Previous Page Next Page 
వెలుగుబాట పేజి 11


    ప్రభుత్వ ఆస్పత్రికి పంపిన మందులూ ఆస్పత్రిలో ఉన్న మందులూ ఒకటికావని కోర్టులో రుజువయింది. ప్రభుత్వం పంపిన మందులు డాక్టర్ రహస్యంగా అమ్మేసుకుని కాలపరిమితి దాటినా మందుల్ని రోగులకు వాడుతున్నాడన్నారు- ఈ ఆరోపణలకు కుమార్ సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. అతడి మాట ఎవరూ నమ్మలేదు. అతడిని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. జీతం రాడు ఇంక చెల్లెలు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అశ్రద్ధ చెయ్యటానికి వీల్లేదు. ఎంతో కష్టపడి తాను కొనుక్కున్న రిఫరెన్స్ బుక్స్ ఒక్కొక్కటీ వందరూపాయల పైన  ఖరీదుచేసేవి పదిహేను రూపాయలకి సెకండ్ హేండ్ మార్కెట్ లో అమ్మేసి చెల్లెలికి కావలసినవి కొన్నాడు.
    తల్లి అమాయకంగా కలలు కంటోంది. "బాబూ! నువ్వు ఉద్యోగం చేస్తున్నాఊరెళ్ళిపోదాం. మీ అయ్యని కూడా బాగుచేస్తావు నాకు తెలుసు- మా బాబు గొప్ప డాక్టర్........"
    కంటనీరు క్రింద రానివ్వకుండా చిరునవ్వుతో "అలాగే అలాగే" అన్నాడు.
    ఆ సమయంలో ఝాన్సీ దగ్గరనుంచి టెలిగ్రాం వచ్చింది. "స్టార్ట్ ఇమిడియెట్లీ" అని కంగారుపడిపోయాడు కుమార్- అతని దగ్గర రైలు ప్రయాణానికి కూడా ఖర్చులు లేవు. రిజిస్టర్ మేరేజి సమయంలో  ఝాన్సీకి తన వేలి ఉంగరం తొడిగాడు. ఝాన్సీ తన ఉంగరం అతనికిచ్చింది- అది అతని చిటికెన వేలుకి సరిపోయింది.
    మనసు  ఎంత మదనపడుతున్నా, ఆ ఉంగరం తాకట్టు పెట్టి వందరూపాయలు అప్పుతీసుకొని యాభై రూపాయలు తల్లికిచ్చి యాభైరూపాయలు మాత్రం తను వుంచుకొని, కొత్తపల్లికి బయలుదేరాడు.
    కొత్తపల్లిలో బస్ దిగుతుండగా బస్ స్టాప్ లో కనపడింది సుందరమ్మ కుమార్ కి. చేతిలో సంచి ఉంది. ముఖం వదిలిపోయింది "ఎవరూ? సుందరమ్మగారూ! బాగున్నారా?" అని పలకరించాడు కుమార్ చేతులుజోడించి నమస్కారం చేస్తూ.
    సుందరమ్మ తన చెవులను తను నమ్మలేనట్లు నిలబడి పోయింది. "సుందరమ్మగారూ!" అని తను జీవితంలో మొట్ట మొదటిసారిగా వింటున్న సంభోధన ఆమె మనసులో విచిత్రంగా  మార్ర్మోగసాగింది - జోడించిన చేతులతో  ఈ లోకంలోని కష్టాలకు అతీతంగా ఎక్కడినుండో దిగిన మహానుభావుడిలాగ వున్నాడు కుమార్ - నిలబడ లేక తూలింది.
    "అరె! ఏమిటలా  వున్నారు! ఆ సంచి ఇలా ఇవ్వండి పట్టుకుంటాను-" అని ఆమె చేతిలో సంచి అందుకున్నాడు.ప్రతిఘటించటానికి కూడా ఓపిక లేకపోయి సుందరమ్మలో. ఆమెతో నడుస్తూ "ఎక్కడి కెళ్ళాలి మీరు?" మిమ్మల్ని  ఇంటిదగ్గర దింపి నేను వెళ్తాను." అన్నాడు.
    "నాకు ఇల్లంటూ లేదుబాబూ ఇల్లు వెతుక్కోవాలి ఇప్పుడు."
    "ఇప్పుడా! మీరు చాలా నీరసంగా వున్నారు- సరే ముందు మా ఇంటికి  రండి. తరువాత చూసుకో వచ్చును."
    "మీ ఇంటికా!"
    "ఝాన్సీ అంటే  మీ భార్యా ?"
    "అవును. కాదు-అవును-కాదు ఫరవాలేదు-మీ కేమీ ఇబ్బంది రాదు."
    అతని కంగారు సుందరమ్మకు ఆశ్చర్యంగా తోచింది.
