని"
"యూ సెంటిమెంటల్ ఫూల్..."
ఆమె నెత్తిమీద చిన్నగా మొట్టాడు అధికారి.
"సరే....ఈ రోజుకి వదిలేస్తున్నాను. ఎప్పటికయినా నీ నోటితో నువ్వె నన్ను ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావో చెప్పాలి! అర్ధమైందా?" ముక్కు ఎగబీలుస్తూ బింకంగా అన్నది సంజీవి.
"అది ఈ జన్మకు జరగదని చెప్పానా లేదా" విసుగ్గా అన్నాడు.
"అంటే నన్ను చేసుకోవడం ఇష్టం లేదనుకోనా... లేక అసలు పెళ్ళేచేసుకోవా?"
"పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నన్ను విసిగించకు వెళ్ళు!"
"సరే....అలాగే వదిలేస్తానుకానీ....నీ చేతికివున్న ఆ డైమండ్ రింగ్ ను నా చేతికి తొడగవూ..." బుంగమూతి పెట్టి గారాలుపోతూ అంది.
"సంజీవి..." దాదాపు అరిచినట్టు అన్నాడు.
"ఏమ్మా...నా వ్రేలికి తొడిగితే వచ్చే నష్టం ఏమిటబ్బా..."
"ఆడపిల్లకు రింగ్ తొడగడమంటే పెళ్ళికి నిశ్చితార్ధం..... అది ఎవరికీ చెందాలో వారికే చెందుతుంది."
"అంటే..."
"నాకు ఇష్టం అయినా వ్రేలికి తొడుగుతాను. సరేనా?"
"నాకంటేనా?"
"అఫ్ కోర్స్.... వ్యక్తులకు, వస్తువులకు ముడిపెట్టడం అంత బాగోదు. అయినా నువ్వు అడిగావు గనక చెబుతున్నాను. నువ్వయినా, ఎవరయినా నా ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి వుంటుంది. ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ఏదయినా..."
"సరే....పెళ్ళిచేసుకోమంటే చేసుకోవు...ఉంగరం తొడగమంటే తొడగవు....తాళి కట్టమంటే కట్టవు. కనీసం నీ దానిగాచేసుకోవయ్యా మగడా అంటే- అదే సిగ్గు విడిచి వుంచుకోవయ్యా అన్నా- అదీ కుదరదు అంటావు. అసలు నీతో ఎలా వేగానురా దేవుడా?" అని వాపోయింది సంజీవి.
"మహాతల్లీ! ఇది నీతో ఎప్పుడూ వుండే పంచాయితీయేగానీ....నన్ను కాస్త విశ్రాంతి తీసుకోనివ్వు. నాకు మరో టాస్క్ వుంది."
ఆ మాట విన్న మరుక్షణం.....అంతవరకూ అల్లరిగా మాట్లాడుతున్న ఆమె ముఖం నల్లబడిపోయింది.
అంటే....మరల కత్తిమీద సాము.
రేపు ఎక్కడ...ఏం చేయబోతున్నాడో? చేసేవరకూ చెప్పడు.
ఎలా వేగాలి ఇతనితో? అధికారిని ఎలా కాపాడుకోవాలో ఆలోచనలో పడింది సంజీవి.
* * *
ఆ గదిలో ఒక వ్యక్తి బంధితుడు.
అతని పేరు శ్రీనివాసన్. నగరంలోని రౌడీషీటర్.
మురుగన్ ద్వారా కబురందగానే చందనను తీసుకుని ఆ గదిలోకి వచ్చాడు రాజశేఖర్. అతనిని చూడగానే పులిని చూసిన జింకపిల్లలా వణికిపోయాడు శ్రీనివాసన్.
"ఎందుకు చేశావా పని?" ఎంతో నెమ్మదిగా అడిగాడు రాజశేఖర్.
అతనినుండి ఎలాంటి సమాధానం రాలేదు.
"మంచి మాటలు వీడికి రుచించవు అన్నా!....నాలుగు తగిలిస్తే కానీ ఇతని నోటిని తెరిపించలేము."
మురుగన్ అతనివైపు వడివడిగా కదిలాడు. చేతిలో కొరడా!
మరుక్షణం శ్రీనివాసన్ అరుపులు.
నాలుగు దెబ్బలు పడేసరికి అతని నోటితాళం వూడిపోయింది. ఇక వోక్కోక్కటిగా వాస్తవాలన్నీ బయటకు రాసాగాయి.
"ఇంత వరకూ చెప్పిందంతా నిజమేనా లేక కావాలని అలా చెపుతున్నావా?"
"లేదన్నా- నిజమే చెప్పాను. అంతేకాదు. చందనను నేనెప్పుడూ ప్రేమించలేదు కూడా. ప్రేమించినట్టు నటించానంతే. పెళ్ళి వంకతో లాయర్ ఇంట్లో సురక్షితంగా వుండవచ్చునని కావాలనే ఆమెను మోసం చేశాను. నేను ఒక ముఠారౌడీనని తెలియక చందన నన్ను ప్రేమించింది. నా సంగతి తెలిసిన మురుగన్ నా గురించి చంధనకు అంతా చెప్పేశాడు. ఆ తరువాతనే ఆమెతో మీ పెళ్ళి జరిగింది.
"నా ఆశ నిరాశ కావడంతో మీపై పగ పెంచుకున్నాను. ఎలాగైనా మిమ్మల్ని చంపేస్తే మీ ఆస్తి చంధనకు సంక్రమిస్తుంది. ఆ తరువాత ఆమెను స్వంతం చేసుకోవచ్చనుకున్నాను. ఆ విధంగా మీ ఆస్తి పాస్తులన్నింటికీ నేనే వారసుడ్ని కావచ్చునని కలగన్నాను. అందుకే శరణాలయం వద్దకు వచ్చి కాసుకున్నాను.
"ఫంక్షన్ వద్దా ఎవరూ గమనించకుండా మిమ్మల్ని షూట్ చేయబోతున్న నన్ను చందన షూట్ చేసింది. అయినా అదృష్టం బాగుంది తప్పించుకున్నాను. అంతేతప్ప ఈ నేరంలో చంధనకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మూర్తీభవించిన ప్రేమ దేవత. అసలు నేరస్థుడిని నేనే. నన్ను క్షమించన్నా...." మింటికీ కంటికీ ఏకధారగా ఏడుస్తూ రాజశేఖర్ పాదాలమీద పడిపోయాడు శ్రీనివాసన్.
"మురుగన్, అతన్ని వదిలెయ్...." నిర్లిప్తంగా ధ్వనించింది రాజశేఖర్ కంఠం.