కాసేపు కూచుని ప్రసూన లేచింది.
బిలబిలాడు బోలేడుమంది పిల్లలు ప్రసూనను చుట్టూ ముట్టారు . ఆ చింకిరితలలూ, చిరుగుబట్టలూ, జిడ్డుముఖాలూ చూడలేకపోయింది. ప్రసూన బ్యాగ్ తెరచి వాళ్ళచేతుల్లో డబ్బులు పెట్టబోయింది. వాళ్ళు ప్రసూనమీదకు ఎగబడ్డారు ఆ సందట్లో ఎవరో వెనకనుండి ప్రాసూన బ్యాగ్ లాక్కుని పారిపోయారు......
పిండిబొమ్మలా నిలబడ్డ ప్రసూనను చూచి నవ్వాడు చిరంజీవి ........
"భయపడకండి మేడం! వీళ్ళి౦తే , పాపం, ఏమీ తెలియదు ...... ముందు ఇక్కడనుంచి నడవండి ......"
"నువ్వు ....."
"పరవాలేదు నేను వీళ్ళల్లో వాణ్ణి! అయినా అదృష్టం బాగుండి బళ్ళోపడ్డాను. చదువు వంటబట్టింది. వీళ్ళకు నాకు ఒక్కటే తేడా ..... వీళ్ళకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు .... నాకు తెలుస్తోంది . ఇంకా ఇంకా తెలుసు కోవాలని పిస్తోంది ..... వీళ్ళల్లో అలా తెలుసుకోవాలనే కుతూహాలం తగిలించే నాధుడు లేడు .... అందుకే వీళ్ళకు మోక్షంలేదు .... మీరు నడవండి ......."
"నువ్వు ఇక్కడే ఉంటున్నావా ?"
"ఎక్కడి కేళతాను? ఇక్కడ అందరూ నాకేదో విధంగా సాయపడ్డవారే; నేను ఏదోవిధంగా వీళ్ళకు సాయ పడుతూనే ఉంటాను. మాలోమేంకాక బయటివాళ్ళు మమ్మల్నెందుకు ఆడుకుంటారు?"
ఆ కూలిపేటదాటి ప్రసూన టాక్సీలో కూచున్నాక చిరంజీవి చిరునవ్వుతో చెయ్యి ఊపాడు .......
తను చూసిన దృశ్యాలు ప్రసూన మనసును వదలటం లేదు. తనుకూడా వాళ్ళమధ్య అలాగ బ్రతక వలసి వచ్చేది! ఈ ఊహా రాగానే భయంతో గడ్డకట్టుకు పోయింది ..... వాళ్ళకు, తనకు ఏమిటి తేడా? డబ్భేనా ? కాదు .... తన తల్లికి డబ్బుంది ..... కానీ తన తల్లికి రత్తమ్మకు పెద్ద తేడా లేదు ......
చిరంజీవి మాటలు గుర్తుకొచ్చాయి.
"నాకు తెలుస్తుంది ...... ఇంకా ..... ఇంకా తెలుసు కోవాలనిపిస్తోంది ......" .... అవును. ఇదే తేడా ..... కేవలం డబ్బుకాదు ..... చిరంజీవి డబ్బు లేదు ..... అయినా తనూ చిరంజీవి ఒకటి.
7
ఎప్పటిలా చిరంజీవి తన గదిలోకి పేపర్ తీసుకురాగానే ఆదరంగానవ్వింది ప్రసూన .... ఆ ఆదరాన్ని గుర్తించినట్లు సమాధానంగా చిరంజీవి కూడా నవ్వాడు ......
"నువ్వు ..... అక్కడికి రోజూ వెళ్తావా ?"
సంకోచిస్తూ అడిగింది ప్రసూన .......
"నేను అక్కడే ఉంటాను . వాళ్ళంతా నావాళ్ళు, ఎక్కడికి వెళ్తాను? ........"