    సుందరమ్మతో కలిసివస్తున్న కుమార్ నిచూసి మతిపోయినట్లయింది ఝాన్సీకి "రండి రండి" అంటూ సుందరమ్మను కూచోబెట్టి "ఈవిడ మనింట్లోనే ఉంటారు." అన్నాడు కుమార్-కళ్ళు పెద్దవిచేసి చూస్తూ నిలబడటంతప్ప మాట్లాడలేకపోయింది ఝాన్సీ. పరిస్థితి గమనించి, "ఇల్లు చూసుకోవాలమ్మా! అప్పటివరకే" అంది. అప్పటికి ఝాన్సీ నోరు తెరిచి "అదేం! మీ ఇల్లేమయిందీ" అంది- సుందరమ్మ నీరసంగా ఏదో అనబోతుంటే కుమార్ అడ్డుకుని "ఝాన్సీ, ఈవిడ చాలా నీరసంగా వున్నారు, ముందు భోజనం పెట్టు" అన్నాడు.
    "రండి" అంది ఝాన్సీ.
    ఈ భార్యాభర్తలిద్దరూ తనను మరచేమన్నిస్తున్నారు. ఈ పిల్ల బ్రాహ్మణ పిల్లలాగా  ఉందిమరి. కుమార్  హరిజనుడి లాగా ఉన్నాడు ఏమో హరిజనులలో అందంగా ఉండేవారు లేరా! కుమార్ మాత్రం  అందంగాలేడూ? ఆలోచనలు గజిబిజిగా అల్లుకుపోతుంటే, ఝాన్సీ తోడిచ్చిననీళ్ళతో కాళ్లూ చేతులూ కడుక్కొంది సుందరమ్మ-ఝాన్సీ ఆమెకు బయట వరండాలో వడ్డించబోయింది. ఆ సమయంలో అప్రయత్నంగా ఆమె చూపులు కుమార్ చూపులతో కలుసుకున్నాయి ఆ చూపుల్లో ఏముందో వెంటనేబైట వేసినపీట తీసేసి వంటింట్లో వేసి వడ్డించింది. ఎంత నీరసంలో ఉన్నా సుందరమ్మ ఇదంతా అర్ధంచేసుకోగలుగుతోంది. ఝాన్సీ వడ్డించిన భోజనము ముగించి కడుక్కున్న చెయ్యి  పైటకొంగుకు తుడుచుకుంటూ "నా జీవితంలో ఈ భోజనం  జన్మలో  మరిచిపోలేను-" అంది. ఝన్సీ నొచ్చుకొంటున్నట్లు "మీ కోసం ప్రత్యేకం ఏం చేయలేదుగదా, కూర కూడా సరిగా ఉన్నట్లు లేదు వట్టి పులుసు, మజ్జిగతో తిన్నారు. నేనుకూడా ఒక్కదాన్నేకదా! "ఏం చేసుకోవటంలేదు" అంది.
    సుందరమ్మ ఏం మాట్లాడలేదు- ఝాన్సీ ముఖంలోకి చూస్తూ నవ్వింది. భాషకు అతీతమైనా ఆదరం, వాత్సల్యం, కృతజ్ఞత ఉన్నాయి ఆ నవ్వులో.
    "ఇప్పుడు చెప్పండి- ఎందుకిలా అయిపోయారో?" అన్నాడు కుమార్.
    "ఇక్కడ ఇంత గొడవ జిరిగాక బోసుబాబు నన్నుఈ ఊళ్లో వుండొద్దన్నారు. పెద్దవాళ్ళ మాటకెదురు చెప్పలేక మా వూరువెళ్ళిపోయాను. మా వాళ్ళు నన్ను ఇంట్లోకి రానియ్యలేదు."
    "ఛ! ఛ! జరిగినదానిలో మీ తప్పు ఏముందీ?"    
    "నేను చెడిపోయినదానినన్నారు."
    "అంటే?"
    "నా మొగుడు తాగి నన్ను తన్నేవాడు. నిండు నెలలతో ఉన్న  నన్ను  డబ్బుకోసం కూలికెళ్ళమని తంతే, కడుపు పోయింది. ఆ బాధలు పడలేక బోసుబాబు చేరదీస్తే అతనితో వచ్చేస్తాను."
    "ఇందులో మీ తప్పు ఏముంది?"
    ఈసారి సుందరమ్మతోపాటు ఝాన్సీకూడా అతనివంక ఆశ్చర్యంగా  చూసింది. తరువాత ఇద్దరు స్త్రీలూ ఒకరినొకరు చూసుకున్నారు.సుందరమ్మ కళ్ళలో ఆవేదన చూసి ఝాన్సీ స్త్రీ హృదయం కరిగిపోయింది.
    "మరి, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. బోసుబాబు ఊరుకుంటాడా?"
    సుందరమ్మ కళ్ళలో ఆవేదన ఎగిరిపోయింది. ఆమె కళ్ళు నిప్పులు కురిసాయి. ఏది క్రౌర్యం ఆ కళ్ళలో తొంగి చూసింది. ఝాన్సీ  ఆ చూపులకు తట్టుకోలేక కుమార్ దగ్గరగా  వచ్చింది కుమార్ కూడా  భరించలేక, "చాలా శ్రమపడ్డారు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి" అన్నాడు. ఝాన్సీ పడక గదిలోనే తన హొల్డాలు పరిచాడు ఆవిడకోసం, ఆ పక్క మీద  సోమ్మసిల్లినట్లు వాలిపోయి ఆవిడ చేతులు జోడించింది కనపడని అంతర్యామికో!