"వాళ్ళంతా నా వాళ్ళు ....." విచిత్రంగా మనసును కుదించింది అ ఆమాట ..... వాళ్ళంతా చిరంజీవికి 'నావాళ్ళు' అనుకునేవాళ్ళయితే తనకు? .....
"నాకు అక్కడికి రావాలని ఉంది కాని భయంగా ఉంది .....'"
దేనికి ? వాళ్ళ ప్రవర్తన తలుచుకునా? ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ..... సంస్కారవంతులు ..... కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూడటంలేదా? పాపం. వాళ్ళకేం తెలుసుకుని? రండి! పరమేశ్వరిగారి లాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళుకూడా తోడయి తేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది" __
"పరమేశ్వరిగారెవరు?"
"కూలిపేటలో నైట్ స్కూల్ లో నడుపుతున్నారా?"
"ఆహా! గవర్నమెంట్ నడిపే స్కూల్ లో టీచర్. ఇదివరకంతా నామమాత్రంగా ఉన్నదానిని నిజంగా నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకా .... నేను చెప్పటందేనికి?" ఒకసారి వచ్చి మీరే చూడండి మీకే తెలుస్తుంది.......
"వస్తాను ..... రేపు తప్పకుండా వస్తాను ....." అని ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.
రోజు ప్రసూన సాంబశివం కారులోనే ఇంటికి వెళ్తుంది. ఆ రోజు ఎవో బుక్స్ కొనాలని బజారులో కారు ఆపుచేయించి షాఫ్లోకి వెళ్ళింది. బీరువాలో బుక్స్ చూస్తోంది. ఎవరో తనను వెన్నంటి ఉన్నట్లు తోచి వెనక్కు తిరిగింది __ శ్యామ్! వెకిలిగా నవ్వాడు, గిర్రున తల తిప్పికుంది ......
"సునా!" నెమ్మదిగా పిలిచాడు శ్యామ్ ........
ప్రసూన మాట్లాడలేదు _ మరొక బీరువాదగ్గరకు నడిచింది . వెనకే వచ్చాడు శ్యామ్ .........
"సాయంత్రం సినిమాకు వస్తావా?"
ప్రసూన పెదవులు బిగబట్టింది.
"నువ్వు ఏంట కావాలంటే శ్యామ్ వైపు తిరిగింది. చాచిలెంపకాయ కొట్టింది .......
గొడవకు నలుగురూ అటు తిరిగారు .
శ్యామ్ ముఖం ఎఱ్ఱబడిపోయింది __ కసిగా ఒక్కసారి ప్రసూనను చూచి ప్రసూన కారు వెనుక ఉన్న టాక్సీలో కూర్చున్నాడు __ తన కారును టాక్సీలో వెంబడిస్తున్నాడని అర్ధమయింది ప్రసూనకు .......
"నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను ......" ఒక్కొక్క అక్షరము ఎర్రగా కాలిన కడ్డీలా ప్రసూన మనసును కాలుస్తున్నాయి.
దుర్మార్గుడు ! ఎంత సాహసం!
సాయంత్రం వేళ సుశీలతో కలసి క్లబ్ కు వెళ్ళి ఏదైనా అడటమూ, సినిమాకు వేళ్ళడమో, తోస్తుంది ప్రసూన _ లేకపోతె ఇంట్లోనే పూలమొక్కలమధ్య కొంచెంసేపు కూర్చుని, బోజనాలయ్యక నిద్రవచ్చేవరకు చదువుకుని పడుకుంటుంది ......
పూలమొక్కల మధ్య గార్డెన్ చైర్ లో కూచుని ఎటో పరాగ్గా ఆలోచిస్తుంది . ప్రసూన __ ఎవరో వెనుకనుండి వచ్చి, నోరు నొక్కి ఎత్తుకు తీసుకపోయి టాక్సీలో కూచోపెట్టారు. టాక్సీ శరవేగంతో కదిలింది.