 

                                                       *    *    *


    హాలులో కుమార్ ఝాన్సీలు మిగిలారు.
    "అంత అర్జంటుగా ఎందుకు టెలిగ్రాం ఇచ్చావు?" అన్నాడు.
    "ఎందుకంటే, నాకు అర్జంటుగా  మొగుడితో అవసరం మొచ్చింది."
    కుర్చీలోంచి ఎగిరి కూచున్నాడు కుమార్.
    బుర్రగోక్కుంటూ "అయితే మల్లెపూలూ అవీ..." అన్నాడు అయోమయంగా.....
    ఝన్సీ పకాలున నవ్వుతూ "ఆఁ ఆ ఏర్పాట్లన్నీ చూడటానికి ముత్తయిదువ కూడా ఉంది" అంది, పడుకున్న సుందరమ్మను వేలితో చూపుతూ.
    ఇంత అర్జంటుగా నీ కెందుకు  పుట్టింది ప్రేమ నా మీద?"
    "పుట్టింది ప్రేమకాదు, అవసరం."
    "ఇంకా నాతో ఏం అవసరం నీకు?"
    ఝాన్సీ అతని కళ్ళలోకి సూటిగా చూసింది.
    "కూమార్? నిన్ను నా అవసరాలకు వాడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వే___"
    "సరే సరే! సంగతి చెప్పు....."

 Previous Page Next Page